రాయలసీమ జానపదం
చెక్కభజన

రాయలసీమ జానపదం – తీరుతెన్నులు:అంకె శ్రీనివాస్

రాయలసీమ జానపదం

రాయలసీమ సాంస్కృతికంగా చాలా విలక్షణమైనది. తొలి తెలుగు శాసనాలు రాయలసీమలోనే లభించాయి. తెగల వ్యవస్థలనుండి నాగరిక జీవనానికి పరిణామం చెందే దశలో స్థానిక భాషకు ఆ నాటి స్థానిక నాయకులు రాజగౌరవం ఇచ్చారు. ఇదే సమయంలో రాయలసీమను పాలిస్తున్న శూద్రరాజులు బ్రాహ్మణుల సంస్కృత భాషను తిరస్కరించి రాజభాషగా తెలుగు భాషను పురస్కరించారు. జెైన మత ప్రచారం కోసం మత ప్రచారకులు స్థానిక భాషలను ప్రోత్సహించడమే ఇందుకు ముఖ్య కారణం. టిట్‌మోర్‌ వంటి భాషా శాస్త్రజ్ఞులు సామాజిక నిర్మాణం భాషాభివ్యక్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తుందంటారు. సహజంగానే భాషాభివ్యక్తి కూడా సామాజిక నిర్మాణం మీద తీవ్ర ప్రభావాన్ని కలిగి ఉంటుంది. దురదృష్టవశాత్తు ఆనాటి మత ప్రచార గేయాలు నేడు లభించడం లేదు.

ఆ నాటి రాయలసీమ ప్రజానీకానికి, జానపద కళాకారులకు ఆచెైతన్యం లేకపోయింది. ఆ తర్వాత దాదాపు వెయ్యి సంవత్సరాలకు రాయలసీమ జానపద గేయానికి గజ్జెకట్టి కంజీర మోగించిన జానపద వాగ్గేయకారుడు అన్నమయ్య. తెలుగులోనే మొదటి జానపద వాగ్గేయకారుడు. ఆనాటి రాజుల్ని వారి ఫ్యూడల్‌ మనస్తత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. ఈ వ్యతిరేకతను పోతులూరి వీరబ్రహ్మం, దూదేకుల సిద్దప్ప వంటి జానపద వాగ్గేయకారులే కాక ధూర్జటి వంటి పండిత కవులు కూడా కొనసాగించారు. దిశమొలతో దేశమంతా సంచరిస్తూ శాస్త్రీయమైన జీవన తాత్త్వికతను కవిత్వం చేసిన వేమన సరేసరి! అయితే ఆ జానపద వాగ్గేయకారుల వారసత్వం ఆధునిక కాలంలో రాయలసీమకు లేకపోవడం ఒక ఆశ్చర్యం. సమకాలీన తెలంగాణలో సుద్దాల హనుమంతు, గద్దర్‌, గోరేటి వెంకన్న, ఉత్తరాంధ్రలో వంగపండు ప్రసాదరావు వంటి జానపద వాగ్గేయకారులున్నట్లు రాయలసీమలో అటువంటి కళాకారులు కనిపించకపోవడం విస్మయం కలి గించే వాస్తవం.

తిరుగుబాటు తత్త్వంలోనే కాక సామాన్యుని జానపద భాషకు సంగీతాన్ని సమన్వ యించి తెలుగు సంకీర్తనకు ప్రాణం పోసిన అన్నమయ్యకు తెలంగాణలో రామదాసు, కోస్తాలో క్షేత్రయ్య వంటివారు వారసులయ్యారు. కానీ రాయలసీమలో భాషలో, భావ జాలంలో వారసత్వం లేకపోవడానికి చాలా కారణాలే కన్పిస్తాయి.విజయనగర సామ్రాజ్యం పతనం తర్వాత రాయలసీమ అంతటా పాలెగాళ్ళు పాలకులయ్యారు. అప్పటికే నిర్మితమైన చెరువుల వంటి ఆదాయ వనరులను కేంద్రంగా చేసుకొని అనతి కాలంలోనే బలపడ్డారు. తమకు తామే గొప్పవాళ్ళమనుకునే ఆధిపత్య భావజాలంలో మునిగితేలుతూ తమలో తాము కలహించుకుంటూ ఈ ప్రాంతాన్ని రావణకాష్ఠం చేశారు. పాలెగాళ్ళ మధ్య జరుగుతున్న యుద్ధాల్లో ఓడిపోయిన గ్రామాల పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని రాయలసీమలోని కైఫీయత్తులు సాక్ష్యం చెబుతాయి.

చదవండి :  నలుగూకు రావయ్య నాదవినోదా! - జానపదగీతం

ఓడిపోయిన గ్రామాల్లోని ప్రజల ఆస్తులు, తిండి గింజలతోపాటు, మాన ప్రాణాలకు కూడా రక్షణలేదు. అందువల్ల ప్రత్యర్థి పాలెగాళ్లనే ప్రజలు శత్రువులుగా చూశారు తప్ప, ఈ సమస్యకు మూలకారణమైన వ్యవస్థమీద వ్యతిరేకత లేకపోయింది. హైదరాబాద్‌ నిజాం సైన్య సహకార పద్ధతి కింద రాయలసీమను బ్రిటిష్‌ వారికి దత్తత చేయడం పరిస్థితిని బాగా దిగజార్చింది. థామస్‌ మన్రో పాలెగాళ్ళను అంతమొందించే సమయంలో కొందరు స్థానిక పాలెగాళ్ళ మీద ప్రజల సానుభూతి కూడా వెల్లువెత్తింది. మహా లింగారెడ్డి అనే పాలెగాణ్ణి బ్రిటిష్‌ పోలీసులు హతమార్చినప్పుడు ఆ నాటి అజ్ఞాత జానపద కళాకారుడు ఆలపించిన ‘కొడుకో మా లింగారెడ్డి’ అనే స్మృతి జానపద గేయం (ఊౌజూజు ఉజ్ఛ్ఛూడ) వందల సంవత్సరాల తర్వాత కూడా నేటికీ రాయలసీమ నాలుక మీద సజీవంగా ఉంది. ఈ పరిణామాల ప్రభావంతో ఈసమయంలో పాలెగాళ్ళ ఆధిపత్యాన్ని ప్రశ్నించే జానపద సాహిత్యం ఆవిర్భవించలేదు.

బ్రిటిష్‌ ప్రభుత్వం కేవలం పాలెగాళ్ళను అంతమొందించింది తప్ప పాలెగాళ్ళ వ్యవస్థను రూపు మాపలేదు. ప్రజల్ని తమ అదుపాజ్ఞల్లో ఉంచుకోవడానికి ఈ వ్యవస్థను మరో రూపంలో ప్రోత్సహించింది. ఈ పాలెగాళ్ళ వ్యవస్థ ఆధునికతను సంతరించుకొని ఫ్యాక్షన్‌ వ్యవస్థగా రూపాంతరం చెందింది. ఈ సంధి దశలోని ఒక చిన్న పరిణామాన్ని ఇక్కడ చెప్పుకోవాలి. ఈ సందర్భంలో భయంకర కరవులు ఏర్పడినప్పుడు ధనవంతుల్ని, భూస్వాముల్ని దోచి ప్రజల ఆకలి తీర్చిన దివిటీల మల్లుడు వంటి దారిదోపిడీ దొంగల్ని అజ్ఞాత జానపద కళాకారులు కీర్తించిన కొన్ని జానపద గేయాలు లభిస్తున్నాయి (దివిటీల మల్లుగాడు/ దీటిబట్టి వచ్చినాడు/ గుఱ్ఱమెక్కి గూడమొచ్చి/ గంజి గటక కాచి కాచి/ సానికల్లో పోసినాడు/ ధాతుకరువు భూతమయ్యె/ దొర కొడుకుల దొరతనం మల్లు ముందు దిగదుడుపురా నాసామిరంగా). అయితే ఇది తాత్కాలికమే అయింది. ఫ్యాక్షన్‌ వ్యవస్థ తీవ్రంగా పాదుకొని గ్రామాన్ని రెండు ముఠాలుగా మార్చేసింది.

చదవండి :  మట్లి (సిద్ధవటం) రాజుల అష్టదిగ్గజాలు

1930వ దశకంలోనే ఈ ఫ్యాక్షన్‌ ప్రభావం పుట్టపర్తి నారాయణాచార్యులు ‘మేఘదూతం’ గేయంలోనే కనిపిస్తుంది. స్వాతంత్య్రానంతరం ఫ్యాక్షనిస్టులే రాజకీయ నిర్ణాయకులుగా మారిపోయారు. ఈ రాయలసీమ పరిస్థితులకు- తెలంగాణ పరిస్థితులు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. నామమాత్రమైన గోల్కొండ నిజాం పాలనలో తెలంగాణ గ్రామాలకు జమీందార్లు, పటేళ్ళు, పట్వారీలు ప్రత్యక్ష పాలకులయ్యారు. బానిసత్వాన్ని పెంచి పోషించారు. నిజాం వ్యతిరేకతతో పాటు స్వాతంత్య్ర ఉద్యమ ప్రభా వంతో తెలంగాణ విమోచన ఉద్య మంలో జానపద వాగ్గేయకారులూ కీలక పాత్ర నిర్వహించారు. ‘మా నిజాం తర తరాల బూజు’, ‘ఓ నిజాం పిశాచమా! కానరాడు/ నిన్ను బోలిన రాజు మాకెన్నడేని/ తీగలను తెంపి అగ్నిలో దింపినావు/ నా తెలంగాణ కోటి రతనాల వీణ’’

(దాశరథి కృష్ణమాచార్య) అన్న పండిత కవుల మాదిరిగానే జానపద కవీ ఘాటుగానే స్పందించాడు (‘నెైజాం సర్కరోడా నాజీల మించినోడా/ యమ బాధలు పెడితివి కొడుకో, నెైజాం సర్కరోడా’… ‘బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో వస్తవు కొడుకో నెైజాం సర్కరోడా’).తెలంగాణ విమోచన ఉద్యమానికి ముందున్న దొరల వ్యవస్థ సామాన్యుల బానిసత్వం, తెలంగాణ గ్రామాల అస్తిత్వాలకు దాశరథి రంగాచార్య ‘చిల్లరదేవుళ్ళు’, వట్టికోట ఆళ్వారు స్వామి ‘ప్రజల మనిషి’ వంటి నవలలు మంచి సాక్ష్యాలు. రాయల సీమలోని అతి పేద దళితుడు కూడా కాస్తో కూస్తో భూమిని కలిగి ఉన్నాడు. కరవులు చుట్టిముట్టినా భూమి మీద సర్వాధికారాలు అతనివే. రాయలసీమలో గ్రామం రెైతు పోషితం.

చదవండి :  అమ్మమ్మో ..నా లడీసు మొగుడూ - జానపదగీతం

తెలంగాణలో భూములు చాలా వరకు జమీందారులవే. వారి దయా దాక్షి ణ్యాల మీద గ్రామం ఆధారపడి ఉంది. తెలంగాణలో గ్రామం దొరల పోషితం. ఈ ప్రత్యేక పరిస్థితులే తర్వాత కాలంలో సాయుధ పోరాటానికి మూలకారణమయ్యాయి. సాయుధ పోరాటానికి పాట ప్రధాన వాహిక. ఈ సాయుధ పోరాటమే గద్దర్‌ వంటి వారిని తయారు చేసింది. ఈ పరిస్థితులే తెలంగాణా నుండి ‘మనిషి లోపల విధ్వంసం, అతడు’ (అల్లం రాజయ్య) వంటి కథలూ జన్మించడానికి ఆస్కారమయ్యాయి. ఇటువంటి పరిస్థితులే ఉత్తరాంధ్రలో ఉండడం వల్ల ‘యజ్ఞం’ (కాళీపట్నం రామారావు) వంటి కథ రావడానికి, వంగపండు వంటి జానపద వాగ్గేయకారులు తయారు కావడానికి దోహదం చేశాయి.

ఇటువంటి పరిస్థితులు రాయలసీమలో లేనందువల్ల అటువంటి జానపద వాగ్గేయకారుల ఆవిర్భావానికి అవకాశమే లేకపోయింది. ఏ సమాజమైనా తనకు అవసరమయ్యే కళల్ని తనే రూపొందించుకుంటుంది. రాయలసీమకున్న ప్రత్యేక పరిస్థితులపట్ల జానపద గేయాల ఆవిర్భావం జరుగుతోంది. వాటిలో ఉద్యమ చెైతన్యమూ లేదు, సహజమైన వాగ్గేయకారుల అభివ్యక్తీ లేదు. టిట్‌మోర్‌ వంటి భాషా శాస్త్రజ్ఞులు వ్యాఖ్యానించినట్లు సామాజిక నిర్మాణం, భాషా నిర్మాణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. భాషంటే కేవలం మాటలు కాదు కదా! ఒక జీవన విధానం, ఒక సంస్కతి, ఒక ప్రాంత అభివ్యక్తి!!

ఇదీ చదవండి!

రాయలసీమలో హైకోర్టు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – మొదటి భాగం

రాష్ట్ర విభజనానంతరం 1953నాటి ప్రాంతాలే ఆంధ్ర ప్రదేశ్ లో మిగలడం వల్ల, స్థూలంగా రాయలసీమలో అప్పటి వెనుకబాటుతనం, సీమవాసుల్లో కోస్తాంధ్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: