జిల్లా కలెక్టర్ కెవి రమణకు వినతిపత్రం ఇస్తున్న వైకాపా నేతలు
జిల్లా కలెక్టర్ కెవి రమణకు వినతిపత్రం ఇస్తున్న వైకాపా నేతలు

వైకాపా ధర్నా విజయవంతం

కడప: ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలన్ని నెరవేర్చాలని.. లేదంటే ప్రభుత్వ మెడలు వంచి చేయిస్తామని వైకాపా నేతలు పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం కడప కలెక్టరేట్ ఎదుట వైకాపా నిర్వహించిన మహాధర్నా విజయవంతమైంది. ఈ సందర్భంగా పలువురు నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తీరుపైన విమర్శలు గుప్పించారు. సొంతమామనే వెన్నుపోటు పొడిచిన బాబుకు రైతుల్ని, మహిళల్ని నిలువునా ముంచడం పెద్ద విశేషమేమి కాదని పలువురు శాసనసభ్యులు వ్యాఖ్యానించారు. నగర మేయర్ సురేష్‌బాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి జిల్లా పార్టీ పరిశీలకులు జంగా కృష్ణమూర్తి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మేయర్ సురేష్‌బాబు మాట్లాడుతూ ఒక్క కడప నగరంలోనే ఎనిమిది వేల పింఛన్లు తొలగించారని  ఆరోపించారు.

మభ్యపెట్టే కుట్ర

ఈ సందర్బంగా కడప పార్లమెంట్‌ సభ్యుడు వైఎస్‌ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ…రైతులు, మహిళలు రోడ్డెక్కుతారని అనుకున్నప్పుడల్లా ఓ ప్రెస్‌మీట్‌ పెట్టడం, దాన్ని పట్టుకుని వారి భజన బృందం పటాకులు కాల్చడం ద్వారా మభ్యపెట్టే కుట్రకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రైతు రుణమాఫీ హామీ ఇచ్చానని చంద్రబాబు చెప్పడం శుద్ధ అబద్ధమని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేక మేనిఫెస్టోలు విడుదల చేసి అందులో రైతు రుణమాఫీ స్పష్టం చేశారన్నారు. కోటి పైచిలుకు రైతు అకౌంట్లు ఉంటే 22 లక్షలకు కుదించారని, ఐదు వేల కోట్లతో సరిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కొంతమంది అధికారులు టీడీపీ నేతల అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని అటువంటి వారు న్యాయస్థానం ముందు జవాబు చెప్పాల్సి వస్తుందన్నారు.

చదవండి :  వైఎస్‌ను దొంగగా చిత్రీకరించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తే..

వైకాపా పరిశీలకుడు జంగా క్రిష్ణమూర్తి మాట్లాడుతూ చంద్రబాబుకు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడే మహానేత వైఎస్‌ అని, ప్రజలను మభ్యపెట్టి అధికారం చెలాయించే నేత చంద్రబాబు అన్నారు.

కేసు పెట్టి విచారణ జరపాల

బద్వేలు శాసనసభ్యుడు జయరాములు మాట్లాడుతూ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక నెరవేర్చకుండా మోసగిస్తున్న చంద్రబాబుపై కేసు పెట్టి విచారణ జరపాలన్నారు.

మాటభంగం చేసిన బాబుకు ఏ శిక్ష వేయాల

ప్రొద్దుటూరు శాసనసభ్యుడు రాచమల్లు ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ మానభంగానికి శిక్ష ఉందని, మాటభంగం చేసిన చంద్రబాబుకు ఏ శిక్ష వేయాలని ప్రశ్నించారు. గ్రామాలకు వచ్చే టీడీపీ నాయకులను గేట్లకు కట్టి వేయాలని, హామీలు నెరవేర్చాక చంద్రబాబు వచ్చి విడిపించుకునేలా మహిళలు చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

మోసగించే ప్రయత్నం

కడప శాసనసభ్యుడు అంజాద్‌బాష మాట్లాడుతూ ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి ఉంటే వైకాపా 150 స్థానాలు గెలిచి ఉండేదని అధికారం కోసం అబద్ధాలు చెప్పే నైజం జగన్‌ది కాదన్నారు. ధర్నా ప్రకటన రాగానే 50 వేల లోపు రుణమాఫీ అంటూ చంద్రబాబు మోసగించే ప్రయత్నానికి పాల్పడ్డారన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆరాధించిన వ్యక్తి నందమూరి తారక రామారావు, అలాంటి వ్యక్తిని సొంత మామ అనుకోకుండా వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబేనని, ఆయన ప్రజల్ని సైతం క్రమం తప్పకుండా వెన్నుపోటు పొడుస్తున్నారన్నారు.

చదవండి :  జులై 2న కడప విమానాశ్రయం ప్రారంభం కానుందా?

బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది

రాయచోటి శాసనసభ్యుడు శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రుణాలు మాఫీ అని చెప్పి అధికారంలోకి వచ్చాక పంట రుణాలని మాట మార్చిన చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. జగన్‌పై అక్రమంగా 11 కేసులు పెట్టారని, చంద్రబాబుపై ఉన్న ఏ ఆరోపణపైన అయినా చర్చించేందుకు టీడీపీ సిద్ధమా అని ప్రశ్నించారు. సభ్యత్వ నమోదులో కూడా బీమా పేరుతో పింఛన్‌దారులను మోసగిస్తున్నారని ఆరోపించారు. మంగంపేట గనులు మూతబడితే స్పందించని చంద్రబాబు జపాన్‌, సింగపూర్‌లకు కోట్లల్లో ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ అక్కడి నుంచి నిధులు తెస్తాననడం హాస్యాస్పదమన్నారు.

సూచనలు స్వీకరించే గుణం లేని చంద్రబాబు

కోడూరు శాసనసభ్యుడు కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ అసెంబ్లీలో పాలనపై జగన్‌ ఎన్నో సూచనలు చేశారని, విమర్శకులు సైతం మెచ్చుకున్నారని చంద్రబాబు మాత్రం ఆచరించడం లేదన్నారు. మంచి సూచనలు స్వీకరించే గుణం లేని చంద్రబాబు రైతులు, మహిళలను మోసగించారని ఆరోపించారు. అధికారులు ప్రొటోకాల్‌ పాటించడం లేదని ఇలాగే కొనసాగితే జైలుకు వెళ్లక తప్పదన్నారు.

తిరుగుబాటు చేయాల

కమలాపురం శాసనసభ్యుడు రవీంద్రనాథరెడ్డి మాట్లాడుతూ ఏ వ్యక్తో, పార్టీనో పిలుపునిస్తే… సరిపోదని ప్రజావంచక పాలనపై ప్రజలు స్వచ్ఛందంగా తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. హామీలు నెరవేర్చని నేతల అంతు చూడాలని లేకుంటే చంద్రబాబు లాంటి నాయకులు పుట్టుకొస్తుంటారని చెప్పారు. ఆయన ప్రమాణస్వీకారానికి, విదేశీ పర్యటనకు మినహా ఏ శాఖకు నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఐదు రెట్లు పింఛన్లు పెంచామని గొప్పలు చెప్పే చంద్రబాబు బడ్జెట్‌లో వాటి కోసం కేటాయించింది…. కేవలం రూ.1300 కోట్లు మాత్రమేనన్నారు. గతంలో రూ.3200 కోట్లు ఉన్న సంగతి ప్రజలు గుర్తించాలన్నారు.

చదవండి :  కడపజిల్లా పోలింగ్ విశేషాలు

అశోకగజపతిరాజుకు బాధ్యతలు అప్పగిస్తే మంచిది

శాసనమండలి సభ్యుడు నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రజావిశ్వాసం కోల్పోయిన చంద్రబాబు పదవి నుంచి తొలగి అశోకగజపతిరాజుకు బాధ్యతలు అప్పగిస్తే మంచిదన్నారు. నగర మేయర్‌ సురేష్‌బాబు మాట్లాడుతూ జిల్లాలో లక్షా 12 వేల పింఛన్లు ఉండేవని, 40 వేలకు కుదించారన్నారు. రైతు రుణమాఫీపై మాయప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు.

కార్యకర్తలకు, నాయకులకు మాత్రమే

వైకాపా జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అందరికి సంబంధించిందిగా ఉండాలి.. రాష్ట్రంలో తెదేపా కార్యకర్తలకు, నాయకులకు మాత్రమే అన్నట్లు వ్యవహరిస్తోందన్నారు. ఏది చేయవచ్చో… అదే వైసీపీ చెబుతుందన్నారు. హామీలు అమలు చేయని చంద్రబాబును గద్దె దింపే వరకు ప్రజలు విశ్రమించకూడదన్నారు.

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ గూడూరు రవి మాట్లాడుతూ హామీలను చంద్రబాబు అటకెక్కించారని ఆరోపించారు. తామెవరమైనా పనిమీద వెళ్లితే మీరు ఏ పార్టీ అని అధికారులు అడగడం ఈ ప్రభుత్వ పాలనకు అద్దం పడుతున్నదన్నారు.

కలెక్టరేట్ ఎదుట జరిగిన ఈ ధర్నాలో వైకాపా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇదీ చదవండి!

బుగ్గవంక

బుగ్గవంక రిజర్వాయర్ సొగసు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: