అన్నమయ్య కథ (రెండో భాగం)

పాము కరవలేదు సరికదా! ఎదురుగ చింతలమ్మ ప్రత్యక్షమైంది. నారాయాణయ్య ఏడుస్తూ ఆమె పాదాల మీద పడ్డాడు. చింతలమ్మ ఆ బాలుని ఓళ్ళో చేర్చుకొని వూరడించింది.”ఎందుకు బాబు ఈ అఘాయిత్య?. నీ మూడోతరంలో గొప్ప హరి భక్తుడు జన్మిస్తాడు. అతని వల్ల మీ వంశమే తరిస్తుంది. నీకు చదువు రాకపోవడమేమిటి వెళ్ళు, తాళ్ళపాక చెన్నకేశవస్వామే నీకు అన్నీ అనుగ్రహిస్తాడు” అని చింతలమ్మ బాలుని చింత తీర్చి అదృశ్యమైంది. అమ్మ చెప్పినట్లు నారాయాణయ్యకు చెన్నకేశవస్వామి దయవల్ల అన్ని విద్యలూ సిద్ధించాయి. ఈ నారాయాణయ్య కుమారుడే నారాయణసూరి.

తిరుమల తీర్థయాత్ర:

నారాయణసూరి గొప్ప కవి, పండితుడు. అతని ఇల్లాలు లక్కమాంబ – మహా భక్తురాలు. మధురంగా పాడుతుంది. ఈమె స్వగ్రామం మాడువూరు (కడప జిల్లా సిద్ధవటం తాలూకాలో వున్నది). అక్కడ చెన్నకేశవస్వామి ఈమెతో ప్రత్యక్షంగా మాట్లాడేవాడట. ఈ పుణ్య దంపతులు సంతానం కోసం చేయని వ్రతం లేదు, కొలవని దేవుడు లేడు. “మాకు మంచి కొడుకును ప్రసాదించు స్వామీ” అని ఏడుకొండలస్వామికి మ్రొక్కుకున్నారు. ముడుపులు కట్టుకున్నారు. ఒక మంచిరోజు చూసి ఇద్దరూ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం ప్రయాణమయ్యారు.

చదవండి :  అన్నమయ్య కథ : ఐదో భాగం

లక్కమాంబ, నారాయణసూరి తిరుమల చేరారు. స్వామి మందిరం ప్రవేశించారు. గరుడగంభం వద్ద సాగిలి మ్రొక్కారు. వాళ్ళకేదో మైకం కమ్మినట్లైంది. కళ్లు మిరుమిట్లు గొలిపే తేజస్సు కనిపించి ధగధగ మెరిసే ఖడ్గాన్ని వాళ్ల చేతుల్లో పెట్టి అదృశ్యమైంది. వేంకటేశ్వరస్వామి తన ఖడ్గమైన నందకాన్ని ఆ పుణ్య దంపతులకు ప్రసాదించాడు. వాళ్ళు పరమానంద భరితులయ్యారు. వేంకటపతిని దర్శించి స్తుతించారు. సంతోషంతో తాళ్లపాకకు తిరిగి వచ్చారు.

అన్నమయ్య జననం:

లక్కమాంబ గర్భవతి అయింది. వైశాఖమాసం విశాఖా నక్షత్రంలో ఒక శుభలగ్నంలో మూడు గ్రహాలు ఉన్నత దశలో వుండగా  మగశిశువు ఉదయించాడు. అంటే మే 9, 1408 (సర్వధారి సంవత్సరం, వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు) అన్నమాట. హరినందకాంశంలో జన్మించిన ఆ హరిభక్తునికి అన్నమాచార్యులు అని నామకరణం చేసినారు. అన్నమయ్య బోసి నవ్వులు ఒలకబోస్తూ నలుగిరినీ మురిపించేవాడు. మాటిమాటికి వెంకటప్పకు జోతలు పెట్టేవాడు. వెంకన్న పేరు చెబితేనే ఉగ్గుపాలు త్రాగేవాడు. వేంకటపతి మీద జోలపాట పాడందే నిద్రపోడు. లక్కమాంబ భక్తిగీతాలు పాడుతూంటే ఏదో అర్థమైనట్లు తల పంకించేవాడు. నారాయణసూరి కావ్యాలలో అర్థాలు వివరిస్తూ వుంటే తానూ ఊ కొట్టేవాడు.

చదవండి :  24 నుంచి అన్నమయ్య 605వ జయంతి ఉత్సవాలు

బాల్యం:

అన్నమయ్యకు ఐదేండ్లు నిండాయి. అతడు ఏక సంథాగ్రాహి. గురువులు చెప్పిన పాఠాలు చెప్పినట్లు వెంటనే అప్పచేప్పేవాడు. వాళ్ళు ఆశ్చర్యపడేవాళ్ళు. ఇక అన్నమయ్యకు నేర్పించవలసింది  ఏమీ లేదని త్వరలోనే తెలుసుకున్నారు. అన్నమయ్య ఆడిందెల్లా అమృతమయమైన కావ్యంగా పాడిందెల్లా పరమ గానంగా వినిపించేది. అన్నమయ్య చెన్నకేశవుని గుడి చేరి “బుజ్జి కేశవా!” అని పిలిచేవాడు.

బుజ్జి బాలుని ముద్దు మాటలకు మురిసి చెన్నకేశవుడు సిరినవ్వులు చిందించేవాడు. అన్నమయ్య ఎప్పుడూ ఆటల్లో పాటల్లో మునిగి తేలేవాడు. చెరువు కట్టల మీద చేరి చెట్టు మీది పిట్టలతో గొంతు కలిపేవాడు. చిరుగాలుల సవ్వడికి మురిసేవాడు. చెరువులోని అలలలో ఉయ్యాలలూగే కమలాలను చూస్తూ గంతులేసేవాడు. కన్నెపిల్లలు వెన్నెల రోజుల్లో జాజర పాటలు పాడుతూంటే అక్కడ చేరుకొని వాళ్ళను అల్లరి పెట్టేవాడు. రాగం పాడి, తాళం వేసీ చూపేవాడు. “మీకేం తెలీదు పొమ్ము”ని ఎగతాళి చేసేవాడు. కలుపు పాటల్లో, కవిల పాటల్లో జానపదులతో పాటు శృతి కలిపేవాడు. అన్నమయ్య మాటన్నా పాటన్నా ఆ ఊరి వాళ్ళు ఎంతో సంబరపడి పోయేవాళ్ళు.

చదవండి :  కంటిమి నీ సుద్దులెల్ల గడపరాయ - అన్నమయ్య సంకీర్తన

(ఇంకా ఉంది)

కామిశెట్టి శ్రీనివాసులు శెట్టి

రచయిత గురించి

తితిదే వారి ‘శ్రీనివాస బాలభారతి’ పుస్తకమాలలో భాగంగా ప్రచురించిన ‘అన్నమాచార్యులు’ పుస్తకం కోసం కామిశెట్టి  శ్రీనివాసులు గారు పరిశోధించి రాసిన కథ ఇది. కడప జిల్లాకు చెందిన శ్రీనివాసులు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ఎమ్మే పట్టా పొందినారు. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారి వద్ద శిష్యరికం చేసిన వీరు చాలా కాలం పాటు తితిదేలో పనిచేసినారు. తితిదే వారి అన్నమాచార్య ప్రాజెక్టుకు,  శ్రీ వెంకటేశ్వరా దృశ్య శ్రవణ ప్రాజెక్టుకూ డైరెక్టరుగా వ్యవహరించినారు. అన్నమాచార్య సంకీర్తనలకు వ్యాఖ్యానాలు రాసినారు. తాళ్ళపాక కవుల జీవిత చరిత్రను రాసినారు.

ఇదీ చదవండి!

మనమింతే

కడప నగరం

కడప (ఆంగ్లం: Kadapa లేదా Cuddapah, ఉర్దూ: کڈپ ), వైఎస్ఆర్ జిల్లా యొక్క ముఖ్య పట్టణము, రాయలసీమలోని ఒక ప్రముఖ …

Leave a Reply

Your email address will not be published.

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: