honnooramma

పాలెగత్తె హొన్నూరమ్మ

మట్లి వెంకట్రామరాజు మైసూరు నవాబైన హైదరాలీకి కప్పము కట్టడానికి తిరస్కరించాడు. దీంతో ఆగ్రహించిన మైసూరు నవాబు హైదరాలీ దండెత్తి వచ్చి  వెంకట్రామరాజును తరిమి సిద్దవటం కోటను స్వాధీనం చేసుకొన్నాడు.

హైదరాలీ ఈ సిద్ధవటం కోటను కప్పం చెల్లించు విధానంపై చిట్వేలి జమిందారునకు స్వాధీనం చేసినాడు. ఈ జమిందారు భాకరాపేట పరిసర ప్రాంతాలలో ఉన్న పట్ర పాళెగార్ల వ్యవహారాలకు దోపిడీలకు భయపడి, ముదిరెడ్డిపల్లె పాళెగాడైన గోపాలరెడ్డి ఆయన సోదరుడు నర్సింరెడ్డికి అమ్మివేశాడు. ఈ  ముదిరెడ్డిపల్లి సోదరులు  దుర్మార్గులు. పేద ప్రజల జీవన విధానాన్ని గౌరవించక, క్రూరంగా హింసించి పన్నులు వసూలు చేస్తుండేవారు.  ఈ విషయం తెలుసుకున్న హైదరాలీ శ్రీరంగపట్నం నుంచి సైన్యంతో వచ్చి ముదిరెడ్డిపల్లె కోటపైబడి కబళించి అన్నదమ్ములను వధించాడు. గోపాలరెడ్డి భార్య హొన్నూరమ్మను కోటకు అధిపతిని చేశాడు. కప్పం నియమానుసారంగా చెల్లించాలనీ, ధర్మవిధానాలతో ప్రజలను పాలించాలని ఒప్పందం కుదుర్చుకుని వెళ్లిపోయారు.

క్రీ.శ. 1782వ సంవత్సరములో కప్పం వసూలు చేయుటకు హైదరాలీ యొక్క హమిల్దారులు ముదిరెడ్డిపల్లెకు వస్తున్నారని వేగుల ద్వారా తెలుసుకున్న హొన్నూరమ్మ తన భర్తను చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని తన అనుచరులతో మాటు వేసి వారిని చంపించింది. ఇంకోసారి హైదరాలీ కుమారుడు టిప్పుసుల్తాన్ సిద్ధవటం కోట పాలనా వ్యవహారములపై వచ్చినప్పుడు కొంత సైన్యాన్ని ముదిరెడ్డిపల్లె హొన్నూరమ్మపై పంపగా సర్దారుడు హొన్నూరమ్మకు భయపడి కోటకు దూరం నుంచే ఆమెతో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుని వెనుతిరిగిపోయాడు.

ముదిరెడ్డిపల్లె కడప జిల్లాలోనిది. మైదుకూరు నుంచి పోరుమామిళ్లకు పోవు రహదారి ఏడవ మైలు రాయి నుంచి అడవిలో పదిమైళ్లు దూరంలో వీరి కోట ఉన్నది. ఇది దట్టమైన అడవి మధ్యన చిత్రమైన లోయల్లో నల్లమల పర్వత శ్రేణుల ఒడిలో ముదిరెడ్డిపాళెం 17వ శతాబ్దిలో చరిత్ర ప్రసిద్ధమైనదిగా చెప్పవచ్చు. అది పురాతన కట్టడము చుట్టూ దట్టమైన పర్వతాల మధ్య భాగాన చుట్టు బలమైన రాతికోట, బురుజులు, లోతైన అగడ్తలు కలిగి దుర్భేద్యమైందిగా చెప్పుచుందురు.

చదవండి :  జిల్లాల వారీ నేర గణాంకాలు 1982

గోలుకొండ నిజాము నవాబుచే సిద్ధవటాన్నే గాక మరికొన్ని గ్రామాలను పొంది కప్పము చెల్లించు ఒప్పందంపై హొన్నూరమ్మ పాలింపసాగినది. కోటకు దక్షిణ భాగాన భాక్రాపేట పరిసర ప్రాంతాలలో పట్రానాయుళ్ళు బలమైన రాతి బురుజులు నిర్మించుకుని స్వతంత్య్ర పాలన చేయుచుండుట విన్నది. వారిని అదుపులో ఉంచలేక పోయింది. వీరి బురుజులను కూల్చవలెనన్న తలంపుతో ముందుగా పట్రానాయుళ్ల అదుపు ఆజ్ఞకు లోనైవున్న గొల్ల బోయలను ఎదుర్కోవలసి వచ్చింది. వీరు ఉద్ధిమడుగు ప్రాంతము నుంచి వచ్చి కోటలో పాగవేసి దోపిడీలు చేసి విత్తాన్ని దోచుకెళ్లేవారు. ఫలాని జాములో ఫలానిది దోచుకుపోతామని ముందుగా హెచ్చరించి దొంగతనం చేయటం ఈ గొల్ల బోయల ప్రత్యేకత.

ఒకరోజు హొన్నూరమ్మ ధరించి ఉన్న చీరను వలుచుకుని వెళ్లగలమని గొల్ల బోయలు హెచ్చరిక చేశారు. దానిని ఒక సవాలుగా తీసుకున్న హొన్నూరమ్మ ఆ రాత్రి కోటలో పహారా కట్టుదిట్టం చేసింది. అన్నమాట ప్రకారం గొల్లబోయలు ఆ రాత్రి మూడవ జామున తమ శక్తియుక్తులతో రాణి మహలులోనికి ప్రవేశించారు. ఒకడు ద్వారం వద్ద ఉన్న సిపాయిని కొట్టి వాని బట్టలు వేసుకుని నిల్చున్నాడు. రెండవవాడు హొన్నూరమ్మ నిద్రించు పట్టెమంచము ముఖమల్ పట్టుపరదాల వెనుక దాక్కుని సిద్ధం చేసుకుని తెచ్చిన చిన్న డబ్బాకు అడుగున సన్నని రంద్రం చేసి డబ్బానిండుగా నీటిని నింపి ఒక పొడుగాటి కర్ర చివరకు డబ్బాను వేలాడదీసి పైకి ఎత్తి పట్టి చాటుగా కర్రను పట్టుకున్నాడు.

చదవండి :  సహృదయ శిరోమణి డాక్టర్ బాలశౌరిరెడ్డి

హొన్నూరమ్మ బొడ్డు క్రింది భాగాన రెండు ఊరువుల మధ్య గల చీర కుచ్చులపై ఒక్కొక్క నీటి బిందువు రాలి తడి చేసింది. చల్లగా తగలడం వల్ల హొన్నూరమ్మ గబాల్న మేల్కొని మూత్రం జారి చీరను తడిపిందని భావించి సిగ్గుపడి చీరను వదలి వేరొక చీరను ధరించి యథాప్రకారం నిద్రలోకి జారింది. వదిలిన పట్టుచీరను తీసుకొని బోయలు కోట రహస్య మార్గం నుంచి పరుగు తీసిరి.

కోటకు దక్షిణం పెన్నానదికి ఆవలి ఒడ్డున రెండు గుంజలు నాటి చీరెను ఆరవేసి ఉడాయించారు. నాల్గవజామున మేలు కొలుపులకు హొన్నూరమ్మ మేల్కొని తాను విడిచిన పట్టు చీర లేక పోవడం చూసి చకితురాలైంది. ఇంతలో పహారా సేవకుడు వచ్చి చీర ఇసుక తిన్నెల మీద ఉన్నట్లు తెలియజేయగా హొన్నూరమ్మ కోట గోడ నుంచి ఆవలకు చూసి నిర్ఘాంతపోయింది.

ఇలా ఉండగా, నిజాం వారికి కప్పం కట్టుట మానింది. పైగా బ్రిటీష్ వారి ఒత్తిడి ఎక్కువయింది. ఇదే అదనుగా గోల్కండ నుంచి నవాబు దండు వచ్చి సిద్ధవటం కోట పైబడి ఆమెను తరిమివేసింది. హొన్నూరమ్మ తిరిగి ముదిరెడ్డిపల్లెలో ఉన్న కుమారుని కలిసింది. ముదిరెడ్డిపల్లి కోటను బలంగా తీర్చిదిద్ది కట్టుదిట్టం చేసింది. ఒక రోజు తన కుమారుడు వేటకై అడవులలో దూరగా మేనమామ మాటువేసి చంపించాడు. తెలిసిన వెంటనే తమ్ముణ్ణి, వాని సహచరులను తుదముట్టించింది. సోదరుని, కుమారుని కోల్పోయిన హొన్నూరమ్మ క్రుంగిపోయింది.

చదవండి :  జిల్లాల వారీ నేర గణాంకాలు 1980

బ్రిటిష్‌వారు, నిజాము నవాబులు ఆమెను లొంగదీయుటకు అనేక ప్రయత్నాలు చేపట్టినారు. హొన్నూరమ్మ మాత్రం నమ్మకస్తులైన సైన్యంతో ముదిరెడ్డిపల్లి కోట పరిసరాల దగ్గరికి రానీయకుండా అడవులలో దూరి సమయం చిక్కినప్పుడల్లా నిజాములపైనా, బ్రిటిష్ వారిపైనా తీవ్రమైన దెబ్బతీయుచుండెది. ఈమె తన సైన్యమునకు కావలసిన అన్నపానాదులు స్వయంగా పర్యవేక్షించుచుండేది. సైన్యమునకు కావలసిన అన్నము వండి వార్చిన గంజి సెలయేరులా ప్రవహించి దిగువగా ఒకచోట చెరువులా నిండివుండేది.

ఇప్పుడు ఇక్కడ ఒక గ్రామము వెలసి గంజికుంటగా పిలువబడుచున్నది. గంజిపారే వంక వెంబడి రహస్యంగా బ్రిటిష్ సైన్యము, నిజాం దండు నడిచి అర్థరాత్రి హొన్నూరమ్మ స్థావరంపైబడి బంధి చేసింది. కోటను ఆక్రమించుకున్నారు. ఆ గంజివంకే ఆమెను పట్టించునని వూహించనైనా లేదు. కడకు ఆమెను వనిపెంట పశ్చిమ భాగములోని కొండలపై ఉరి వేసి వేలాడదీశారు.

హొన్నూరమ్మ పరాయి పాలనను తీవ్రంగా ప్రతిఘటించి మైసూరు నవాబులను, నిజాం నవాబులను, బ్రిటిష్‌వారిని ముప్పతిప్పలు పెట్టి హడలుగొట్టించిన వీరనారిమణిగా నేటికీ బుర్రకథల రూపములోను జానపదులు పాడుకుంటూ ఆమె కీర్తిని చాటుతున్నారు.

(గమనిక: ఈ వ్యాసానికి జత చేయబడిన చిత్రం గూగుల్ ద్వారా స్వీకరించబడిన ఒక చిత్రపటం మాత్రమే. అది హోన్నూరమ్మ చిత్రం కాదు)

పోతురాజు వెంకటసుబ్బన్న

(మూలం: కడపోత్సవాల సావనీర్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: