నవ వసంతం (కథ) – తవ్వా ఓబుల్ రెడ్డి

విజయరాఘవరెడ్డి మొగసాలలో అరుగుపై కూర్చుని గంగులయ్యతో గడ్డం గీయించుకుంటున్నాడు. గేటు దగ్గర ఇద్దరు అంగరక్షకులు పరిసరాలను గమనిస్తున్నారు. ఇస్త్రీ బట్టల మోదతో వచ్చిన రామన్న వాటిని మంచంపై పెట్టి రెడ్డెమ్మ కోసం ఇంట్లోకి కేక వేసినాడు.

”గడ్డం గీకేటప్పుడు సేతులెందుకు వణికిచ్చవురా? పిరికి నాయాలా” అద్దంలో మొహాన్ని చూసుకుంటూ గంగులయ్యను మందలించినాడు విజయరాఘవరెడ్డి.

”అబ్బెబ్బే… అదేం లేదులేబ్బా… నరాల జబ్బుతో సేతులు వణుకుతాండయ్‌” సంజాయిషీ చెప్పుకున్నాడు గంగులయ్య.

”ఖూనీలు చేయించే మనిషికి గడ్డం గీయడమంటే మాటలా!?” తన సంజాయిషీకి కొనసాగింపుగా మనసులో అనుకున్నాడు.

ఎంతో జాగ్రత్తగా ఒళ్లు దగ్గర పెట్టుకుని గడ్డం గీస్తున్న గంగులయ్య ఒకటికి పదిసార్లు కత్తిని కరుకు రాతిపై నూరుకుంటున్నాడు.

”ఒరేయ్‌! గంగులూ గడ్డం మింద ఒకసారి గీకడానికి కత్తిని నూరుసార్లు నూరతాండవ్‌ఏందిరా?” అసహనంగా గద్దించినాడు విజయరాఘవరెడ్డి.

ఏం మాట్లాడితే ఏం బరువో అన్నట్లుగా తలగీరుకుంటూ మౌనంగా నేలపైకి చూపు తిప్పినాడు గంగులయ్య. ఐదేళ్ల కిందట ఊళ్లో గలాట పడినప్పుడు ఒకేసారి నలుగురిని నరికించి, చంపించిన విజయరాఘవరెడ్డి ఉగ్రరూపం గుర్తుకు వచ్చింది గంగులయ్యకు.

”ఖూనీలు చేయించే మనిషికి గడ్డం గీయడమంటే మాటలా?” మళ్ళీ మనసులో అనుకున్నాడు గంగులయ్య.

జర్నలిజం, సాహిత్యం ప్రవృత్తిగా రచనలు చేస్తున్న కడప జిల్లా ఖాజీపేట మండలం బక్కాయపల్లె గ్రామంలో జన్మించారు. వీరి సంపాదకత్వంలో వెలువడిన ” కడప కథ, రాయలసీమ వైభవం” సంకలనాలు విమర్శకుల ప్రశంసలను అందుకున్నాయి.

 

”ఊళ్లో పిల్లనాయాళ్లు ఏందిరా… అట్ట కేకలేచ్చా పరిగెత్తాండారు?” గంగులయ్యను ప్రశ్నించినాడు విజయరాఘవరెడ్డి.

”ఉగాది గదూ సోమీ… వసంతాలు సల్లుకుంటాండరు” ముక్తసరిగా జవాబు చెప్పినాడు గంగులయ్య.

ఏటా పిలువని పేరంటం మాదిరిగా కరువు కాటకాలు వచ్చిపోతున్నా, ఊళ్లో ఎవరి తాహతుకు తగినట్టుగా వాళ్లు ఉగాది పండుగ చేసుకుంటున్నారు. వసంతాల పండుగగా, ఓలిగెల పండుగగా పిలిచే ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. బావా బావమరుదులు, అత్తాకోడళ్లు, వదినా మరదళ్లూ, మామా అల్లుళ్లూ, వరుసైన వాళ్లంతా పొద్దు పొడవక ముందు నుండే వసంతాలు చల్లుకోవడం ప్రారంభించినారు. వసంతాలు చల్లుకుంటూ వీధుల వెంట వీరంగం చేస్తున్నారు కొందరు… వరుసైన వారి ధాటికి తట్టుకోలేక వసంతాల బారి నుండి తప్పించుకునేందుకు ఇళ్లలోకి దూరి దాచి పెట్టుకుంటున్నారు మరికొందరు.

ఊరంతా ఇదే వాతావరణం.

విజయరాఘవరెడ్డికి క్షవరాన్ని పూర్తి చేసినాడు గంగులయ్య.

”కుడిపక్క మీసం తక్కువ పెట్టినట్టుండావ్‌… గదరా?” అద్దంలోకి చూసుకుంటూ అనుమానంగా అడిగినాడు విజయరాఘవరెడ్డి.

విజయరాఘవరెడ్డి ప్రశ్నతో గంగులయ్య ఉలిక్కిపడి, తమాయించుకున్నాడు.

”ఏం లేదులే సోమీ… మీసం దర్జాగా కుదిరిందిలే సోమీ…!” అంటూ కిందపడిన వెంట్రుకలను శుభ్రం చేస్తూ సామాన్లు సర్దుకున్నాడు గంగులయ్య.

”ఏమే… నీళ్లు తోడినావ్‌” రెడ్డెమ్మను కేకలేస్తూ పీటపై నుండి లేచి స్నానానికి ఇంట్లోని జాలాడి వైపు నడిచాడు, విజయరాఘవరెడ్డి.

ఇంటి ముందు వేపచెట్టుకు ఊయళ్లు కట్టుకుని ఊగుతున్న విజయరాఘవరెడ్డి కూతురూ, ఇద్దరు కొడుకులూ, నాయన ఇంట్లోకి పోగానే మరింత జోరుగా ఊగడం మొదలుపెట్టినారు.

చదవండి :  ఏటుకాడు (కథ) - రామకృష్ణా రెడ్డి.పోసా

ముఠాకక్షలూ, రాజకీయాలూ దినచర్యగా గడుపుతున్న విజయరాఘవరెడ్డికి పండుగలూ, పబ్బాలూ ఆమడ దూరమే! ఒక చిన్న కంట్రాక్టు కోసం తలెత్తిన పేచీ, పక్క ఊరి చెన్నారెడ్డికీ తనకూ మధ్య ముఠాకక్షలకు దారితీసింది. రాజకీయాలు, ముఠాకక్షలకు ఎప్పటికప్పుడు ఆజ్యం పోస్తున్నాయి. హత్యల దాకా పరిస్థితి వెళ్లింది. గలాటలూ, పోలీసులూ, కేసులూ, లాయర్లూ, కోర్టు వాయిదాలూ, ఎన్నికల ప్రచారాలూ, కిడ్నాప్‌లూ, బెదిరింపులూ, పంచాయితీలూ, రెకమెండేషన్లూ, కాంట్రాక్టు పనులూ, సారా వ్యాపారాలూ, విజయరాఘవరెడ్డికి దినచర్యలో చోటు చేసుకునే అంశాలు. తమ నాయకుడైన మాజీ ఎమ్మెల్యే భార్యా పిల్లలతో అమెరికా పర్యటనకు వెళ్లిపోవడంతో విజయరాఘవరెడ్డికి కొన్నాళ్లపాటు ఊళ్లో ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

స్నానం చేసి, తెల్లబట్టలు ధరించిన విజయరాఘవరెడ్డి మొగసాలలోకి వచ్చి వాలుకుర్చీలో కూర్చున్నాడు. స్టీలు గ్లాసులో కాఫీ తెచ్చి ఇచ్చింది రెడ్డెమ్మ. మోద కట్టుకుని తెచ్చిన ఇస్త్రీ బట్టలను ఎంచుకుని ఇంట్లోకి తీసుకెళ్లిందామె. రామన్న విజయరాఘవరెడ్డికి దూరంగా గొంతు కూర్చుని మౌనంగా ఉండిపోయినాడు.పిల్లల ఆట, పాటలను చూస్తున్న విజయరాఘవరెడ్డిలో చిన్ననాటి జ్ఞాపకాలు మెదులుతున్నాయి. పీర్లపండుగ నాడు పశువులకు గంగిరెద్దు వేషాలు వేసి ఆట ఆడించడం, దీపావళి నాటి రాత్రి నుడుములు తిప్పడం, విజయరాఘవరెడ్డి గుర్తుకు చేసుకుంటున్నాడు. ఒళ్ళో వత్తి, వంగుడు గుర్రం, ముక్కులు గిల్లుడు, దాగుడు మూతలు, వెన్నెల రాత్రుల్లో సాగిన పిల్ల జాతరలు! చిల్లాకట్టే, బారాకట్టె ఆటలతో పొద్దుగడిచిపోయేది. చింత చిగురు కోసుకోవడం, ఈతకాయలు రాల్చుకోవడం, తాటి ముంజెలు కొట్టుకోవడం, చేపలూ, ఎండ్రకాయలూ కాల్చుకు తినడం, ఈతకొబ్బెర, నాగమల్లి గుజ్జు, కుందేటి కొమ్ములూ, జున్నింగి చెరుకులూ… చిన్నతనం మొత్తం విజయరాఘవరెడ్డికి మళ్లీ గుర్తుకు వచ్చింది.

విజయరాఘవరెడ్డి పట్టణానికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండిపోవడంతో పిల్లలు స్వేచ్ఛగా ఆడుకోలేక పోతున్నారు. ఊరిజనంతో కలిసి ఉరకలు వేస్తూ వసంతాలు చల్లుకోవాలనే ఉబలాటంతో, ముందురోజు రాత్రే సిద్ధం చేసుకున్నా, వసంతాన్ని బయటకు తెచ్చే సాహసం చేయలేకపోతున్నారు. ఊళ్లో వసంతాల కోలాహలం మరింత ఊపందుకుంది. విజయరాఘవరెడ్డితో వరుస ఉన్న కుటుంబాల పిల్లలు, వసంతంతో వచ్చి, విజయరాఘవరెడ్డిని చూసి గేటు దగ్గరి నుండే వెనక్కి వెళ్లిపోతున్నారు. విజయరాఘవరెడ్డి గంభీరంగా కూర్చుని ఇదంతా గమనించని వాడిలా ఉండిపోయినాడు. విజయరాఘవరెడ్డితో పని ఉండి వచ్చిన గ్రామస్తులు పొడిపొడిగా మాట్లాడి వెళ్తున్నారు. రెడ్డెమ్మ కూడా బెరుకు బెరుకుగా అటూ ఇటూ తిరుగుతూ తన పనులు తాను చేసుకుంటూ ఉంది. పండుగ కోలాహలం చెవులను తాకడంతో చిన్నప్పుడు వసంతాలు చల్లుకున్న జ్ఞాపకాలు విజయరాఘవరెడ్డిలో మెదిలాయి. నవ్వులాటనూ… కలుపుగోలు తనాన్నీ, వేళాకోలాన్నీ దూరంగా నెట్టి గంభీర ముద్రను ధరించక తప్పని జీవనసరళి, భార్యాపిల్లల దగ్గర కూడా భేషజం తప్పడం లేదు.

చదవండి :  అలసిన గుండెలు (కథల సంపుటి) - రాచమల్లు రామచంద్రారెడ్డి

పండుగ కోసం చేసిన ఓలిగెలు తెచ్చి రామన్న బుట్టిలో వేసింది రెడ్డెమ్మ. తరతరాలుగా రామన్న వంశీయులే విజయరాఘవరెడ్డి కుటుంబానికి ఉద్దేగం చేస్తున్నారు. విజయరాఘవరెడ్డి చిన్నగా ఉన్నప్పుడు రామన్నే ఎత్తుకుని తిప్పేవాడు. రామన్న భార్య చాకిరేవుకు తీసుకెళ్లి సంగటి తినిపించేది. నూనూగు మీసాల వయసు వచ్చేదాకా రామన్న వరుస కలుపుకుని విజయరాఘవరెడ్డిని ”ఓయ్‌” అంటూ పిలిచేవాడు. పనీపాటల వాళ్లు, రైతులూ, వరుసలు కలుపుకుని పరస్పరం పిలుచుకోవడం సాధారణమే అయినా, ‘పార్టీ’ నడుపుతున్న విజయ రాఘవరెడ్డిని పలుకరించాలంటేనే రామన్న ఒకరకమైన భయానికి గురౌతున్నాడు.

ఊళ్లో నుండి ఒక గుంపు వసంతాలు చల్లుకుంటూ విజయరాఘవరెడ్డి ఇంటి వైపుగా వస్తోంది. ఇరవై మందికి పైగా ఉన్న ఆ గుంపులో ఊళ్లోని అన్ని కులాల వాళ్లూ ఉన్నారు. వసంతాలతో తడిసి ముద్దలైనారు వాళ్లు. విజయరాఘవరెడ్డికి బావమరిది వరుస అయ్యే పక్కింటి సుబ్బిరెడ్డీ, చాకలి రామన్న కొడుకు వెంకటేశూ వారిలో ఉన్నారు. సుబ్బిరెడ్డి గేటు దాటి నేరుగా వచ్చి విజయరాఘవరెడ్డి కూతురిపై వసంతం గుమ్మరించినాడు. నాయన అరుస్తాడనే భయంతో ఆ పాప ఏడుపు ప్రారంభించింది. సుబ్బిరెడ్డితో పాటు గుంపులోని వారతా ఒక్కరొక్కరే గేటు దాటి వచ్చినా విజయరాఘవరెడ్డిపై వసంతాలు చల్లేందుకు ఎవరూ సాహసించలేక పోతున్నారు. ఆయుధాలతో సిద్ధంగా ఉన్న అంగరక్షకులు విజయరాఘవరెడ్డికి మరింత దగ్గరగా జరిగినారు. సుబ్బిరెడ్డి, విజయరాఘవరెడ్డిని మర్యాదపూర్వకంగా పలుకరించినాడు. పలుకరింపునకు ప్రతిగా విజయరాఘవరెడ్డి తల ఊపుతూ కనుబొమలు ఎగరేసినాడు. గుంపులోని వారు, వారిలో వారే వసంతాలు చల్లుకుంటున్నారే తప్ప, విజయరాఘవరెడ్డి భార్యా, పిల్లలపై కూడా వసంతం చల్లడానికి వెనుకాడుతున్నారు. పాప మాత్రం అలాగే ఏడుస్తూనే ఉంది. విజయరాఘవరెడ్డి కూతురిని సముదాయించేందుకు ప్రయత్నించలేదు. విజయరాఘవరెడ్డి కొడుకులిద్దరూ ఇంట్లోకి పరుగెత్తి వసంతాలు తెచ్చి గుంపుపై చల్లడం ప్రారంభించినారు. విజయరాఘవరెడ్డి గంభీరంగా మీసాలు మెలేసినాడు. పాప ఇంకా ఏడుస్తూనే ఉంది.
రామన్న పాప దగ్గరగా వచ్చి సముదాయించేందుకు ప్రయత్నిస్తున్నాడు.

”చినరెడ్డెమ్మా… ఊరుకో సోములూ… వానలో తడవని వాళ్లూ… వసంతంలో మునగని వాళ్ళూ… దరిద్రులంట!” పాపను గడ్డం పట్టుకుని బతిమాలినాడు రామన్న.

రామన్న మాటలు విజయరాఘవరెడ్డిలో కంపనాలు సృష్టించినాయి. రామన్న సముదాయింపుతోనో, మరెందుకో ఏడుపు మానుకుంది పాప. తుర్రుమంటూ వెళ్లి గుంపులో కలిసిపోయింది. పాప తమలో చేరడంతో గుంపులో కేరింతలు మొదలైనాయి. కూతురూ, కొడుకులూ చిందులు వేస్తూ వసంతాలు చల్లుకోవడంతో రెడ్డెమ్మలో ఆనందం చోటు చేసుకుంది. రెడ్డెమ్మపై అల్లుడు వరుస అయ్యే పదేళ్ల పిల్లవాడు వసంతం చల్లడంతో ఆమె ఉలిక్కిపడింది. మళ్లీ తేరుకుని తన కూతురి వద్ద ఉన్న వసంతాన్ని తీసుకుని తిరిగి ఆ పిల్లవాన్ని వసంతంలో తడిపింది. గుంపు మొత్తం సరదాగా చిందులు వేయడాన్ని ఉధృతం చేశారు. వాళ్లు రామన్నను కూడా గుంపులో కలుపుకున్నారు.

విజయరాఘవరెడ్డీ, ఆయన అనుచరులూ తప్ప, అందరూ వసంతాలు చల్లుకుంటూ ఆనందంతో కేకలు వేస్తున్నారు.

చదవండి :  జుట్టుమామ (కథ) - ఎం.వి.రమణారెడ్డి

”వానలో తడవని వాళ్లూ… వసంతంలో మునగని వాళ్లూ దరిద్రులంట!” రామన్న మాటలు విజయరాఘవరెడ్డి చెవుల్లో పదేపదే రింగుమంటున్నాయి.

విజయరాఘవరెడ్డి కుర్చీలోంచి లేచి ముందుకు అడుగులు వేసినాడు. ఆయుధాలు తడుముకుని అంగరక్షకులు కూడా ముందుకు కదిలినారు. వసంతాలు చల్లుకుంటున్న గుంపు వైపునకు విజయరాఘవరెడ్డి నడక ప్రారంభించినాడు. గుంపులోని కొందరు విజయరాఘవరెడ్డి రాకను గమనించి వసంతాలు చల్లుకోవడం ఆపి స్థానువులై నిలబడిపోయినారు. రెడ్డెమ్మ, పిల్లలు గుంపు నుండి విడిపోయి మొగసాలలోకి వెళ్లి వాకిట్లో నిలబడినారు. రామన్న అరుగు ప్రక్క స్థంభం చాటుగా జారుకున్నాడు. విజయరాఘవరెడ్డి గుంపును సమీపించినాడు. విజయరాఘవరెడ్డికి దారి ఇస్తున్నట్లుగా గుంపులోని వారు రెండు పాయలుగా చీలి ప్రక్కగా నిలబడి పోయినారు. విజయరాఘవరెడ్డి గేటు దాకా ముందుకు వెళ్లి మళ్లీ వెనక్కి తిరిగినాడు. అంగరక్షకులు కూడా వెను తిరిగినారు. గుంపులోని వారందరినీ ఒకసారి పరికించి చూసినప్పటికీ వసంతాలు మయమైన వాళ్లను, అందరినీ గుర్తుపట్టలేక పోయినాడు విజయరాఘవరెడ్డి. అవతారాలు మారిపోయినా, అవధులు దాటిన ఆనందంలో ఉన్నారు వాళ్లు. విజయరాఘవరెడ్డి తనకు తానే ఒకసారి ఆపాదమస్తకం చూసుకున్నాడు. తన బట్టలు తెల్లగా మెరిసిపోతున్నాయి. ఏదో పరధ్యానంలో కుర్చీలో అలాగే కూర్చున్నాడు విజయరాఘవరెడ్డి. ఏదో ఆశాభంగానికి గురైనట్లుగా వుంది విజయరాఘవరెడ్డి ముఖం.

గుంపులోని వారు వసంతాలు చల్లుకోవడం మెల్లిగా ప్రారంభించినారు. రామన్న కొడుకు వెంకటేశూ, మరో యువకుడూ పోటీపడి చల్లుకుంటున్నారు. ఒకరిని ఒకరు వెంటాడుకుంటూ వారిద్దరూ విజయరాఘవరెడ్డిని సమీపించినారు. ముందు పరిగెత్తుతున్న యువకునిపై, వెంకటేశు విసురుగా వసంతం చల్లినాడు. ఆ యువకుడు పక్కకు తప్పుకోవడంతో వసంతం నేరుగా వెళ్లి విజయరాఘవరెడ్డిపై పడింది. తెల్లటి ఖద్దరు బట్టలు, వసంతపు చినుకులతో కొత్త రూపును సంతరించుకున్నాయి. అంగరక్షకులు ఉద్రేకంతో వెంకటేశుపై దూకినారు. వెంకటేశును కాలరు పట్టి ఈడ్చి, కిందపడేసి తన్నడం ప్రారంభించినారు. విజయరాఘవరెడ్డిలో ఉద్వేగం చోటు చేసుకుంది. కుర్చీలోంచి లేచి వెంకటేశు వైపునకు వస్తున్నాడు. రామన్న వెన్నుపూసలో వణుకు ప్రారంభమైంది. తన కొడుక్కు పండుగపూటా, ఈ విధంగా రాసిపెట్టి ఉందేమో అంటూ మనసులో దేవున్ని ప్రార్ధించుకున్నాడు రామన్న. కిందపడి, అంగరక్షకులతో దెబ్బలు తింటున్న వెంకటేశును విజయరాఘవరెడ్డి రెట్ట పట్టుకుని విసురుగా లేపినాడు. అంగరక్షకులను ఇద్దరినీ చాచి చెంపదెబ్బలు కొట్టినాడు. ఊహించని ఈ సంఘటనతో అక్కడి వారంతా ఆశ్చర్యానికి గురైనారు.

”పండుగ పూటా ఈడ మీకేం పనిరా లమ్డీ కొడకల్లారా… ఇంటికి పోయి చావకూడదూ…” తన చేతిలో దెబ్బలు తిన్న అంగరక్షకులను గద్దించినాడు విజయరాఘవరెడ్డి. అంగరక్షకులు తలలు దించుకుని గేటు వైపు నడిచినారు. విజయరాఘవరెడ్డి వసంతాన్ని తీసుకుని సుబ్బిరెడ్డిపై గురి చూసి చల్లినాడు. పిల్లలు కేరింతలు కొట్టినారు. గుంపు గుంపంతా హుషారుగా చిందులు వేయడం మళ్లీ ప్రారంభించింది.

వసంతకాల ఉదయాన చల్లగా వీచిన గాలితో ఆ యింటి ముంగిట్లోని వేప చిగుళ్లు సోయగంగా కదలాడసాగినాయి.

ఇదీ చదవండి!

రాయలసీమ వైభవం

రాయలసీమ వైభవం – Rayalaseema Vaibhavam

‘రాయలసీమ వైభవం’ – రాయలసీమ ఉత్సవాల సావనీర్ . సంపాదకత్వం: తవ్వా ఓబుల్ రెడ్డి, ప్రచురణ : రాయలసీమ ఆర్ట్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: