సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించిన అఖిలపక్షం

కర్నూలు: రాయలసీమకు సాగునీటిని మళ్లించే పోతిరెడ్డిపాడు నుంచి అర్ధంతరంగా నీటి విడుదల నిలిచిపోవడంతో అఖిలపక్షం నేతలు గురువారం ఇక్కడి నుంచి గండికోట రిజర్వాయరు వరకు క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించేందుకు బృందంగా తరలివచ్చారు. ఈ సందర్భంగా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి గండికోట జలాశయం వరకు నీరు విడుదల చేసుకునేందుకు ఉన్న అడ్డంకులపై పరిశీలించారు. ఏస్థాయిలో పనులు అడ్డంకిగా ఉన్నాయన్న వివరాలను తెలుగుగంగ ప్రాజెక్టు ఎస్‌ఈ, డీఈల ద్వారా తెలుసుకున్నారు. రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులకు సజావుగా నీటిని తరలించడానికి అత్యవసరంగా చేపట్టాల్సిన పనులుపై చర్చించారు.

పనులు పూర్తికానందు వల్లే..

ప్రస్తుతం ఎస్‌ఆర్‌ఎంసీ కాల్వ 10, 12, 14, 16 కిలోమీటర్ల వద్ద పెండింగ్‌లో ఉండటంతోపాటు ఎస్‌ఆర్‌బీసీ విస్తరణ పనులు పూర్తికానందు వల్ల పోతిరెడ్డిపాడు నుంచి 44వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయలేకపోతున్నట్లు టీజీపీ ఎస్‌ఈ సన్యాసీనాయుడు తెలిపారు. కాల్వల విస్తరణ పూర్తికాకపోవడంతో సాగునీటిని సవ్యంగా సరఫరాచేయలేకపోతున్నట్లు వారు వివరించారు. ఈ పనులన్నీ త్వరితగతిన పూర్తిచేసుకుంటే పూర్తిస్థాయిలో నీటిని తరలించొచ్చన్నారు. లేనిపక్షంలో పోతిరెడ్డిపాడు నుంచి 20వేల క్యూసెక్కులను విడుదల చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.

చదవండి :  దేశం గూటికి చేరిన మేడా మల్లికార్జునరెడ్డి

ప్రత్యేక చొరవ చూపాలి..

బనకచర్లతోపాటు గోరుకల్లు రిజర్వాయరును అఖిలపక్షం నాయకులు పరిశీలించారు. శుక్రవారం ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించేందుకు నంద్యాలకు వచ్చిన ఆ శాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్‌తో అఖిలపక్షం నేతలు మాట్లాడారు.  పోతిరెడ్డిపాడు-బనకచర్ల, బనకచర్ల-గోరుకల్లు, గోరుకల్లు-అవుకు, అవుకు-గండికోట రిజర్వాయర్లు వరకూ మధ్యలో ఉన్న చిన్నచిన్న పనులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిపై ప్రత్యేక చొరవ చూపాల్సిందిగా కోరారు. గాలేరు-నగరి ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఆధికారం చేపట్టి  ఎనిమిది నెలలైనా రాయలసీమకు చెందిన సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

కాకమ్మ కబుర్లు చెప్పొద్దు..

కడపజిల్లా సీపీఎం పార్టీ జిల్లాకార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రాజెక్టులనిర్మాణం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించటంతోపాటు కాకమ్మ కబుర్లుచెబుతుందని ఆయన విమర్శించారు. దీంతో తాగు, సాగునీరులేకుండా పోయిందని ఆయన తెలిపారు.

కృష్ణాబోర్డును తరలించటం హేయమైన చర్య

కడపజిల్లా సీపీఐ సెక్రెటరీ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరు నుంచి నీటివిడుదల పెంచి రాయలసీమ ప్రాంతాల్లోని ఆయకట్టు రైతులకు సాగునీటిని అందించాలని ఆయన కోరారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం ప్రాజెక్టులు శిలాఫలకాలకే పరిమితం అయ్యాయని విమర్శించారు. కృష్ణాబోర్డును కర్నూల్లో ఏర్పాటుచేసి రాయలసీమ ప్రాంతాల రైతాంగాన్ని ఆదుకోవాల్సిన చంద్రబాబు కృష్ణాబోర్డును ఇతర ప్రాంతాలకు తరలించటం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. శ్రీశైలం జలాశయం ప్రాజెక్టు నిర్మాణంలో 2.75లక్షల మంది నిర్వాసితులు కాగా వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాయలసీమ ప్రాంతాలకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి సాగు, తాగునీటిని అందించాలని కోరారు.

చదవండి :  డబ్బులూ, అనుమతులూ ఇవ్వకుండా నీళ్లెలా తేగలరు?

ఉద్యమిస్తేగాని చలనం రాదా..?

ప్రతిపక్షాలు ఉద్యమిస్తేకానీ ప్రభుత్వానికి చలనం వచ్చే పరిస్థితి లేదని కమలాపురం శాసనసభ్యుడు రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. కడపలో జీఎన్‌ఎస్‌ఎస్‌తోపాటు మిగిలిన ఇరిగేషన్ ప్రాజెక్టులపై జగన్ రివ్యూమీటింగ్ నిర్వహించి అఖిలపక్షం అధ్వర్యంలో ఉద్యమించేందుకు సిద్ధమవగా  చంద్రబాబు కూడా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు పరిశీలనకు సన్నద్ధమవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

పనులన్నింటినీ తక్షణమే పూర్తి చేయాలి

బనకచర్ల వద్ద నుంచి నిత్యం 44 వేల క్యూసెక్కుల నీటిని ఎస్‌ఆర్‌బీసీ, టీజీపీ, కేసీ ఎస్కేప్ కాల్వ ద్వారా తరలించేందుకు అవకాశం ఉందని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. అయితే పోతిరెడ్డిపాడు నుంచి గండికోట వరకు కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నందున ఇది సాధ్యం కావడం లేదన్నారు. చిన్నచిన్న పనులన్నింటినీ తక్షణమే పూర్తిచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామన్నారు. ఇవి పూర్తయితే 30 రోజుల్లో రాయలసీమకు 114 టీఎంసీల నీటిని తరలించొచ్చని, తద్వారా చాలా ప్రాంతాలకు మేలు జరుగుతుందని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా జీఎన్‌ఎస్‌ఎస్, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ప్రాజెక్టుల పనులు 90 శాతం పూర్తి చేసిన ఘనత వైఎస్‌కే దక్కుతుందని తెలిపారు.

చదవండి :  సీమ సాగునీటి పథకాలపై కొనసాగిన వివక్ష

కడప వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, రైల్వేకోడూరు శ్రీనివాసులు, బద్వేలు ఎమ్మెల్యే జయరాములు, కడప ఎమ్మెల్యే అంజాద్‌బాషా, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, పార్టీ రైతువిభాగం జిల్లా కార్యదర్శి ఎస్.ప్రసాద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు అమర్‌నాథ్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నారాయణ, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్యతోపాటు కర్నూలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుడ్డారాజశేఖరరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, పార్టీ నేతలు బుడ్డా శేషారెడ్డి, పోచా జగదీశ్వర్‌రెడ్డి, చంద్రమౌళి తదితరులు ఈ అఖిలపక్ష బృందంలో ఉన్నారు.

ఇదీ చదవండి!

Gandikota

డబ్బులూ, అనుమతులూ ఇవ్వకుండా నీళ్లెలా తేగలరు?

కడప: గాలేరు-నగరి పథకంలో భాగమైన గండికోట జలాశయం పూర్తి చేయడానికి అవసరమైన డబ్బులూ, అనుమతులు ఇవ్వకుండా నీళ్లెలా ఇవ్వగలుగుతారని ఆంధ్రప్రదేశ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: