లక్కోజు సంజీవరాయశర్మ గారి విజిటింగ్ కార్డ్
లక్కోజు సంజీవరాయశర్మ గారి విజిటింగ్ కార్డ్

గణిత బ్రహ్మతో నా పరిచయం

నేను 1981 నుండి 1985 వరకూ శ్రీ కాళహస్తిలో పనిచేశాను.ఆ రోజుల్లో సంజీవరాయ శర్మ గారు స్వామి వారి సన్నిధిలో రోజూ సాయంత్రం వయోలిన్ వాయించేవారు.అంధులు.వయోలిన్ మీద కమాన్ కర్ర నాట్యంచేస్తుంటే,ద్వారం వారి వయోలిన్ సంగీతం గుర్తుకు వచ్చేది!

నేను పనిచేసే బాంక్ సమీపంలోనే ఒక చిన్న పాడుపడ్డ ఇంటిలో వుండేవారు.”ప్రతి రోజూ బాంక్ కు వచ్చి కాసేపు నాతో ముచ్చటించండి,మీతో సరదాగా మాట్లాడుకోవచ్చు,ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు”అని వారిని వేడుకున్నాను.వారు అలానే,సాయంత్రం నాలుగు గంటల సమయంలో వచ్చేవారు.రాగానే,వారికి ఫలహారం,కాఫీ ఏర్పాటు చేసే వాడిని.వాటిని ప్రేమతో స్వీకరించి.రోజుకొక ‘గణిత విన్యాసాన్ని’ చూపించేవారు.

నేను M.A(Maths). ఆయన ,”బాబుగారు! మీరు ఏమి చదువుకున్నారు?”అని అడిగినప్పుడు చాలా సిగ్గుపడ్డాను.యెందుకంటే,ఆ అ’గణిత’ మేధావి ముందు మనం నిరక్షురలం క్రింద లెక్క వేసుకొనవచ్చు.”మీరు ఏ రోజు పుట్టారు బాబు గారు?”అని అడిగారు. దానికి నేను సమాధానంగా,”శ్రీ వికృతి నామ సంవత్సర మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు,రోహిణీ నక్షత్రంలో జన్మించాను.”అని చెప్పాను.వెంటనే రెండు నిముషాలలోపే,”అంటే, 22 -12 -1950 న,మంగళవారం జన్మించారు” అని చెప్పి నన్ను ఆశ్చర్యంలో ముంచేశారు.యిలా రోజుకొక,విన్యాసాన్నిచూసే వాడిని.ఎప్పుడన్నా,నూతన వస్త్రాలను ఇచ్చి,స్వీకరించమని ప్రాధేయ పడేవాడిని.చాలా అభిమాన వంతులు.ఎవరినుండి ఆయాచితంగా యేమీ ఆశించరు.అప్పుడప్పుడు మాత్రమే స్వీకరించే వారు.జీవనం గడవటం చాలా ఇబ్బందిగా వుండేది.పైగా,వీరికి ఒక సహాయకుడు కూడా వుండేవారు.

చదవండి :  రాయలసీమ ద్రోహం నుంచీ బయటపడటానికి మార్గం ఏమిటి?

ఒక రోజు,’బాబుగారూ! నాకొక చిన్న సహాయం చేయగలరా?’అని ప్రాదేయపడినంత పని చేశారు.”చెప్పండి,నాకు చేతనైతే ఎన్ని కష్టాలొచ్చినా సహాయం చేయటానికి వెనుకాడను”అని చెప్పాను.స్కూల్ పిల్లకు నా విద్యను ప్రదర్శించి,యాజమాన్యం వారు సహకారం చేస్తే,ఏదో కొంత ధనం చేకూరి,నా కుటుంబ పోషణ భారం సులభం అవుతుంది.అలా జీవించటంలో నాకొక తృప్తి కూడా వుంటుంది” అని వారి కోరికను వెళ్ల బుచ్చారు.వెంటనే,నా మిత్రుడు,హైస్కూల్ హెడ్ మాస్టర్ గారైన శ్రీ అంగర ఆంజనేయ శర్మ గారి సహాయంతో శ్రీ సంజీవ రాయ శర్మ గారిని తీసుకొని,విద్యాశాఖ లోని జిల్లా అధికారిని చిత్తూరులోకలిశాం.వారు వీరి విద్యను చూసి ఆశ్చర్య పడి,ప్రతి విద్యాలయానికి,వీరి విద్యా ప్రదర్శన ఏర్పాటు చేయ వలసినదిగా వెంటనే సూచనలు ఇచ్చారు.అంతే కాకుండా హైదరాబాద్ లోని పై అధికారులకు వీరి ప్రజ్ఞా పాటవాలను గురించి కూడా తెలియ చేశారు.

చదవండి :  తాగునీరూ కష్టమే!

అలా వారు,వారానికి ఒక విద్యాలయాన్ని సందర్శించే వారు.విద్యాలయం తరఫున ఏ ఉపాధ్యాయుడో వచ్చి వారిని తీసుకొని వెళ్లి మళ్ళీ ఇంటి వద్ద దించేవారు.అలా వారికి తృప్తినిచ్చే వ్యాసంగం ద్వారా కొంతా ఆర్ధిక స్థితి కూడా మెరుగు పడింది.సాయంత్రపు వేళలో,స్వామి వారి గుడి తలుపులు వీరి వయోలిన్ వాదన తోనే తెరుచుకునేవి.నాద,నాట్య ప్రియుడైన నటరాజుకు మరి అటువంటి వారంటేనే ఇష్టం కదా!అలా వారి జీవనం సాగుతుండేది.

ఏ విద్యాలయంలోనూ,ఏ గురువు వద్ద అభ్యసించకుండా యెంతో ఘనమైన విద్యను సొంతం చేసుకున్న ఒక గొప్ప మేధావి శ్రీ శర్మ గారు.1985 లో నేను అక్కడినుండి బదలీ అయ్యి గుంటూరుకు వచ్చాను.చాలా కాలం వరకూ,వారి యోగ క్షేమాలు తెలుసుకున్నాను.నేను శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడల్లా వారిని కలుసుకొనే వాడిని.

చదవండి :  వెనుకబడిన జిల్లాల మీద ధ్యాస ఏదీ?

1997 లో వారు మరణించి నపుడు నేను వెళ్ళలేక పోయాను.1997 లో నాకు గుండెకు చికిత్సజరగటం వల్ల,వెళ్ల లేక పోయాను.

శ్రీనివాస రామానుజం గారు చిన్న తనంలోనే మరణించారు.శ్రీమతి శకుంతలా దేవి గారిని చూసే అదృష్టం కలుగలేదు.పుట్టుకతోనే గణితాన్ని ఔపోసన పట్టిన శ్రీ శర్మ గారితో నాకు ప్రత్యక్ష పరిచయం కలగటం,నిజంగా అది పూర్వజన్మ పుణ్యఫలమే!

ఆ అ’గణిత’మేధావి కి మనం ఘనమైన నివాళిని సమర్పించుకుందాం!

– టి.వి.ఎస్.శాస్త్రీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: