ఆ రాజధాని శంకుస్థాపనకు హాజరుకాలేను

ముఖ్యమంత్రిగారూ!

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి శంకుస్థాపన ఉత్సవానికి రమ్మంటూ నాకు ఆహ్వాన పత్రిక పంపారు. రాయలసీమ ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ‘నేను రాలేను’ అని చెప్పడానికి చింతిస్తున్నాను. సీమ ప్రజలకు ప్రతినిధిగా ఉన్న నాకు ఇంతకంటే వేరే మార్గం కనిపించడం లేదు.

రాష్ట్ర విభజన సమయంలో మీరు చేసిన ప్రకటనలు, ముఖ్యమంత్రి పదవి చేపట్టాక మీరు వ్యవహరిస్తున్న తీరు పొంతన లేకుండా ఉన్నాయి. అభివృద్ధిలో తీవ్రమైన అసమానతల వల్లే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ విడిపోయింది. తెలంగాణ ఉద్యమానికి అదే ప్రాతిపదికగా నిలిచింది. అందులోనూ హైదరాబాద్‌ ప్రధాన చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి మొత్తాన్ని హైదరాబాద్‌లో కేంద్రీకరించడం వల్ల రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు నష్టపోయాయని, వెనుకబడ్డాయని మీరే అంగీకరించారు. కొత్త రాష్ట్రంలో అలా జరగబోదని చెప్పారు. రాష్ట్రంలోని 13 జిల్లాలను సమంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.

అవశేష ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపైన కనీసమైన చర్చ చేయలేదు. ప్రజాభిప్రాయం తీసుకోలేదు. అన్నీ ఏకపక్షంగా చేసుకుపోయారు. అమరావతిని రాజధానిగా ప్రకటించారు. రాజధాని కోస్తాలో ఏర్పాటు చేస్తే….హైకోర్టు రాయలసీమలో పెట్టాలన్న శ్రీబాగ్‌ ఒడంబడికను మరచిపోయి హైకోర్టు కూడా రాజధాని ప్రాంతంలోనే నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారు.

చదవండి :  అది మూర్ఖత్వం

రాజధానిని మీకు నచ్చిన చోట పెట్టుకుంటున్నా…వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర, పల్నాటిసీమ ప్రాంతాల అభివృద్ధిపై దృష్టిసారించివుంటే ఈ ప్రాంతాల ప్రజలు అసంతృప్తి చెందేవారు కాదు. తరతరాలుగా కరువుకాటకాలతో అల్లాడుతున్న ప్రాంతాల అభివృద్ధి కంటే….ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించడమే మీకు ప్రాధాన్యంగా మారింది. వేల కోట్లు అక్కడే కుమ్మరించడానికి సిద్ధపడుతున్నారు. అమరావతి నిర్మిణానికి విదేశీ నిపుణులతో ప్రణాళికలు, రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేయించిన మీరు, రాయలసీమ, ఉత్తరాంధ్ర, పల్నాడు ప్రాంతాల అభివృద్ధికి అలాంటి ప్రణాళిక సిద్ధం చేసివుండాల్సింది. అలాగే కార్యాచరణ ప్రకటించి ఉండాల్సింది. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి, ఏ ఏడాది ఎంత నిధులు ఖర్చు చేస్తారో స్పష్టంగా చెప్పివుండాల్సింది. ఇవేమీ చేయలేదు.

హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ, తుంగభద్ర సమాంతర కాలువ వంటి ప్రాజెక్టులు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉండగా వాటికి నిధులు నీళ్లు చిలకరించినట్లు చిలకరించారు. పట్టిసీమకు మాత్రం రూ.1300 కోట్లు ఖర్చుచేసి ఆగమేఘాలపై పూర్తిచేశారు. ఇదేమిటని అడిగితే…రాయలసీమ కోసమే పట్టిసీమ నిర్మిస్తున్నామని చెప్పారు. పట్టిసీమ వల్ల శ్ర్రీశైలంలో మిగిలే నీటిని సీమకు ఇస్తామన్నారు. అయితే అలాంటి జీవో ఏదీ విడుదల చేయలేదు.

చదవండి :  ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ కాల్చిన విద్యార్థులు

తిరుపతి శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాల వ్యవహారం కూడా రాయలసీమ పట్ల ప్రభుత్వం చూపుతున్న వివక్షకు ఉదాహరణ. 120 జీవో ద్వారా సీమ విద్యార్థులకు రిజర్వేషన్లు లేకుండా చేసి తీవ్ర అన్యాయం చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని కోర్టులు చెప్పినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఈ ఏడాదిలోనే 90 మందికి పైగా సీమ ఆడబిడ్డలు ఎంబిబిఎస్‌ సీట్లు కోల్పోయారు.

రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో కరువు తాండవిస్తోంది. ఈ వర్షాకాలంలోనూ దాదాపు 4000 పల్లెల్లో ట్యాంకర్లతో నీళ్లు సరఫరా చేస్తున్నారు. సీమ వ్యాప్తంగా మూడు లక్షల బోర్లు ఎండిపోయాయి. వేల ఎకరాల్లో మామిడి, చీనీ, దానిమ్మ తోటలు మలమలమాడిపోయాయి. నీళ్లు లేక పశువులు అమ్ముకుంటున్న దుస్థితి. 10-15 రోజులకు ఒకసారి వచ్చే నీటిని నిల్వ చేసుకోవడం వల్ల దోమలు పెరిగి, డెంగ్యూ వ్యాపించి జనం ప్రాణాలు తీస్తోంది.

ఉపాధి దొరక్క సీమ కూలీలు, రైతులు కడుపు చేతపట్టుకుని కేరళ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు వలసపోతున్నారు. అక్కడ దుర్భరమైన జీవితం గడుపుతున్నారు. ఇదో మానవ విషాదం వంటిది. దీని నివారణ కంటే రాజధాని నిర్మాణమే మీకు ప్రాధాన్యంగా కనిపిస్తోంది.

చదవండి :  భారద్వాజస గోత్రీకుడు షేక్ బేపారి రహంతుల్లా!

రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని పునర్విభజన చట్టంలో స్పషంగా రాసుకున్నా…అలాంటి ప్యాకేజీ కేంద్రం నుంచి సాధించుకునేందుకు ప్రయత్నాలు జరగడం లేదు. జిల్లాకు రూ.50 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. సీమకు కనీసం లక్ష కోట్లతో ప్యాకేజీ ప్రకటించి, అమలు చేస్తేగానీ ఈ ప్రాంతం కోలుకోదు. ఇది ప్రభుత్వానికి ప్రాధాన్యత గల అంశంగా కనిపించడం లేదు.

రాష్ట్ర విభజన తరువాతే సీమకు తీవ్రమైన నష్టం జరుగుతోందన్న భావన ఇక్కడి ప్రజల్లో బలంగా ఉంది. జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నేను కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న రాయలసీమ అభివృద్ధి వేదికకూ ఇలాంటి అభిప్రాయమే ఉంది. సీమ ప్రజలు నన్ను ఎంఎల్‌సిగా గెలిపించి శాసనమండలికి పంపించారు. వారి మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే సీమ ప్రజల మనోభావాలను గాయపరిచేలా జరుగుతున్న రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి నేను హాజరుకాలేను.

భవదీయుడు
(గేయానంద్‌)

ఇదీ చదవండి!

రాయలసీమలో హైకోర్టు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – మొదటి భాగం

రాష్ట్ర విభజనానంతరం 1953నాటి ప్రాంతాలే ఆంధ్ర ప్రదేశ్ లో మిగలడం వల్ల, స్థూలంగా రాయలసీమలో అప్పటి వెనుకబాటుతనం, సీమవాసుల్లో కోస్తాంధ్ర …

Leave a Reply

Your email address will not be published.

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: