సాహిత్య ప్రయోజనం – రాచమల్లు రామచంద్రారెడ్డి

నిత్యజీవితంలో సాధారణంగా యెంతో సహజమైన వ్యావహారిక భాషే మాట్లాడుతూంటారు. కానీ, వాళ్ళే కలం పట్టుకొనేటప్పటికి, శైలి కొరకు చేసే ప్రయత్నంలో, అనగా చెప్పేదేదో బాగా చెప్పాలనే ప్రయత్నంలో తమ సహజమైన వ్యావహారిక భాష మరిచిపోతుంటారు. సాధారణంగా రచయితలు పనిగట్టుకొని సాధనచేసి యేదో ఒక రచనా విధానాన్ని అలవరచుకుంటారు. దాన్నే శైలి అంటాం. శైలిలో గాంభీర్యమూ, ఉదాత్తతా, వేగమూ, ఉద్రతీ లాంటి గుణాలు బలీయంగా వున్నప్పుడు, ఆ శైలి పాఠకులను ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేసి భళీ అనిపించుకుంటుంది.

యీ వ్యాసాలలో దాదాపు అన్నీ సాహిత్యానికి సంబంధించినవే. ప్రధానంగా సాహిత్య ప్రయోజనానికీ, సాహిత్య శిల్పానికీ సంబంధించినవి. సమాజానికీ, సాహిత్యానికి గల సంబంధం గురించి అత్యంత స్పష్టమైన ఖచ్చితమైన అవగాహన వున్న వాడుగానీ సాహిత్య ప్రయోజనం గురించి యింత సూటిగా, యంత అసందిగ్ధంగా చెప్పలేడు. సాహిత్యం పాఠకుని సంస్కారాన్ని పెంచే ప్రక్రియలో సంస్కారం పెరుగుతున్న కొద్దీ చట్టరూపమైన న్యాయమూ, నీతీ తరిగిపోవాలి. ఇప్పుడు న్యాయచట్టం చేసేపని అప్పుడు సంస్కారమే చేస్తుంది. ఈనాడు మనం మన ఆడవాళ్ళతో సహగమనం చేయించకుండా వుండడానికి, ఒక చట్టం అవసరంలేదు అని సమాజ పరిణామానికీ, సాహిత్యానికి గల సంబంధాన్ని కుటుంబరావుగారు 1987 లోనే చెప్పగలిగినారు. నాకు తెలిసినంతవరకు, సాహిత్యాన్ని a great civilizing medium అన్న గురజాడ తర్వాత, సాహిత్య ప్రయోజనం గురించి యింత స్పష్టమైన అవగాహనగలవాళ్ళు తెలుగులో మరొకరు కనిపించరు. సాహిత్యంలో అభ్యుదయకరమైన మార్పు వచ్చినప్పుడు దాన్ని కొంతమంది వ్యతిరేకించినారు. దానికి మూల కారణమేమిటో కుండబద్దలు కొట్టినట్లు కుటుంబరావుగారే చెప్పగలరు. అభ్యుదయ సాహిత్వం ఒక ప్రబలమైన సామాజికశక్తి. సామాజిక శక్తులు పెరగటం సమాజాన్ని దోపిడీ చేసేవారికి రుచించదు.

అలాగే, సాహిత్య నిత్య నూతనత్వం యొక్క అవసరాన్ని ప్రతి తరంవాళ్ళూ తమకు కావలసిన సాహిత్యాన్ని తాము సృష్టించు కోవాలి అనే వాక్యంలో సూత్రీకరించగల వాళ్ళూ, శంకరాచార్యుడయేది, ఆయన తాత అయేది, గడచిపోయిన యుగాల సాహిత్యాన్ని ప్రమాణంగా చెప్పే వాడు వంచన చేస్తున్నాడని రూఢిగా చెప్పవచ్చు, అంటూ శ్రుతి స్మృతి అంటూ పురాణేతిహాసాది యావత్తు పాత సాహిత్యంలోని ప్రమాదం యేమిటో గొంతెత్తి హెచ్చరించగల వాళ్ళూ అరుదు. .. జీవితపు మారుమూలలలోకి వెలుగు తీసుకరాలేనిది సాహిత్యమే కాదు అని ఒక కుటుంబరావుగారే సాహిత్యాన్ని నిర్వచించగలరు. సాహిత్యానికీ, శిల్పానికీ గల ప్రగాఢ సంబంధాన్ని గుర్తించడంలో కూడా కుటుంబరావుగారు యెప్పుడూ సందేహాలకు లోనుగాలేదు. అభ్యుదయ రచన అన్నట్లయితే అందులో కళాదృష్టి, శిల్ప నైపుణ్యమూ అవసరంలేదనీ, శ్రామిక వర్గం గురించి రాస్తే ఎట్లారాసినా అభ్యుదయ రచనే ననీ, రకరకాల అపోహలు రచయితల్లో వున్నట్లు కనిపిస్తూంది అనీ, సాహిత్యాభిలాషను కల్మషంగా మార్చిన మరొక తరగతి వాళ్ళున్నారు. వాళ్సు ప్రత్యేక రాజకీయ వాదాలకు సాహిత్యాన్ని వాహనంగా ఉపయోగించాలని అభిలషించేవారు. వీరిలో కమ్యూనిస్టులూ ఉన్నారు, కమ్యూనిస్టు వ్యతిరేకులూ ఉన్నారు అనీ నిర్భయంగా చెప్పడానికి ఆయన యేనాడూ వెనకాడలేదు. అంటే, రాజకీయాల అంటు లేకుండా సాహిత్యం మడి కట్టుకోవాలని కాదు. సాహిత్వం ఒక స్వతంత్ర సామాజిక శక్తి. అది యే రాజకీయాలకు పరిచారిక కాకూడదు.

చదవండి :  సంవేదన (త్రైమాసిక పత్రిక) - ఏప్రిల్ 1969

సాహిత్యం రాజకీయాల నుండి ఉత్తేజం పొందవచ్చుగాక, రాజకీయాలకు ప్రోత్సాహం యివ్వవచ్చుగాక, రాజకీయ ప్రచారమే సాహిత్యంకాదు. కానీ, సాహిత్యంలో సమాజ జీవితమంతా ప్రతిఫలిస్తుంది గనుక రాజకీయాలు కూడా ప్రతిఫలించక తప్పదు. సాహిత్యకారులు తమ రాజకీయ విశ్వాసాలకు కళారూపం యివ్వడమూ తప్పదు. డిక్టేటర్ల నిరుద్యోగమూ,లాకౌట్లూ.. యుద్ధాలూ.. వీటిని గురించి విస్పష్టమైన అభిప్రాయాలు వెలిబుచ్చే అధికారం రాజకీయవాదులకే ఉన్నట్టూ, కళాకారులకు లేనట్టూ మాట్లాడటం మూర్ఖత్వం. సాంఘిక దోపిడీ చలాయించేవాళ్ళు యిటువంటి మూఢత్వాన్ని బలపరుస్తున్నారు. రాజకీయాలూ, రాజకీయ సిద్ధాంతాలూ సాహిత్యాన్ని నిర్ణయించకపోతే మరి సాహిత్యానికి గీటురాయి యేమిటి? సాహిత్యకారుడుగా నాకు జీవితం ప్రమాణం. సిద్ధాంతంకోసం జీవితాన్ని వక్రంగా చిత్రిస్తే ఆ రచన ఉత్తమ రచన ఎట్లా అనిపించుకుంటుందో నాకు యేనాడూ అర్థం కాలేదు యిది కుటుంబరావుగారి ప్రగాఢ విశ్వాసం. మరి అభ్యుదయ దృక్పథంతో ఆయన యెలా అంతగా సమైక్యం కాగలిగినాడంటే, అభ్యుదయ దృక్పథం అనేది వాస్తవ జీవితం నుండి ఉద్భవించిందే గనుక జీవిత వాస్తవం ప్రబోధించేది అదే గనుక; కులమూ, మతమూ, సంప్రదాయమూ మొదలైనవి జీవితం మీద కప్పిన మాయముసుగులను ఛేదించి, జీవిత వాస్తవాన్ని నగ్నంగా దర్శించడమే అభ్యుదయ దృక్పథం గనుక.

కుటుంబరావుగారి వచనంలోని సూటిదనమూ, నిరాడంబరత్వమూ యెవరైనా గుర్తించవచ్చు, కానీ, ఆయనకొక శైలి ఉన్నట్లు చాలామంది గుర్తించరు. యెందు కంటే rheoric అనేదే శైలి అని చాలా మందికున్న అపోహ. కుటుంబరావు గారికి rhetorical శైలికీ చుక్కెదురు. కనుక ఆయనకు శైలీ స్పృహే లేదని చాలామంది అనుకుంటారు. సాధారణంగా రచయితలు పనిగట్టుకొని సాధనచేసి యేదో ఒక రచనా విధానాన్ని అలవరచుకుంటారు. దాన్నే శైలి అంటాం. శైలిలో గాంభీర్యమూ, ఉదాత్తతా, వేగమూ, ఉద్రతీ లాంటి గుణాలు బలీయంగా వున్నప్పుడు, ఆ శైలి పాఠకులను ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేసి భళీ అనిపించుకుంటుంది. డి.యం.కె. నాయకుల వాగ్దాటిలాగా rhetoric అంటే అదే. అది మామూలు మనుషులను ఉక్కిరి బిక్కిరి చేస్తూంది గనకనే దాన్ని యెవరైనా సులభంగా గుర్తించగలరు. rhetoric కాని శైలీ భేదాలను గుర్తించడం కొంత కష్టం. లాలిత్యమూ, మార్దవమూ, పదునూ, బిగువూ మొదలైన గుణాలు కలవాటిని ప్రసన్నతా, సుబోధకతా, అరమరికలులేని అమాయకత్వమూ, అడంబరంలేని సరళత్వమూ లాంటి గుణాలను గుర్తించడం మరీ కష్టం. నిజానికి rhetorical శైలిపట్ల ఈనాడు నాగరిక ప్రపంచ మంతటా విముఖత్వం యేర్పడింది. ఉద్బోధకూ, అధిక్షేపణకూ తప్ప దాన్ని సాధారణంగా యెవరూ వాడరు. ఆ శైలి కృత్రిమమైందని యీనాటి సంస్కారవంతుల అభిప్రాయం.

ఒకనాడు రాజులూ, నవాబులూ ధరించిన కిరీటాలూ, భుజకీర్తులూ చమ్కీకోట్లూ వేసుకొని యీనాడు బజార్లో తిరగడానికి మనం సిగ్గుపడినట్లే, ఆ శైలిలోని ఆడంబరాన్నీ, పటాటోపాన్నీ ఆధునిక రచయితల సంస్కారం ఆమోదించదు. అందువల్లనే యింగ్లీషు రచయిత లెవ్వరూ యీనాడు మెకాలే లాగా, జాన్సన్ లాగా, రస్కిన్ లాగా, న్యూమన్ లాగా రాయడం లేదు. Rhetorical అనే మాటకు (దాని మొదటి అర్థంతోపాటు) false, showy, inflatd, artificial, insincere అనే అర్థాలు కూడా యేర్పడినాయి. ఈనాటి యింగ్లీషు రచయితల్లో rhetoric లేకపోయినా శైలి అనేది వుంది. ఆధునిక శైలి ఆడంబరం లేకుండా బరువుగా ప్రసన్నంగా వుంటుంది. పాఠకులను చకితులను చేయకుండా, ఆహ్లాదం కలిగిస్తుంది. మృదంగ సంగీతంలాగ తన్మయత్వం కలిగించకుండా, చెప్పే విషయం మీద శ్రద్ధాసక్తులు కలిగిస్తుంది. బెర్టండ్ రసెల్, సామర్సెట్ మామ్ లాంటి వాళ్ళలో ఆధునిక శైలిని స్పష్టంగా గుర్తించవచ్చు. ఆధునిక శైలిలో ముఖ్యమైన గుణం కృత్రిమత్వం లేక పోవడం. అంటే, నిత్య జీవితంలోని వ్యవహారానికి దగ్గరగా వుండడం. వీలైనంత వరకు నిత్య వ్యవహారంలోని మాటలే వాడటం, వీలైనంతవరకు నిత్య వ్యవహారంలోని వాక్య నిర్మాణ ద్ధతులే అవలంబించడం. నిత్య వ్యవహారంలోని భాష సాధార ణంగా పేలవంగా వుంటుంది గనుక ఆ పేలవత్వాన్ని పరిహరించడానికి కొంత శ్రద్ధ తీసుకోవడం.. యిది శైలిని గురించి ఆధునికుల అవగాహన. ఆధునిక శైలీ భేదాలు యెన్ని వున్నా యీ అవగాహనకు లోబడే వుంటున్నాయి.

చదవండి :  రాయలసీమ సాంస్కృతిక రాయబారి

మామూలు మనుషులు నిత్య వ్యవహారంలో మాట్లాడుకునే భాష యెల్లప్పుడూ పేలవంగానే వుండదు. ఉదాహరణకు మా వూరి వీధి కొళాయిలదగ్గర కొట్లాడుకునే ఆడవాళ్ళ శైలిని పేలవం అని జాన్సన్ కూడా అనలేడు. బైబిల్‌ను మించిన అర్థపుష్టి, కమ్యూనిస్టు మానిఫెస్టోను మించిన జలపాతపు దూకుడూ ఆ శైలిలో వుంటాయి. అసంస్కారుల ఆవేశ బలంవల్ల వచ్చిందే ఆ శైలి. కానీ, ఆవేశం లేనప్పుడు కూడా నిత్యవ్యవహారంలోని భాష వట్టి చొప్పదంటులాగా పుండనక్కర లేదు. సాధువూ, సంస్కారవంతుడూ అయిన వ్యక్తి సహజంగా మాట్లాడే భాష ప్రసన్నంగా వుంటుంది. ఆ వ్యక్తి మిత్రులతో మాట్లాడే భాష మరింత ధారాళంగా, సరసంగా ఉంటుంది. ఆ వ్యక్తి మితభాషి కూడా అయితే ఆ భాష బిగువుగా, గంభీరంగా కూడా వుంటుంది. ఆ వ్వకి విద్యావిజ్ఞాన సంపన్నుడే , తనకు కరతలామలకమైన విషయం గురించి మాట్లాడేటప్పుడు, మాటలకు తడుము కోవడమూ, తడబాటూ లేకుండా అప్రయత్నంగా మనసులో కలిగిన భావాలు అప్రయత్నంగానే వాగ్రూపం ధరిస్తాయి గనుక, ఈ భాషకొక ప్రవాహ గుణం, ఒక ధారాశుద్ధి లభిస్తుంది. అదే కుటుంబరావుగారి శైలి. కుటుంబరావుగారి భాష పచ్చి వ్యావహారికమని అందరికీ తెలుసు. కానీ, చాలామంది గుర్తించని విషయమేమిటంటే, అంత శుభ్రమైన, అంత సౌష్టవమైన వ్యావహారికం రాయగలవాళ్ళు తెలుగు భాషలో మరొకరలేదు. రచయితలందరూ తమ నిత్యజీవితంలో సాధారణంగా యెంతో సహజమైన వ్యావహారిక భాషే మాట్లాడుతూంటారు.

కానీ, వాళ్ళే కలం పట్టుకొనేటప్పటికి, శైలి కొరకు చేసే ప్రయత్నంలో, అనగా చెప్పేదేదో బాగా చెప్పాలనే ప్రయత్నంలో తమ సహజమైన వ్యావహారిక భాష మరిచిపోతుంటారు. శైలి కొరకు ప్రయత్నం చెయ్వని వాళ్ళకు కూడా ఒక self-conciousness వచ్చి నెత్తి మీద కూర్చొని తమ సహజ వ్యావహారిక భాషకు వాళ్ళను దూరంచేస్తుంది. self-conciousness జయిస్తే తప్ప స్వచ్చమైన వ్యావహారిక భాష , ముఖ్యంగా వ్యవహారంలోని నుడికారమూ, వాక్య నిర్మాణ పద్ధతులూ చేతికందపు. యెంతో రచనా సామర్థ్యమూ, తద్వారా ఆత్మ విశ్వాసమూ గలవాళ్ళు దాన్ని జయించవచ్చునేమో గాని, కుటుంబరావుగారి పరిస్థితి అది కాదు. ఉద్యోగం కొరకు ఇంటర్వ్యూకు వెళ్ళిన అభ్యర్థికీ, పెండ్లిచూపుల పరీక్షకు నిలబడిన ఆడపిల్లకూ self-conciousness వుంటుంది. కాని, కుమ్మరికీ, కమ్మరికీ, చాకలికీ, మంగలికి తమ తమ వృత్తులు చేసుకునేటప్పుడు అది యే కోశానా వుండదు. తాము చేసే పనిలో భేషజం అనేది అణుమాత్రం కూడా లేనివాళ్ళకు self-conciousness అనేది అంటదు. దాన్ని జయించడం అనే సమస్యే వాళ్ళకు కలగదు. కుటుంబరావుగారి తత్వం సరిగా అలాంటిదే. ఆయన వ్యక్తిత్వంలో కృతిమత్వం యెక్కడాలేదు కనుకనే, ఆయన రచనా వ్యాసంగంలో భేషజం యే కోశానాలేదు గనుకనే, ఆయనకు అంత స్వచ్చమైన వ్యావహారిక భాష అబ్బింది. అది ప్రయత్న పూర్వకంగా స్వాధీనం చేసుకున్న దికాదు. ఆయన వ్యక్తిత్వంలో నుండి సహజంగా ఉద్భవించింది. కుటుంబరావుగారి అభ్యుదయ దృక్పథం కూడా అంతే. శాస్త్రీయమైన ఆలోచనా విధానామూ, మార్క్సిస్టు సామాజిక దృక్పథమూ, మానవతా వాదమూ ఆయన వ్యక్తిత్వంలో భాగాలు. ఇవన్నీ కలిసే అభ్యుదయ దృక్పథం ఏర్పడుతుంది.

చదవండి :  అమెరికా జీవనమే సుఖమయమైనది కాదు - సొదుం గోవిందరెడ్డి

తన విశ్వాసాలు తన వ్యక్తిత్వపు లోతులనుండి ఉద్భవించినవే. కాకపోతే అవి కేవలం పుస్తకాల నుంచి సంగ్రహించినవే ఐతే, పచ్చనోటు లాంటి కథలుగానీ, వారసత్వం లాంటి నవలలుగానీ ఆయన రాయగలిగేవాడు కాదు. అభ్యుదయ సాహిత్యాన్ని ఒక ఉద్వమంగా చూసినప్పుడు, అందులో కుటుంబరావుగారి కంటే కార్యకారులూ, ఉద్యమ నిర్వహణ దక్షులూ అనేకులు పుండవచ్చు. కానీ అభ్యుదయ సాహిత్యమంటే యేమిటో, దాని పరమార్థం యేమిటో, దాని స్వరూప స్వభావాలు యేమిటో ఆయన కున్నంత స్పష్టమైన, నిశ్చితమైన అవగాహన బహుశా మరెవరికీ లేదేమో అనిపిస్తుంది. అభ్యుదయ సాహిత్యాన్నీ వివరించడంలోగాని, అవసరం వచ్చినప్పుడు సమర్థించడంలోగాని, ఆభ్యుదయ వ్యతిరేకమైనదాన్ని సూటిగా యెదిరించడంలోగాని, సూటీ పోటీ మాటలతోనే మన్ను కరిచేటట్లు చేయడంలోగాని ఆయనకు ఆయనే సాటి. ఈ సామర్థ్యం ఆయనకు కేవలం తెలివితేటలవల్లా, పాండిత్వంవల్లా వచ్చింది కాదు. అభ్యుదయ దృక్పథం ఆయన రక్తంలో జీర్ణమైంది. ఆ దృక్పథంతో ఆలోచించడం ఆయన స్వభావంలో భాగమైంది. యీనాడు కొంచెం నిజాయితీ, కొంచెం మానవతా దృష్టి వున్న వ్యక్తి యెవరైనా ఆధునిక విజ్ఞానాన్ని కొంత వరకైనా అర్థం చేసుకుంటే అభ్యుదయవాది కాక తప్పదు. ఈ మూడు గుణాలూ నిండుగా వున్నప్పుడు అభ్యుదయ దృక్పథం అనేది ఆ వ్యక్తి స్వభావంలో భాగమౌతుంది. కుటుంబరావుగారిలో జరిగింది అదే.

– రాచమల్లు రామచంద్రారెడ్డి (రారా)
(రాచమల్లు రామచంద్రారెడ్డి (రారా) రచించిన
సారస్వత వివేచన పుస్తకం నుంచి…)

ఇదీ చదవండి!

samvedana magazine

సంవేదన (త్రైమాసిక పత్రిక) – ఏప్రిల్ 1968

పుస్తకం : సంవేదన ,  సంపాదకత్వం: రాచమల్లు రామచంద్రారెడ్డి , ప్రచురణ : యుగసాహితి, ఏప్రిల్ 1968లో ప్రచురితం. చదవండి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: