ఎదురెదురు ! (కథ) – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

ఎదురెదురు

‘‘ఎంత ధైర్యం సార్‌ సురేష్‌కు! యాభైవేల రూపాయలు పోగొట్టుకొన్నే .. లెక్కజెయ్యకుండా పేకాటకాన్నించి లెయ్యనే లెయ్యడంట… అబ్బా … ఆయప్పది గుండెకాయ కాదు సార్‌ – ఇనపముద్ద…’’ అన్నాడు వీరారెడ్డి.స్నానం చేసి గదిలోకొచ్చి తల తడుచుకొంటున్నాను.

ఎదురెదురు‘‘ఏడీ సురేష్‌ .. పోయినాడా?’’ అడిగాను.‘‘ఇంగా యాడుండాడు! టైమైందంట. టిఫినన్నా చేసిపోమ్మంటే కుదరదంటాడే… వాల్ల క్లబ్బులో అయితే కోరిన టిఫిను తినొచ్చునంట. ఇక్కడి గడ్దీగాదం నేనెందుకు తింటా.. ఖర్మా? అక్కడ చికెను మటన్‌తో పులిభోజనం దొరుకుతాంటే.. అని ఎల్లబారి పాయెనే’’ అన్నాడు.చిన్నగా నవ్వాను.‘‘సరే సరే … స్నానం చేసిరాపో..’’ చెప్పాను.వీరారెడ్డి బాత్రూంలో దూరాడు.ముగ్గురమూ రాత్రి పోరుమామిళ్లలో బసెక్కి ఉదయం ఆరుగంటలకంతా హైదరాబాదు చేరుకొన్నాము.నాకు రెండు రోజుల సాహిత్య సమావేశాల పని.కొత్తగా తవ్వించిన బోరుబావిలో దించేందుకు సబ్‌ మెర్సిబుల్‌ మోటారు పంపు, స్టార్టరు, పైపులు వగైరాల కోసం వచ్చాడు వీరారెడ్డి. మంచి బ్రాండెడ్‌ కంపెనీ సరుకైతే లక్షరూపాయలకు పైగా ధర పలుకుతుందట.

లోకల్‌ అసెంబుల్డయితే యాభైవేల లోపేనంట. అవి కూడా పోరుమామిళ్లకు ఇక్కడికీ పదివేల రూపాయల ధర తేడా వుంటుందంట.పాతిక వేలు ఎవరో ఇస్తానన్నారనీ, నన్ను మరో పాతికవేలు అప్పు అడిగాడు వీరారెడ్డి. ఏ చెడు అలవాట్లూ లేని రైతు అతను. వ్యవసాయ పనులు తప్ప మరో వ్యాపకం లేనివాడు. పైరెండి పోతోందని కళ్ల నీళ్లు పెట్టుకొంటే సరేనన్నాను.డబ్బు సమకూడినపుడంతా హైదరాబాదు వచ్చి పేకాడి వెళ్లటం సురేష్‌కు ఈనాటి అలవాటు కాదు.

పల్లెల వ్యాపారమంతా చేతిలో పెట్టి అతని నాన్న హఠాత్తుగా మరణించినప్పటి నుండి అదలించే వాళ్లు లేకపోవటంతో పేకాటను ప్రవృత్తిగా మార్చుకొన్నాడు. అలాగని వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేయట్లేదు. పల్లెల మీద ఇప్పటికీ అతనిదే పట్టు. నాలుగు రోజులు అటో ఇటో అయినా సరకుకు సంబంధించిన సొమ్ము కచ్చితంగా తెచ్చిస్తాడనే పేరుంది.కేంద్ర సాహిత్య అకాడెమీ వాళ్లు ఏర్పాటు చేసిన సాహిత్య కార్యక్రమంలో రాయలసీమ కథా సాహిత్యాన్ని గురించి మాట్లాడేందుకు వచ్చాను. నా పత్ర సమర్పణ రెండవరోజు ఉంటుంది.

ఇలాంటి సమావేశాలకు రావటంలో ప్రధాన ఉద్దేశ్యం – వివిధ ప్రాంతాలనించి వచ్చిన రచయితలను కలవటం, వాళ్లతో మాట్లాడటం, కలిసి భోంచేయటం, కలిసి తిరగటం. వాళ్లను చూస్తూనే నాకు వాళ్ల కథలు గుర్తుకొస్తాయి. అందులోని పాత్రలతో మాట్లాడినట్లు వుంటుంది. అక్కడి మట్టిలో తిరుగాడినట్లు ఉంటుంది. అక్కడి మట్టిమనుషుల కరస్పర్శనూ, భూమి దుఃఖాన్నీ అంటించుకొచ్చిన రచయితలను మనసారా ఆలింగనం చేసుకోవాలనిపిస్తుంది.ఇలాంటి సమావేశాల్లో నేను కూడా నేను నేనుగా కనిపించేందుకు ఇష్టపడను. నా పల్లెమట్టి కష్టాలు సుఖాలు ఆనందాలు ఆవేదనలూ కలగలిసిన ఒక కథగానో కవితగానో నవలగానో పరిచయమయ్యేందుకే ఇష్టపడతాను.నాకూ, ప్రకాశం జిల్లా మిత్రునికీ కలిపి యీ గది కేటాయించారు. ఆయన వచ్చాడుగాని సిటీలో కూతురు, అల్లుడు ఉండటంతో అక్కడికి వెళ్లాడు.

గదినీ, భోజనపు టోకెన్లనూ ఉపయోగించుకోమన్నాడు.తలుపు తెరచుకొని ఉత్తరాంధ్ర మిత్రుడొచ్చాడు. ఆప్యాయంగా పలుకరించాడు. ఇరుప్రాంతాల సాహితీమిత్రుల క్షేమ సమాచారాలు ఇచ్చిపుచ్చుకొన్నాము. అతనితో చాలా ఇష్టంగా మాట్లాడుతూ వుండగానే అనంతపురం, కర్నూలు, వరంగల్లు ప్రాంతపు మిత్రులు కూడా కలిశారు. నల్లరేగడి, ఇసుక, ఒండ్రు, రాళ్లనేలలన్నీ కలిసి కొంతసేపు అక్కడ తమ తమ మట్టి పొత్తిళ్ల భావోద్వేగాల్ని పంచుకొన్నట్లుగా అనిపించింది నాకు.అంతలో స్నానాల గదిలోంచి వీరారెడ్డి బైటకొచ్చాడు. సాహిత్య మిత్రులకు అతన్ని పరిచయం చేశాను.వచ్చిన పని గురించి కూడా చెప్పాను.అతనికేసి కొత్తగా చూశారు. తెల్లచొక్కా, తెల్లపంచె, కోరమీసం కేసి ఆసక్తిగా చూశారు.‘‘మేము మా కథల పుస్తకాల్ని మాత్రమే పట్టుకొచ్చాము. నువ్వు కథల్లో పాత్రను కూడా వెంటబెట్టుకొచ్చావు’’ అన్నాడు విజయనగరం సాహితీ మిత్రుడు.

చదవండి :  నవ వసంతం (కథ) - తవ్వా ఓబుల్ రెడ్డి

అందరూ నవ్వారు.ఉపాహారం కోసం కిందకు వెళ్లాము. అడ్డపంచె ఎగగట్టి, భుజమ్మీద కండువా సవరించుకొంటూ, అప్పుడప్పుడూ చూపుడు వేలితో కొనమీసాల్ని మీటుతూ నాపక్కనే నడుస్తూ వున్న వీరారెడ్డి అందరికీ కొద్దిసేపట్లోనే బాగా దగ్గరయ్యాడు.ఉపాహారం తర్వాత తను వెళతానన్నాడు వీరారెడ్డి. నాగోల్‌ ప్రాంతంలో అతని చిన్నాయన కొడుకు ఏదో చిన్న ఉద్యోగం చేసికొంటూ వున్నాడంట. ‘డబ్బులిస్తాను రమ్మంది’ అతనేనట. అతనిచ్చిన సొమ్ముతో నా డబ్బు కలిపి మోటారు పంపుసెట్టు కొని బస్టాండుకు తీసికెళ్లి బస్సులో వేసికెళ్తాడంట.రాత్రికే ప్రయాణమై వెళ్లాలంట.

ఒక్కరోజు ముందుగా మోటారు బిగించినా పైరును చావు దగ్గరగా వెళ్లకుండా మరొక్కరోజు వాయిదా వేసినట్లేగదాయని ఆరాటపడుతున్నాడు. నీటి తడి లేక పూర్తిగా పాడుబట్టి నేల కరచుకు పోయిన పైరు దీనస్థితి అతని కళ్లల్లో స్పష్టంగా ప్రతిబింబిస్తూ వుంది.హైదరాబాదు రావటం ఇదే మొదటి సారంట! అతని బంధువుకు ఫోన్‌ చేసి అడ్రస్‌ కనుక్కొని, ఆటో మాట్లాడి ఎక్కించి పంపాను.తెలుగు యూనివర్శిటీలోని లలితకళా తోరణంలో సాహిత్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు .అకాడెమీ వాళ్లు పుస్తకాల్ని కూడా అమ్మకానికి పెట్టారు.సాహిత్యకారుల్లో చాలామంది హాలు బైటే వున్నారు.తెలిసిన వాళ్లందర్నీ పలుకరించాను.కొత్తవాళ్లు కూడా పరిచయమయ్యారు.సాహిత్యంతో ఎప్పటి నుంచో పరిచయం ఉండి, వ్యక్తులుగా ఇప్పుడే కలవటం గమ్మత్తుగా అనిపించింది.

ముఖ్యంగా భద్రాచలం అటవీ ప్రాంతాలనించీ, అరకు పర్వత సానువుల్నించీ వచ్చిన రచయితలు పరిచయమైనపుడు వాళ్ల కథల్లోని ప్రాంతాలూ, జీవితాలూ కళ్లముందు కదలాడి గమ్మత్తుగా అనిపించింది. కథలంత దగ్గరయ్యేదాకా మాట్లాడుతూ వుండిపోయాను.గంట ఆలస్యంగా సభ ప్రారంభమైంది.రెండు వందల మంది దాకా శ్రోతలు హాజరయ్యారు.ప్రారంభ ఉపన్యాసాలు ముగిసేసరికి భోజన సమయమైంది.మధ్యాహ్నం తర్వాత రెండు ప్రాంతాలకు సంబంధించిన రెండు కథా పఠనాలూ, కథాసాహిత్యాన్ని గురించిన విశ్లేషణా పత్ర సమర్పణలూ జరిగాయి.ఐదుగంటలకు సమావేశాలు ముగించుకొని ఆరు గంటలకంతా లాడ్జి చేరుకొన్నాము.బైటే కనిపించాడు వీరారెడ్డి.నాకు దగ్గరగా వచ్చి ‘‘కుదరలేదు సార్‌!’’ అన్నాడు.డబ్బు దొరకలేదో, మోటారు బేరం కుదరలేదో అర్ధం కాలేదు నాకు.రిసెష్షన్‌లో గది తాళపు చెవులు తీసికొని పైకి వెళ్లాము.

తలుపు తీసి గదిలోకి అడుగుపెట్టగానే అడిగాను ‘‘ఏమైంది?’’ అని.‘‘వాని దగ్గెర లెక్కలేదంట సార్‌! యాన్నో తేవాలంట. ఇచ్చే మనిసి అందుబాటులో లేడంట’’ చెప్పాడు.‘‘మరి.. రమ్మనడం దేనికంట?’’ ప్రశ్నించాను.‘‘ఆ మాట అడుగుతాననే నన్ను ఇంటికాన్నే వుంచి పైటేల్దాకా యాడేన్నో తిరిగొచ్చిండు. వాని పెండ్లాం అననే అనింది ‘యాడన్నా సూసుకోగూడదా బావా! యీడ ఎవురిస్చారు! ఇచ్చినా వడ్డీలు ఎక్కువ. కుదువ బెట్టుకోంది ఏమీ ఇయ్యరు’ అని. వాడొచ్చీ అదే మాట అన్నెడు. ‘కుదవ లేకండా రూపాయ లెక్కగూడా పుట్టదన్నా! సిటీలో అట్లా నడుస్చాంది. కుదవబెట్టేదానికి నాకాడ ఏమీలేదు. నువ్వే ఏదెన్నా వుంటే సూడు’ అని. ‘నాకాడ ఏముందిరా’ అన్నె. పొలము కుదవబెట్టమన్నెడు. ‘తెల్లకాగితమ్మీద ఆయకం రాసీ సాల్లే… నేనే ఏదొకటి చెప్పుకొని లెక్క తెచ్చిస్తా’నన్నెడు. నాకు అనుమానం యేందంటే సారూ – నా మీద నమ్మకం లేకనే యీ నాటకాలాడతా వుండాడని. రేపొస్చానని చెప్పాచ్చినా’’ అన్నాడు వీరారెడ్డి.

‘‘ఇప్పుడెట్లా మరి?’’ అడిగాను‘‘మా చిన్నాయన కొడుకే సార్‌ వాడు. అప్పులు జాస్తయి తీర్చలేక మందు దాగి సావబోతాంటే మేమే అడ్డపడి బూములమ్మించి అప్పులోల్లను బంగపడో గదమాయించో రూపాయకు పావలా వంతున చెల్లు గట్టించి బాండ్లు చించేయించినాము. ఊరిడ్సి వాడీడ జేరుకొని పదిరూపాయలు ఎనకేసికొన్నెడు. సంతోసెమే … కానీ రవ్వంతన్నా విశ్వాసముండాల గద సారూ!’’ అన్నాడు ఆవేదనగా.‘‘ఇక్కడేం చేస్తున్నాడు అతను?’’ అడిగాను.‘‘పదేండ్లనించి యీన్నే వుండాడు. యాన్నో ఫ్యాక్టరీల కాడ వాచ్‌మెన్‌గా కుదురుకున్నేదంట… ఊరిబైట సెంటో అరసెంటో ఇంటి స్థలం కొని, అది అమ్మి, ఇంగోకటి కొని … అదీ అమ్మి .. అట్లాసార్‌…’’ చేతులు పైకి వూపాడు.అంతలో పక్క గదుల్లోంచి నలుగురు సాహిత్య మిత్రులొచ్చారు. వ్యవసాయ పెట్టుబడులకు డబ్బులందక ఇబ్బందిపడే వీరారెడ్డిని గురించి మరోసారి విన్నారు.

చదవండి :  'శివరామక్రిష్ణన్'కు నిరసన తెలిపిన విద్యార్థులు

బోరుబావి తవ్వించి, కరంటు స్తంభాలు బాతి, తీగలు లాగి రెండు లక్షలు ఖర్చుజేసి మోటారు బిగించినా కరువుకాలంలో రెండెకరాలకు కూడా నీళ్లు అందవని తెలిసి ఆశ్చర్యపోయారు. పండిన పంట వల్ల వచ్చిన ఆదాయం అంతా ఎదిరి కుప్పేసుకొన్నా పెట్టుబడి సొమ్ముకు వడ్డీలు కూడా చెల్లవని తెలిసి నమ్మలేనట్లుగా చూశారు.‘‘నష్టం వచ్చేపని ఎందుకు చేయాలి? వ్యవసాయం చాలించొచ్చు గదా!’’ అన్నారు.‘‘సేద్దెం ఎత్తిపెట్టి యింగేపని జెయ్యాల సారూ?’’ అడిగాడు వీరారెడ్డి.‘‘శారీరక కష్టం చేసేవాడివి. ఏ పనైనా చేసికొని ఇంతకన్నా సుఖంగా బతకొచ్చు గదా!’’ అన్నారు.‘‘సుగంగా బతకాలని మేమనుకోవడం లేదు సార్‌! కష్టం జెయ్యడంలో మాకేమీ బాధలేదు. పనిజెయ్యడంలో వుండే కష్టం మాకిష్టమే.

పని జరగక పోయే కష్టమే సార్‌ మా పానాల్దీసేది..’’వాళ్లకు అర్ధం కాలేదు.‘‘పన్జేస్చాంటే రోడ్డుమీద గాను దొల్లినట్టు దొల్లాల సార్‌! ఏదీ .. ఎప్పుడూ గుంతలు మిట్టలు కంపా కట్టెలూ అడ్డమే. విత్తనాలు మొలిచే పదును మయాన వాన కురవదు. అర బదునుకు యిత్తితే మొలిచినవి మొలిచినట్టే కుసిలిస్తా వుంటాయి. బోరు దించుదామా – నీల్లు పడవు. అరకొర నీల్లు పడినా మడవ ముందుకు సాగదు… పని దొల్లనే దొల్లదు సార్‌! పని జరుగుతా వుంటే మాకు దాంట్లోనే సుగం సార్‌! అదే ఆనందం.. దొల్లడం లేదు సార్‌!’’ అతని గొంతులో విషాదపు జీర కదలాడింది.

‘‘అందుకే.. వ్యవసాయం వదిలి వేరే పని చేసికోవచ్చు గదా!’’‘‘బూములెవురు దున్నాల సారూ!’’ ప్రశ్నించాడు. ‘‘బూమి దున్నకుండా పైరు బెట్టకుండా ఇంగోక పనికి పోడానికి పానం ఒప్పుకోవద్దా! నాలగేండ్లకు ఒక్కేడన్నా పండదా?’’మరేమీ మాట్లాడలేక పోయారు రచయితలు. భూమిమీద అతనికున్న మరులు, ఆశాభావం చూసి నిట్టూర్చారు.రాత్రి భోంచేసి గదిలోకి వచ్చిన కొంత సేపటికి సురేష్‌ వచ్చాడు.‘‘ఏమైనా తిని వచ్చావా?’’ అడిగాను‘‘తాగి కూడా వచ్చినా’’ చెప్పాడు.పరుపు తెప్పించుకొని కింద పరచుకొన్నాడు. పడుకొని ఐదు నిమిషాల్లో గుర్రుపెట్టి నిద్రబోయాడు.‘‘అదృష్టవంతడు సార్‌!’’ అతనికి నిద్రబట్టిన విధానాన్ని చూసి అన్నాడు వీరారెడ్డి.‘‘డబ్బేమైనా దండిగా సంపాదించినాడేమో!’’అన్నాను.మోటారు సమస్య నన్ను కూడా ఆలోచింపజేస్తూ వుంది.‘‘ఎంత కరంటు! ఎన్ని నీల్లు!’’ చిన్నగా గొణుక్కొంటున్నాడు వీరారెడ్డి.

అతనికేసి ప్రశ్నార్థకంగా చూశాను.‘‘పొద్దున్నించి సూస్తండ … ఒక్క నిమిసెం కరంటు పోలేదు సార్‌! బాత్రూముల్లో నీల్లధార తగ్గలేదు. ఎంత దూరాన్నించో నీల్లుదెచ్చి సిటీనంతా తడుపుతావుండారు. కరెంటు దెచ్చి ఎలిగిస్చా వుండారు. దీంట్లో పాతికె వంతు పల్లెలకిస్చే బతికి పోమా!’’ అన్నాడు.తన యీ ఒక్కరోజు నగరానుభవాన్ని పుట్టి పెరిగిన పల్లెతో పోల్చుకొంటున్నాడు.‘‘ఎంతెంత మిద్దెలూ మేడలూ, ఎన్ని రకాల కార్లూ … ఎంత మంచి రోడ్లూ.. కండలు బలిసిన మనుసులేగాని ఎంకలు బైటబడినోల్లు లేనే లేరు… సౌకర్యాలన్నీ ఇక్కడే … సంపదంతా ఇక్కడే… ఇంత పెద్ద నగరంలో ఇంటింటికీ ఇన్ని నీల్లేంది సార్‌? నాలగిండ్లు లేవు.. మా వూర్లో నాల్రోజులకు ఒక్కసారన్నా నీల్లురాక బిందెలెత్తుకొని పొలాల్లోని బోరుబావుల కాడికి పోతావుంటమి’’ అన్నాడు.

పల్లెను నగరంతో పోల్చి నిట్టూరుస్తున్నాడు.ఆ వూర్లో ఉపాధ్యాయున్ని కాబట్టి, వూరి పరిస్థితులన్నీ తెలుసు కాబట్టి అతని ఆవేదనను అర్ధం చేసుకోగలుగుతున్నాను.ఉదయం మా కన్నా ముందే లేచాడు సురేష్‌.డబ్బు విషయం కదలించాను.‘‘యాడుంది సార్‌! ముప్పయివేలు తెచ్చిన్నే. హ్యాండ్‌ డౌన్‌ సార్‌! అంతా వూడ్చక పోయింది. ఒక్కోసారి టైం సార్‌! కూచున్నె వేళా విశేషం – మీ దగ్గెర క్యాషేమన్నా వుంటే యీండి. ఈ రోజు అంతకంతకు సంపాదించుకొస్తా’’ అన్నాడు.‘‘డోలు పోయి మద్దెలతో మొరపెట్టుకొన్నెట్టుంది నీ యవ్వారం..’’ అంటూ మోటారు కోసం వీరారెడ్డి పడే అగచాట్లను క్లుప్తంగా చెప్పాను.

చదవండి :  బొమ్మ బొరుసు (కథ) - వేంపల్లి రెడ్డి నాగరాజు

‘‘ఇంకేం మరి.. మా యిద్దరి సమస్యలు తీరినట్టే…’’ అన్నాడు సురేష్‌.‘‘ఎట్లా?’’ అడిగాను.‘‘ఆ పాతిక వేలూ నాకియ్యండి. ఒకరోజు హ్యాండ్‌ డౌనయితే ఇంగో రోజు ఖచ్చితంగా రెయిజయిద్ది. ఈ రోజు గెల్చుకొంటా. నీ పాతిక వేలూ నీకిస్తా. వీరారెడ్డి మోటారు ఖర్చంతా నేనే యిస్తా..’’ అన్నాడు.అతని ప్రతిపాదనకు నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు.వీరారెడ్డి రెండు చేతులెత్తి దండం పెట్టి ‘‘నీ అగచాట్లు నువ్వుబడు సురేషూ!’’ అన్నాడు.‘‘నాకు లెక్క దొరక్క కాదు. నీకు సాయం జెయ్యాలనే..’’ సురేష్‌ అన్నాడు.వీరారెడ్డి మరోసారి దండం పెట్టాడు.సురేష్‌ ప్రయాణమై వెళ్లిపోయాడు.‘నీ పరిస్థితి ఏమిటి?’ అన్నట్లుగా వీరారెడ్డి కేసి చూశాను.‘‘పొలం కుదువ రాయించి లెక్కదెచ్చుకొంటా సార్‌! ఇంగో దారి కనబడ్డం లేదు…’’ చెప్పాడు.

అట్నించటే బసెక్కి వూరికి వెళతానన్నాడు.నేను కూడా అదే బస్‌కు వెళ్లాలి.వీరారెడ్డిని ఆటో ఎక్కించి పంపాను.మధ్యాహ్నమే టికెట్‌ రిజర్వ్‌ చేయించుకొన్నాను.సాయంత్రంగా వీరారెడ్డి నించి ఫోనొచ్చింది. అతను బస్సుకు రావటం లేదంట. కడపకు వెళ్లే లారీ ఒకటి దొరికిందట. మోటరు సామాన్లన్నీ అందులో వేసికొని వెళతాడంట.బస్సులో వెళితే చార్జీలు లగేజి అంత కలుపుకొని వెయ్యి రూపాయల దాకా అవుతుంది. అందులో సగం ఖర్చుతోనే లారీలో వెళ్లొచ్చుగదా!రాత్రి ఎనిమిది గంటలకు బస్టాండు చేరుకొన్నాను.బస్సు కదిలేముందుగా వచ్చాడు సురేష్‌.క్లబ్‌ నించే టికెట్‌ రిజర్వ్‌ చేసికొన్నాడంట.భోజనం కోసం బస్‌ను జడ్చర్ల వద్ద ఆపినపుడు, నన్ను బలవంతంగా లాక్కెళ్లి భోజనం తినిపించాడు.ఈ రోజు పదివేలు లాభంతో వచ్చాడంట. అందుకే సంతోషంతో బిర్యాని తింటున్నా అన్నాడు.‘‘నిన్న ముప్పయి వేలు నష్టపోయావు గదా!’’ అన్నాను.

‘‘నిన్నటి ఏడుపు నిన్నటిదే సార్‌! ఈ రోజు సంతోషం యీ రోజుది’’ అన్నాడు. వీరారెడ్డిని గురించి అడిగాడు.అతని అగచాట్లన్నీ చెప్పాను.‘‘ఏమైనా … బో! గుండె నిబ్బరమున్న మనిషి సార్‌ వీరారెడ్డి’’ అన్నాడు సురేష్‌.అతని కేసి ప్రశ్నార్థకంగా చూశాను.‘‘ఆటలో పదివేలు పోతేనే చేతులు వణుకుతాయి సార్‌ నాకు. అట్లాంటిది లక్షరూపాయలు పెట్టుబడి పెట్టి పంట చేతికి రాక బొందుబోయి, మల్లా కారుకు వాని కాల్లు వీని కాల్లు పట్టుకొని అప్పోసప్పోజేసి మల్లా పొలం దున్ని సాగుజేసి విత్తడానికి సిద్దమవుతాడు. ఎంత ధైర్యం సార్‌ అతనికి! ఆయప్పది గుండె కాయ కాదు సార్‌ – ఇనప ముద్ద..’’ అన్నాడు సురేష్‌. హైదరాబాదు వచ్చేటప్పుడు సురేష్‌ గురించి ఇదే మాటన్నాడు వీరారెడ్డి.వీరారెడ్డి దృష్టిలో సురేష్‌ ఎంత జూదగాడో, సురేష్‌ దృష్టిలో వీరారెడ్డి కూడా అంతే జూదగాడని అర్ధమయ్యేసరికి నాకు తల తిరిగిపోయింది. బస్సులో కూచుంటే – వీరారెడ్డి ప్రకృతిలో ఆడే వ్యవసాయం జూదమే కళ్లముందు కదలాడ సాగింది

(ఆదివారం ఆంధ్రజ్యోతి)

సన్నపురెడ్డి గురించి

సన్నపురెడ్డి పుట్టిందీ, పెరిగిందీ , ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నదీ – కడప జిల్లా, కలసపాడు మండలం బాలరాజుపల్లెలో – కుగ్రామం కావడంతో తన కథలకూ, కవితలకూ అవసరమైన మూలబీజాల్ని ఆ గ్రామీణం నుండే ఏరుకోగలుగుతున్నాడు. అక్కడి బడుగుజీవులైన రైతుల, రైతుకూలీల బతుకువెతల్ని తన కళ్ళలో నింపుకుంటూ, తన కళ్ళ దర్పణాల్లో వాళ్ళ జీవిత ప్రతిబింబాల్ని పాఠకలోకానికి స్పష్టంగా చూపించగలుగుతున్నారు. వీరి ‘పాలెగత్తె’ స్వాతివారపత్రిక నిర్వహించిన నవలలపోటీలో – ‘చినుకుల సవ్వడి’ చతుర నవలపోటీలో ప్రథమ బహుమతిని సాధించాయి. వీరి తొలి నవల కాడి 1998లో ఆటా వారు నిర్వహించిన నవలల పోటీలో ద్వితీయబహుమతి పొందింది.2006 ఆటా పోటీలలో వీరి నవల తోలుబొమ్మలాట  ప్రథమ బహుమతి పొందింది.

ఇదీ చదవండి!

రాయలసీమలో హైకోర్టు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – మొదటి భాగం

రాష్ట్ర విభజనానంతరం 1953నాటి ప్రాంతాలే ఆంధ్ర ప్రదేశ్ లో మిగలడం వల్ల, స్థూలంగా రాయలసీమలో అప్పటి వెనుకబాటుతనం, సీమవాసుల్లో కోస్తాంధ్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: