గజ్జల మల్లారెడ్డికి శ్రీశ్రీ రాసిన బహిరంగ లేఖ

‘మల్లారెడ్డి గేయాలు’ పుస్తక రూపంలో అచ్చయిన కొద్దిరోజులకు మహాకవి శ్రీశ్రీ గజ్జల మల్లారెడ్డికి రాసిన బహిరంగ లేఖ ఇది. ఈ లేఖ మొదట ‘విశాలాంధ్ర’ దినపత్రికలోనూ, తరువాత డిసెంబర్ 13 (1961) నాటి ‘సవ్యసాచి’ సంచికలోనూ అచ్చయింది.

గజ్జల మల్లా!

నీ గేయాలు చదివాను, మళ్ళీ చదివాను, మళ్ళీ మళ్ళీ చదివాను. ఈ పాతికేళ్లలో నేను కూడబెట్టుకున్న కీర్తిని నువ్వు పాతిక కన్న తక్కువ కావ్యాలతో తస్కరించావని నీ మీద కేసు పెడుతున్నాను. నువ్వు ఒట్టి మార్క్సిస్టు మిత్రుడివి గాక నిజమైన కవివే ఐతే చోరీసొత్తు యధాస్థానంలో దాఖలు చెయ్యి. నువ్వేదో నీ రాజకీయాలేవో చూచుకోక అనవసరంగా కావ్య జగత్తులో దురాక్రమణ చెయ్యటం నీకేమైనా బావుందీ? ఐనా గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పు. అరసున్న ఎక్కడ పెట్టాలో నీకు తెలుసూ? (రాయలసీమ వాడివి కాబట్టి బండిరాల సంగతి దాటవేస్తున్నాను.)

చదవండి :  'ఏముండయన్నా కడపలో'? : కడప పర్యటన - 1

నీకు ఇంగ్లీషు రాదు, ఫ్రెంచి రాదు, సంస్కృతం రామరామ రానే రాదు. ఇలాంటివాడివి నువ్వు తెలుగు కవిత్వం రాయడమేమిటి చెప్పూ.

క్షణికంబులు తాత్కాలికంబులునగు సమకాలిక సమస్యలా నీ కవితా వస్తువులు? నువ్వు భారతీయ సంస్కృతికి తీరని కళంకం తెచ్చావు. సార్వకాలిక సమస్యలు, శాశ్వత విలువలు (సమాస తప్పును పాఠకులు మన్నింతురు గాక) నీకేం తెలుసు? నీకేం తెలుసునంటా! తెలియదని నాకు తెలుసు కాబట్టి నీ కవిత్వం ఉత్త ప్రోపగాండా అని రూలింగు ఇచ్చాను.

చదవండి :  మన జయరాం, మన సొదుం

మళ్ళీ చెబుతున్నాను మల్లా! నువ్వు కవివి కావు, కావు, కావు, కావు ఇది కాకిగోల అనుకున్నా సరే. నువ్వు కవ్వి కావు.”

–  శ్రీరంగం శ్రీనివాసరావు

Leave a Reply

Your email address will not be published.

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: