పోలీసు బలగాలతో నిండిన నగరం
పలువురు నేతల గృహనిర్భందం
కడప : నారాయణ కళాశాలలో ఇద్దరు విద్యార్థినిలు అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటనపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ టీడీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, అనుంబంధ విభాగాలు చేపట్టిన బంద్ విజయవంతమైంది. బంద్‌ను విచ్చిన్నం చేయడానికి ప్రభుత్వ ఆదేశానుసారం కడపలోనే తిష్ట వేసిన డిఐజీ రమనకుమార్ బందోబస్తు కోసమని మూడు జిల్లాల నుండి పోలీసు బలగాలను రప్పించారు. పోలీసు యంత్రాంగం మంగళవారం అర్థరాత్రి నుంచే అక్రమ అరెస్టులకు పూనుకుంది. నగర మేయర్ కె.సురేష్‌బాబు, కడప శాసన సభ్యుడు ఎస్‌బి అంజద్‌బాషాలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మరికొందరు నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు.
వైకాపా జిల్లా మహిళా అధ్యక్షురాలు పత్తి రాజేశ్వరి, నగర అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ, రాష్ట్ర నేతలు ఉమామహేశ్వరి, బోలా పద్మావతి, పద్మ, సుశీలమ్మ, తులశమ్మ, మరియ తదితరులను ఆ పార్టీ కార్యాలయంలోనే పోలీసులు నిర్బంధించారు. కడపలో పోలీసులు అప్రకటిత ఎమర్జెన్సీ విధించారని సీపీఎం నగర కార్యదర్శి రవిశంకర్ ధ్వజమెత్తారు. బంద్ సందర్భంగా ర్యాలీగా కోటిరెడ్డి సర్కిల్‌కు వస్తున్న సీపీఎం నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి వాహనాలలో తరలించారు.
ఈ సందర్బంగా రవిశంకర్ మాట్లాడుతూ మంత్రులు నారాయణ, గంటా వియ్యంకులు కాబోతున్నారని, పెళ్లికాక ముందే నారాయణ విద్యా సంస్థలను గంటా కుమారుడే నడుపుతున్నాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు వేసిన త్రిసభ్య కమిటీ ఎందుకు పనికొస్తుందని ఆయన ప్రశ్నించారు. నారాయణ కళాశాలల్లో వరుస ఆత్మహత్యలపై జుడీషియల్ విచారణ జరపాలని, మంత్రి నారాయణను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తీవ్ర వాగ్వాదం అనంతరం సావంత్ సుధాకర్, సిద్దిరామయ్య, శివశంకర్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు.

న్యాయం జరిగే వరకు పోరాడుతాం…
రాష్ట్ర మంత్రి నారాయణకు పోలీసులు తొత్తులుగా మారి ఊడిగం చేస్తున్నారని నగర మేయర్ కె.సురేష్‌బాబు మండిపడ్డారు. బుధవారం గృహ నిర్భంధంలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ నారాయణ కళాశాలలో ఇద్దరు విద్యార్థులు అకారణంగా మరణిస్తే ఆత్మహత్య చేసుకున్నారని కట్టుకథలు చెబుతున్నారన్నారు. ఆ ఘటన జరిగినప్పటి నుంచి పోలీసులు అవలంభిస్తున్న వైఖరి అత్యంత దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టుమార్టం పూర్తికాగానే పోలీసులు వారిని వెంబడించి ఖననం చేసే వరకూ విడిచి పెట్టలేదన్నారు. విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని చెప్పారు.
నిరసన తెలిపే హక్కు కూడా లేదా ?
ఇద్దరు విద్యార్థులు అన్యాయంగా బలైతే శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా మాకు లేదా.. ఇది ప్రజాస్వామ్యమా.. బ్రిటీషు పాలనలో ఉన్నామా అనేది అర్థం కావడం లేదని కడప ఎమ్మెల్యే ఎస్‌బి అంజద్‌బాషా ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టుమార్టం చేసిన వైద్యులకే అవి ఆత్మహత్యలా, హత్యలా అన్నది అర్థం కాలేదన్నారు. కార్పొరేట్ సంస్థల గుప్పిట్లో ఈ ప్రభుత్వం నడుస్తోందని, చంద్రబాబు సీఎం అయ్యాక నారాయణ కళాశాలల్లో 11 మంది మృత్యువాత పడ్డారన్నారు. నందినీ, మనీషా మృతదేహాల రీ పోస్టుమార్టం నిర్వహించి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. మంత్రి నారాయణను బర్తరఫ్ చేసి, ఆయన విద్యా సంస్థల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వేలాది మంది పోలీసులు వాహనాల్లో తిరుగుతూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాయకులతో నిండిన పోలీస్‌స్టేషన్లు..
వివిధ రాజకీయ పక్షాలు, విద్యారి సంఘాల నాయకుల అరెస్టులతో నగరంలోని పోలీస్‌స్టేషన్లు నిండిపోయాయి. షేక్ అల్తాఫ్, పులి సునీల్, సంజీవరాయుడు, ఆదిత్య, శ్రీరంజన్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నాయకులు జగదీష్, సుబ్బారెడ్డిలను మంగళవారం అర్ధరాత్రి అరెస్ట్ చేసి వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో ఉంచారు. డిప్యూటీ మేయర్ బి. అరీఫుల్లా, జిల్లా అధికారప్రతినిధి టీకే అఫ్జల్‌ఖాన్, సీపీఐ నగర కార్యదర్శి ఎన్. వెంకటశివ, బ్రహ్మయ్య, సీపీఎం నాయకులు బి. మనోహర్, మగ్బూల్‌బాషా, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు కరిముల్లా, సికిందర్, త్యాగరాజు, శివకేశవ, మున్నా, జహీర్‌లను, AISF నాయకుడు గంగాసురేష్, గిండి మధువర్ధన్‌రెడ్డి, చల్లా రాజశేఖర్, వి. నాగేంద్రారెడ్డి, నాగమల్లారెడ్డి, రెడ్డిప్రసాద్ తదితరులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.

మొత్తానికి బంద్ సందర్భంగా నారాయణ విద్యాసంస్థల ఆస్తులకు నష్టం జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో బలగాలను మోహరించడం విశేషమే.