రాయలసీమ రైతన్నా
Image courtesy : The Hindu

ఆశలే సూపిచ్చివా – వరుణా…. జానపదగీతం

వర్గం: చెక్కభజన పాట

పాడటానికి అనువైన రాగం: సావేరి స్వరాలు (ఏక తాళం)

ఈ పొద్దు వానొచ్చె
మలిపొద్దు సినుకోచ్చె
కొండంత మబ్బొచ్చె
కోరినా వానల్లు
కురిపిచ్చి పోతావని
ఆశలే సూపిచ్చివా – వరుణా
అన్యాలమే సేచ్చివా

ఏరులెండి పాయ
సెరువులెండి పాయ
దొరువులెండి పాయ
సేల్లు బీల్లయిపాయ
నీకు సేసిన
పూజలన్ని భంగములాయ
ఆశసంపి పొతివా – వరుణా
అన్యాలమే సేచ్చివా

గడ్డిపాసలు ల్యాక
పసువులెండి పాయ
తిననీకి తిండిల్యాక
కండల్కరిగి పాయ
గింజ గింటలు ల్యాక
పిట్టలూ సచ్చి పడ్యా
గుట్టలెండీ పాయ
పొట్టలెండీ పాయ
కట్టకట్టి అంతా
పైపైకి సూచ్చేను
బోరుగాలితో వచ్చి
బొప్పరిచ్చీ పోయి
మాకు దగా సేచ్చివా – వరుణా
అన్యాల మొడిగడితివా

చదవండి :  బేట్రాయి సామి దేవుడా! - జానపద గీతం

ఆట్లాడే బాలల్ల
అరుపూలు సూడయ్య
పాలకాసం గుక్కేసే
పసిపాపల్ల సూడు
రొట్టెలా కొరువయ్యే
రోదనలు ఇనవయ్య
సంగటి సారక లేదు
సావుజంపులు సూడు
కాలవల్ల నీల్లాడే
కప్పతల్లుల సూడు

ఎండుపారిపోయిన
పాటి సేలను సూడు
దుక్కటెద్దుల సూడు
దూడ పిల్లల సూడు
ఏకంగా యెటుపోతివీ – వరుణా
కరుణ తప్పీ పోతివా

గంగమ్మ కిస్తిమీ
గొర్రెపోతులు మొన్న
సుంకలమ్మ కిస్తిమీ
దున్నపోతులు నిన్న
మారెమ్మ కిస్తిమీ
కోడిపుంజులు శాన
అంకాలమ్మ కిస్తిమీ
యాటపోతులు యెన్నో
అనిమెలా బోగాది
అన్న్యారగించింది
వరుణయ్య అల్లంత
వరుసకేమౌతారో
కట్టగట్టి వంత
పెట్టింది తినిపోయి
అన్యాలమే సేచ్చిరా – వరుణా
గోరాల కొడిగడ్తిరా

చదవండి :  బొబ్బిళ్ళ నాగిరెడ్డిని గురించిన జానపదగీతం

సేల సేద్దాగాల్లు
కుండ్లు సేసేవోళ్ళు
న్యాత పేట్నేటోళ్ళు
సలువ జేసేటోల్లు
ఊరూరు తిరుగేల్లు
అట్లాడె వగిసోల్లు
మల్లక్క పుల్లక్క
సాబ్బండు కులపోల్లు
ఇబ్బంది పల్ల్యాక
తబ్బబ్బు అయిండ్రి
పడిపడి పొర్లుతూ
దండాలు బెట్నారు
కరుణాలు పెట్టుకోరా – వరుణా
వరుసాలు కురిపించరా

పాటను సేకరించినవారు – కీ.శే.కలిమిశెట్టి మునెయ్య

ఇదీ చదవండి!

mahanandayya

మహనందయ్య – జానపద కళాకారుడు (చెక్కభజన)

రెండు చెక్కలను లయాత్మకంగా కొట్టడం ద్వారా అద్భుతమైన సంగీతాన్ని సృష్టించి దానికి అనుగుణంగా అడుగులు వేసే కళ చెక్కభజన. చెక్కభజనలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: