బొమ్మ బొరుసు (కథ) – వేంపల్లి రెడ్డి నాగరాజు

మధ్యాహ్నం పన్నెండు గంటలు కావస్తోంది.నియోజకవర్గ కేంద్రంలోని కోర్టు ఆవరణంలో లాయర్లు , వాళ్ళ జూనియర్లు,ప్లీడరు గుమాస్తాలతోపాటూ రకరకాల కేసుల్లో ముద్దాయిలుగా,సాక్షులుగా వచ్చినవారితోనూ,వారిని వెంటబెట్టుకుని వచ్చిన పోలీసు కానిస్టేబుళ్ళతోనూ కాస్తంత సందడిగానే వుంది.

చెట్టు క్రింద వున్న సిమెంటు బెంచీలవద్ద, కాంపౌండ్ లోనూ ఓ వారగా వున్న టీ క్యాంటీన్ వద్ద వున్న కొందరు లాయర్లు, బోనులో నిల్చున్నపుడు ప్రతివాది తరపున అడిగే ప్రశ్నలకు ఏ రకమైన సమాధానాలు చెప్పాలనే అంశంపై ట్రైనింగ్ ఇస్తుండగా మెజిస్ట్రేట్ గారు అడిగే ప్రశ్నలకు తడబాటు లేకుండా ఎలా జవాబు చెప్పాలో అవగాహన కల్పిస్తున్నారు.

” ఏం సుబ్బయ్యన్నా,హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ ఎట్లుంది?” అప్పుడే కోర్టు ఆవరణంలోకి వచ్చిన సుబ్బయ్యను విష్ చేసి నవ్వుతూ పలకరించాడు పొరుగు స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నరసిం హులు.

“ఏం ప్రమోషన్ లేరాబ్బీ, నీ మాదిరీ కానిస్టేబుల్ గా వున్నప్పుడే బాగుండేది” కాస్తంత విరక్తిగా నవ్వుతూ అన్నాడు సుబ్బయ్య.

“అదేందన్నా అట్లంటావు,నీకు నా మాదిరిగా గాడిద చాకిరీ చేసే పని తప్పింది గదా?” అన్నాడు నరసిం హులు.

” గాడ్ద చాకిరీ తప్పిన మాట నిజమేగానీ ఈ ప్రమోషన్ వచ్చి బొత్తిగా స్వేచ్చ లేకుండా పోయిందప్పా”నిట్టూర్చాడు సుబ్బయ్య. అర్థం కానట్లు చూశాడు నరసిం హులు సుబ్బయ్య వైపు.

” ఎస్. ఐ. ముందు కూర్చునేదానికి లేదు, కానిస్టేబుల్ ముందు దర్పంగా నిల్చునేదానికీ లేదు,’ తింటే ఆయాసం – తినకుంటే నీరసం ‘ మాదిరీ తయారయ్యింది నా పరిస్థితి” అన్నాడు సుబ్బయ్య.

” సంపాదన బాగానే పెరిగిందంటనే ?” అడిగాడు నరసిం హులు మెల్లగా నవ్వుతూ.

” మా స్టేషన్ లో సంపాదన గురించి ఏం మాట్లాడమంటావులే నర్శింలూ , వచ్చిందంతా నాకే కావాలంటాడు మా ఎస్.ఐ”కాస్తంత నిట్టూరుస్తూ ఆవేదనగా చెప్పాడు సుబ్బయ్య.

” మా పరిస్థితి కూడా అట్లనే వుందిలేన్నా , కాకుంటే మా ఎస్.ఐ. ‘ గడ్డివామి దగ్గర కుక్క మాదిరీ ‘ తాను తినడు, మమ్మల్ని తిననీయడు, పంచాయితీలకు, సెటిల్మంత్ లకు ఒప్పుకోక అన్ని కేసులూ రిజిస్టరు చెయ్యల్సిందేనంటాడు” నరసిం హులు కూడా తమ ఎస్.ఐ తీరు గురించి సుబ్బయ్య వద్ద తన గోడు వెళ్ళబోసుకున్నాడు.

” ఇంతకూ ఏం కేసు మీద వచ్చినావప్పా?” ప్రశ్నించాడు సుబ్బయ్య చేతి వాచి వంక చూసుకుంటూ.

” నిన్న సాయంత్రం సిద్దారెడ్డి చింత తోపు మీద దాడి జరిపినామన్నా , కోళ్ళ పందేలు ఆడేవాళ్ళంతా పరిగెత్తుకోని పోయినారు,ఈ నా కొడుకొక్కడే చిక్కినాడు” చెప్పాడు నరసిం హులు తన పక్కనున్న వ్యక్తిని చూపిస్తూ.

” నువ్వు సున్నపురాళ్ళ చంద్రయ్యవు కదరా?” అతడిని గుర్తు పట్టినట్లు అడిగాడు హెడ్ కానిస్టేబుల్ సుబ్బయ్య.

“ఔ సామీ” తల గోక్కుంటూ బదులిచ్చాడు చంద్రయ్య.

” నువ్వేం కేసు మీద వచ్చినావన్నా?” ప్రశ్నించాడు నరసిం హులు. నాదీ ఇట్లాంటి ముదనస్టపు కేసేలేప్పా ,ఈ పేపరోళ్ళతో సచ్చే సావొచ్చింది, ఊల్లో వ్యభిచారం జోరుగా జరుగుతోందని రాసినారు, నిన్న రాత్రి లాడ్జి మీద రైడింగ్ చేసినాం, ఆ కేసు మీదనే వస్తి” చెపాడు సుబ్బయ్య.

” ఎంతమంది దొరికినారున్నా?” కుతూహలంగా అడిగాడు నరసిం హులు.

” ఎంతమందా పాడా ? దొరికినోళ్ళనందరినీ ఒదిలేసి దీన్నొక్కదాన్నే పట్టుకోని కేసు రిజిస్టర్ చేసినాడు మా ఎస్.ఐ” తమకు కాస్తంత దూరంలో నిల్చుని పాన్ నములుతున్న ఓ యువథిని చూపించాడు సుబ్బయ్య.

” అది నక్కలోళ్ళ సరోజ కదన్నా ?”అడిగాడు ఆ వైపుగా దృష్టి సారించిన నరసిం హులు. అవునన్నట్లుగా తలాడించాడు సుబ్బయ్య.

చదవండి :  దాపుడు కోక (కథ) - డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి

“గొంతెండిపోతాండాది సమీ , కాసిన్ని నీల్లు తాగొస్తా” అంతసేపూ ఓపిగ్గా నిల్చుని వున్న చంద్రయ్య మెల్లగా నోరు విప్పి అడిగాడు హెడ్ సుబ్బయ్యను.

“లం డీ కొడకా , ఈ సొట్టు చెప్పి మెల్లిగా జారుకుందమని అనుకుంటాండావేమో ,కోర్టు లోపలికి పొయ్యి మళ్ళీ బయటకు వచ్చేదాకా నోరెత్తితే నీ కాళ్ళు విరగ్గొడతా” చేతిలోని లాఠీని ఝళిపిస్తూ ఒంటికాలిపై లేచాడు నరసిం హులు.

“సుబ్బయ్య సారూ, ఇంకెంతసేపు పడుతుంది మన వంతు వచ్చేదానికి?” అడిగింది సరోజ , నరసిం హులు బిగ్గరగా అరవడం గమనించి అక్కడికే వస్తూ.

“బిళ్ళ బంత్రోతు పిలిచేంతవరకూ నీతోపాటూ నాకుకూడా ఈ పాట్లు తప్పేటట్లులేవు గదమ్మే” చెప్పాడు సుబ్బయ్య విసుగ్గా.

సుబ్బయ్య , నరసిం హులు ఇద్దరూ తమ స్టేషన్ల గురించి , కేసుల గురించి కబుర్లలో పడిపోయారు.

ముందు రోజు సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటినుండీ తిండి లేక ,కోర్టు ఆవరణం లోకి వచ్చినప్పటినుండీ ఎండలోనే నిల్చునివున్న మూలంగా దాహంతో నాలుక తడారిపోగా వున్నచోటునే నీరసంగా మోకాళ్ళమీద కూర్చుండిపోయాడు చంద్రయ్య.

చంద్రయ్య అవస్థను కళ్ళారా గమనించిన సరోజ మెల్లగా అతడి వద్దకు చేరింది. బాగా దాహం వేస్తోందని , దప్పిక తీర్చమన్నట్లుగా చేత్తో సైగ చేసి చూపిస్తూ అభ్యర్థించాడు చంద్రయ్య.

పరిస్థితిని అర్థం చేసుకున్న సరోజ పరుగు పరుగున కోర్టు కాంపౌండ్ లోనే ఓ మూలగా వున్న టీ క్యాంటీన్ వద్దకెళ్ళి ఓ వాటర్ ప్యాకెట్ తెచ్చి తనే నోటితో చింపి చంద్రయ్యకు అందించింది.

ఆబగా అందుకుని దాంతో గొంతు తడుపుకున్న చంద్రయ్యకు పోతున్న ప్రాణం మళ్ళీ లేచివచ్చినట్లయ్యింది.

కృతజ్ఞతగా చూశాడు సరోజ వైపు.

“ఏం పెద్దాయనా , ఏం కేసులో పట్టుకోనొచ్చినారు?”చంద్రయ్యను అడిగింది సరోజ అతడు కాస్తంత తేరుకోవడం గమనించి.

” కోడి పందెం కేసులో పట్టకచ్చినారమ్మా,నాకు ఏం సమ్మందం ల్యాకపొయ్యినా” విచారంగా బదులిచ్చాడు చంద్రయ్య.

” ఆడ కూతురువు, నువ్వేం కెసుమీద వచ్చినావమ్మా?” ప్రశ్నించాడు చంద్రయ్య.

“బ్రోతల్ కేసు గురించి” చెప్పింది సరోజ నోట్లోని పాన్ ఊటను తుపుక్కున ఉమ్మివేస్తూ .

” అంటే?” అర్థం కానట్లుగా చూస్తూ ప్రశ్నించాడు చంద్రయ్య మళ్ళీ.

రాత్రి లాడ్జిపై పోలీసులు దాడి జరపడం, తను పట్టుబడడం గురించి చెప్పింది సరోజ.

ఆమె చేసే వృత్తి ‘ వ్యభిచారం ‘ అని వినగానే మనసులో ఓ రకమైన ఏహ్యభావం కలిగింది చంద్రయ్యకు.

” నీకు మొగుడు లేడా?” అడిగాడు ఆమె మెడలోని రంగు వెలిసిన పసుపు దారాన్ని గమనిస్తూ.

” ఆ ముండ నాబట్టె సక్కరంగావుంటే ఈ పనిచేసే ఖర్మ నాకేం పట్టింది?” ఎదురు ప్రశ్న వేసింది సరోజ.

” పోలీసోల్లకు నువ్వొక్కదానివే దొరికినావా?” అడిగాడు చంద్రయ్య.

“పట్టుబడిండే మిగతావాళ్ళనందరినీ మా ఓనరమ్మ స్టేషన్ లోనే విడిపించుకొనిపొయ్యింది” బదులిచ్చింది సరోజ.

“నిన్నొక్కదాన్నే ఎందుకు వొదిలేసిందీ?” ప్రశ్నించాడు చంద్రయ్య సందేహంగా చూస్తూ

“పేపరోళ్ళ కోసం, పై ఆపీసర్లకు చూపిచ్చేదానికి రికార్డుల్లో లెక్కల కోసం మాలాంటి ఒకటీ , రొండు కేసులన్నా బుక్ చెయ్యకుంటే ఎట్లా?, పోలీసోళ్ళు కూడా ఊద్యోగాలు చెయ్యల్లగదా ” తనపై కేసు రిజిస్టర్ కావడానికి గల ‘ అసలు కారణం ‘ వివరించింది సరోజ.

“నిన్నిప్పుడు జైలుకు పంపుతారా?” అడిగాడు చంద్రయ్య.

“రొండు నూర్లో, మూడు నూర్లో ‘ ఫైన్ ‘ వేస్తారు , అది కట్టకుంటేనే జైలుకు పోవల్ల” బదులిచ్చింది సరోజ , చంద్రయ్యను తొలిసారిగా కోర్టుకు వచ్చినవాడిగా అర్థం చేసుకుంటూ.

చదవండి :  రాతిలో తేమ (కథ) - శశిశ్రీ

” నాకూ ఫైన్ వేస్తారా?” అమాయకంగా చూస్తూ ప్రశ్నించాడు చంద్రయ్య.

“ఒక్కోసారి ఫైన్ తో పాటూ జైలుకు కూడా పంపుతారు” చెప్పింది సరోజ నవ్వుతూ.

ఈలోగా కోర్టు బంట్రోతు అందరి చెవుల తుప్పు వదిలిపొయ్యేలా చంద్రయ్య పేరును బిగ్గరగా మూడుసార్లు పిలవడంతో హెడ్ సుబ్బయ్యతో మాటల్లో వున్న కానిస్టేబుల్ నరసిం హులు వెంటనే తేరుకుని చంద్రయ్యను తన వెంటబెట్టుకుని కోర్టు గుమ్మంలోకి దారితీసాడు.

“నీ పేరు ?” ప్రశ్నించాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ .

“చంద్రయ్య” భయపడుతూనే సమాధానమిచ్చాడు బోనులో ముద్దాయిగా నిల్చునివున్న చంద్రయ్య.

“ఏం పని చేస్తావ్?” పబ్లిక్ ప్రాసిక్యూటర్ మళ్ళీ అడిగాడు తన నల్ల కోటు సవరించుకుంటూ.

“కూలి పనులు చేసుకునేటోన్ని సామీ” గొంతు వణుకుతుండగా చెప్పాడు చంద్రయ్య.

“నిన్న సాయంత్రం కోడి పందేలు ఆడుతుండగా పోలెసులు నిన్ను పట్టుకున్నారు నిజమేనా?”అసలు విషయంలోకి దిగుతున్నట్లుగా అడిగింది నల్ల కోటు.

” ఆ కోల్ల పందేలతో నాకేం సమ్మందం లేదు సామీ” బదులిచ్చాడు చంద్రయ్య బెదురు చూపులు చూస్తూ.

“మరయితే కోళ్ళ పందేలు జరిగే చోట ఎందుకున్నట్లు?” లా పాయింట్ లేవదీసినట్లుగా రెట్టింపు స్వరంతో గద్దించాడు ప్రాసిక్యూటర్.

“నా మనవనికి పరీచ్చ పీజు కట్టేదానికి దుడ్లు లేకుంటే తోపులో కోల్ల పందేలు జరిగేకాడ నా పుంజు మంచి రేటుకు అమ్ముడుపోతాదని మా పక్కింటి ఎంగటేసు చెప్తే పొయ్ నా సామీ ” గుడ్లనీరు కక్కుకుంటూ చెప్పాడు చంద్రయ్య చేతులు జోడించి దండం పెట్టి అభ్యర్థిస్తూ.

” ఆ కోది పుంజు నీదేనా?” మళ్ళీ అడిగాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్.

” నాదే దొరా” దీనంగా బదులిచ్చాడు చంద్రయ్య , ముందు రోజునుండీ జింగలు, నీళ్ళు లేక వడలిన తోట కూరకాడలా వేళ్ళాడుతున్న తన కోడి పుంజును చూస్తూ .

“పిల్లవాడి ఫీజు కోసం డబ్బు కావాల్సొస్తే కూలి పనులకే వెళ్ళవచ్చుకదా?” మరో ప్రశ్న సంధించింది నల్ల కోటు .

“వారం దినాలనుండీ జొరంతో మంచానబడి నిన్ననే లేసినా సామీ,నిజంగా కోల్ల పందేలు ఆడేతోల్లంతా పరిగెత్తుకోనిపోతే ఈ పోలీసోల్లు నన్ను పట్టుకోనొచ్చినారు” ఇప్పటికైనా నిజాన్ని గ్రహించమన్నట్లుగా ఏడుపు గొంతుతో చెప్పాడు చంద్రయ్య.

“పోలీసులు దాడి చేసినప్పుడు నువ్వు కూడా అందరిలా ఎందుకు పారిపోలేదు?” మరోసారి గద్దిస్తూ అడిగాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్.

“నేనేం తప్పు చేసినానని పారిపోవల్ల సామీ?” అమాయకంగా ఎదురు ప్రశ్నించాడు చంద్రయ్య.

“ఇక్కడ మేము అడిగే ప్రశ్నలకే సమాధానం చెప్పాలిగానీ , మమ్మల్ని ప్రశ్నించకూడదు” వూహించని చంద్రయ్య ఎదురు ప్రశ్నతో అహం దెబ్బతిన్న ప్రాసిక్యూటర్ కసురుకున్నాడు.

మళ్ళీ అంతలోనే న్యాయాధికారి వంక చూస్తూ , ” అదీ మిలార్డ్ , రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడికూడా ఇప్పుడిలా కోర్టునే తప్పుదరి పట్టించాలని చూస్తున్నాడు”
తన వాదన ముగిసిందన్నట్లుగా చెప్పాడు.

“నీ తరపున వాదించేందుకు ఎవరైనా వకీలు వున్నారా?” అప్పటివరకు చెవులకు మాత్రమే పని చెప్పి ముద్దాయికీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూ మధ్య జరిగిన సంభాషణ వింటున్న మేజిస్ట్రేట్ తన డ్యూటీలో భాగంగా సర్వసాధారణంగా అడిగే ప్రశ్ననే అడిగాడు.

“జొరం వొస్తే మందు బిళ్ళ మింగేదానికీ , పిల్లోనికి ఇస్కూలు పీజు కట్టేదానికే ‘లెక్క’ లేనోన్ని, వకీల్ను పెట్టుకునే స్తోమత్తు నాకేడిది సామీ” వినయంగా చెప్పుకున్నాడు చంద్రయ్య మేజిస్ట్రేట్ గారైనా కరుణించకపోతారా అనే ఆశ కలళ్ళలో కదలాడుతుండగా.

“పోలీసులు దాడి చేసినపుడు కోళ్ళ పందేలు జరిగేచోట కోడి పుంజుతో సహా పట్టుబడినావు కాబట్టి నీ మీద మోపబడిన నేరం నిజమేనని నమ్ముతూ నాలుగు వందలు ఫైన్ వేస్తున్నాను” కళ్ళద్దాలు సవరించుకుంటూ కేసు ముగిసిందన్నట్లుగా తీర్పు చెప్పారు మేజిస్ట్రేట్ .

చదవండి :  కథానికా, దాని శిల్పమూ - రాచమల్లు రామచంద్రారెడ్డి

“నిజానిజాలు ఆ బగమంతునికే తెలియల్ల , ఫైన్ కట్టేదానికి నా కాడ ఒక్క పైసా సొమ్ము కూడా లేదు దొరా , నన్ను కట్టేసి కొట్టినా నయా పైసా గుడా రాలదు సామీ, పిల్లోనికి నేను ఒక్కన్నే దిక్కు , వాల్ల అమ్మా, నాయినా గుడా లేరు మిద్దె పనిచేస్తాండి అది కూలి సచ్చిపొయ్యినారు” మళ్ళీ బ్రతిమలాడుకుంటున్నట్లుగా అన్నాడు చంద్రయ్య.

“అయితే వారం రోజులు జైలుకు వెళ్ళక తప్పదు” తన అంతిమ తీర్పు ఇదేనన్నట్లుగా చెప్పాడు మెజిస్ట్రేట్ మరో కొత్త కేసుకు సంబంధించిన ఫైల్ తన ముందుకు లాక్కుంటూ.

బోనులోనుండీ క్రిందకు దిగి కానిస్టేబుల్ నరసింహులు వెంట కోర్టు గుమ్మం బయటకు వచ్చిన చంద్రయ్య వాలకాన్ని గమనించి ‘ ఏం జరిగిందంటూ ‘ అడిగింది తన కేసు కోసం అక్కడే ఎదురు చూస్తున్న సరోజ.

” ఈ ముసిలోని మాటలు ఎవురూ వినిపించుకోలేదమ్మా” కోర్టు లో జరిగిన విషయాలన్నీ ఏకరువు పెడుతూ ఫైన్ కట్టకుంటే జైలుకు వెళ్ళాల్సిన తన దుస్థితిని ఏకరువు పెట్టాడు చంద్రయ్య కళ్ళ నీళ్ళ పర్యంతమవుతూ.

ఇంతలో ఏదో నిర్ణయించుకున్నదానిలా సరోజ తన జాకేట్ లోనికి చెయ్యి పోనించి అక్కడినుండీ తీఇన పర్సులో వున్న వందరూపాయల నోట్లన్నీ తీసి ఖాళీ పర్స్ దూరంగా విసిరివేస్తూ ఆ మొత్తాన్నంతా చంద్రయ్య చేతుల్లో పెట్టింది ‘నీ ఫైన్ కట్టి ఇంటికి వెళ్ళు ‘ అని చెబుతూ.

“నీ దగ్గరున్న సొమ్మంతా నాకు ఇచ్చేస్తివి, ఇబ్బుడు నీకు ఫైన్ వేస్తే ?” అడిగాడు చంద్రయ్య ఆమె ఏం చేస్తోందో మెల్లగా అర్థం అవుతుండగా.

“నేను జైలుకు పోవాల్సుంటుంది, అంతేగదా, కొన్నాళ్ళు జైలుకే పోవాలనుకుంటున్నా ” అంది సరోజ స్థిరంగా పలుకుతూ.

“ఎందుకట్ల?”ప్రశ్నించాడు అమాయకంగా.

“ఫైన్ కడితే కోర్టు నన్ను వదిలేస్తుంది, తిరిగి ఈ రోజు రాత్రి నుండీ మళ్ళీ పాముల్లాంటోళ్ళ పక్కన , పశువుల్లంటో కౌగిళ్ళలో ఒళ్ళంతా పుండు చేసుంటూ , వాళ్ళ పంటి గాట్లను, సిగరెట్ వాతలను భరిస్తూ ఓనరమ్మకు పచ్చనోట్లు సంపాదించిపెడుతూ, మళ్ళీ అప్పుడప్పుడూ రైడింగులూ, పోలీసులు, కోర్టులు, మనసు చంపుకుని ఇవన్నీ భరిస్తూ వుండేకంటే కొన్నాళ్ళు జైలుకు వెళ్ళయినా ఈ కంపుకు దూరంగా వుందామనుకుంటున్నా ” అంది సరోజ.

సరోజ ఇదంతా చెబుతుండగా కోర్టు బంట్రోతు ఆమే పేరు మూడు సార్లు బిగ్గరగా పిలిచాడు తొందరగా రమ్మన్నాట్లుగా.

” ఈ రకమైన సాయం నువ్వు నాకే ఎందుకు చేస్తుండావు?” అడిగాడు చంద్రయ్య .

“నీకు అన్యాయంగా శిక్ష పడడం ఇష్టంలేక ,పైగా నేను ఈ వృత్తి ద్వారా మూటగట్టుకున్న పాపాన్ని నీలాంటివాళ్ళకు సాయం చేయడం వల్ల కొంతయినా తగ్గించుకుందామనుకుంటున్నందువల్ల, అంతేగాకుండా నువ్వు జైలుకు పోతే నీ మనవడు దిక్కులేనివానిగా ఏమైపోతాడో తెలిసిన ఆడదానిగా ఈ సాయం చేస్తాండా” అంది హెడ్ సుబ్బయ్య వెంట కోర్ట్ హాల్లోకి దారితీస్తూ.

తొలుత సరోజ తను చేసే వృత్తి గురించి చెప్పినప్పుడు ఆమె పట్ల తన మనసులో కలిగిన ఏహ్యభావం మెల్లమెల్లగా కరిగిపోతుండగా రూపాయి నాణేనికి ఓ వైపు కళ్ళు లేని చట్టం అనే బొమ్మే కాక మరో వైపు సరోజ లాంటి మంచి మనసున్న బొరుసు కూడా వుంటుందని అర్థమవుతుండగా విచారణ ఎదుర్కొనేందుకు బోను వైపుకు కదిలివెడుతున్న సరోజ రూపం అలుక్కున్నట్లుగా అస్పష్టంగా కనిపించసాగింగిది నీళ్ళు నిండిన కళ్ళతో చూస్తున్న చంద్రయ్యకు …..

(వీక్ పాయింట్, 16-30 మార్చి 2010)

రచయిత ఫోన్ నంబర్: 9985612167

ఇదీ చదవండి!

రాతిలో తేమ (కథ) – శశిశ్రీ

మా జిల్లాల్లో మునిరత్నం పేరు చెప్తే చాలు ఉలిక్కిపడి అటూ ఇటూ చూస్తారు. ముని అంటే ముని లక్షణాలు కానీ, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: