హోమ్ » చరిత్ర » చీకటి మాటున గంజికుంట సీమ చరిత్ర
గంజికుంట

చీకటి మాటున గంజికుంట సీమ చరిత్ర

ఐదు వందల ఏళ్లకు పైగా ఆధ్యాత్మికంగా , రాజకీయంగా సుదీర్ఘమైన చరిత్ర కలిగిన గంజికుంట నేడు పట్టించుకునేవారు కరువై క్రమక్రమంగా చీకటి పుటల్లోకి నెట్టివేయబడుతోంది. విజయనగర సామ్రాజ్య కాలంలో వనిపెంట , మైదుకూరు, దువ్వూరు ప్రాంతాలకు రాజకీయ కేంద్రంగా విలసిల్లిన గంజికుంట సీమ చరిత్రకు శ్రీకృష్ణ దేవరాయల, అచ్యుతదేవరాయల కాలంనాటి శిలాశాసనాలు(16వ శతాబ్దం ) ఆధారాలుగా నిలుస్తున్నాయి. బ్రిటీషువారి రికార్డులకు ఎక్కిన పాలెగాళ్ళు పట్రా విటలపతినాయుడు వెలమ వెంకోజీ నాయుడు , వన్నూరమ్మలు రాజకీయ కార్యకలాపాలకు గంజికుంట కేంద్ర స్థానంగా వెలుగొందింది.

పేరు వెనుక కథ :

గంజికుంట అగ్రహారం ఆ రోజుల్లో ఆధ్యాత్మిక విద్యాకేంద్రంగా వెలుగొందింది . తిరుమల, శిద్దవటం ప్రాంతాలనుండి నల్లమల కొండల దారిగుండా అహోబిలం క్షేత్రానికి వెళ్ళే యాత్రీకులకు వెలమ దొరలు పెద్ద ఎత్తున అన్నదానం చేసేవారు. ఆ అన్నం వార్చిన గంజి కాలువలై పారి కుంటగా మారడంతో ఆ ప్రాంతానికి గంజికుంట అనేపేరు వచ్చినట్లు స్థానిక చరిత్రవల్ల తెలుస్తోంది.

ఆలయాలు

గంజికుంట

గంజికుంటలో చారిత్రక ప్రాధాన్యత కలిగిన చెన్నకేశవ, ఆంజనేయ , వీరభద్ర ఆలయాలతో కూడిన దేవాలయానికి ఏంతో చారిత్రిక విశిష్టత ఉంది. ఆలయంలోని చెన్నకేశవ, లక్ష్మీదేవి విగ్రహాలు ప్రసన్నతతో భక్తులకు ఆధ్యాత్మిక భావనను , మానసిక ప్రశాంతతను కలిగిస్తున్నట్లుగా ఉన్నాయి. చేన్నకేశవ ఆలయ గర్భగుడికి పైకప్పులేకపోవడం ఈ ఆలయ ప్రత్యేకత . చెన్నకేశవ ఆలయానికి ఉత్తరదిశగా గంభీరమైన వీరభద్రస్వామి విగ్రహం ఉంది. ఆలయ ప్రాకారానికి నైరుతీదిశలో ఆంజనేయస్వామి ఆలయం, భక్తులకు కోసం నూతనంగా దాతలు నిర్మించిన వసతి సత్రం ఉన్నాయి. ఆంజనేయ విగ్రహం భక్తులకు అభయమిచ్చే కటాక్ష రూపంతో అలలారుతోంది.

గంజికుంటఆలయప్రాంగణంలో పురాతన విఘ్నేశ్వర, నాగదేవతల విగ్రహాలు, ధ్వజస్తంభం ఆలయ ప్రాచీనతకు సాక్షీభూతంగా నిలుస్తున్నాయి. విజయనగర రాజులు ఈ దేవాలయానికి వేద బ్రాహ్మణులను అర్చకులుగా నియమించి ఆగ్రహారాన్ని ఏర్పాటు చేసారు. ఆ అగ్రహారానికి భూములను మాన్యంగా ఇచ్చారు. ఆలయ సముదాయంలో తవ్విన బావి అందమైన కటకంతో శిల్పాలతో చూపరులను ఆకట్టుకుంటుంది. బావిలో ఏనుగు, సర్పము , శృంగార శిల్పాలున్నాయి.

ఈ ఆలయానికి సమీపంలోని ఎల్లమ్మ ఆలయం కూడా మహిమాన్వితమైనదిగా స్థానిక ప్రజలు విశ్వసిస్తారు . గంజికుంట, నల్లపురెడ్డిపల్లె, లెక్కలవారిపల్లె గ్రామాల ప్రజలు ఈ ఆలయాలలో పూజలు చేస్తూ ఉన్నారు. ప్రఖ్యాత భైరవకోన క్షేత్రం ఈ గంజికుంట సీమలోనే ఉండటం విశేషం . ఇంతటి విశిష్టత కలిగిన గంజికుంట సీమ చరిత్రపై మరింతలోతుగా పరిశోధన జరగాల్సి ఉంది. ఆలయానికి సంబంధించిన మాన్యం భూములపై సరైన ఆదాయం వసూలు చేసి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

గంజికుంట

–  తవ్వా ఓబుల్ రెడ్డి

మొబైల్ : +91-9440024471

ఇదీ చదవండి!

కడప జిల్లా కథాసాహిత్యం

కడప జిల్లాలో కథాసాహిత్యం – డా|| కేతు విశ్వనాధరెడ్డి

కడప జిల్లా కథాసాహిత్యం నవల, కథానిక, నాటకం, నాటిక వంటి ఆధునిక రచన సాహిత్య ప్రక్రియల ఆవిర్భావం కడప జిల్లాలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: