వేమన శృంగార పద్యాలు

వెర్రి వానికైన వేషధారికినైన

రోగికైన పరమ యోగికైన

స్ర్తీల జూచినపుడు చిత్తంబు రంజిల్లు

విశ్వదాభిరామ వినురవేమ

అతడు పిచ్చివాడు కావొచ్చు, సందర్భానికో వేషం మార్చేవాడు కావొచ్చు, వ్యాధిగ్రస్తుడు కావొచ్చు. చివరికి గొప్ప యోగి కావొచ్చు, వీరున్నారే, వీరు నలుగురూ స్ర్తీలను చూసినప్పుడు మాత్రం ఎంతో కొంత కామ వికారానికి లోనవుతారు అని వేమన లోకానుభవంతో చెప్తున్న మాట.

ఈ పద్యంలో స్ర్తీ సౌందర్య శక్తితో పాటు అన్ని రకాల వారూ స్ర్తీ వ్యామోహానికి గురయ్యే లోకరీతిని చూపిస్తున్నాడు వేమన. వాడు ముందే వెర్రివాడు, ఉన్మత్తుడు, అవివేకి. అయితే మాత్రం ఆడదాన్ని చూడగానే ఆకర్షితుడౌతాడు. అందాన్ని చూసి పిచ్చివాడు మరింత పిచ్చివాడవుతాడన్న మాట! రెండోవాడు వేషధారి. వేషధారి అంటే తన అసలు రూపాన్ని మార్చుకొని, మరో వేషాన్ని ధరించేవాడు.

చదవండి :  ముక్క వంకజూచి ముకురంబు దూరుట

ఇటువంటి వాడు స్ర్తీల కోసమే బహు రూపిగా మారుతున్నాడేమో! ఇక రోగికేం పుట్టింది? ముందే రోగాలతో బాధపడుతున్నాడు. అదంతే! అసలు రోగి కాస్త భవరోగిగా మారిపొయ్యాడు. ఆశ్చర్యమేమిటంటే యోగి కూడా. పైగా పరమయోగి! యోగి దేనికీ చలించడు. మనసును నిగ్రహించి ధర్మ వర్తనకు ఆదర్శంగా నిలిచేవాడు యోగి. మరి అట్లాంటి వాడికి కూడా స్ర్తీల పట్ల మనస్సు చెదిరిందే! ఇదెక్కడి విడ్డూరం! అవును ఈ విడ్డూరం స్ర్తీ ఆకర్షణలో ఉంది. పురుషుడి బలహీనతలో ఉందని వేమన్న ఉవాచ. వేషధారి అంటే కపటి. చిత్తం అంటే మనస్సు అని చెప్పాలా! రంజిల్లు అంటే సంతోషం కలిగించు అని అర్థం. ‘హృదయకంజమున రంజిల్లు నమందాను రాగరస మకరందంబునన్; మది రంజిల్లగదెల్పెదన్ వినుము’ అనేవి ప్రయోగాలు. ‘… చిత్తంబు చలియించు’ (డి.1723-86); ‘చిత్తంబు వదలురా’ (డి.1725-775) అనేవి పాఠాంతరాలు.

చదవండి :  చీకటి తెరలను తొలగించిన వేగుచుక్కలు ..వేమన, వీరబ్రహ్మం

ఎరన్రాడు దాని ఏపార చూచిన

వేకి పుట్టి చాల వెర్రి పట్టు

పల్లు తెరిచి నగిన పట్టు పెన్భూతంబు

విశ్వదాభిరామ వినురవేమ

అందమైన స్ర్తీని చూసి తట్టుకోవడం అంత సులభం కాదంటున్నాడు వేమన. ఆమె అందం ఎట్లాంటిది? ఎట్లాంటిదంటే ఆమె ఎరన్రి చర్మకాంతితో నిగనిగలాడేది. అంతేకాదు అతిశయించిన శరీర సౌష్టవంతో కదిలే లావణ్యవతి. అటువంటి సొగసుకత్తెను చూసి అతనికేదో అయ్యింది. ఏమయ్యింది? వెంటనే జ్వరం వచ్చేసింది. ఆ వెంటనే పిచ్చి పట్టుకుంది. వేకి అంటే జ్వరం. జ్వరం అంటే వైద్య జ్వరం కాదు. పులకరం. ఆయుర్వేదంలో పులకరం అంటే లోజ్వరం.

ఇంతవరకు పరవాలేదు. ఇక తరువాత ఆలకించండి. ఆమె ఎరగ్రా ఉంది, పుష్టిగా ఉంది సరే, ఇప్పుడామె ఒక చేష్టను వదిలింది. అంటే ఆమె నవ్వింది. ఎలా? ముత్యాల్లాంటి పలువరుస కనపడేట్టుగా హసితకాంతులు వెదజల్లింది. ఇక చూస్కోండి పెద్ద భూతమే పట్టుకుందతన్ని. ఒక స్ర్తీ సౌందర్యాన్ని వ్యంగ్యంగా క్రమ వికాసితం చేసిన పద్యమిది. ఆమె అందచందాలూ వాటికి ఒక రసికుడి సద్యః స్పందనలు ఆరోహణ పద్ధతిలో వర్ణితమైనాయి. ఇదంతా బాగానే ఉంది గాని ఇక్కడ వేమన చెప్పదల్చుకున్నదేమిటి? స్ర్తీ సౌందర్యాన్ని చూసి లోబడిపోకు, పిచ్చివాడివైపోకు. దానిని మించిన జీవన పరమార్థం మరోటి ఉందని మరిచిపోకు. అందుకే రసి కుని దృష్టిలో మోహకారకమైన ఆమె అందం వేమన దృష్టిలో మోక్షమార్గ విఘాతంగా పరిణమించే ఉపద్రవం అని సారాంశం. ‘ఎర్ర పాడి దాని ఎట్టెట్టు చూసిన/ వెర్రి బుట్టు మిగుల వేకివచ్చు/ పల్లు విచ్చి నవ్వ పట్టురా భూతంబు’ (డి.1769-593) అనేది పాఠాంతరం.

చదవండి :  కడప జిల్లాలో కథాసాహిత్యం - డా|| కేతు విశ్వనాధరెడ్డి

డా॥ఎన్.గోపి

ఇదీ చదవండి!

హిమధాముడు లేని రాత్రి హీనములు సుమతీ

పికము వనములోన విలసిల్ల పలికిన భంగి ప్రాజ్ఞజనుల పలుకు గులుకు కాకి కూత బోలు కర్మబద్ధుల కూత విశ్వదాభిరామ వినురవేమ …

ఒక వ్యాఖ్య

  1. మనసు సంకల్పము సృష్టి గోచరించును సంకల్పములేనిదే మోక్షాన్ని పొందుతారుబ్రహ్మజ్ఞాన దీనినిబట్టి చూస్తే పూజారులు, మధ్యవర్తులు అవసరం లేకుండా స్థూలదృష్టికి అందేది కాదు అంతరంగ సూక్ష్మ దృష్టి బ్రహ్మజ్ఞాని లక్షణము మనసుకు ప్రశాంతత, నిర్మలత, ఏకాగ్రత కలుగుతాయి; ఆన్ని మతాల సారమూ కూడా అదే అని బ్రహ్మజ్ఞాన ఆసక్తిపరులు తమ బుద్దినీ, మనుసునీ పరమాత్మ యందు నిలిపి మోక్షాన్ని పొందుతారు.

Leave a Reply

Your email address will not be published.

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: