వానరాయుడి పాట (కథ) – వేంపల్లి గంగాధర్

“ఉత్తరాన ఒక వాన ఉరిమి కురవాల

దక్షిణాన ఒక వాన దాగి కురవాల

పడమరా ఒక వాన పట్టి కురవాల

తూర్పున ఒక వాన తుళ్ళి కురవాల…”

పాట సాగిపోతూ వుండాది.

పాట ప్రవహిస్తా వుండాది. పాట పరవళ్ళు తొక్కుతా వుండాది. పాట పరవశిస్తా ఆడతా వుండాది.

తెల్లటి ఆకాశం మీద నల్లటి మోడాలు కమ్ముకుంటా వుండాయి. మోడాలు మోడాలు పెనవేసుకొని అల్లుక పోతా వుండాయి. ఒకదానికొకటి చేతులు పట్టుకొని కదలి వస్తా వుండాయి. కదలి… కదలి.. పాట ప్రవాహానికి ఆకాశాన్ని పక్షుల్లా ఈదుకుంటా ముందుకు వస్తావుండాయి. పాటకు తలాడిస్తా పచ్చని వరిపైరు వయ్యారాలు పోతావుంది. కర్రి మోడాలు కదలి వస్తా కరిగి పోవడానికి సిద్ధపడ్తా వుండాయి.

ఉరుము ఉరిమింది. మెరుపు మెరిసింది.కురిసింది ఒక వాన.. ఈదురు గాలికి కట్టమీద కానుగ చెట్ల కొమ్మలల్లాడతా వుండాయి. ఆగని పాట సాగుతూనే వుంది. యాన్నుంచి వస్తాంది ఆ పాట? ఎవరు పాడ్తా వుండారబ్బా!

చినుకులు కురుస్తాండాయి. మోడాలు హృదయాల్ని తెరచి చినుకు ధారల్ని కురిపిస్తా వుండాయి. నేలంతా నోరు తెరచుకొని దాహం తీర్చుకుంటా వుంది. గాలికి వూగుతావుండే వరి కంకులు తడుస్తా వుండాయి. మురుస్తా వుండాయి. స్నానమాడతా వుండాయి. తమకంతో తడిసి ముద్దైపోతా వుండాయి. మోడాల నీడల కింద నిబ్బరంగా శ్వాసను స్వప్నిస్తూ పచ్చని విశ్వరూపాన్ని చూపిస్తా ఎదిగిన పైరు శిరస్సు వంచి నమస్కరిస్తుండాది… చినుకుల రాకకు!

పాట… వాన పాట… వానరాయుడి పాట… వానను కురిపిస్తా వుండాది. కమ్ముకొచ్చిన మోడాలు పంటకు ప్రాణం పోస్తా వుండాయి.

ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన ఏనుగు కొండ బండ పై నుంచి ఆకాశానికేసి చూస్తా పాట పాడ్తా వుండాడే అతని పేరే కాటమరాయుడు. అందరూ అసలు పేరు వదిలేసి వానరాయుడని పిలుస్తారు ఆత్మీయంగా. దిగదాల నల్లరేగడి భూమిలో తెలుత్తుకొని గర్వంగా ఎదిగి నవ్వుతూ వుండే వరి కంకుల పంట అతడిదే.

నాలుగు కాండ్ల ఎడ్లతో దుక్కి దున్ని నేలను సాగుచేస్తాడు. నాట్లు ఏస్తాడు. కలుపు తీస్తాడు. ఒక్కడిదే శ్రమ. వరి కంకులు గుత్తులు గుత్తులుగా మొల్చుకొస్తాయి. నీళ్ళు పెట్టాల్సిన ఘడియ రాగానే రాగమెత్తుకుంటాడు. పాట అందుకుంటాడు. గాలికి ఊపిరి పోసి గానం చేస్తాడు.

కదుల్తాయి మోడాలు. తన్మయత్వంగా కదిలి వస్తాయి. వరికంకుల పైన మోడాల నీడలు పడ్తాయి. ఘడియ ఘడియకూ స్పందిస్తాయి. వానరాయుడి వరికంకులకు గువ్వలు కాపలా కాస్తాయి. ఆ పాటలో పరవశమది. అతడి అంతరాత్మలోని భావానికి పల్లవది.

* * *

పడమటి దేశం రాజు హిరణ్యుడు. బంగారు రంగు గుర్రమెక్కి, వెండి కళ్ళెం చేత బట్టి దేశాటనానికి బయలు దేరినాడు. రాజ్యాలన్నీ తిరుగుతా విశేషాలన్నీ తెలుసుకుంటా పోతా వుండాడు. ఈ యాత్ర మొదలయ్యి ఏడాది దాటి పోయింది. ఎంతో భూమి తిరిగాడు. ఎక్కడ చూసినా కరువు. ఎండిపోయిన భూములు, చెరువులు, కాల్వలు, బావులు, పంటలు, కరువు మంటలు, గుండె కోతలు, బోరుబోరున విలపిస్తున్న రైతులు, తినడానికి తిండిలేక నకనకలాడుతాండే ప్రజలు, పశువులు.

చినుకు లేదు. వాన లేదు. తడిలేదు. రాజ్యాలన్నీ కరువుతో అల్లాడి పోతా వుండాయి. ఎకరాలు ఎకరాలు తమ గుప్పిట్లో పెట్టుకొని మీసం మెలేసి బతికే భూస్వాములు కూడా కరువు దెబ్బకు విలవిలలాడ్తా వుండారు. రాజ్యమంతా కంప చెట్లు పుట్టుకొస్తా వుండాయి. ఒకప్పుడు వజ్ర వైడూర్యాలు, రత్నాలు రాశులు పోసి అమ్మిన పుర వీధులు నిర్మానుష్యంగా జీవం కోల్పోయి కన్పిస్తా వుండాయి. హిరణ్యుడి చివరి యాత్ర ముగిసింది. ఇంటి దారి పట్టినాడు.

తిరిగి పడమటి రాజ్యంలోకి ప్రవేశిస్తా వుండేటప్పుడు…. అప్పుడు కన్పిపించింది ఆకాశంలో అద్భుతం. తెల్లటి ఆకాశంలో నల్లటి మోడం ఒకటి కదిలి పోతా… పోతా వుండాది.

ఎక్కడికి?

తెలుసుకోవాలనే… ఆసక్తి.

యాత్ర దారి మారింది. మోడం వెనుక వెంబడిస్తా వెంట పడినాడు. కదిలి పోతా వుండే మోడం వెనుక సాగిపోవడం సాధ్యం కావడంలేదు.

వూరంటే వూరు లేదు. పల్లంటే పల్లె లేదు. పైన పోతాండే మోడం అడవి దాటుకుంది. కొండ దాటుకుంది. లోయ దాటుకుంది. పోతానే వుండాది. కింద పోతాండే మొండి రాజు హిరణ్యుడు అడవిని, లోయను, కొండను అష్టకష్టాలు పడ్తా దాటుకుంటా పోతానే వుండాడు. గస. చెమటలు. అలసిసొలసి ముందుకు సాగుతూనే వుండాడు…. వెంట సైన్యంతో పాటుగా!

చదవండి :  అంజనం (కథ) - వేంపల్లె షరీఫ్

కాకులు దూరని కారడవి; చీమలు దూరని చిట్టడవి ఇంకొంత దూరంలో వస్తాయనగా ఆ మార్గ మధ్యంలో ఊరికి ఉత్తరాన, దారికి దక్షిణాన ఎత్తైన ఏనుగు కొండ కన్పిపిస్తావుండాది. చూడ్డానికి రెండు కళ్ళు చాలడం లేదు. ఎత్తైన కొండ. దాని మీద దూసుకొస్తున్న పాట. వానరాయుడి పాట విన్పిస్తా వుండాది.

“చిత్త చిత్త వాన కురిసె

చిత్తారి వాన కురిసె

బంగారు వాన లొచ్చె

పచ్చని పంట లొచ్చె

కురిసెర ఒక వాన…”

కదుల్తా వచ్చిన కర్రి మోడం ఆగింది. గాలికి ఊగుతా వుండే కొండ కింది వరికంకులను తడపను మోడం సిద్ధ పడింది. చూస్తాండగానే చినుకులు ఎత్తుకున్నాయి. తడుస్తాంది నేల. మురుస్తాండాయి వరి కంకులు. పాట… వానరాయుడి పాట… కమ్ముకున్న మోడం వానను పై నుంచి కురిపిస్తానే వుండాది.

హిరణ్యుడి చేతిలోని వెండి కళ్ళెం బిగుసుకుంది. బంగారు రంగు గుర్రం ఆగింది. చూస్తావుండారు. కల కాదు నిజం! కలవరం… కలకలం… ఎక్కడ్నుంచో మోడమొకటి ఇక్కడికొచ్చి కురుస్తా వుండాది. ఎంత విశేషం. ఏ రాజ్యంలోనూ ఈ వింత చూసింది లేదు. ఎక్కడా వినింది లేదు. కొండ బండ పై నుంచి లీలగా వానరాయుడి పాట విన్పిస్తానే వుండాది.

విన్నాడు. ఆ కంఠంలో ఆ స్వరంలో ఎంతో మాధుర్యం. వినమ్రత. మైమరిపించే పరవశం. కట్ట మీద కానుగ చెట్ల నీడలో సేద తీరాడు హిరణ్యుడు. వింతగా ఆకాశానికేసి చూస్తూనే వుండాడు. చినుకులు.. చినుకులు… కురుస్తూనే వున్నాయి. కొంత సేపటి తర్వాత పాట ఆగింది. వాన నిలిచింది.

నిశ్శబ్దం… నిశ్శబ్దం…

హిరణ్యుడు ఒకే ఒక్క కేక వేశాడు

నలు దిక్కులు ప్రతిధ్వనించేలా…

‘నేను కరువును జయించాను!’ అని.

* * *

‘ఎక్కండి… పైకి… పై పైకి…

ఏనుగు కొండ శిఖరానికి… బండపైకి అక్కడే వుండాడు మనకు కావలసిన మనిషి. వాడ్ని రెక్కలిరిచి గొలుసులతో బంధించి కిందకు ఈడ్చుక రండి. మన రాజ్యమంతా కురవాల్సిన వానని వీడొక్కడే ఇక్కడ కురిపించుకుంటా వుండాడు. వీడి పాటతో మనం మన రాజ్యమంతా వర్షాలు కురిపించుకోవాలి… ఎక్కండి… పైకి… పైపైకి…’ ఆజ్ఞాపించాడు సైన్యాన్ని హిరణ్యుడు.

రాజు ఆజ్ఞ. దండు కదిలింది ముందుకు.నునుపైన కొండను ఎక్కడంలో అనుభవం లేని వాళ్ళంతా జారి కిందకొచ్చి పడ్తా వుండారు. ఇంకొందరు తాళ్ళ సాయంతో ఎక్కుతా వుండారు. కింద నుంచి ఈ విన్యాసాలన్ని హిరణ్యుడు చూస్తానే వుండాడు కన్నార్పకుండా. రెండు పగల్లూ, ఒక రాత్రి గడిచిన తర్వాత సైన్యం కిందకి దిగింది. ఒక నడివయసు వ్యక్తిని గొలుసులతో కట్టి తీసుకొచ్చి హిరణ్యుడి ముందు వుంచారు.

అతడు శిరస్సు వంచి నమస్కరించాడు. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. కానీ హిరణ్యుడు నమస్కరించలేదు. ఆ వ్యక్తిని పరిశీలనగా చూశాడు. అతడు సాదాగా వున్నాడు. ఎక్కడా పిడికెడు కండ లేదు శరీరంలో. పెద్ద గాలి వస్తే ఎగిరిపోయేలా వున్నాడు. ధరించివున్న దుస్తులు కూడా చాలా పాతవి. మనిషి నిర్మలంగా వున్నాడు. ముఖంలో ఏదో జీవకళ తొణికిసలాడుతాంది.

హిరణ్యుడు ఇంకా ఏదో ఊహించాడు వున్నతంగా. అతడి ఊహలన్నీ చెదిరి పొయాయి. నవ్వు… నవ్వు వస్తోంది… ఆ వ్యక్తిని చూడగానే.

‘కొండపై పాట పాడింది నువ్వేనా?’ మొదటి ప్రశ్న వేశాడు హిరణ్యుడు.

‘అవును దేవరా!’

‘ నీ పేరు?’

‘నా పేరు కాటమరాయుడు. కానీ అందరూ వానరాయుడనే పిలుస్తారు.’

‘ఏ రాజ్యం మీది?’

‘తెలియదు దేవరా… ఈ ఏనుగు కొండకు అవతల ఊరికి ఉత్తరాన, దారికి దక్షిణాన వున్నామని తెలుసు అంతే!’ జవాబిస్తున్నప్పుడు అతడి కళ్ళల్లో కొత్త కాంతి. చెక్కు చెదరని ఆత్మ విశ్వాసం. వినమ్రతతో కూడిన వ్యక్తిత్వం. ఆత్మీయ వదనం.

‘నీ తల్లిదండ్రులు ఎవరు?’

‘నా తండ్రి ఆకాశన్న. నా తల్లి భూమమ్మ.’

‘ఎక్కడుంటారు వాళ్ళు?’

‘నా తండ్రి నన్ను దీవిస్తా పైనుంటే నా తల్లి నన్ను కాపాడ్తా కిందుంటుంది.’

‘నీ కులమేది?’

‘నాది మానవ కులం’

‘నీ మతమేది?’

‘నాది మానవ మతం’

వానరాయుడు ఇస్తున్న సమధానాలు హిరణ్యుడికి ఏ మాత్రం నచ్చడం లేదు. అసహనంగా ఉంది.

చదవండి :  పోతన మనుమలు స్తుతించిన 'వరకవి సార్వభౌముడు'

‘నా రాజ్యంలోకి వచ్చి నాతోనే వితండం వాదిస్తా వుండావా… నీ అంత మూర్ఖుడు ఇంకొకడు వుండడు. రాజ సభలో నిన్ను ప్రవేశపెట్టి విచారించి ఉరి తీయిస్తా. అప్పటికిగాని నీకు జ్ఞానోదయం కల్గదు…’ రాజు కన్నెర్ర చేశాడు.

వానరాయుడ్ని బంధించి చీకటి చెరసాల్లో వేశారు. నాలుగు రాత్రులు, ఐదు పగళ్ళు పూర్తయిన తర్వాత బయటకు తీసుకొచ్చారు. ఆవ్యక్తి ముఖంలో ఎక్కడా దిగులు లేదు. బాధలేదు. ఎప్పటిలాగానే వుండాడు. ముఖంలో అదే జీవకళ… అదే చెదరని చిరునవ్వు… అందరికీ ఆశ్చర్యంగా వుంది.

వానరాయుడ్ని రాజసభలో ప్రవేశ పెట్టారు. సభంతా ఉత్కంఠంగా చూస్తోంది. ‘యిప్పటికైనా నేను అడిగిన ప్రశ్నలకు అడిగినట్లుగా సమాధానం చెప్పు… వదిలేస్తాను. లేదంటే నీకు ఉరి తప్పదు…’ హెచ్చరించాడు హిరణ్యుడు.

వానరాయుడు ఏం మాట్లాడలేదు. తలొంచుకొని నిలబడి వున్నాడు.

‘నీకు ఈ పాటలు ఎవరు నేర్పించారు?’

‘మా తాత’

‘ఆయన ఎక్కడున్నాడు?’

‘చనిపోయి చాలా కాలమైంది.’

‘నువ్వు ఎక్కడుంటావు?’

‘దిగువ కొండలో’

‘దిగువ కొండలో ఎవరుంటారు?’

‘పేదవారు’

‘నువ్వు రహస్యంగా శిస్తు చెల్లించకుండా పంట పండిస్తున్నదెవరి కోసం?’

‘వారి కోసమే…’

‘సామంత పాలక… వెంటనే మన సైన్యంతో వెళ్ళి దిగువ కొండలోని పేదవారినందర్ని తీసుకొచ్చి చెరసాలలో బంధించండి…’ హిరణ్యుడు కర్కశంగా ఆజ్ఞాపించాడు.

‘వారి విషయం తర్వాత మాట్లాడదాం. నా ప్రశ్నలకు ఇలాగే సమధానమివ్వు’ మీసాన్ని పైకి దువ్వాడు హిరణ్యుడు. మళ్ళీ ప్రశ్న…

‘రాజ్యమంతా కరువుతో అల్లాడి పోతావుంది. రైతులంతా దుఖ్ఖిస్తావుండారు. వాన చుక్క జాడ లేదు. రాజ్యమంతా కురవాల్సిన వానల్ని నువ్వు బలవంతంగా మోడాల్ని నీ పాటతో తరలించుకొని నీ పంట పైకే కురిపించుకోవడం ఎంత వరకు న్యాయం? – తీక్షణమైన చూపుల్తో ప్రశ్న…

‘తెలియదు దేవరా… నాకు మా తాత నేర్పిన న్యాయం ఒక్కటే. మనిషిలో మానవత్వాన్ని కాపాడుకోవాలని చెప్పేవాడు. మనిషిలో మానవీయత లోపించిన రోజున ప్రకృతి కూడా మనిషికి కనికరించదని చెప్పేవాడు. నేనూ ఆమాటలు నమ్మలేదు. ఆయన ఆచరించి చూపాడు. నేను కేవలం దాన్ని అనుసరిస్తున్నానంతే…’

వానరాయుడి ప్రతి మాటా నమ్మకంతో విశాల ఆకాంక్షలతో చెప్తున్నట్లు వుంది.

సభంతా ఆసక్తిగా వింటున్నారు. ఏం జరగబోతుందా అని చూస్తున్నారు.

‘ఆయనేం చేశాడు?’ ఆసక్తిగా ప్రశ్నించాడు హిరణ్యుడు.

‘ఏనుగు కొండ బండ చుట్టూ వున్న భూమిని సాగు చేశాడు. విత్తనం వేశాడు. బండ పై కెక్కి గొంతెత్తి వాన పాటలు పాడేవాడు. అంతేగానీ ఏ క్షుద్ర పూజలు చేసేవాడు కాదు. ఏ జంతు బలులు ఇచ్చేవాడు కాదు. ఏ కడవ సాంగ్యాలు లేవు. ఏ కప్పల పెళ్ళిళ్ళు చేసేవాడు కాదు.

మొదట్లో పాడి పాడి అలసి కళ్ళు తిరిగి పడిపోయేవాడు. కానీ తన కృషి ఆపేవాడు కాదు. పంటను బిడ్డలా సాకేవాడు. అప్పుడప్పుడు తుంపర చినుకులు కురిసేవి. చివరాఖరికి కొంత పంట పండింది. దాన్ని నాలుగు భాగాలు చేశాడు.

ఒక భాగాన్ని వికలాంగులకు, అనారోగులకు, అనాథలకు… ముఖ్యంగా గుడ్డి వారికి, కుంటివారికి, వ్యాధులు – రోగాల బారిన పడిన వారికి, మానసికంగా బాగోలేక పిచ్చివారిగా జీవిస్తున్న వారి కోసం కేటాయించి ఉచితంగా పంచేవాడు.

రెండవ భాగాన్ని ఆకలితో అలమటించే పేదవారికి, బిడ్డల చేత వెలి వేయబడిన వృద్ధులకు, వితంతువులకు, ఇల్లు విడిచి బయటకొచ్చిన పిల్లలకు, యాత్రికులకు ఉచితంగా పంచేవాడు.
మూడో భాగాన్ని తన పొలానికి కాపలాగా వుండే పక్షులకు, గువ్వలకు, జీవరాశులకు, జంతువులకు, వన్య ప్రాణులకు కేటాయించేవాడు.

చివరగా నాలుగో భాగాన్ని తన ఆహారం కోసం, మళ్ళీ పంట వేసుకోవడం కోసం తీసి పెట్టుకునేవాడు. ఈ నాలుగు కేటాయింపులు ఎప్పుడూ సవ్యంగా జరిగేవి. ఈ లెక్క ఎప్పుడూ తప్పేవాడు కాదు. దీన్ని ప్రకృతి గుర్తించింది. అప్పటి నుంచి ఎప్పుడు ఆయన పాట ఎత్తుకున్నా వాన అదే వచ్చి కురిసేది. పంట పచ్చని విశ్వరూపం చూపేది. ఇదే పద్ధతి నాకు ఆయన నేర్పాడు.

ఆయన కాలంలో కలిసిపోయిన తర్వాత నేను ఆయన మార్గంలో నడుస్తున్నాను అంతే!’ స్థితప్రజ్ఞంగా, స్థిమితంగా, వివరంగా జవాబిచ్చాడు వానరాయుడు.

సభంతా నిశ్శబ్దంగా నివ్వెర పోయి చూస్తూ, వింటూ వుంది.

చదవండి :  కథకుల సందడితో పులకరించిన నందలూరు !

‘మరి మాకిక్కడ వర్షాలెందుకు కురవడం లేదు?’ మరో ప్రశ్నను హిరణ్యుడు సంధించాడు.

‘ఏం చెప్ప మంటారు దేవరా! మనిషితనం యిక్కడ ఎక్కడుంది? మానవీయత ఎక్కడుంది? ప్రతివాడూ ఎదుటివాడ్ని దోచుకోవాలనుకునే వాడే. పాపాలు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి, అధర్మం, దగా, కుట్ర, కుతంత్రం వెరసి వీటి కింద మనిషి ఎప్పుడో చచ్చిపోయాడు. వీళ్ళకు… ఇలాంటి వారికి ప్రకృతి ఎందుకు సహకరిస్తుంది? అందుకే ఇక్కడ వర్షాలు కురవవు. పంటలు పండవు. ఎప్పుడూ కరువులు, కాటకాలు, విద్వేషాలు, విధ్వన్సాలు, యుద్ధాలు. మనిషి వీటి మధ్యనే అంతరించి పోతున్నాడు. ఇది నిజం!

‘నేనిప్పటికి ఇరవై రెండు యుద్ధాలు చేసి తూర్పున దుర్గకోట నుంచి పశ్చిమాన రేనాటిగడ్డ వరకు రాజ్యాలు జయించిన వాడ్ని నేను. నాకే నీవు ధర్మ అధర్మాలు, న్యాయ అన్యాయాలు నేర్పిస్తున్నావా?’ హిరణ్యుడు మరో సారి మండి పడ్డాడు.

వానరాయుడు మౌనంగా నిల్చున్నాడు.

‘నాకు నువ్వేం చేస్తావో తెలియదు. తెల్లారే పాటికి నా రాజ్యమంతా వాన కురవాలి. చెరువులు నిండాలి. బావులు పొర్లాలి. కాల్వలు పారాలి. నువ్వు ఏ పాట పాడ్తావో నాకు తెలీదు. నా రాజ్యమంతా వర్షాలు కురవాలి… ఇదే నా ఆజ్ఞ’ హెచ్చరించాడు కోపంగా హిరణ్యుడు.

‘మా తాత చెప్పిన లెక్క ప్రకారం మీ రాజ్యంలో పండిన పంట నంతటిని నాలుగు భాగాలుగా వాటాలేసి ఆ సిద్ధాంతాన్ని అనుసరించి చూడండి. పాపాలు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, యుద్ధాలు వదిలేసి మనిషి ప్రేమించే తత్త్వాన్ని ఏకీకరించండి. అప్పుడు ఏమైనా ప్రకృతి మీ మాట వింటుందేమో ఎదురు చూద్దాం!’

తన దగ్గర ఇంత కంటే ఇంకేం సమాధానం లేదన్నట్లు స్థిరంగా చెప్పాడు వానరాయుడు.

హిరణ్యుడిలో ఆవేశం… ఆక్రోశం…

‘నువ్వు చెప్తున్నదేమిటి?’

‘సత్యం’

‘నువ్వు చేస్తున్నదేమిటి?’

‘సేవ’

‘రాజ్యమంతా నీ పాటతో వాన కురిస్తే అది సేవ కాదా?’

‘ఆ విషయం నా చేతుల్లో లేనిది’

‘ఇప్పుడేం చేయమంటావు?’

‘నన్ను నా ప్రదేశానికి పంపండి. నా బతుకు నేను బతుక్కుంటాను. నాకు సంతృప్తి నిచ్చేలా జీవిస్తాను.’

‘అది కుదరదు. నిన్ను విడీచిపెట్టను.’

‘అయితే మీ ఇష్టం.’

హిరణ్యుడి కళ్ళు ఎర్రబడ్డాయి. రాజాజ్ఞను ధిక్కరిస్తావా అనే కసి కనిపిస్తా వుండాది. గట్టిగా చప్పట్లు కొట్టాడు. సైనికుడు ‘చిత్తం ప్రభూ’ అన్నట్లు వచ్చి నిల్చున్నాడు. కర్కశమైన శిక్షనేదో అమలు చేయమన్నట్లు మూర్ఖంగా తీర్పునిచ్చాడు.

రాజ సభంతా విషాదంతో ఆలోచనలో పడింది.

* * *
విశాల నీలాకాశం కప్పుకొని వెన్నెల జడివాన కింద ఏకాంతంగా చీకటితో సంభాషిస్తూ తనకు నచ్చిన పాట పాడుకుంటూ స్వచ్చంగా పరవశిస్తూ పరిమళిస్తున్నప్పుడు కాలం గోడల నుంచి వికటాట్టహాసం చేసుకుంటూ దూసుకొస్తున్న రాక్షస మృగ ఆకారం… వేయి కన్నులు, వేయి చేతులు, వేయి తలల వికృత రూపం. ఉక్కు సంకెళ్ళతో వెంటాడుతూ, వేటాడుతూ… అవును అది అచ్చం పడమటి దేశం హిరణ్యుడిలాగే వుంది. ఆగిపోయింది. వానరాయుడి పాట ఆగి పోయింది. మూగబోయింది.

సంధ్య మేఘం ఏడుస్తాంది. హిరణుడ్ని శాపనార్థాలు పెడ్తా బోరు బోరున కన్నీళ్ళు చిందిస్తాంది.

‘నీ రాజ్యంలో తొండలు గుడ్లు పెట్టి, కంప చెట్లు వనాలు వెయ్యాలి. ఎక్కడే గాని చుక్క నీళ్ళు లేకుండా నాలికలు పెరుక్కొని చావాలి. ఏడేడు తరాను నీ రాజ్యంలో కరువు కమ్ముకోవాల…’ అంటూ మేఘం హిరణ్యుడ్ని తిట్టి పోస్తాంది.

వానరాయుడా ఎక్కడుండావు?

నీ పాట వినాలని వస్తిని.

నీవు ఏమై పోతివి?

కట్ట మీద కానుగ చెట్లు వానల్లేక, గాలుల్లేక కొమ్మలన్నీ అల్లాడి పోతా వుండాయి.

మేఘం దుఖ్ఖిస్తావుండాది.

వానరాయుడీ పాట కోసం నిరీక్షిస్తా వుండాది.

(ఈ వారం జన వార్త జులై27- ఆగస్టు2,2008 సంచికలో ప్రచురితం)

రచయిత గురించి

కడపకు చెందిన వేంపల్లి గంగాధర్ సుపరిచితులైన పాత్రికేయుడు, కవి, రచయితాను. వీరు పలు కథలు, వ్యాసాలు రాశారు. నేల దిగిన వాన అనే నవల కూడా రాసారు. రాయలసీమ ఇతిహాసం అనే పేరుతో వార్తలో వచ్చే కాలమ్ వీరిదే. మొలకల పున్నమి, హిరణ్య రాజ్యం,.. మొదలైన ఐదు పుస్తకాలు రాసారు. వీరు కేంద్ర సాహిత్య అకాడమీ నుండి యువపురస్కారాన్ని అందుకున్నారు.

ఇదీ చదవండి!

పోతన మనుమలు స్తుతించిన ‘వరకవి సార్వభౌముడు’

బమ్మెరపోతన మనుమలు కేసన, మల్లనలు. వీరు పోతనకు ముమ్మనుమలనియు తెలుస్తున్నది. వీరు జంటకవులు. విష్ణు భజనానందం, దాక్షాయణీ పరిణయం అను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: