అరకట వేముల శాసనం

ప్రదేశము : అర్కటవేముల లేదా అరకటవేముల

తాలూకా: ప్రొద్దుటూరు (కడప జిల్లా)

శాసనకాలం: 9వ శతాబ్దం కావచ్చు

శాసన పాఠం:

1.స్వస్తిశ్రీ వల్లభమహారాజాధి రాజపరమేశ్వర భట్టరళ పృథివిరాజ్య
2.ఞయన్ పెబా೯ణ వంశ భుజంగది భూపాదిత్యుల కదాన్ వంగనూర్లి చరువశమ్మ೯పుత్ర
3.విన్నళమ్మ೯ళాకు నుడుగడంబున పన్నశ ఇచ్చిరి. వేంగుఖూదు, పెన్డ్రు(డ్=θ)కాలు, నారకొళూ కంచద్లు
4.ఇన్నల్వురు సాక్షి
5.దేనికి వక్రంబువచ్చు వాన్డు(డ్=θ)పఞచ్ మహాపాతక సంయ్యుక్తున్డు(డ్=θ) గున్
6.అబ్భిద్ధ೯త్తన్త్రిభి భు೯క్తం సద్భిశ్చపరిపాలితం ఏతానినని వత్త೯న్తే పూవ్వ೯రాజకృ
7.తానిచ ||స్వరత్తా[0]పరదత్తా[0]వాయోహరేతి(త) వసుందరా(0)షష్టిం వష೯సహప్రాణి విష్టా
8.యాం జాయతే కృమి(ః)

వివరణ:

శాసనము చాలా స్పష్టముగ చదువుటకు వీలుగనున్నది.శాసనపాఠము పూర్తిగనే యున్నది. చెప్పదగిన లోపములు కానరావు. సంస్కృతశ్లోకములలో తప్పులు చెప్పదగినవి అంతగా లేవు. కనుక లేఖకుని దోషమని చెప్పి వదలివేయ వలసిన భాగమంతగా లేదు. కాని మనకీశాసనములో అనేక సందేహాలు కనుపించును.

1.’పృథివీరాజ్యఞచెయన్ ‘అను క్రియకు కర్త కనుపించదు. శ్రీ వల్లభ మహారాజు అని చెప్పుచో ముందుండవలసిన’మహారాజాధిరాజ… ఇత్యాది బిరుదు పరమందున్నట్లు భావించవలెను.అట్లాకూడ కొన్ని గలవు.”స్వస్తిశ్రీ విక్రమాదిత్య ప్రిథివీవల్లభ మహారాజాధిరాజ పరమేశ్వర భటరళ్” అని రామాపురం లోని చాళుక్య విక్రమాదిత్యుని శాసనము ఇదే కాలమునకు చెందిన దొకటి కలదు.అయినను ‘శ్రీ’ని స్వస్తిశ్రీలో దానినిగ చెపితే వల్లభ మహారాజగును.శ్రీ వల్లభుడుగాని వల్లభుడుగాని ప్రసిద్ధ రాజెవడు ఆనాడున్నట్లు తెలియదు.

చదవండి :  పెద్దపసుపుల - దానవులపాడు (కురుమరి) పొలిమేర కొట్లాట

2. పెబా೯ణవంశ భుజంగది భూపాదిత్యుల కదాన్ – ఇది దానము చేసిన దాతను తెలుపును. భూపాదిత్యుడనే సామంతుడనుకొనవలెను. ఆయన మహాబాణ వంశమునకు చెందినవాడు. ‘కదాన్’ అనే పదనికి అర్థము తెలియదు.పెర్ అనగ కన్నదములో గొప్ప అని అర్థము.

3. ‘చరువశర్మ పుత్ర విన్నశర్మళాకు’అని ప్రతిగ్రహీత పేరు, తండ్రి పేరుతో కలిపి సమాసము చెయబదినది.నిడగడంబున-అనేది స్థలనామము కావచ్చు ను.అచ్చట పన్నశ అంటే భూమి దానము ఇచ్చిరి.

4. సాక్షులు నల్వురు.ఉన్నపదాలు నాలుగు.(1)వేంగుళూదు,(2)పెన్డు(డ్=θ)కాలు(3)నారకోళు(4)కంచద్లు.ఈ నాలుగు మను ష్యుల పేర్లగునా కాదా అని సందేహము.వేంగుళూద్లు అనునది ఊరి పేరగుచో పెన్డ్రుకాలు ఆ యూరివాడగు.ఇదియే ఉచితమని తోచును.కాని ‘వేంగుళూద్ల అని షష్ఠ్యంతముగా లేదు.పైన ‘వంగనూద్ల’షష్ఠ్యంతము కలదు.’నారకోళు ‘అనునది స్థలనామమో మనిషిపేరో తెలియదు.కాబట్టి నయిష్టం మీద ఆధార పడియున్నది.’నమ్మిపోళు ‘అని మనిషిపేరొకటి బాణ వంశపు ధవళెయ రాజు యొక్క బలపనూరు శాసనములోకలదు.అట్లే యిది యు మనిషి పేరగునేమో.కంచద్లు(కంచరివాండ్రు)అనియెందరో తెలియదు. ఈ నాల్గిటి లోను ఒక్కటికూడ మనిషి పేరుగా కనిపించదు. వేంగుళూద్లు, వేల్పుచెర్ల, శాసన మందున్న వ్ర్యేంగులవంటి వారి సంఘమునకు చెందిన నివాసమని తోచును.వారికి సంబంధించిన ‘పెద్దకాలు’అనగ ఆసామి లేక ఉద్యోగి యని అర్థమగును. ‘కణ్ణనూద్లు’ అని మనిషి పేరుగా వైదుంబ గండ త్రిణేత్రుని శాసనము లో నున్నది.అట్లే వేంగుళూద్లు మనిషిపేరగునేమో చెప్పజాలము.ఇట్టి యూహ లెన్నియైనను చేయుటకు వీలుగ నున్నది.సాక్షులనిర్దేశము అంటే అక్కడ ఎదురుగనున్న వారిని మనసులో పెట్టుకొని వారిపేర్లు కూడ వ్రాయకయే వీరు సాక్షులని చెప్పబడెను.కంచర్లు ఎందరో తెలియదు.మొత్తము నలుగురని మాత్రము చెప్పబడెను.ఇచ్చిన పన్నస యొక్క పరిమితి యెల్లలు గాని చెప్పబడలేదు.

చదవండి :  కడప ప్రాంత శాసనాలలో రాయల కాలపు చరిత్ర !

దీనిని బట్టి ఆనాటి మంచిభాషలో వ్రాయబడిన శాసనాలైనను మనకీనాడు సులభముగ నర్థము కావని చెప్పవలెను.దానికి ఆనాటి భాష సరిగా రూపొందక పోవుటయే కారణము.భాషను తయా రు చేసుకొనే కాలమది.ఇప్పుడు మనకట్టి కాలమొకటి తెలుగుభాషకుండెనా యనిపించును. ఉన్నద నుటకు ఈ అసంబద్ధ వాక్యములే ప్రమాణము.మాట్లాడునప్పుడువారు ద్రావిడ,కన్నడ, ప్రాకృతము లతో కూడిన తెలుగుభాషను మాట్లాడువారు.కన్నడులు తాము కన్నడములోనే వ్రాయటం మొదలిడి నప్పటినుండి వీరికికూడ భాషాభిమానము పుట్టి వ్రాయడం ప్రారంభించిరి.ఆనాటి శ్రమయే నేడు మనము తెలుగువారము అని చెప్పుకొనుటకు మూలము. తెలుగు వారికి ఆఱు-ఏడు శతాబ్దము లలోని వారే మూలపురుషులు.నన్నయాదులకంటె మున్ముందు వారికే మనజాతి అర్పించవలసిన అగ్రతాంబులము.గాసట-బీసట భాషనైనా మనకు నేర్పఱచి యిచ్చిరికదా! నేటి విశాలాంధ్ర నిర్మాణ మునకు ఆనాటి వారి తెలుగు భాషా నిర్మాణమే మూలము.

చదవండి :  అన్నలూరు శాసనము

-జివి పరబ్రహ్మ శాస్త్రి

(తెలుగు శాసనాలు, ఆం.ప్ర సాహిత్య అకాడమీ ప్రచురణ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: