‘విజయ’ సామ్రాజ్యాధీశుడు నాగిరెడ్డి – పులగం చిన్నారాయణ

పాతాళభైరవి… మాయాబజార్… మిస్సమ్మ… జగదేకవీరుని కథ… గుండమ్మ కథ….

ఈ అయిదు సినిమాలూ మనకు రాలేదనే అనుకుందాం. అప్పుడేంటి పరిస్థితి?

జస్ట్! ఒక్కసారి ఊహించుకోండి. కిరీటం కోల్పోయిన ఛత్రపతిలా, జాబిల్లి లేని గగనంలా, పరిమళం తెలియని జాజిపూల మాలలా… తెలుగు సినిమా కనిపించదూ!

ఎవరైనా ఒక్క మేలు చేస్తేనే మనం గుండెల్లో పెట్టి పూజించేసుకుంటాం. మరి ఇంత మేలు చేసిన బి.నాగిరెడ్డి రుణం ఎలా తీర్చుకోవాలి? ఓ విజయా సంస్థనీ- ఓ చందమామనీ – తెలుగు సినిమాకి ఓ సత్సంకల్పాన్నీ – ఓ క్రమశిక్షణనీ అందించిన బి.నాగిరెడ్డికిది శతజయంతి సంవత్సరం.

మరో వందేళ్లయినా ఆయన చిరంజీవే!

b-nagi-reddy
బి నాగిరెడ్డి

విజయం… ఓ సుదీర్ఘ రాత్రి ప్రసవించిన స్వప్నం కాదు. ఎండా వానా కలగలిసి ప్రభవించిన ఇంద్రధనస్సూ కాదు. రక్తాన్ని చెమటగా మరిగిస్తే పుట్టిన ప్రతిబింబమూ కాదు. విజయం అంటే ఓ కళ. ఆ కళలో ఆరితేరిన వ్యక్తి బి.నాగిరెడ్డి.

ఉల్లిపాయల వ్యాపారం చేసినవాడు… వీధుల్లో పోస్టర్లు కట్టించినవాడు… అందంగా శుభలేఖలు అచ్చు వేయించినవాడు… ఊరూరా తిరిగి ఖద్దరు అమ్మినవాడు… తెలుగు సినిమా జెండాపై కపిరాజు ఎలా కాగలిగాడు?

‘పాతాళ భైరవి’లో తోటరాముడు రాజకుమారిని వరించినట్టే, మాంత్రికుణ్ని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించినట్టే, బి.నాగిరెడ్డి కూడా అసాధ్యాలను సుసాధ్యం చేశాడు. అవరోధాల్ని ఫెటీల్మని ఒక్క తన్ను తన్నాడు. తను కష్టాల్ని ఎదురీదిన గజ ఈతగాడు. లక్ష్యం గురి తప్పని విలుకాడు.

‘జగదేకవీరుని కథ’లాగానే బి.నాగిరెడ్డి కథ కూడా ఆసక్తికరమే!

 బి.నాగిరెడ్డి శతజయంతిని పురస్కరించుకుని సాక్షి దినపత్రిక 8-12-12 నాటి ఆదివారం  అనుబంధంలో ప్రచురించిన ముఖచిత్ర కధనమిది. ఆసక్తికరమైన ఆ కధనం యధాతధంగా…ఇందులో నాగిరెడ్డి గారు పెరిగిన ఊరైన పొట్టిపాడు గురించి ప్రస్తావించారు. వారి స్వగ్రామమైన యెద్దులయ్యగారి కొత్తపల్లె పులివెందుల తాలూకాలో ఉంది. నాగిరెడ్డి గారు, బి.ఎన్ రెడ్డి గారు అక్కడే జన్మించారు.

అనగనగా ఓ పల్లెటూరు. కడప జిల్లా పొట్టిపాడు. చుట్టూ కొండలు, పొలాలు, పచ్చని గాలులు, కోకిలలు, పిచ్చికలు, స్వచ్ఛమైన మనుషులు… వీటన్నిటి మధ్యా పెరిగాడు నాగిరెడ్డి. అందుకే తనలోనూ అంతా పచ్చదనం. పచ్చిదనం. నాగిరెడ్డి నాన్న బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి అంటే ఆ ఊళ్లో మహాగౌరవం. ఆయనకు నలుగురు కొడుకులు. రెండోవాడు నాగిరెడ్డి.

నాగిరెడ్డి అమ్మ కొంగు పట్టుకునే తిరిగేవాడు. అమ్మకు పువ్వులు కోసిచ్చేవాడు. గడ్డి కోసిచ్చేవాడు. ఇదంతా చూసి అమ్మ మురిసిపోయేది. నువ్వు ఆడపిల్లగా పుట్టినా బావుండేదిరా అని ముద్దులాడేది.

నాగిరెడ్డికి తెల్లవారుజామున మెలకువ వచ్చిందంటే నాలుగైనట్టు లెక్క. ఆ లెక్క చివరివరకూ తప్పలేదు. పశువుల కొట్టంలోకి వెళ్లి చీపురు పట్టుకుని శుభ్రం చేసేవాడు. గొడ్లతో కాసేపు అటూ ఇటూ వాకింగ్ చేయించేవాడు. సాయంత్రం పూట అయ్యవారొచ్చేవారు. రామాయణం, భారతం, భాగవతం విడమరిచి చెప్పేవారు. నాగిరెడ్డికి పన్నెండేళ్లకే అవన్నీ కంఠతా వచ్చేశాయి.

భారత, భాగవతాలను మించిన డిగ్రీలు, పీహెచ్‌డీలు ఏముంటాయ్?

తాటాకింటికైనా, తాజ్‌మహల్‌కైనా పునాది ఉండాల్సిందే. నాగిరెడ్డికి పొట్టిపాడే పెద్ద పునాది.

నరసింహారెడ్డికి రకరకాల వ్యాపారాలు. మద్రాసులో కమిషన్ వ్యాపారం మొదలెట్టారు. పిల్లల్ని బాగా చదివిద్దామని కూడా తీసుకెళ్లారు.

మద్రాసులో కొత్త జీవితం

స్వాతంత్య్రోద్యమం ముమ్మరంగా జరుగుతున్న రోజులవి. నాగిరెడ్డిలోనూ దేశభక్తి మొదలైంది. స్కూలుకు డుమ్మాకొట్టి మరీ ఉద్యమాల్లో తిరగసాగాడు. తండ్రి మందలించినా తగ్గలేదు. దాంతో తండ్రి మళ్లీ ఊరు పంపేశాడు. అయినా నాగిరెడ్డి మారలేదు. ఊరూరా తిరుగుతూ ఖద్దరు అమ్మేవాడు.

నరసింహారెడ్డి రంగూన్‌లో ఉల్లిపాయల వ్యాపారం మొదలెట్టారు. అక్కడ చూసుకునే మనిషి కావాలి. నాగిరెడ్డిని మించిన దక్షుడు ఎవరు?

నాగిరెడ్డి ఛలో రంగూన్…

అక్కడ మళ్లీ కొత్త జీవితం. వ్యాపారమంటే ఏదో వ్యవహారమన్నట్టు కాకుండా వాటిలోని మర్మాల్ని బాగా ఆకళింపు చేసుకోగలిగాడు.

మళ్లీ మద్రాసొచ్చేశాడు. ఇంట్లోవాళ్లు మంచి పిల్లనిచ్చి పెళ్లి చేశారు. హ్యాపీ లైఫ్.
ఓ పక్క వ్యాపారం. ఇంకోపక్క సంసారం. వీళ్లకు బి.ఎన్.కె. ప్రెస్ కూడా ఉంది. శుభలేఖలు, పుస్తకాలు అచ్చు వేస్తుంటారు. ఇవన్నీ నాగిరెడ్డే చూసుకోవాలి.

ఎందుకంటే అన్నయ్య బి.ఎన్.రెడ్డికి ఈ వ్యాపారాలు నచ్చవు. ఆయనదంతా సినిమా ప్రపంచం. హెచ్.ఎం.రెడ్డితో కలిసి ‘గృహలక్ష్మి’ సినిమా తీశారు. ఏవో తేడాలొచ్చి రోహిణీ సంస్థతో తెగతెంపులు చేసేసుకున్నారాయన. అప్పుడే వాహినీ సంస్థ పుట్టింది. వాహినీ పుట్టుకలో నాగిరెడ్డికీ వాటా ఉంది. అన్నగారి సామర్థ్యం తెలుసు కనుక, కొత్త సంస్థ పెడదామని గట్టిగా వత్తాసు పలికాడు.

చదవండి :  ఆరవేటి శ్రీనివాసులు - కళాకారుడు

రోజంతా వ్యాపారంలో మునిగి తేలినా కూడా సాయంత్రమయ్యేసరికి వాహినీ ఆఫీసులో తేలేవాడు నాగిరెడ్డి. కథాచర్చలు, పాటలు, వాతావరణం… నాగిరెడ్డికి ఆసక్తిగా అనిపిస్తుండేది.

‘సుమంగళి’, ‘భక్తపోతన’ సినిమాలకు నాగిరెడ్డే ప్రచారకర్త. తక్కువ డబ్బుతో ఎక్కువ ప్రచారం ఎలా చేయాలో నాగిరెడ్డికి తెలియకుండానే తెలిసిపోయింది. కరపత్రాలు పంచడం, కటౌట్లు పెట్టించడం లాంటి కొత్త్త ప్రయత్నాలు చేశారు. ‘జెమినీ’వాసన్ లాంటివాడే ఈ పబ్లిసిటీకి ఆశ్చర్యపోయాడు.

నాగిరెడ్డికి అవకాశాల్ని సృష్టించుకోవడమూ తెలుసు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమూ తెలుసు.

నాగిరెడ్డి జీవితంలో ఓ ఊహించని మలుపు! వాహినీ సంస్థకు మెయిన్ పిల్లర్ అయిన మూలా నారాయణస్వామికి ఇన్‌కమ్‌ట్యాక్స్ నోటీసులొచ్చాయి. అర్జెంట్‌గా ఆయనకు డబ్బులు కావాలి. నాగిరెడ్డి రంగంలోకి దిగారు. డబ్బు సర్దుబాటు చేశారు. అలా ‘వాహినీ’ నాగిరెడ్డి అజమాయిషీలోకొచ్చింది.

అప్పటికే వాహినీ స్టూడియో సగం నిర్మాణంలో ఉంది. నాగిరెడ్డికి స్టూడియో ఇంపార్టెన్స్ తెలుసు. అందుకే దాన్ని మొత్తం రెడీ చేశారు.

ఇక్కడ ఇంకో మలుపు.

ఓరోజు నాగిరెడ్డి ప్రెస్‌లో కూర్చుని ఉన్నప్పుడు ఓ బక్కపలుచటి వ్యక్తి వచ్చాడు. నవలలు ప్రింట్ చేయాలని అడిగాడు. ఇద్దరూ మాటల్లో పడ్డారు. ఒకరి వ్యక్తిత్వాలు ఒకరికి నచ్చాయి. ప్రెస్సు పుణ్యమాంటూ ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. అర్జునునికి కృష్ణుడు తోడయ్యాడు.

నాగిరెడ్డి ఏం చేసినా అతని సలహా తీసుకునేవాడు. ఆయనే చక్రపాణి. నాగిరెడ్డి ఆరోప్రాణం. ఇద్దరూ కలిసి సినిమా చేద్దామనుకున్నారు. చేతిలో స్టూడియో ఉంది. చక్రపాణి దగ్గర కథ ఉంది. బ్యానర్ పెట్టాలి. అంతే!

నాగిరెడ్డి పెద్దకూతురి పేరు జయలక్ష్మి. తనంటే ఇంట్లో అందరికీ ప్రాణం. చక్రపాణిక్కూడా! తను పుట్టాకే ఇంట్లో బావిలో తియ్యటి నీళ్లు పడ్డాయి. అప్పటినుంచీ జయ అంటే ఓ సెంటిమెంటు. ఆమె పేరు కలిసొచ్చేలా ‘విజయా ప్రొడక్షన్స్’ అని పెట్టారు. ‘జెండాపై కపిరాజు’ ఎంబ్లమ్!

నాగిరెడ్డికి సినిమా ఫక్తు వ్యాపారమని తెలుసు. అందుకోసం విలువలు వదులుకోకూడదని ఇంకా బాగా తెలుసు. ‘విజయా’వారి సినిమా అంటే పిల్లాపాపా తల్లీతండ్రీ కుటుంబ సమేతంగా కలిసి రావాలి. హాయిగా నవ్వుకోవాలి. టికెట్ కొని సినిమా చూసినందుకు మనసు నిండిపోవాలి. చేస్తే గీస్తే ఇలాగే జనరంజకంగా సినిమా చేయాలని నాగిరెడ్డి-చక్రపాణి ఒట్టుపెట్టుకున్నారు. ఆర్టిస్టుల్ని, టెక్నీషియన్లని నెల జీతానికి తీసుకున్నారు.

మొదటి సినిమా ‘షావుకారు’(1950). ఎన్టీఆర్ హీరో. శంకరమంచి జానకి హీరోయిన్. ఎల్వీ ప్రసాద్ డెరైక్టర్. చిన్న చిన్న మనస్పర్థల వల్ల కుటుంబాలు ఎలా చీలిపోతాయన్నది కథ. ఎక్కడా మెలోడ్రామా ఉండదు. అన్నీ రియల్ క్యారెక్టర్లలాగానే అనిపిస్తాయి. ‘భలే తీశార్రా’ అని పేరొచ్చింది. కాసులు మాత్రం రాలలేదు.

నాగిరెడ్డి-చక్రపాణికి జ్ఞానోదయమైంది. జనానికేం కావాలో అర్థమైంది. తమ అమ్ములపొదిలోంచి ‘పాతాళ భైరవి’ అనే అస్త్రం తీసి వదిలారు. ఎక్కడ తగలాలో అక్కడే తగిలింది. ప్రేక్షకులు జిల్ అయిపోయారు. బాక్సాఫీస్ ఘల్‌ఘల్‌మంటూ మోగింది. సినిమా నచ్చితే ఎంతలా కనకవర్షం కురుస్తుందో అందరికీ తెలిసొచ్చింది. ‘పాతాళ భైరవి’లోని ఎన్టీఆర్‌ని చూశాక మాస్ హీరో ఎలా ఉండాలో సినిమా మేకర్లకు అర్థమైంది.

తర్వాత ‘పెళ్లి చేసి చూడు’. ఇదీ హిట్టే! ఇలాక్కూడా ప్రేక్షకుల్ని నవ్విం చొచ్చా అనిపించింది. విజయావారికి బాక్సాఫీస్ గుట్టుమట్లు తెలిసిపోయాయి.

ఆ ఉత్సాహంతోనే రెచ్చిపోయి ‘చంద్రహారం’ తీశారు. పాతిక లక్షల బడ్జెట్. ఆ రోజుల్లో పది సినిమాలు తీసేయొచ్చు. అయినా రిస్క్ చేశారు. కానీ దెబ్బకొట్టింది. అయినా నాగిరెడ్డి కంగారు పడలేదు. కలవరపడలేదు. జీవితంలో పువ్వులే కాదు, రాళ్లూ ముళ్లూ ఉంటాయని తెలుసు. ఈసారి ‘మిస్సమ్మ’ను పంపించారు. వాళ్ల అంచనా మిస్సు కాలేదు.

ఆ తర్వాత ‘మాయాబజార్’. నిజంగానే మాయచేసి పారేసింది. ఆ మాయ గురించి చెప్పాలంటే ఓ ఉద్గ్రంధమే రాయాలి. మారుమాట లేదు.

‘మాయాబజార్’ నాగిరెడ్డినే కాదు, తెలుగు సినిమానే ఎక్కడో కూర్చోబెట్టింది. ఇప్పటికీ తెలుగు సినిమా అంటే ‘మాయాబజారే’!

చదవండి :  కార్వేటినగరం ఓ మధుర జ్ఞాపకం - నటి టి.జి.కమలాదేవి

ఆ తర్వాత ‘అప్పు చేసి పప్పు కూడు’, ‘జగదేకవీరుని కథ’, ‘గుండమ్మ కథ’… అన్నీ సూపర్‌హిట్లే!

తమిళం, కన్నడం, హిందీ… ఏదీ వదిలిపెట్టలేదు. ఎక్కడ తీసినా, ఏం తీసినా ‘విజయ విహారమే’! ఆ రోజుల్లో విజయా సంస్థలో అవకాశం రావడమంటే గవర్నమెంట్ ఉద్యోగం దొరికినంత గొప్ప. ఎన్టీఆర్, ఎస్వీఆర్, సావిత్రి, రేలంగి, పద్మనాభం లాంటి ఎందరో తారలు నెల జీతం మీద ఆ సంస్థలో పనిచేసి పెకైదిగినవాళ్లే!

మార్కస్ బార్‌ట్లే, పింగళి, ఘంటసాల, గోఖలే, కళాధర్, డి.వి.నరసరాజులాంటి హేమాహేమీలంతా ఈ ‘విజయ’ పునాదులతోనే సినీవిశ్వ విఖ్యాతి గాంచారు.

విజయావారి తొలి సినిమా నుంచి ప్రతి సినిమాలోనూ నటిస్తూ వచ్చిన ఎన్టీఆర్, ‘గంగ-మంగ’లో తనకు వేషం ఇవ్వకపోయేసరికి సన్నిహితుల దగ్గర తెగ బాధపడిపోయారు.

‘భైరవ ద్వీపం’ ఓపెనింగ్‌కి వచ్చిన ఎన్టీఆర్ విజయా స్టూడియో అంతా ఆనందంగా తిరుగాడుతూ, ‘‘రెడ్డిగారూ! మీరు స్వయంగా నిర్మిస్తానంటే, నేను హీరోగా నటిస్తాను’’ అన్నారంటే, ఆయనకు నాగిరెడ్డి అంటే ఎంత ఇష్టమో, గౌరవ భావమో అర్థమవుతుంది.

నాగిరెడ్డి నిర్మాతగా సూపర్‌హిట్. మరి డెరైక్టర్‌గా?

ఆయన తీసింది ఒకే ఒక్క సినిమా. అది కూడా తమిళంలో. ‘షావుకారు’కు రీమేక్. పేరు ‘ఎంగవీట్టు పెణ్’. నిర్మల అనే కొత్తమ్మాయి కథానాయిక. తొలిరోజు షూటింగ్. ఎస్వీఆర్, ఎం.ఆర్.రాధ, రెండు సింహాలు. ఇటేమో చిట్టెలుకలా నిర్మల.

‘‘ఈ అమ్మాయి వీక్‌గా ఉంది. కె.ఆర్.విజయను పెట్టుకోండి’’ అని హూంకరించారు ఎస్వీఆర్.

‘పేకప్’ అని అరిచారు నాగిరెడ్డి. నిర్మలకు తన పని అవుట్ అని అర్థమై, రాత్రంతా ఒకటే ఏడుపు. కానీ తెల్లారే కారొచ్చింది. లొకేషన్‌లో చూస్తే ఎస్వీఆర్ లేరు. ఆ ప్లేస్‌లో ఎస్వీ సుబ్బయ్య ఉన్నాడు. డెరైక్టర్ అంటే అదీ. నాగిరెడ్డా మజాకానా!

నాగిరెడ్డి అప్పటికే టాప్ ప్రొడ్యూసర్. డెరైక్షన్ చేసేంత ఖాళీ ఉందా? ఎందుకుండదు. లైటింగ్ దగ్గర్నుంచీ, కెమెరా యాంగిల్ వరకూ అన్నీ తనే చూడాలి. చెప్పాలి. డైలాగులో ఏమాత్రం తేడా వచ్చినా వందసార్లు రిహార్సల్ చేయించేవారు. కాస్ట్యూమ్స్ సరిగ్గా కుదరకపోతే కయ్యిమనేవారు.

సినిమా బాగా వచ్చింది. నాగిరెడ్డి డెరైక్షన్‌కూ పేరొచ్చింది. నిర్మల… విజయ నిర్మలగా మారింది.

నాగిరెడ్డిలో ఒక్క సినిమా యాంగిలే కాదు… ఇంకా చాలా యాంగిల్స్ ఉన్నాయి. ఆయనో గొప్ప పబ్లిషర్, ప్రింటర్. స్వాతంత్య్రోద్యమ సమయంలోనే ఆగిపోయిన ‘ఆంధ్రజ్యోతి’ వారపత్రికను బి.ఎన్.గుప్తా నుంచి తీసుకుని, మాసపత్రికగా కొన్నాళ్లు నడిపారు. శ్రీశ్రీ, చలం, కొడవటిగంటి లాంటి హేమాహేమీలతో రచనలు చేయించారు.

1947 జూలైలో తెలుగు, తమిళాల్లో ‘చందమామ’ప్రారంభించారు. పేరుకే పిల్లల పత్రిక. కానీ పెద్దలకూ ప్రియమైన పత్రిక అయిపోయింది. 13 భాషల్లో ఈ పత్రిక వెలువడటం ఓ రికార్డ్. అంధుల కోసం ప్రత్యేకంగా బ్రెయిలీ లిపిలోనూ ‘చందమామ’ను అందించారు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌లాంటివాళ్లు నాగిరెడ్డిని ‘చందమామ’రెడ్డి అని పిలిచేవారు. అసలు ‘చందమామ’ అనేది లేకపోతే మనకింత బాల సాహిత్యం దక్కేదా అనిపిస్తుంది.

1966లో స్థాపించిన ‘విజయ చిత్ర’ సినిమా పత్రికదీ ఓ సంచలన పర్వమే. మూడు దశాబ్దాలకు పైగా నిర్విరామంగా వెలువడిన ఈ పత్రికకు ఇప్పటికీ వీరాభిమానులున్నారు. అలాగే నాగిరెడ్డి స్త్రీల కోసం ‘వనితను, యువత కోసం ‘యువ’ను నిర్వహించారు.

ఇక బి.ఎన్.కె. ప్రెస్‌ని ఆయన అభివృద్ధి చేసిన తీరు మరో చరిత్ర! ఆసియాలోనే అతి గొప్ప ప్రెస్‌గా దాన్ని తీర్చిదిద్దారు. ఇండియాలోని సినిమా పోస్టర్లన్నీ దాదాపుగా అక్కడే ప్రింటయ్యేవి. అతిపెద్ద సినిమా పోస్టర్‌గా రికార్డ్ సృష్టించిన ‘కాగజ్ కే పూల్’ ఇక్కడే ముద్రితమైంది.

నాగిరెడ్డి జీవితంలో కీలకమైన అధ్యాయం – విజయ వాహినీ స్టూడియో నిర్వహణ. మూలా నారాయణస్వామి నుంచి వాహినీ స్టూడియో చేపట్టి, దాన్నే 14 ఫ్లోర్లతో ఆగ్నేయాసియాలోనే అతి పెద్దదైన ‘విజయ-వాహినీ స్టూడియోస్’గా విస్తరింపజేయడంలో నాగిరెడ్డి కార్యదీక్ష కనిపిస్తుంది. రకరకాల భాషల సినిమాల షూటింగులతో అప్పట్లో ఆ స్టూడియో స్వర్గాన్ని తలపింపజేసేది. ఎప్పటికప్పుడు మార్పులూ చేర్పులూ చేపడుతూ కొత్త హంగులు అద్దేవారు.

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా ఆయన చేసిన సేవల్ని ఇప్పటికీ భక్తులు గుర్తుంచుకుంటారు. ఇవాళ భక్తులు అనుభవిస్తున్న అనేక సౌకర్యాలు ఆయన ఊహల్లో రూపుదాల్చినవే!

చదవండి :  వైసివి రెడ్డి (ఎమ్మనూరు చినవెంకటరెడ్డి)

నాగిరెడ్డికి చిత్ర నిర్మాణమే కాదు, భనవ నిర్మాణమన్నా చాలా ఇష్టం. విజయా హాస్పిటల్స్, విజయా శేష్‌మహల్ కళ్యాణమంటపం ఆయన ఆధ్వర్యంలో తయారైనవే. అక్కినేని నాగేశ్వరరావు అరవై సినిమాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫంక్షన్ చేసుకుంటానంటే ఆగమేఘాల మీద ‘విజయా గార్డెన్స్’ సిద్ధం చేయించారు. ప్రపంచంలో అత్యధిక షూటింగులు జరుపుకున్న ప్రదేశం ఇదేనంటారు దర్శకుడు సింగీతం.

90 ఏళ్లు వచ్చేవరకూ కూడా ఒక గొడుగు పట్టుకుని మెల్లగా నడుస్తూ ఆ కట్టడాల్ని పరిశీలిస్తుండేవారు.

‘క్రియా సిద్ధిఃస్సత్త్వే భవతి మహతాంనోపకరణే’ అని భర్తృహరి సుభాషితం. మహాత్ములైనవారికి వారి సామర్ధ్యం వల్లనే పనులు సిద్ధిస్తాయి. నాగిరెడ్డి కూడా తన సామర్ధ్యంతోనే వ్యక్తి నుంచి వ్యవస్థ స్థాయికి ఎదిగారు. ‘విజయ’ సామ్రాజ్యాన్ని నిర్మించారు.

– పులగం చిన్నారాయణ

ప్రొఫైల్

జన్మదినం : 1912 డిసెంబర్ 2
స్వస్థలం : పొట్టిపాడు (కడప)
తల్లిదండ్రులు : ఎరుకలమ్మ, బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి
సోదరులు : బి.ఎన్.రెడ్డి (అన్నయ్య), కొండారెడ్డి, రామలింగారెడ్డి (తమ్ముళ్లు)
సంతానం : నలుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు, బి.ఎల్.ఎన్.ప్రసాద్, జయలక్ష్మి, వేణుగోపాల్‌రెడ్డి, విశ్వనాథరెడ్డి, శారద, వెంకట్రామిరెడ్డి
పురస్కారాలు:దాదా సాహెబ్ ఫాల్కే (86), రఘుపతి వెంకయ్య (87)
మరణం : 2004 ఫిబ్రవరి 25

నాగిరెడ్డి ‘విజయ’ చిత్రాలు

తెలుగు

షావుకారు (1950), పాతాళభైరవి (1951), పెళ్లిచేసి చూడు (1952), చంద్రహారం (1954), మిస్సమ్మ (1955), మాయాబజార్ (1957), అప్పుచేసి పప్పుకూడు (1959), జగదేక వీరునికథ (1961), గుండమ్మ కథ (1962), సత్యహరిశ్చంద్ర (1965), సి.ఐ.డి. (1965), ఉమాచండీగౌరీ శంకరుల కథ (1968), గంగ-మంగ (1974), శ్రీరాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ (1976)

తమిళంలో…

పాతాళభైరవి, కల్యాణం పణ్ణిపార్, చంద్రహారం, మిస్సియమ్మ, గుణసుందరి, మాయాబజార్, కడన్‌వాంగి కల్యాణం, మనిదన్ మారవిల్లై, ఎంగవీట్టు పిళ్ళై, ఎంగవీట్టు పెణ్, నమ్‌నాడు, వాణి-రాణి, మీన్డుమ్ సావిత్రి;

కన్నడంలో…

మాయాబజార్, జగదేకవీరన కథే, సత్యహరిశ్చంద్ర, మదువే మాడినోడు;

హిందీలో…

మాయాబజార్, రామ్ ఔర్ శ్యామ్, నన్హా ఫరిస్తా, ఘర్‌ఘర్‌కీ కహానీ, జూలీ, యహి హై జిందగి, స్వర్గ్-నరక్, స్వయంవర్, శ్రీమాన్ శ్రీమతి.

‘కాలం మారింది మనుషులే మారాలి’

నాగిరెడ్డికి బంగారమన్నా, ఆడంబరాలన్నా చిరాకు. ఇంట్లో ఎవ్వరికీ బంగారం కొనేవారు కాదు.

వాహినీ స్టూడియో వైశాల్యం 10 ఎకరాలు. తర్వాత పక్కనున్న రేవతి స్టూడియో, ఇతర స్థలాలు కలిపి మరో 12 ఎకరాలు కొన్నారు. మొత్తం విజయ-వాహినీ వైశాల్యం 22 ఎకరాలు.

నాగిరెడ్డి మద్రాసు దాటి వెళ్లడానికి ఇష్టపడేవారు కాదు. హైదరాబాదులో స్టూడియోకి ఆయన కనుక స్థలం కావాలనుకుని ఉంటే వెంటనే ఇచ్చేసేవారు. అంతెందుకు ‘చందమామ’ ప్రెస్ కోసం తనయుడు విశ్వనాథరెడ్డికి బంజారాహిల్స్ రోడ్ నం.12లో 5 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయిస్తే, నాగిరెడ్డి అడ్డుకున్నారు. అంతా ఒకేచోట ఉండాలనేది ఆయన సిద్ధాంతం.

తిండి విషయంలో పెద్దగా ఆసక్తి ఉండేది కాదు కానీ రాయలసీమ రాగి సంగటిని ఇష్టపడేవారు.

కమ్మ-రెడ్డి వైషమ్యాలు చూపించి నాగిరెడ్డి-చక్రపాణిని విడగొట్టాలని చాలామంది ప్రయత్నించి విఫలమ య్యారు. ఈ విషయమై డి.వి.నరసరాజుతో ఓ కథ తయారుచేయించి తెలుగులో చేయాలనుకున్నారు. చక్రపాణి మరణంతో ఆగిపోయింది. ‘కాలం మారింది మనుషులే మారాలి’ పేరుతో అది ‘విజయచిత్ర’లో సీరియల్‌గా ప్రచురితమైంది కూడా.

రూపాయి లేకుండా హక్కులిచ్చిన రజినీకాంత్

1990లలో రజనీకాంత్ నిర్మించిన ‘వల్లి’ చూసి నాగిరెడ్డి చలించిపోయారు. రజనీకాంత్ ఇంటికి వెళ్లి మరీ హక్కులు అడిగారు. పెద్దాయన మీద ప్రేమతో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా రజనీ హక్కులు ఇచ్చేశారు. దాన్నే నాగిరెడ్డి ‘విజయ’ పేరుతో తెలుగులోకి అనువదించారు. ఆ వచ్చిన లాభాలతో ‘విజయా హెల్త్ సెంటర్’లో ఓ బ్లాక్ నిర్మించి, రజనీకాంత్‌తో ప్రారంభింపజేశారు.

నాయన మా వెన్నంటే ఉన్నట్టుంది: బి.విశ్వనాథరెడ్డి

‘‘మేం ఏ పని తలపెట్టినా మా నాయన మా వెన్నంటే ఉన్నట్టు అనిపిస్తుంది. నాయన తరహాలోనే కథను నమ్మి, విలువలను నమ్మి సినిమాలు నిర్మించాలని మాకూ ఉంది. కానీ ఇప్పటి నిర్మాణ శైలిని చూస్తే భయమేస్తోంది. మూడేళ్ల క్రితం ఓ గుజరాతీ రచయిత దగ్గర మంచి కథ కొన్నా. ‘విజయ’ పద్ధతుల్లో ఉండే కథ ఇది. ఎప్పుడు చేసినా మా సంస్థ పేరు చెడిపోకుండా జాగ్రత్తపడతాను.’’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: