ఔను…కడప జిల్లా అంటే అంతే మరి!

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా మూడు ట్రిపుల్ ఐటి లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో ఒకటి కడప జిల్లాలోని ఇడుపులపాయలో ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వం విధాన పరమైన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని నాటి ప్రతిపక్షమైన తెదేపా అసెంబ్లీ సాక్షిగా తీవ్రంగా తప్పుపట్టింది. ఆ సందర్భంలో వైఎస్ మాట్లాడుతూ ‘ఏం ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటి పెట్టకూడదా? అదేమన్నా పాకిస్తాన్లో ఉందా?’ అంటూ తెదేపా నేతలను ప్రశ్నించారు. అదే సందర్భంలో ఆయన మరో మాట కూడా చెప్పారు. ‘ చంద్రబాబు గారు మీ తొమ్మిదేళ్ళ హయాంలో పులివెందుల కానీ కడప జిల్లా కానీ ఆంధ్రప్రదేశ్ మ్యాపులో ఉన్నట్లు మీకు కనబడలేదు కదా!’ అని.

ఆ రోజు వైఎస్ చెప్పిన మాటలు అక్షర సత్యాలు. ఎందుకంటే సంవత్సరాలు గడచినా కడప జిల్లా విషయంలో బాబు గారి వైఖరి ఏమాత్రం మారలేదు. విభజనాంతర ఆం.ప్రకు మొట్ట మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బాబు గారు రాష్ట్రంలో పదమూడు జిల్లాలుంటే – పన్నెండు జిల్లాల వారికి మంత్రి పదవులు కట్టబెట్టారు – ఒక్క కడప జిల్లాకు తప్ప. ఈ జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారిలో ఎవరినో ఒకరిని మంత్రిని చేసుండవచ్చు కదా!

రాజంపేట నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్లిఖార్జున రెడ్డి మొదటిసారి శాసనసభకు ఎన్నికైనందున మంత్రి పదవి ఇవ్వలేదుట! – మొదటిసారి ఎన్నికైతే మంత్రి పదవి ఇవ్వాకూడదనేది నియమమైతే – నెల్లూరు జిల్లాకు చెందిన నారాయణ విషయంలో ఈ నియమం ఎందుకు వర్తించలేదు? అంటే సమాధానముండదు.  కనీసం మల్లిఖార్జున రెడ్డి శాసనసభ్యుడిగా గెలిచారు. మరి నారాయణ – ఏ చట్టసభకూ ఎన్నికవ్వలేదు. మల్లిఖార్జున రెడ్డి, వారి కుటుంబ సభ్యులు కాంట్రాక్టులు, వ్యాపారాల ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించారు. మల్లిఖార్జున రెడ్డి చెబుతుంటారు ‘కేవలం మంచి పేరు తెచ్చుకోవాలనే రాజకీయాల్లోకి వచ్చాను – డబ్బు సంపాదించాలని కాదు’ అని. అందుకోసమే ఆయన పార్టీలతో, విధానాలతో సంబంధం లేకుండా ఎడా పెడా పార్టీలు మారారు. ఎన్నికల్లో గెలవాలని సొంత డబ్బు బాగా ఖర్చు పెట్టేరు కూడా. అంతటి వాడు మంత్రి పదవికి ఆనడా?

చదవండి :  సాయిప్రతాప్ రాజీనామా!

ఇక పులివెందులకు చెందిన ఎస్వీ సతీష్ రెడ్డి – శాసనమండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు – ఈయన తెదేపాకు పులివెందుల నియోజకవర్గంలో పెద్దదిక్కు. అనేక పర్యాయాలు వైఎస్ పైన పోటీ చేసి ఓడిపోయారు. ఈ సార్వత్రిక ఎన్నికలలో సైతం జగన్ పై పోటీకి నిలబడ్డారు. పాపం ఎన్నికలైపోయి తెదేపా అధికారంలోకి వస్తుందని తెలియగానే పులివెందులలో ఎప్పటి నుంచో కిలో 180 రూపాయలుగా ఉన్న చికెన్ ధరను రూ.150కి తీసుకొచ్చి ప్రజలకు మేలు చేశారు. సతీష్ ఇలా చెయ్యటం వల్ల పులివెందుల ప్రజలు చికెన్ కొనటానికి అనంతపురం జిల్లాలోని కదిరికి వెళ్ళే బాధ తప్పిందట (ఈనాడు వారి కధనం). గతంలో వైఎస్ హయాంలో పులివెందులలో చేపట్టిన పనులన్నీ కాంట్రాక్టర్ల కోసమే అని సతీష్ చెప్తుంటారు. పులివెందుల దాహార్తిని తీర్చేదానికి వైఎస్ 180 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని – అదే నేనైతే 18 కోట్ల రూపాయలిస్తే నీటి సమస్య లేకుండా చేస్తానని కూడా సతీష్ జగన్ కు సవాలు విసిరారు – ఎన్నికల సందర్భంలో. అంతటి సమర్దుడూ, దశాబ్దాలుగా పులివెందులలో వైఎస్ కుటుంబం పైన పోరాడుతున్న సతీష్ రెడ్డి మంత్రి పదవికి సరిపోడా!

చదవండి :  బడ్జెట్‌పై ఎవరేమన్నారు?

వీళ్లెవరూ కాకపోతే నారాయణ మాదిరిగా ఓడిపోయిన వాళ్ళలో సేనియర్ ఎవరో ఒకరికి మంత్రిగిరీ ఇవ్వొచ్చుగా… కడప జిల్లా కోటాలో! ఎన్ని ఆప్షన్లున్నా కడప జిల్లా విషయానికొచ్చేసరికి అంతా తూచ్!! అది ఎప్పటికీ అంతే.

ఇంతకీ కడప జిల్లాకి మంత్రిగిరీ లేకపోతే వచ్చే నష్టమేమిటట… ఒక తెదేపా సానుభూతిపరుడు నన్నడిగేడు – కడప జిల్లా నుండి ఒక మంత్రి ఉంటే – ఆ మంత్రి తన వల్ల వీలయితే ఈ జిల్లాకు లేదా నియోజికవర్గానికి మేలు చేసే అవకాశం రాదా? వేరే జిల్లా వాళ్లయితే కడప జిల్లాకు మేలు చేయరా? అంటే – చేస్తారు! – వాళ్లకు చేయాలని కమిట్మెంట్ ఉంటే.. ఇక్కడి సమస్యలు తెలిస్తే! ఒకవేళ వీలు కుదరకపోతే అసలు పట్టించుకోకపోవచ్చు. అదే మనూరోడు మంత్రి ఉంటే అంతో ఇంతో కేబినెట్ మీటింగులలోనో … అధికారుల వద్దనో మనూరి సమస్యల గురించి చర్చించగలడు. అభివృద్ది పనులకు అంతో ఇంతో నిధులు తీసుకురావచ్చు. లేదంటే ఇతర మంత్రుల రెఫెరెన్స్ తో కొన్ని పనులు  పూర్తి చేయించొచ్చు. ఎందుకంటే అవతలి మంత్రికి ఈయన గారి అవసరం కూడా ఉండొచ్చు.

అసలే బాబు గారు కడపలో హైదరాబాదును తలదన్నే హైటెక్ సిటీని నిర్మించాలి, కడప విమానాశ్రయానికి నైట్ ల్యాండింగ్ సౌకర్యం కల్పించాలి – ఈ లోపు పెండింగ్ పడిన ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చెయ్యాలి.  అట్టానే కడపలో అనేక కొత్త పరిశ్రమలు ప్రారంభించబోతున్నారు. కడపకు సంబంధించి ఇన్ని పనులు పెట్టుకొన్న బాబు గారు వాటిని ఇక్కడ అజమాయిషీ చేయటానికి ఒక స్థానిక మంత్రిని నియమించకపోతే ఎట్లా?

చదవండి :  నేటి నుంచి దేవుని కడప బ్రహ్మోత్సవాలు

బాబు గారు నోటి వెంబడి ఎన్నికల్లో గెలిచింది మొదలు కోస్తా రాగం, రాజధాని రాగం  తప్ప మరే రాగాలు వినిపించట్లేదు.  కడపకు సంబంధించి బాబు ఇవన్నీ చేస్తాడని నీకు ఎవరు చెప్పారోయ్ అని మీరడగొచ్చు – ఎవరో చెబితే మేమెందుకు నమ్ముతాం – బాబు గారే చెప్పేరు. ఎప్పుడు చెప్పేరు? అంటే ఏప్రిల్ 7న కడపలో మీటింగ్ పెట్టి చెప్పేరు.

బయటూర్లలో ఉద్యోగం చేసుకుంటున్న మా కడపోల్లు బాబు గారు హైటెక్ సిటీ కట్టిస్తే సొంతూరికొద్దామని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇవన్నీ తొందరగా మొదలై … పూర్తి కావాలంటే మా కడప మంత్రి కేబినేట్ లో ఉండాల కదా!

జిల్లాకు మంత్రిగిరీ లేకపోతే మన నాయకులు వెళ్లి ఆయా మంత్రుల చుట్టూ తిరగాలి – ‘మాకీ పని చేసి పెట్టండి’ అని. అయినా వీళ్ళు అడగగానే వాళ్ళు పలకాలనేం రూలు లేదు కదా! అదంతా వారివారి విచక్షణ పైన ఆధారపడి ఉంటుంది. ఒకరకంగా వారి దయా … మన ప్రాప్తమూనూ!

మొత్తానికి  బాబు గారి మాటల్లో చెప్పాలంటే ఒకాయనకు పదమూడు మంది పిల్లలుంటే ఆ తండ్రి పన్నెండు మందికి  మేలు చేసి పదమూడో వాడికి అర్హతున్నా విస్మరిస్తే … అది వివక్షే!

ఔను…కడప జిల్లా అంటే బాబుగారికి అంతే మరి!

ఇదీ చదవండి!

అన్నమయ్య దర్శించిన

అన్నమయ్య దర్శించిన ఆలయాలు

ఆహోబిల మఠ సంస్తాపనాచార్యులైన శ్రీమాన్ శఠగోప యతీంద్రుల దగ్గర సకల వైష్ణవాగమాలను అభ్యసించిన పిదప దారి వెంబడి పలు ఆలయాలను …

ఒక వ్యాఖ్య

  1. articles published on injustice done to kadapa are excellent.nice job…….. maintain momemntum by publishing more articles relate to our district kadapa.

Leave a Reply

Your email address will not be published.

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: