జుట్టుమామ (కథ) – ఎం.వి.రమణారెడ్డి

ఇన్నేళ్లైనా నా జ్ఞాపకాలనుండి జుట్టుమామ తొలగిపోలేదు. ఎప్పుడూ కాకపోయినా, సినిమానుండి తిరిగొచ్చే సమయంలో తప్పకుండా గుర్తొస్తాడు. గుర్తుకొస్తే మనసు బరువెక్కుతుంది. ఏదో అపరాధం చేసిన భావన నన్ను వెంటాడుతుంది. నేను చేసిన తప్పు ఇదీ అని ఇదమిత్తంగా తేల్చుకోనూలేను; దులిపేసుకుని నిశ్చింతగా ఉండనూలేను. అప్పట్లో నాది తప్పూ, నేరం తెలిసిన వయసేగాదు. అతడు చనిపోయేనాటికి నా వయసు ఎనిమిదేండ్లు.

అతడు మా బంధువుల్లో మనిషి కాడు; మా ఇంట్లో పెరిగిన అనాథ. అప్పట్లో నాకా తేడాలు పెద్దగా తెలీదు. అతడు మా ఇంట్లో పెరగడమేగాక, ఇంట్లో మనిషిలాగే కలిసుంటాడు. మా అమ్మను ‘అక్కా’అని పిలుస్తాడు. నాకుమల్లే నాన్నకు భయపడతాడు. సినిమాకు డబ్బు కావాలని అమ్మ దగ్గర మొండికేస్తాడు. అతడు మొరాయిస్తే మా ఇంట్లో పొద్దు నిలిచిపోతుంది. ఏ రుతువులోనైనా కనీసం నాలుగు గేదెలు పాడిగల మోతుబరి సంసారం మాది. వరిగడ్డితో వొళ్లుతోమి వాటిని నీళ్లతో కడగడం మొదలుకొని, పాడిపశువుల ఆలనాపాలనా మొత్తం అతనిమీదే నడుస్తుంది. పనులన్నీ వొంటిచేత్తో చేసుకుపోతాడు. మామ మాయింటికొచ్చిన తరువాత నన్ను సముదాయించే పనిగూడా అమ్మకు తప్పింది. కేరుమని నా ఏడుపు వినిపిస్తే, పిదికే పాలను పక్కనబెట్టి పరిగెత్తుకొస్తాడట. గేదెలకు అతడు కనురెప్ప. అతనికి నేను కంటిపాప. ‘వీడి కోసమే దేవుడు వాణ్ని భూమిలోనుండి పుట్టించాడు’ అని అమ్మ ఎప్పుడూ అంటుండేది. జుట్టుమామకు అమ్మానాన్నా లేరు. వారెవరో అతనికి తెలీదు. అదుకేనేమో అతడు భూమిలోనుండి పుట్టుకొచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన 30 ఏళ్ళకు మలితరం సీమ సమస్యలపై గొంతెత్తిన మొదటి నాయకుడు డా. ఎం.వి. రమణారెడ్డి. 1983లో అధికార టీడీపీలో ఎమ్మెల్యేగా ఉంటూనే రాయలసీమకు జరుగుతున్న అన్యాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. తర్వాత స్వతంత్రంగా రాయలసీమ విమోచన సమితి ఏర్పాటు చేసి 1985 జనవరి 1 నుంచి రాయలసీమ సమస్యల తక్షణ పరిష్కారం కోరుతూ 22 రోజుల పాటు ఆమరణ దీక్ష చేపట్టారు.

జుట్టుమామకు చదువురాదు. నేను బిగ్గరగా పాఠాలు చదివితే అతనికి పట్టరాని సంతోషం. నన్ను చంకకెత్తుకుని రోజూ బడికి మోసుకుపోతాడు. ‘ఎడపిల్లోడైనా ఇంకా ఈ చంకమోతలేమిటిరా’ అని అమ్మ మందలించినా వినిపించుకోడు. బడి ఎగ్గొట్టే అవకాశం లేకుండా చేస్తున్నాడని నాకు కోపం. బడినుండి రాగానే నా కోపం పోగొట్టడానికి ఎంతగానో బుజ్జగిస్తాడు. నాకిష్టమైన కథలు చెబుతాడు.భుజమీద కూర్చోబెట్టుకుని ఊరంతా షికారు తిప్పుతాడు. ఒక కాలు కుడివైపు, మరోకాలు ఎడమవైపు అతని ఎదమీదికి దిగేసి, మూపుమీద నేను దర్జాగా కూర్చొంటాను. అతని జుట్టే నా చేతికి పట్టు. నాన్న ఎదురవకుండావుంటే నా స్వారీకి ఎదురేలేదు. చూస్తే చీవాట్లు తప్పవు. ‘దిగు గాడిద కొడకా. వాడు మనిషనుకున్నావా, జంతువనుకున్నావా?’ ఇంటివైపు తిరిగి ఇద్దరం పరుగో పరుగు.

నేను మారాం చేసి అతని వీపున ఎక్కుతున్నానని పెద్దవాళ్ల అనుమానం. అది నిజంగాదు. నన్ను ఎత్తుకోవడం జుట్టుమామకు సరదా. నేను పైకెక్కి కూర్చుంటే ఆంజనేయునిలా ఉబ్బిపోతాడు. మామ ప్రపంచానికి రెండే దిక్కులు. నేను తూర్పు. మిగతావన్నీ పడమర. అతడు మాఇంటికి ఇంతక కట్టుబడిపోవడానికి కారణం నేనే. కేవలం పనిమనిషైతే అతన్ని కళ్ళకద్దుకుని ఎవరైనా తీసుకుంటారు. కానీ, అతనికి డబ్బుతో నిమిత్తం లేదు. సినిమా టికెట్టుకు పావలా కోసం అమ్మను ప్రాధేయ పడటం తప్ప డబ్బుతో వేరే ప్రయోజనముందని అతనికి ఆలోచనే లేదు. చివరకు ఆ సినిమా మోజే అతని ప్రాణానికి గండమైంది.

ఇంకా చిన్నప్పుడు, జుట్టుమామకు డబ్బంటే అస్సలు తెలీదట. పుష్పగిరి ఆలయంలో రోజంతా నన్ను ఎత్తుకుతిరిగి ఆడించినందుకు అమ్మ డబ్బులివ్వబోతే వెర్రిమొగమేసుకుని ఆమెవైపు చూశాడట. ‘వాడేం చేసుకుంటాడమ్మా. ఇల్లా వాకిలా? దిక్కులేనోడు.కడుపునిండా ఇంత అన్నం పెట్టు తల్లీ’ అక్కడున్న సాముల్లో వొకాయన. అప్పుడు నాకు మూడో యేడు పడింది. లేకలేక కలిగిన సంతానాన్ని గాబట్టి, ముక్కోటి దేవతలతో భరోసా తీసుకోవటానికి చేసిన తీర్థయాత్రల్లో భాగంగా మేము పుష్పగిరికి వచ్చినప్పుడు ఇది జరిగింది. అమ్మానాన్నలకు జుట్టుమామ దొరికాడో, జుట్టుమామకే మా అమ్మానాన్నలు దొరికారో చెప్పడం కష్టం. బహుశా వీటిల్లో ఏదీ కాదేమో! మామచనిపోయిన తరువాత అమ్మ నోట ఎన్నోసార్లు ఆ కథ విన్న నాకు, అవి రెండూ కాదనే అనిపించింది.

అప్పట్లో పుష్పగిరికి నేరుగా బస్సులు లేవు. ఆరోజుల్లో బస్సు రూట్లే అరుదు. ప్రయాణాలన్నీ కాలినడకనో, ఎడ్లబండిమీదనో జరిగేవి. ఆ పుణ్యక్షేత్రానికి దగ్గర్లో మా పిన్నిగారి ఊరుంది. ఆ ఊరు బస్సురూటు మీదుంది. పిన్నమ్మగారి ఎడ్లబండ్లో పుష్పగిరి పూజలు ముగించుకుని తిరిగివస్తున్న సందర్భంలో జరిగిన సన్నివేశం. కొబ్బరిచిప్పలూ, ప్రసాదమూ అతనికి అందివ్వబోయింది అమ్మ. వద్దంటూ తల అడ్డంగా ఊపాడు. డబ్బూ అక్కరలేదు, తిండి అక్కరలేదు, మరి అతనికి ఏంకావాలో పాలుపోక అమ్మ తికమక పడింది. ‘బాబును బండిదాకా ఎత్తుకుంటానక్కా’ అంటూ దీనంగా బ్రతిమాలుకున్నాడు. అతని అమాయకత్వానికి నవ్వుకుంది. కాదనకుండా నన్ను అందించింది. అప్పటికి మామ పదిపన్నెండేళ్ల కుర్రాడు.

బండెక్కి, దిండ్లను సవరించుకుని అమ్మ కూర్చునేదాక నేను మామ చంకలో వున్నాను. తరువాత అమ్మ వొడిలోకి మారాను. కూర్చున్నది అమ్మదగ్గరైనా చూపంతా మామమీదే. అతడు బండి వెనకాలే నడిచొస్తున్నాడు. కళ్ళెగరేస్తూ, పళ్ళికిలిస్తూ నన్ను నవ్విస్తున్నాడు. కోతి, పిల్లి, కుక్క – రకరకాల కూతలతో నన్ను కేరింతలు కొట్టిస్తున్నాడు. ఆ సంఘటన వింటూంటే నాకు కళ్ళు చెమ్మగిల్లేవి. ‘కాలి కింద కంపే పడుతూందో, కంకరే పడుతూందో వాడు చూసుకుంటేగదా. వీణ్ణి కాదని వాడు చూపు పక్కకు తిప్పుంటే వొట్టు’ అంటూ అతని ఆత్మీయతను తలుచుకుని అమ్మ కంటతడి పెట్టేది. బండి మా పిన్నమ్మ ఇంటిముందు ఆగేదాకా అట్లానే నడుచుకుంటూ వచ్చేశాడట.

‘మా ఇంటి కొస్తావురా?’ అమ్మ అడిగింది.

చదవండి :  పాలకంకుల శోకం (కథ) - సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

‘తీసుకపోతావా అక్కా?’ అతడు ఆశగా అడిగాడు.

‘నాలుగు మెతుకులు తిని, పంచలో పడుంటాడు. ఇంతమంది తినిపోతున్నారు. ఈ వొక్కడు మనకు బరువౌతాడా’ అని నాన్నకు నచ్చజెప్పింది. మామ మా ఇంటికొచ్చేశాడు. అతడు పుట్టిందెక్కడో ఎవరికీ తెలియదు. చనిపోయేదాకా మా ఊర్లోనే, మా ఇంట్లోనే ఉన్నాడు.

నా తరువాత మామ కిష్టమైనవి సినిమాలు. ఒక్కోసారి రెండాటలు ఏకంగా చూసేస్తాడు. ఊరి టెంటులో సినిమా మారితే, మొదటిరోజు తొలి ఆటకు హాజరు కాకుండా ఉండలేడు. ‘అప్పుడే అది పరిగెత్తిపోతుందేరా? రేపు జూస్తే బొమ్మేమైనా మారుతుందా?’ అమ్మ విసుక్కుంటుంది. మామ అలుగుతాడు. అలిగి సోఫాలో కంబానికి ఆనుకుని చేరగిలబడతాడు. తలొంచుకుని దిగులుగా కూర్చుంటాడు. ‘సరే నువ్వట్లాగే కూలబడు. పనంతా నేనే చేసుకుంటా’ అంటూ అమ్మ చీపురు చేతికి తీసుకుంటే చాలు, గబాలున లేచొచ్చి, చీపురు లాక్కొని పనిలో దిగిపోతాడు. అమ్మ నడుమొంచితే జుట్టుమామకు చిన్నతనం. కోపమేమో అలాగే వుంటుంది. అమ్మ నవ్వుకుంటూ పిలిచి పావలా రూక చేతిలో పెడితే కోపం వదిలిపోతుంది. తలొంచుకుని జుట్టు గోక్కుంటాడు. ‘నీ బుద్ధి పుట్టినట్లు తగలబడు’ అనే ఆదేశం వినగానే, చంకలు గుద్దుకుంటూ పరుగులు తీస్తాడు.

నాన్నంటే జుట్టుమామకు చచ్చేంత భయం. ఆమాటకొస్తే నాకు భయమే. ఒక్కగానొక్క కొడుకైనా పెద్దగా చనువివ్వడు. నాన్న స్వభావమే అంత. ఇంటికి చుట్టాలొచ్చినా మర్యాదకోసం చేసే పలకరింపులే తప్ప, కలవొద్దికగా మెలగలేడు. జుట్టుమామ నాన్నకు ఎదురేపడడు. ఆయనై పిలిచినప్పుడు తప్ప, చాటున దాక్కుంటాడు. ఇక సినిమా చూసి తిరిగొచ్చినప్పుడు చూడాలి జుట్టుమామ అవస్త. నిద్రనుండి ఎక్కడ లేస్తాడోనని, పిల్లిలా అడుగులో అడుగేసుకుంటూ, నక్కినక్కి ఇంట్లోకొస్తాడు. ఆయనకు సినిమాలంటే గిట్టవు. అమ్మ మాత్రం మెలుకువగా వుంటుంది. ‘మొద్దుముండాకొడుకు. పొరగడుపుతో పడుకుంటాడు’ అనేది అమ్మ భయం. ‘ఉట్టిమీద పుటికెలో కూడుంది. తిని చావు’ అంటుంది. నేనూ మెలుకువతో మామకోసం ఎదురుచూస్తుంటాను, సినిమా కథ వినటానికి. బుట్టీ తట్టా తీసుకుని మామ పెరట్లో అరుగు దగ్గరికి జారుకుంటాడు. నెమ్మదిగా నేను అక్కడికి చేరుకుంటాను. ముద్ద కలిపి చేతిలో పెడుతూ, కథంతా చెబుతాడు. మామ కథ చెబుతుంటే అచ్చం సినిమా చూసినట్టే ఉంటుంది.

‘అమ్మా, నేనూ సినిమా చూస్తానే’ తెల్లవారగానే అది నా కోరిక.

‘ఎందుకు చూడవ్. మీ నాన్న రానీ, వాడూ నువ్వూ ఇద్దరూ చూస్తారు.’

‘బావకు చెప్పొద్దులేక్కా. బావకు తెలవకుండా బాబుకు చూపించి తీసుకొస్తాను’ జుట్టుమామ వకాల్తా. నా కోరిక తీరకుంటే మామ మనసు గిలగిలా తన్నుకుంటుంది. పొద్దుననగా మొదలెట్టి, పొద్దుకుంకే సమయానికి తంటాలు పడి వొప్పిస్తాడు. చిన్నపిల్లలకు టికెట్టు అడగరు. నాకు చిరుతిండ్లు కొనిపెట్టడానికి మరో బేడ అదనంగా అమ్మ దగ్గర తీసుకుంటాడు.

అలాటి సందర్భంలో వొక వొప్పందంకోసం జుట్టుమామ ఒత్తిడి చేస్తాడు.

‘ఇంగ నన్ను జుట్టుగా అనవుగదూ?’

‘అంటే ఏం?’

‘ఆటకు తీసుకుపోను.’

‘ఉహ్హు హ్హు హ్హు హ్హు.’ గోముతో కూడుకున్న ఏడుపు.

‘అదేం కుదరదు. మామా అని పిలిస్తేనే.’

శాశ్వత ఒడంబడిక కోసం అతని ఆరాటం. నా వరకు అది తాత్కాలికమైన వొప్పందం.

మామ అసలు పేరేమిటో నాకు ఇప్పటికీ తెలీదు. అమ్మకు తెలిస్తే నాకూ తెలిసేది. తన పేరేదో మామకే తెలీదేమో. ఊరంతా జుట్టుగాడనే పిలుస్తారు. ఆ పిలుపుకే అతడు పలుకుతాడు. ఆ పేరు ఎందుకొచ్చిందో ఎవరికీ తెలీదు. చిన్నప్పుడు తలమీద పిలకుండేదేమోగానీ, నాకు గుర్తు తెలిసేటప్పటికి అతనిది అందమైన క్రాపింగు. క్రాపు చేయించుకోవడంలో చాలా జాగ్రత్త తీసుకుంటాడు. దాచి వుంచుకున్న సినిమా పోస్టరు మంగలికి చూపించిగాని తల గొరిగించుకోడు. నా జుట్టుమీదగూడా అజమాయిషీ మామదే. దగ్గర కూర్చుని సలహాలిస్తూ చేయించేవాడు. తల గొరిగించుకోవడం నాకు మహా చిరాకు. మంగలిని చూడగానే పారిపోయి దాక్కొంటాను. ఎక్కడున్నా వెదికి పట్టుకొస్తాడు; బుజ్జగించి కూర్చోబెడతాడు; కోప్పడే అమ్మను పంపించేసి నయంగా దారికి తీసుకొస్తాడు; కబుర్లు చెబుతూ కత్తిరింపు ముగిసేలా చేస్తాడు.

అంతమంచి క్రాపింగున్నా మామను అందరూ జుట్టుగాడనే అంటారు. అమ్మా నాన్నా గూడా ‘ఒరేయ్ జుట్టుగా’ అనే పిలుస్తారు. పెద్దవాడని అనుకోకుండా మా బడిపిల్లలుకూ అదే పిలుపు. అలా ఎవరు పిలిచినా మామకు కోపం రాదు. చిన్న పిల్లలు పిలిచినా కోపం రాదు. కానీ, నేను పిలిస్తే మాత్రం సహించలేడు. వెంటనే బుంగమూతి పెట్టేస్తాడు. ‘చూడక్కా బాబు ఏమంటున్నాడో’ అంటూ అమ్మకు ఫిర్యాదు చేస్తాడు. మామ అభ్యంతరం ‘జుట్టు’ అనే విశేషణం గురించిగాదు, ‘గాడు’ అనే నామవాచకం గురించి. నాతో మామా అనిపించుకోవాలని అతని ఆరాటం. విశేషణంతో కలిపి ‘జుట్టు మామా’ అన్నా నొప్పిలేదు. నాకు ఏదో వొక మామగా వుంటే చాలు.

నేను మామా అని పిలిస్తే అతన్ని పట్టడానికి పగ్గాలుండవు. గోరంత ఆ పిలుపుకు కొండంత సంబరం వచ్చేస్తుంది. నన్ను ఆకాశానికి ఎగరేసి చేతుల్లో అందుకుంటాడు. ఊపిరాడకుండా వొత్తి పట్టుకుని ముద్దులు కురిపిస్తాడు. నేను బుగ్గలు తుడుచుకుంటాఉ విదిలించుకుంటే మరింతా గోముగా దగ్గరికి లాక్కొంటాడు. బయట పడాలంటే ‘పోరా జుట్టుగా’ అనాలి. ఆ మాట వింటే అతని ఉత్సాహం చచ్చిపోతుంది. ఒక్కోసారి ఏడుస్తాడు. ఏడుపొచ్చేంత పెద్దమాట కాదది. అతని మనసుకు అది ఎంతగా గుచ్చుకుంటుందో నాకు తెలీదు. అతన్ని ఏడిపించటం నాకొక సరదా. కన్నీటికి విలువ తెలిసిన వయసులో నేను లేను.

నేనంత చులకనగా అతన్ని ఎందుకు చూసేవాణ్ణో నాకే తెలీదు. సొంత మామ కాదనే అలుసేమో. కాదని నాకు ఎలా తెలిసింది. మా ఇంట్లోనే ఉన్నాడు, మాతోబాటే తింటాడు. అమ్మను ‘అక్కా’ అని పిలుస్తాడు. ఎదురుపడి నాన్నను ‘బావా’ అని పిలువలేడుగానీ, ఆయన్ని గురించి ఎవరితో మాట్లాడినా బావగానే మాట్లాడుతాడు. ఇంట్లో అతన్నెవరూ పనిమనిషిగా చూడరు.ఐనా అతడు నాకెందుకు సొంతమామయ్యలా కనిపించలేదు? ఉరలోవాళ్ళు చెప్పుకునే ఊసులవల్ల నాకా అభిప్రాయం కలిగిందా? సొంతమామయ్యలా నా మీద పెత్తనం చెయ్యనదున తక్కువనిపించిందా? ఏమో. కారణమైతే చెప్పలేను. తేలిగ్గా చూసింది మాత్రం వాస్తవం. నా మీద మమకారం అతని బలహీనత. దాన్ని వాడుకోవడం అలవాటు చసుకున్నాను. పని చేయించుకోవాలంటే ‘మామా’ అని పిలుస్తాను. అవసరం తీరగానే ‘జుట్టుగా’ అంటూ వేళాకోలం చేస్తాను.

చదవండి :  ముక్కొండ కథ

టెంటుకు ‘బాలరాజు’ సినిమా వచ్చింది. మామ తొలిరోజే చూసొచ్చి కథ చెప్పాడు.

‘మామా, నాకు బాలరాజు చూపించవా.’

‘ఇప్పుడే అడిగితే అమ్మ తంతుంది. పదిరోజులుండు.’

పదిరోజులున్నాను. అనుమతి పట్టుకొచ్చాడు మామ. జల్సాగా సినిమా కెళ్ళాం. సగమాటలో నిద్రబోయే అలవాటు నాకులేదు. ఇంటర్వెల్లో కలర్ సోడా తాపించాడు. వేరుసెనగలు కొనిపించాడు. సినిమా చూస్తూ వొక్కొక్కటి వొలిచి నా చేతి కందిస్తాడు తప్ప, ఒక్క విత్తనమైనా నోట్లో వేసుకోడు. ఆట ఐపోయింది. బట్టలకు అంటుకున్న ఇసుకను దులుపుకుంటూ బయటకొచ్చాము. ఎప్పటిలాగే మామ నన్ను భుజాలమీదికి తీసుకున్నాడు. జనంతోపాటు ఇంటిదారి పట్టాము. వీధి మలుపు తిరిగి రామాలయం దాటుతున్నాము. దూరంలో కుక్కల మొరుగుడు వినిపించింది. పట్టించుకోకుండా ఎవరి ఇల్లొస్తే వాళ్ళు తప్పుకుంటున్నారు. జనం పలచ బడుతున్నారు. కుక్కల మొరుగుడు పెద్దదైంది. అదిగో ఇల్లు వచ్చేసింది. మరో నిమిషంలో చేరిపోతున్నాము. అంతలోనే ఎలా వచ్చిందో వచ్చింది. చీకట్లో నుండి దయ్యంలా వచ్చి మామ మీదికి ఎగబడింది – తెల్లని వెన్నల్లో నల్లటి కుక్క. రొప్పుకుంటూ కోరలు తెరచి మామీదికే దూకింది. ఒక అరపూ లేదు, మొరగూ లేదు. కుడివైపునుండి హఠాత్తుగా దాడి చేసింది.

ఆ భయంకర దృశ్యం జీవితంలో మరువలేను. అసంకల్పితంగా నా కుడికాలును పై లాక్కున్నాను. వెంటనే నన్ను తన ఎడమ భుజమ్మీదికి మార్చేశాడు మామ. మీదికి ఎగబడి అది మామను చీరేస్తూంది. నన్ను తప్పించాలనేదే తప్ప, తనకేమౌతోందో ననే ధ్యాసే అతనికి లేదు. నా కాళ్ళను చేతులతో దాచేశాడు. మోచేతిని జాడిస్తూ దాన్ని అదిలిస్తున్నాడు.

వెంట మిగిలిన సినిమా ప్రేక్షకులు బెంబేలెత్తి వీధి అరుగుల మీదికి చేరుకున్నారు. కేకలూ, పెడబొబ్బలేగాని సాయంగా ఒక్కడూ కిందికి దిగడు. మా ఇంటి వాకిట్లో వెలుతురు కనిపించింది. లాంతరు తీసుకుని అమ్మ వెలుపలికొచ్చింది. వసారాలో పడుకున్న పాలేర్లను నిద్రలేపి, లాంతరు అందించింది. తుంటకర్రలతో వాళ్లు కుక్కను తరిమేశారు. మామ భుజమ్మీది నుండి నన్ను అందుకున్నారు. ‘బాబూ నీకేం కాలేదుగదా, నీకేం కాలేదుగదా’ నా వొళ్లంతా ఎడమచేత్తో మామ తడుముతున్నాడు. నా వొంటి మీద చిన్న జీరికగూడా పడలేదు. కానీ మామకు ఏమైందో లాంతరు వెలుతురులో స్పష్టంగా కనిపిస్తూంది. ఒండిమీద చొక్కా పేలికలు పేలికలుగా చిరిగి గాలికి రెపరెపలాడుతూంది. కుడిచేతిమీది పేలికలు రక్తంతో తడిసి జబ్బకు అంటుకుపోయాయి. మోచేతికింది ఇంత కండ ఊడి వ్రేలాడుతూంది. ‘పిల్లోడు జడుసుకుంటాడు.తొందరగా తీసుకుపోరా అంటూ ఎవరో కేకేశారు. నన్ను ఇంటివైపుకు తీసుకుపోయారు.అంతే అంతకు మించి నాకు గుర్తు లేదు. రెండురోజుల వరకు నేను స్పృహలో లేను.

కళ్ళు తెరిచేసరికి మంచంలో వున్నాను. అమ్మ నా పక్కన్నే వుంది. ‘ఏం నాన్నా, ఆకలౌతూందా?’ అని అడిగింది. ఆమె మా అమ్మలాగే వుందిగానీ, మాసిపోయిన అమ్మలా వుంది. ఒడిలోకి తీసుకుంటూంటే అమ్మ స్పర్శలాగే వుందిగానీ, వొంటిమీద ఏవేవో పారాడుతున్నట్టున్నాయి. తలవంచి చూసుకుంటే వొంటినిండా తాయెత్తులూ, అంత్రాలూ. వెండివీ, రాగివీ, తాటాకువీ మెడనిండా దిగేశారు; చేతుల నిండా ముడేశారు. ‘పాలు తెచ్చేదా?’ అమ్మ మళ్ళీ అడిగింది. ‘మామ’ కోలుకోగానే నా నోట పలికిన మొట్టమొదటి మాటది. అమ్మనుండి జవాబులేదు.

ఇంట్లో సందడి లేదు. పాలేర్లు అటూఇటూ తిరుగుతున్నారుగానీ, ఉలుకూ పలుకూ లేదు. వీధి గుమ్మం నుండి నాన్న ఇంట్లోకొచ్చాడు. తలకు చుట్టుకున్న కండువా విప్పి పడకకుర్చీ మీద పడేశాడు. నా దగ్గరికొచ్చి బుగ్గల మీద చెయ్యి ఆన్చాడు. ‘జ్వరం తీసింది’ అన్నడు నెమ్మదిగా. ‘వానికెట్లుంది?’ అమ్మ అడిగింది.

‘నిన్నటికంటే మెరుగే. మాట్లాడుతున్నాడు.’

‘మీరు వచ్చేశారు. వాణ్ణి ఎవరు చూసుకుంటారు?’

‘అచ్చిగాడున్నాడు. వానికి నిలకడ లేదు. ఇంటికి రావాలని సతాయిస్తున్నాడు.వేరే ఎవరినైనా పంపించాలె.’

‘మల్లిగాన్ని పంపితేనో. పెళ్ళిగానోడు. నాలుగైదు రోజులైనా కుదురుగా వుంటాడు.

‘వాణ్ణి పిలిచి చెప్పు.’ అంటూ నాన్న పెరటివైపు నడిచాడు.

అమ్మ మల్లిగాన్ని కేకేసింది. వాడు ఎదురుగా వచ్చి నిలుచున్నాడు. ఏం చెప్పాలనుకుందో ఏమో, ‘ఒరేయ్ వాడు దిక్కులేనోడురా’ అనే మాటొక్కటే బయటికొచ్చి గొంతు పూడుకుపోయింది. పైటకొంగు నోట్లో దోపుకుని వెక్కివెక్కి ఏడ్చింది. మల్లిగానికీ ఏడుపొచ్చింది. అమ్మ కోలుకుని, కళ్ళు తుడుచుకుంది. ‘నేను పోదామంటే వీనికిటుంది. వీణ్ణి విడిచిపెట్టీ పోలేను. వాణ్ణి చూడకుండా వుండలేను.’ తిరిగి గొంతు పూడిపోయింది.

ముఖంమీదా, చేతులమీదా తుండుపంచెతో తడి వొత్తుకుంటూ నాన్న లోపలికొచ్చాడు.’నువ్వు నాల్రోజులు ఆస్పత్రి దగ్గర ఉండరా. అచ్చిగాడు ఇల్లో అని మొత్తుకుంటున్నాడు.’

‘సరేనయ్యా.’

‘ఇప్పుడే బయలుదేరు.’ నాన్న వసారావైపు వెళ్లిపోయాడు.

‘మరచెంబుతో పాలు తీసుకుపోరా.’ అంది అమ్మ.

జుట్టుమామ ఆస్పత్రిలో ఉన్నాడని అర్థమైంది. మా ఊర్లో డాక్టరు ఉన్నాడు గానీ, పడకలుండే ఆస్పత్రి లేదు. కాబట్టి, పట్నం తీసుకుపోయి పెద్దాసుపత్రిలో చేర్పించి వుండాలి. పెద్దగా జబ్బొస్తేగానీ అక్కడికి తీసుకుపోరు. ఐతే, మామ కోలుకుంటున్నాడు, మాట్లాడుతున్నాడు. ఫరవాలేదు. నా ఒంట్లో నీరసం తగ్గింది.

‘అమ్మా మామను చూసొద్దామే.’

‘ఐతే పాలుతాగు. నీకు తొందరగా బలమొస్తే మనం తొందరగా పట్నమెళ్లి మామను చూడొచ్చు.’

నాకు జ్వరం తిరగదోడలేదు. ఐనా మంచం దిగనివ్వరు. మారాం చేసి కుర్చీలో కూర్చున్నాను. డాక్టరొచ్చి చెయ్యి పట్టుకుని చూశాడు. నాలుక కింద థర్మామీటరుంచి చూశాడు. మరేం ఫరవాలేదని భరోసా ఇచ్చాడు. బెదిరిపోయి జ్వరమొచ్చిందని అందరూ తీర్మానించారు.

చదవండి :  రెక్కమాను (కథ) - డా|| ఎమ్‌.వి.రమణారెడ్డి

అచ్చిగాని గొంతు విని మెలుకువొచ్చింది. వాడు అమ్మతో మాట్లాడుతున్నాడు. ‘అదేం కుక్కో చెయ్యంతా నమిలేసిందమ్మా. ఏల్లకాన్నుండి జబ్బకాడికి నజ్జునజ్జుగా నమిలేసింది. గట్టిపిండమై తట్టుకున్నాడు. బాబు కోసం కలవరింపమ్మా. బాబును సూడాలని వాని పానం కొటకలాడుతాంది.’

నాకూ మామను చూడాలనివుంది. మంచం దిగనివ్వడంలేదు. రోజూ ఎవరో వొకరు పట్నమెళ్లి మామను చూసొస్తున్నారు. వచ్చిన వాళ్లంతా అదే మాట.

నన్ను మంచం దిగనిచ్చారు. ఇంట్లోకి బయటికి నడుస్తున్నాను.

‘బాబును పట్నం తీసుకుపోవచ్చా సారూ.’ అమ్మ డాక్టరును అడిగింది.

‘ఇప్పుడే వద్దులెండి. నాలుగురోజులు ఆగండి.’

సాయంత్రం ఓబులమ్మ పట్నంనుండి తిరిగొచ్చింది. ‘ఈ పిల్లోన్ని సూడకుండా వాడు బతకలేడే తల్లీ. ఎన్ని సూదులేసినా బతకడు, ఎన్ని మందులిచ్చినా బతకడు. ఇంటికి పోతానో అని మొత్తుకుంటా ఉండాడు.’

మామని జుట్టుగాడని ఇంకెప్పుడు పిలవగూడదు. ఎవరైనా పిలిస్తే తన్నాలనుకున్నాను. మామకు మంచి పేరేమైనా పెట్టమని అమ్మను అడగాలనుకున్నాను.

నాన్న పట్నంనుండి తిరిగొచ్చాడు. ‘బాగా కోలుకున్నాడు. బాబును కలవరిస్తున్నాడు. బాబును అంత దూరం ఇప్పుడే వద్దంటున్నాడు డాక్టరు.’

‘నేనన్నా చూసొస్తా. వాని మొగం చూడక పదిరోజులైంది. ఎట్లున్నాడో ఏమో బిడ్డ. నేను కనబడితే కొంచెం ధైర్యంగా వుంటుంది.’

‘ఎందుకూ. రెండ్రోజుల్లో ఇంటికి పంపిస్తామన్నారు.’

వచ్చేస్తాడు. రెండ్రోజుల్లో మామ ఇంటికొచ్చేస్తాడు. మల్లిగాడి వెంట వచ్చేస్తాడు. నాన్న వెళ్ళి ఇద్దరినీ తీసుకొస్తాడు. ఇంత దూరం మామ నడవగలడా? ఇన్ని రోజులు జబ్బుపడిన మామను నడిపించి తీసుకొస్తారా? బండ్లో తీసుకొస్తారు. అచ్చిగానికి చెప్పి బండి కట్టిస్తారు. బండి కడితే అమ్మానేనూ వెళ్లొచ్చుగదా! అమ్మ గట్టిగా అడిగితే డాక్టరు వొప్పుకుంటాడు. డాక్టరు వొప్పుకుంటే నాన్న వద్దనడు. రేపు వొకటి, ఎల్లుండి రెండు అనుకుంటూనే నిద్రపట్టింది.

రేపొచ్చింది. ఎల్లుండికోసం ఎదురుచూస్తూ గడపమీద కూర్చున్నాను. ఇంటిల్లిపాదీ ఎవరి పనుల్లో వాళ్లు తలమునకలుగా ఉన్నారు. నన్ను పట్టించుకునే వాళ్లేలేరు. మాముంటే ఇలా వుండేదా. వీధి మలుపులో మల్లిగాడు కనిపించాడు. వాడు ఇంటికేసి గబగబా వస్తున్నాడు. మామ వెనకాలే వుండాలి. వేగంగా నడవలేక నెమ్మదిగా వస్తుంటాడు. మల్లిగాడు ముంగిట్లో కొచ్చేశాడు. నన్ను దాటుకొని ఇంట్లోకి దూరాడు. వాడెందుకో కంగారుగా ఉన్నట్లనిపించింది. మామ ఇంకా కనిపించలేదు. నేను వీధి మలుపే చూస్తూ కూర్చున్నాను. మల్లిగాడు నన్ను దాటుకుంటూ బయటికొచ్చి పరుగు తీస్తున్నట్టు తిరిగిపోతున్నాడు. నాన్నగూడా వాడివెంట బయటికొచ్చాడు. అంగీని దారివెంట తొడుక్కొంటూ మల్లిగాణ్ణి అనుసరించాడు. అమ్మగూడా బయటికొచ్చి నిలుచుంది. ఎందుకో వాతావరణం మారిపోయింది.

ఎల్లుండి వచ్చేసింది. ఇంటిముందు ఎడ్లబండి సిద్ధంగా వుంది. ప్రయాణానికి అమ్మ తయారుగా వుంది. త్వరగా ముఖం కడిగించి నన్నుగూడా తయారు జేసింది. డాక్టరు అనుమతి దొరికిందేమో. ఇద్దరం బండ్లో కూర్చొన్నాం. తోడుగా ఓబులమ్మ బండెక్కింది. నొగలు మీద అచ్చిగాడు కూర్చున్నాడు. బండి పట్నం వైపు కదిలింది.

పెద్దాసుపత్రి కాంపౌండులో బండి ఆగింది. కిందికి దిగుతుండగా నాన్న ఎదురొచ్చాడు. ‘పిల్లోణ్ణి దగ్గరగా తీసుకుపోవద్దు. డాక్టరు మరీమరీ చెప్పాడు. అది అంటువ్యాధి.’ అమ్మను హెచ్చరించాడు.

మామను వుంచిన గదివైపు నాన్న దారితీశాడు. మేమంతా ఆయన్ను అనుసరించాము. గది తలుపులు మూసున్నాయి. తలుపు తోసుకుంటూ నాన్న లోపలికి ప్రవేశించాడు. అమ్మా నేనూ తలుపుదగ్గరే ఆగిపోయాం. ‘వద్దూ’ అనే కేక వినిపించింది. ఇంకా ఏమో అనబోతున్నాడు మామ. దవడలు బిగిసిపోయి నోటి నుండి నురగ పైకొచ్చింది. దగ్గరికి రావొద్దని తల అడ్డంగా ఊపుతున్నాడు. బాబును దగ్గరికి తీసుకురావద్దని చేతులతో సైగలు చేస్తున్నాడు. అతని రెండు చేతులూ పైకి వ్రేలాడదీసి, బెల్టుతో చువ్వలకు కట్టేశారు. ఆ కట్లతోనే చేతులు ఊపుతూ వద్దంటున్నాడు. వేళ్ల దగ్గరి నుండి భుజందాకా కుడిచేయి నల్లగా కుమిలిపోయుంది. కాళ్లను గూడా బల్లకేసి కట్టేసినట్టున్నారు. గొంతువరకు తెల్లటి ఆసుపత్రి దుప్పటితో కప్పున్నారు. స్టాండుకు వ్రేలాడే సీసాలనుండి సన్న గొట్టంతో కాలినరంలోకి నీరు ఎక్కిస్తున్నారు. సీసా దగ్గర వొక నర్సు నిలుచోనుంది. మల్లిగాడు దూరంగా గోడకు చేరగిలి నిలుచున్నాడు.

మామను చూస్తున్నాను. ముట్టుకోవాలనిపిస్తూంది. కానీ, లోపలికి అడుగేయాలంటేనే భయమేసింది. దిక్కుతోచక అమ్మ ముఖంలోకి చూశాను. మామవైపు చూస్తూ ఆమె ఏడుస్తూంది.

‘అటు తిరిగొచ్చి కిటికీ బయట నిలుచోమ్మా.’ అంది మామ దగ్గరున్న నర్సు. మామను పడుకోబెట్టిన బల్లపక్కన పెద్ద కిటికీ వుంది. దాన్నుండి మామను దగ్గరగా చూడొచ్చు.

కిటికీ దాపులకు చేరగానే అమ్మ నన్ను ఎత్తుకుంది. చువ్వలు చేత్తో పట్టుకుని లోపలికి తొంగిచూశాను. మామ నాకేసి చూస్తున్నాడు. రెప్పవెయ్యకుండా నన్నే చూస్తున్నాడు. తన దిగులంతా తీరినట్టు చూస్తున్నాడు. ముఖంలో సంతోషం కనిపించింది. ‘బాబూ’ అని పలకరించబోయాడు. నోరు బిగుసుకుపోయింది. గిలగిలా తన్నుకుంటున్నాడు. మెడ కొట్టుకుంటున్నా నా మీదనుండి చూపు తిప్పలేదు. మంపులు ఆగిపోయాయి. చేతులు సల్లుబడి కట్లమీది వ్రేలాడాయి. ఎగెరెగిరి పడుతున్న శరీరం బల్లకు చప్పగా ఆనుకుంది. నావేపే చూస్తున్న కళ్ళు చూస్తుండగానే మసకెక్కాయి. మల్లిగాడు గొల్లుమన్నాడు. అమ్మ తల పక్కకు తిప్పుకుని ఏడుస్తూంది. తెల్లటిగుడ్డ చేతికి చుట్టుకుని, మామ రెప్పలు మూసేసింది నర్సు.

మామ చనిపోయాడట. ఇంతసేపు నాకోసమే బ్రతికున్నాడట. మామ చనిపోతాడని అందరికీ ముందే తెలిసినట్టుంది. నాతో ఎవరూ చెప్పలేదు. నేను కనబడకపోతే ఇంకా బ్రతికేవాడా? తీసుకెళ్లమని అడిగినప్పుడు వద్దన్నారు, చెప్పకుండా నన్ను తీసుకొచ్చి మామను చంపేశారు. ఈరోజు నేను రాకుంటే మామ బ్రతికుండునా? ఆరోజు సినిమా చూడాలని అడక్కపోతే బ్రతికుండునా? మామ చావుకు నేనే కారణమా? ఈ ప్రశ్న నాకు ఎన్నోసార్లు ఎదురైంది. పెరిగేకొద్దీ మరిన్ని ప్రశ్నలు తోడౌతున్నాయే తప్ప, అంతరాత్మకు సంతృప్తికరమైన సమాధానం దొరకలేదు.

(ఆంధ్రజ్యోతి వారపత్రిక 17-10-2005 సంచికలో ప్రచురితం)

ఇదీ చదవండి!

Yangamuni Vyavasayam

యంగముని వ్యవసాయం (కథ) – ఎన్. రామచంద్ర

యంగమునివ్యవసాయంకథ మోచేతులు దాటి ఖాకీ చొక్కా, మోకాలు దాటి ఖాకీ నిక్కరు, గడ్డపార భుజాన ఒకవైపు పికాసి, మరోవైపు చెట్లడ్డ, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: