Bammera Pothana

భాగవతం పుట్టింది ఒంటిమిట్టలో..!

– విద్వాన్ కట్టా నరసింహులు

బమ్మెరపోతన ఆంధ్రమహాభాగవత రచనకు కొన్నాళ్లముందు చంద్రగ్రహణం నాడు గంగలో స్నానం చేసి ధ్యానం చేస్తున్నాడు. అది మహేశ్వర ధ్యానం. ధ్యానంలో దర్శనమిచ్చినవాడు శ్రీరామభద్రుడు. భాగవతం రచించమన్నాడు. ఆయనకు కలలో కనిపించిన రాముడిలా ఉన్నాడు:


మెఱుగు చెంగట నున్న మేఘంబు కైవడి
ఉవిద చెంగట నుండ నొప్పువాడు
చంద్రమండల సుధా సారంబు పోలిక
ముఖమున చిఱునవ్వు మొలచువాడు
వల్లీయుత తమాల వసుమతీజము భంగి
బలువిల్లు మూపున బఱగువాడు
నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి
ఘనకిరీటము తల గలుగువాడు
పుండరీక యుగము బోలు కన్నులవాడు
వెడదయురము వాడు విపుల భద్ర
మూర్తివాడు రాజ ముఖ్యుడొక్కరుడు
కన్నుగవకు నెదురగాన బడియె – భాగవతం

ఈ పద్యంలో కనిపించే దైవం శ్రీరామచంద్రుడు. సీతతో కోదండం ధరించి ఉన్నాడు. తలమీద కిరీటం ఉంది. ఇలా ఉన్న దైవానికి సంబంధించిన ఆలయం పోతన కాలానికి తెలుగు మాటాడే ప్రాంతంలో ఎక్కడా లేదు. ఒక్క ఒంటిమిట్టలో తప్ప.

ఒంటిమిట్టలో వెలసిన స్వామి రఘునాయకులు

విజయనగర సామ్రాజ్యం అవతరించిన నాటికి ఒంటిమిట్టలేదు. విజయనగరంలో బుక్కరాయలు చక్రవర్తిగా ఉన్నాడు. ఉదయగిరి ప్రాంతం పాలకుడుగా ఆయన సోదరుడు కంపరాయలు పాలిస్తున్నాడు. కంపరాయలు ఈ ప్రాంతం చూచి ఇక్కడ గుడి, చెరువు నిర్మాణాలు ప్రారంభించాడు (ఒంటిమిట్ట కైఫీయత్తు). బుక్కరాయలు కాశీరామేశ్వర యాత్రలో ఒంటిమిట్ట గుడిని ప్రారంభించాడు. ఇక్కడ వెలసిన స్వామిని ”రఘునాయకులు” అని పిలిచాడు. (గండికోట శాసనం – ఆంగ్లానువాదం కడప జిల్లా మాన్యువల్‌)

ఒంటిమిట్టలో నివసించి విజయనగర రాజసత్కారం పొందిన అయ్యలరాజు తిప్పయ్య ‘ఒంటిమిట్ట రఘు వీరా జానకీ నాయకా’ మకుటంతో శతకం చెప్పాడు. పోతన భాగవతంలో ఇలాంటి ఆధారాలున్నాయి. నవమ స్కంధం రామాయణఘట్టంలోని 360 పద్యం గమనించండి.

నల్లనివాడు పద్మనయనంబులవాడు మహాశుగంబులన్‌

విల్లును దాల్చువాడు గడువిప్పగు వక్షమువాడు మేలుపై

జల్లెడు నిక్కిన భుజంబులవాడు యశంబు దిక్కులం

జల్లెడు వాడు నైన రఘుసత్తము డీవుత మా కభీష్టముల్‌.

ఇలాగే రఘు సంబోధన ఉన్న స్కంధాది స్కంధాంత పద్యాలు కనిపిస్తాయి.

1. ద్వితీయ స్కంధం స్కంధాది పద్యం – రాఘవరామా!

2. ద్వితీయ స్కంధాంతం 286 – రాఘవా!

3. చతుర్థ స్కంధాది పద్యం – రాఘవరామా!

4. సప్తమ స్కంధాంతం 480 పద్యం – రఘుకుల తిలకా!

5. అష్టమ స్కంధాంతం 740 పద్యం – రాఘవరామా!

పోతన రచనలు కాని స్కంధాల్లో రఘు సంబోధనలు లేవు.

పోతనను స్మరించిన కవుల్లో మొదటివాడు ఒంటిమిట్ట వాడైన అయ్యలరాజు రామభద్రుడు.

”ఆంధ్ర వాగ్భాగవత కర్త నభినుతింతు” – రామాభ్యుదయం. అంతకు ముందున్న భువనవిజయ కవులుగాని తక్కినవారుగాని పోతనను స్మరించలేదు.

చదవండి :  తితిదే ఆధీనంలోకి ఒంటిమిట్ట

పోతన తన కావ్యాన్ని అమ్మలేదు.

పోతనదిగా ప్రసిద్ధమైన చాటుపద్యం

కాటుక కంటినీరు చనుకట్టు పయింబడ నేల యేడ్చెదో

కైటభ దైత్యమర్దనుని గాదిలికోడల యో మదంబ యో

హాటక గర్భురాణి నిను నాకటికింగొని పోయి అల్ల క

ర్ణాట కిరాట కీచకుల కమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ!

కర్ణాటక సామ్రాజ్యంలో పోతన నివసించి ఉంటే తప్ప కర్ణాటక ప్రభువు భాగవతాన్ని తనకు అంకితమిమ్మని అడుగ లేడు. ఇంతకూ ఆ కర్ణాటక ప్రభువు ఎవ్వరు? ఆ ప్రభువు కిరాటుడు, కీచకుడు అయి ఉండాలి. సంగమ వంశం చివరి కాలంలో విరూపాక్షుడు అనే రాజు త్రాగుడుబోడు, పర స్త్రీలోలుడు (విజయనగర చరిత్ర). ఆయన అడిగి ఉంటాడు. పోతన ఈ పై పద్యంతో సరస్వతీ దేవిని ఊరడించి ఉంటాడు.

అలభ్యమైన నాలుగు స్కంధాలను పూరించినవారు ఓరుగల్లు ప్రాంతం వారే!

పోతన భాగవతంలో దష్టమైన భాగాలను పూరించిన గంగన, సింగన, నారయ్యలు వరంగల్లు ప్రాంతం వారు. వారు 4, 5, 10, 11, 12 స్కంధాలు ఆది నుంచి అంతం దాకా పూరించారు. విరూపాక్షుని సామదాన భేదాలకు లొంగని పోతన ఒంటిమిట్టలో నిలువ లేక పోయాడు. ఒంటిమిట్ట నుండి బండ్లలో తన వస్తువులు సర్దుకొని ఓరుగల్లుకు/ బమ్మెరకు బయలుదేరాడు. మార్గమధ్యంలో వంకలు వాగులు నదులు దాటాలి. కొన్ని ఇతర వస్తువులతోపాటు ఆ నాలుగు స్కంధాలు జారిపోయుంటాయి. ఆ భాగాల జోలికి పోతన పోలేదు. తరువాతి దినాల్లో ఆ ముగ్గురు పూర్తి చేశారు. రాజు ఆగ్రహానికి గురైన పోతన తన భాగవతాన్ని భూమిలో పూడ్చిపెట్టి ఉంటే స్కంధాలు స్కంధాలుగా మట్టికిగాని చెదలుకుగాని గురికావు. స్కంధాల్లో కొన్ని పద్యాలైనా మిగిలి ఉండేవి.

నాచనసోముని ఉత్తర హరివంశంలోని పద్యాలను అనుకరిస్తూ పోతన భాగవతంలో పద్యాలు చెప్పాడు. సోమన బుక్కరాయల కాలంలో విజయనగరం ఆస్థానకవి. ఆయన చేత (బుక్క పట్ణం) పెంచుకలదిన్నె అగ్రహారం పొందాడు. ప్రౌఢదేవరాయల కాలంలో తురిమెళ్లదిన్నెను అగ్రహారంగా పొందాడు. ఈ రెండు గ్రామాలు కడప జిల్లాలోనివి. తురిమెళ్లదిన్నె – ఒంటిమిట్టకు నలుబై కిలోమీటర్ల దూరంలో ఉంది. నాచనసోముని చివరి దినాల్లో తురిమెళ్లదిన్నెలో గాని బుక్కపట్ణంలోగాని నాచనసోముని దర్శించి ఉండవచ్చు. ఆయన ఉత్తర హరివంశం చూచి అందలి పద్య నిర్మాణానికి ముగ్ధుడైన పోతన తన భాగవతంలో అలాంటి పద్యాలను అల్లి ఉంటాడు.

సోమనను పోతన ఇలా అనుకరించాడు.

1. గనయంబుంగొనయంబు నెన్నడుముతోఁ గర్ణావతం సంబుతో 1-157 ఉ.హ.వం.

అలినీలాలక చూడనొప్పెసగెఁ బ్రత్యాలీఢ పాదంబుతో. భాగ.దశ. 179.

2. సత్రాజిత్తనయా కరాంతర ధనుర్జ్యారావ మైరావతీ ఉ.హ.వం. 1-160.

జ్యావల్లీ ధ్వని గర్జనంబుగ సురల్‌ సారంగ యుధంబుగా భాగ.దశమ. 182.

చదవండి :  Report of a Tour in the Cuddapah & North Arcot Districts

3. తంత్రీవినోదంబు తడవు సైపనివ్రేళ్లు గొనయంబు తెగలపై గోరుకొనుట. ఉ.హ.వం. 1-161.

బొమ్మపెండ్లిండ్లకు బోనొల్ల ననుబాల రణరంగమున కెట్లు రా దలంచె. భాగవతం దశ. 10.181.

4. అరిజూచున్‌ హరిజూచు సూచకములై యందంద మందార ఉ.హ.వం. 1-162.

పరుజూచున్‌ వరుజూచు నొంప నలరింపన్‌ రోషరాగోదయా విరత… భాగ.దశ. 178.

ఒంటిమిట్ట చెరువుకింద పోతన పొలం.

ఒంటిమిట్ట చెరువు పొలంలో ఒక ప్రాంతం బొమ్మిది గడ్డ అనీ ఆ గడ్డకు ఉత్తరదిశలో బైరేశుని గడ్డ అనీ సమీపంలో తోట గడ్డ అనీ ఉన్నాయి. బైరేశుని గడ్డ మీద భైరవేశ్వరుని శిల ఉంది. బొమ్మిదిగడ్డ ఒకనాటి బమ్మెర (బొమ్మెర) గడ్డగావచ్చు. ఇవి మూడూ పోతనకు చెందినవే. నాచన సోమన తన అగ్రహారాలకు పెంచుకల దిన్నె (తిన్నె) తురిమెళ్ల దిన్నె (తిన్నె) అని నామకరణం చేసుకోగా ఇక్కడ పోతన తన పొలానికి తోటగడ్డ అని, భైరవుని ప్రతిష్ఠించుకొన్న ప్రాంతం బైరేశుని గడ్డ అనీ తాను నివసించిన ప్రాంతం బొమ్మెర గడ్డ అనీ అయింది.

రామభద్రుడు – రామభద్రకవి

అయ్యలరాజు తిప్పయ్యకు పోతన సమకాలికుడు అయి ఉండవచ్చు. ఆయన భాగవతంలోని పద్యాలకు ఆయన గాని ఆయన కుమారుడు గాని ముగ్ధుడై ఉంటాడు. భాగవతంలోని

పలికెడిది భాగవతమట

పలికించు విభుండు రామభద్రుండట – వంటి పద్యాలు పద్యాభిమానుల నోటనానుతూ ఉంటాయి. పైగా రామభద్రుని మీద భక్తి రగిలించేది, ఆ పద్యం. రామభద్ర శబ్ద మాధుర్యానికి పరవశులైన తండ్రికొడుకులు తమ యింటి వంశాంకురానికి రామభద్రుడని పేరు పెట్టుకొన్నారు. ఆయనే రామభద్రకవి అయ్యాడు. రామాభ్యుదయ కావ్యకర్త కూడా అయ్యాడు.

ఒంటిమిట్టకు ఆ పేరు

ఉదయగిరిని పాలిస్తున్న కంపరాయలు ఈ ప్రాంతంలో చెరువు గుడి నిర్మాణాలకు ఆదేశాలిచ్చాడు. (ఒంటిమిట్ట కైఫీయత్యు) కానీ గుడిని బుక్కరాయలు ప్రారంభించాడు. (గండికోటలోని శాసనం) కాశీరామేశ్వర యాత్రలో తీసుకువచ్చిన సీతారామలక్ష్మణ – ఏక శిలా విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడు. మిట్టమీద నెలకొన్న గుడిని గుడి చుట్టూ ఏర్పడిన గ్రామాన్ని ఒంటిమిట్ట అన్న పేరు మీద పిలిచాడు. గుడికీ చెరువుకూ అదే పేరయింది.

పోతన ఒంటిమిట్టలో కాపురం పెట్టక మునుపు బొమ్మిది గడ్డలో కాపురం ఉండి ఉంటాడు. అక్కడికి కూత వేటు దూరంలో పెన్నానది ప్రవహిస్తుంది. ప్రతిదినం నదీస్నానం చేయక పోయినా పర్వ దినాల్లో గంగకు స్నానానికి వెళ్లివస్తూ ఉంటాడు. ఒకానొక చంద్రగ్రహణ సమయంలో ధ్యానంలో రామభద్రుడు దర్శనమిచ్చాడు. పోతన కవితా పాండిత్యాలు గ్రహించిన ఒంటిమిట్టలోని ”గురువృద్ధ కవిజనులు” స్వాగతం పలికి ఒంటిమిట్టలో కాపురం పెట్టించి ఉంటారు. ఆ సంగతినే ”కొన్ని దినంబులకు ఏకశిలానగరంలోన కుంజను దెంచి” యని చెప్పుకొన్నాడు.

జాంబవంతుడే పోతనగా అవతరించాడు. నన్నయ భారతంలోని తొలి ప్రార్థన శ్లోకం ‘శ్రీవాణీగిరిజాశ్చిరాయ’ లోని పురుషోత్తమాంబుజభవశ్రీ కంధరులు (విష్ణువు, బ్రహ్మ, శివుడు) నన్నయ తిక్కన ఎర్రనలు కూడా అవుతున్నారు అంటూ ఆశ్చర్యజనకమైన ప్రతిపాదన చేశారు విశ్వనాథ సత్యనారాయణ గారు.

చదవండి :  పాలెగాళ్ల పాలనకు సజీవ సాక్ష్యం "దుర్గం కోట "

పురాతన దేవాలయాలకు అగస్త్య ప్రతిష్ఠ, జనమేజయ ప్రతిష్ఠ వంటి పేర్లున్నాయి. ఒంటిమిట్ట గుడి జాంబవత్‌ ప్రతిష్ఠ అంటారు. జాంబవంతుడు త్రేతాయుగంలోను ద్వాపరయుగంలో ఉన్నాడు. త్రేతాయుగంలో శ్రీరామునికి సహాయకుడుగా లంకావిజయంలో పాల్గొన్నాడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణునితో యుద్ధంచేసి తన బిడ్డ జాంబవతిని కన్యాదానం చేశాడు. పోతన తన కావ్య ప్రారంభంలో శ్రీకైవల్యపదంబు జేరుటకునై అంటూ ఆ శ్రీకృష్ణుని స్తుతించాడు. భాగవత మహాకావ్యాన్ని శ్రీరామచంద్రునికి అంకితం చేశాడు. రెండు యుగాల్లో రాముణ్ణీ కృష్ణుణ్నీ సేవించాడు జాంబవంతుడు. కలియుగంలో పోతన రామకృష్ణులిరువుర్నీ ఒకే కావ్యం ద్వారా సేవించాడు. ఇరువురికీ ఒకే పోలికలున్నాయి. ఇరువురూ ఒక్కరే నేమో!

జాంబవత్ప్రతిష్ఠ :

ఒంటిమిట్టగుడిలో కొలువుదీరుతున్న స్వామి రఘునాయకుడు, అరణ్యవాసం చేస్తున్న కోదండరాముడు. అరణ్యవాససమయంలో పరిచయమైన ముఖ్యుడు జాంబవంతుడు. తరువాతి యుగంలోను శ్రీకృష్ణునికి బిడ్డనిచ్చి బంధుత్వం కలుపుకొన్నవాడు. ఆ జాంబవంతుని పేరుమీద జాంబవత్‌ ప్రతిష్ఠగా బుక్కరాయలు ఒంటిమిట్ట గుడిని నిలిపాడు. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. బుక్కరాయలు యదువంశానికి చెందినవాడని నాచన సోమనాథునికిచ్చిన పెంచుకలదిన్నె శాసనంలో ఉంది. యదువంశీయులతో బాంధవ్యం చేసిన మహనీయుడు జాంబవంతుని పేరిట ప్రతిష్ఠ చేయడం ఔచిత్యమే. అంతేకాదు, జాంబవంతుని కుమార్తె జాంబవతి, కృష్ణునికీ జాంబవతికీ జన్మించినవాడు సాంబుడు. బుక్కరాయల వంశీయులు (కురుబలు) సాంబుని వంశపరంపర అని ఊహించేందుకు అవకాశం ఉంది.

ఒంటిమిట్ట / ఏకశిలా నగరం :

బుక్కరాయలు కాశీరామేశ్వరయాత్ర చేస్తూ గోదావరితీరం ఇసుకపల్లెనుంచి తీసుకువచ్చిన నాలుగు విగ్రహాల్లో ఒకటి ఒంటిమిట్టలోని రఘునాయకులు. ఆయన సీతాలక్ష్మణ సహితుడై ఒకే శిలలో కొలువైనాడు. అక్కరాయలు, బుక్కరాయలు ఓరుగల్లు రాజధానిలో రాజోద్యోగులు. కాలాంతరంలో విజయనగర చక్రవర్తులయ్యారు. యాదృచ్ఛికంగా ఒంటిమిట్టగుడిలో ఏకశిలలో ముగ్గురు దేవతలు కొలువైనారు. ఒంటిమిట్ట అని మాత్రమే కాకుండా ఏకశిలా నగరం అనికూడా నామాంతరం అయింది. ఒంటిమిట్టకు అనువాదం కాక పోవచ్చు. ఒకనాటి ఓరుగల్లు తన మదిలో మెదలి బుక్కరాయలే ఏకశిలానగరమనీ అని ఉండవచ్చు. ఒంటిమిట్ట పేరు జనంలోకి వెళ్లింది. ఏకాశిలానగరం పండితులకే పరిమితమయింది. పోతన ప్రస్తావించాడు.

రచయిత గురించి

భాషాపండితుడుగా ఉద్యోగ విరమణ పొందిన విద్వాన్ కట్టా నరసింహులు గారు కడపలోని సి.పి. బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్ర బాధ్యతలు నిర్వహించారు. సి.పి. బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం – ప్రకటిస్తున్న మెకంజీ కైఫీయత్తులుకు సంపాదకత్వం వహిస్తున్నారు.ఇప్పటి వరకు వీరు ఆరు సంపుటాలకు సంపాదకత్వం వహించారు. కడప జిల్లా చరిత్ర సాహిత్యాల వికాసానికి కృషిచేస్తున్న వీరు ప్రసుతం కడపలో నివసిస్తున్నారు. ఫోన్ నంబర్: 9441337542

ఇదీ చదవండి!

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు

తితిదే ఆధీనంలోకి ఒంటిమిట్ట

మాట తప్పిన ప్రభుత్వం తితిదే అజమాయిషీలోకి కోదండరామాలయం కోదండరామయ్య బాగోగులకు ఇక కొండలరాయుడే దిక్కు ఒంటిమిట్ట: వందల కోట్ల రూపాయలు వెచ్చించి …

Leave a Reply

Your email address will not be published.

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: