కడప : దేశభాషలందు తెలుగులెస్స అన్నది నిన్నటి మాట. నేడు విశ్వభాషలందూ తెలుగేలెస్స అనాలి! విశ్వభాషగా ఎదిగే శక్తికలిగిన భాషాగా తెలుగుకు అర్హతలున్నాయని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం విశ్రాంత కులసచివుడు ఆచార్య పీఎల్ శ్రీనివాసరెడ్డి అన్నారు.
శుక్రవారం స్థానిక నాగార్జున మహిళా డిగ్రీ కళాశాలలో భారత జాతీయ కళా వారసత్వ పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృ భాషాదినోత్సవ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ప్రాథమిక దశ నుంచి తెలుగు చదువుకునే స్థానంలో సంస్కృతం, హింది వంటి భాషలు ఆదేశంగా రావడం బాధగా ఉందన్నారు. ప్రజల ఆసక్తిని ప్రభుత్వం చంపేయరాదన్నారు. 1968 నుంచి అధికార భాష తెలుగుకావాలని చట్టం చేసినా ఇంతవరకు అమలు కాలేదన్నారు. ఇది నేతల నిర్లక్ష్యంగా చెప్పక తప్పదన్నారు.
భాషా ఒక వారసత్వమే.. అది అంతరించే ప్రమాదం ఏర్పడితే సంస్కృతికే ముప్పని హెచ్చరించారు. అలాంటి పరిస్థితి రాకుండా కాపాడుకోవాలని సభాధ్యక్షుడిగా వ్యవహరించిన సంస్థ పర్యవేక్షకుడు ఎలియాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులకు చిరు వక్తృత్వ పోటీ నిర్వహించారు.
కార్యక్రమంలో న్యాయనిర్ణేతలుగా రచయిత తవ్వా ఓబులరెడ్డి, యలవర్తి మధుసూదన్, రాణి, గౌరిశంకర్ వ్యవహరించారు. వరుస బహుమతులను నందసాయి, ఆస్మా, కార్తీక్ దక్కించుకున్నారు. ఉన్నతశ్రేణి విభాగంలో వినీల, కేవీపీ ప్రసాద్ నిలిచారు.
కళాశాల స్థాయిలో శిరీష విజేతగా నిలవగా రేష్మా, సబీహ ప్రోత్సాహక బహుమతులు దక్కించుకున్నారు. భాషా వికాసానికి ఇలాంటి పోటీ చాలా అవసరమని విద్వాన్ కట్టా నరసింహులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమాన్ని సహాయపర్యవేక్షకుడు, శాస్త్ర శేఖర పాళెం వేణుగోపాల్ పర్యవేక్షించారు.
కార్యక్రమంలో ఇంటాక్ సభ్యులు మొగలిచెండు సురేష్ నగరానికి చెందిన 15 పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.