సీమ బొగ్గులు

సీమ బొగ్గులు (ముందు మాట) – వరలక్ష్మి

ఈ పెద్దాయన నన్ను వెదుక్కుంతూ వచ్చి తన కథల పుస్తకం గురించి చెప్పి దీన్ని విరసమే ప్రచురించాలని, నేనే ముందుమాట రాయాలన్నప్పుడు ఆశ్చర్యపోయాను. విరసం సరే, నేను ముందుమాట రాయడం ఏమిటి సార్ అన్నా. కార్యదర్శివి కదా అన్నాడు (ఇది లాస్టియర్ మాట). మొహమాట పడుతుంటే విరసం ప్రచురణకు అర్హత ఉంటేనే చూడండి అన్నాడు. చదవడానికే చాలా రోజులు తీసుకున్నాను. రెండు మూడు కథల్లో మార్పులు సూచించాను. చాలా శ్రద్ధగా విన్నారు. కథలు రెండు మూడు సార్లు సవరించారు. ఆ వయసులోనూ కొత్తను స్వీకరించే మనసు, చాలా తెలిసినా ఎవరివద్దైనా నేర్చుకునేతత్వం గొప్పగా అనిపించాయి. చాలా కాలం నుండి రాస్తున్నా చాలా తక్కువగా సెలెక్టివ్ గా రాసిన కథల గురించి ముందు మాటలో కొంత పరిచయం చేసాను గానీ.. కథలు చదవండి, ఇంత కాలం ఈయన యెక్కడున్నారు అని నాలాగే మీరూ ఆశ్చర్యపొతారు. తాము రచయితలమని చెప్పుకోని అరుదైన రచయితలు, కొన్ని కథలు అలా మెరిపించి ఆ తర్వాత లోకం గుర్తింపు నుండి కనుమరుగైన వాళ్ళు రాయలసీమలో ఉన్నారు మరి. పట్టుకొవాలి. నిన్ననే ప్రెస్ నుండి బైటికొచ్చిన ఈ బుక్ అరుణతార స్టాల్ లో ఉంది. కొంచెం ముందే వచ్చి ఉండాల్సింది కాని కుదరలేదు. త్వరలో బుక్ షాప్స్ లో అందుబాటులోకి వస్తుంది.
ఈలోగా వీలైతే ముందు మాటలోని కొన్ని భాగాలు చూడండి.

రాయలసీమ బతుకు పోరాటం

సీమ బొగ్గులురతనాలసీమ కాదు, రాళ్లసీమ కాదు, కరువున కాలి బొగ్గైన సీమ జీవితాలు ఇవి. ఈ జీవితాల గురించి సీమ రచయితలు చాలా రాసారు. ఏముంటుందక్కడ? కరువే కదా! అన్నంత తేలిక కాదు. మనిషి ప్రకృతితో పడే ఘర్షణ చిన్నవిషయం కాదు. జీవధార ఆవిరవుతుంటే జీవితాన్ని నిలబెట్టుకోవడం అంత తేలిక కాదు. వ్యక్తిగా, కుటుంబంగా, సమూహంగా పడే తండ్లాటలో అన్ని భావోద్వేగాలతో మనిషిగా గెలవడం, మనిషిగా ఓడిపోవడం గురించి చెప్తాయి ఈ కథలు. ఈ అనుభవం చేతనే రాయలసీమ కథకులకు జీవితపు లోతు తెలుసు. గాఢత్వం తెలుసు. అయినా మనుషుల గురించి కదా, ఎంత రాసినా చెప్పవలసిందేదో మిగిలే ఉందనిపిస్తుంది. కాలంతో పాటు చేసే ప్రయాణమూ ఉంటుంది. రాయలసీమ ప్రయాణమూ, ప్రయత్నమూ, ఘర్షణా ఒక దగ్గర ఘనీభవిస్తాయి. ఇంత సాంకేతికత అభివృద్ధి చెందీ మానవులు గుక్కెడు నీళ్లకు తనకలాడ్డమా అన్న ప్రశ్న దగ్గరికొస్తాయి.

చదవండి :  సొప్పదంటు ప్రెశ్నలు (కథ) - వేంపల్లి రెడ్డినాగరాజు

మూడున్నర దశాబ్దాల క్రితం రచయితగా సాహిత్య ప్రపంచం ముందుకొచ్చిన దేవిరెడ్డి వెంకటరెడ్డి ఇన్నేళ్ల తర్వాత తన కథా సంకలనాన్ని ‘సీమ బొగ్గులు’ పేరుతో తీసుకురావడం ఇప్పడు మనమనుకుంటున్న సందర్భంతో కలిసింది. ఆయన కథలన్నీ ఎంతో పొందికగా, సూటిగా చిక్కగా అల్లిన వచనంతో ఉంటాయి. కథా నిర్మాణంలో ఒక్క వాక్యం కాదు కదా, ఒక్క పదం కూడా అదనంగా పడినట్లు కనపడదు. 60లు, 70ల నాటి ప్రగతిశీల రచయితల శైలిని వొంటబట్టించుకున్నారు కాని ఎందుకో 83 నాటికి గానీ మొదటి కథ ఈయన రాయలేదు.

నిరుపేద కుటుంబం నుండి వచ్చిన నేపథ్యం కూడా వెంకటరెడ్డిగారిని బక్కజీవుల గురించి రాసేలా చేసుండవచ్చు. మొదటి కథలోనే అంగడి గుమాస్తా బతుకును పరిచయం చేస్తారు. దరిద్రాన్ని అవలీలగా భరించొచ్చనుకున్న ప్రేమజంటకు సంసార జీవితం ఊహల నుండి నేలమీదికి దించుతుంది. ‘బక్కెద్దులు సోగకు కట్టబడినాయని’ అర్థమవుతుంది భర్తకు. జీవితం కంపుకొడుతున్నదని అంటూ ‘ఆర్ద్రంగా చెప్పటానికి నేనేం రచయిత్రిని’ కానంటుంది భార్య. ఈ వాస్తవంలోనే ఒకరిలోఒకరు లీనమయ్యే బాంధవ్యమూ ఎక్కడో ఉంది. ఈ కథ తర్వాత మళ్లీ రాయడానికి 21 ఏళ్లు ఎందుకు పట్టిందో గాని, నేరుగా ఎండిన రాయలసీమ నేల మీద కొత్త చిగుల్లేత్తే జీవితాల్లోకి ఆయన కథ ప్రవేశించింది. ఇవి నిజంగా కొత్త పంటను వాగ్దానం చేసే చిగుర్లేనా అంటే కాకపోవచ్చు. కాని మనుషులు జీవిస్తారు. ఈ జీవించే మనుషులే రేపటికి కొనసాగింపు. అందుకే వెంకటరెడ్డిగారి కథల్లో ఆత్మహత్యలుండవు.

చదవండి :  శ్రుతి (కథ) - డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి

పంటలెండిపోతే జీవితం ఆగిపోతుందా? దెబ్బతిని లేచి నిలబడ్డానికి మనిషి జీవితంతో చేసే పోరాటం తప్పనిసరిగా ఉంటుంది. సేద్యం వాసనే వద్దనుకొని పట్నం వచ్చి రెక్కలకష్టం నమ్ముకునే రైతుబిడ్డ మాధవ, రాబోయే తరానికి ఈ నరకయాతన వద్దనుకొని కూతుర్ని మోటారు మెకానిక్కుకు ఇవ్వాలనుకునే సుభద్ర, పిల్లల చదువు కోసమే పట్నం దారిపట్టి బేల్దారి పనిలో దిగిన సోమిరెడ్డి, గ్రామీణ సంప్రదాయపు కట్టుబాట్లు ఛేదించి కులాంతర వివాహం చేసుకునే భారతి ఎవరి పరిధిలో వాళ్లు భవిష్యత్తు మీద ఆశను నిలుపుకుంటారు. దశాబ్దాలుగా కాలువ నీళ్ల కోసం ఎదురుచూపులే మిగిలి, ప్రకృతి దోబూచులాటలో ఓడిపోయి అమ్ముకుందామన్నా భూములు కొనేవాడు లేని స్థితి ఉంటే, ఇక చాలు ఈ రైతు బతుకు అనుకోకుండా ఎలా ఉంటారు? కాలువ కోసం చేసిన ఉద్యమంలో దెబ్బలు తిని, జైలుపాలై, అప్పులు, అవమానాల పాలై వ్యవస్థ కౄరత్వాన్ని చూసిన ‘బుద్ధుడు’ రైతు జీవితమే వదిలేసుకొని బజ్జీల బండి పెట్టుకొని బతకడం ఒక వైపు నుండి చూస్తే విషాదమే. కాని నష్టమంతా లెక్కేసి ఇక్కడ తేలాక ఇక నిబ్బరంగా ఉందంటాడు.

నీళ్లను మళ్లించే ఆధునిక సాంకేతికత ఇటువైపు చూడకపోయినా రాజ్యం మాత్రం మారుమూల పల్లెల్లోకి విస్తరించింది. అందరి చేతుల్లో కార్డులు పెట్టి అందరికీ బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించింది. కాలువ నీళ్లు వస్తాయా రావా? రావాలంటే ఏం చేయాలి? గిట్టుబాటు ధర వస్తుందా రాదా? దళారీ మార్కెట్‌ వ్యవస్థను ఎలా ఎదుర్కోవాలి? రాయలసీమలో ఈ తరహా చర్చ ఉండదు. సేద్యం మొదలయ్యేటప్పటి నుండి పంట రుణం, బీమాల చుట్టూ రైతులు తిరుగుతారు. దొంగ పాస్‌బుక్కులకు రుణాలు, ఇన్సురెన్సులు పొందే వాళ్లు ఒక పక్క అయితే, రైతుగానే గుర్తింపులేని కౌలుదార్లు ఒకవైపు. బ్యూరోక్రసీ పై నుండి కింది దాకా అన్ని అవలక్షణాలతో రైతు వద్దకు వచ్చేసింది. నీళ్లు మాత్రంరావు. ముప్ఫై ఏళ్ల క్రితం కథా రచన ప్రారంభించి ఒక గెంతుతో ఈ కాలంలోకివచ్చి తన కథని నిలిపే ప్రయత్నం చేసారు వెంకటరెడ్డిగారు.

చదవండి :  అమెరికా జీవనమే సుఖమయమైనది కాదు - సొదుం గోవిందరెడ్డి

ఈ మధ్య కాలంలో కథా నిర్మాణం, కథన పద్ధతిలో ఎన్నో ప్రయోగాలు వచ్చాయి. చాలా మార్పులకు లోనయ్యాయి. ముఖ్యంగా అనేక ప్రజాస్వామిక ఉద్యమాల ప్రభావం వల్ల భాష చాలా మారింది. మాండలికాలకు యాస కూడా జతయ్యింది. అయితే ప్రాంతీయ భాషలో రాసే చాలా మంది రచయితలు యాస మాత్రమే ప్రయోగించి అద్భుతమైన మాండలిక పదాలను పట్టుకోలేకపోతున్నారు. అట్లా చూసినప్పుడు ఈ తరం వాళ్లకు తెలియని ఎన్నో మాండలిక పదాలు ఈ కథల్లో నిండుగా ఉన్నాయి. ‘మితువు’, ‘బెలుకు’, ‘దేఖీలు’, ‘నట్టుదొగే పని’, ‘ఉడ్డా’, ‘గాటిపాట’, ‘ముక్కట్లు’, ‘వలపక్రం’, ‘మళిగ’ -ఇవి మచ్చుకు కొన్ని. వాక్యాల్లో, కథనంలో సొగసు ఉంది. అలవోకగా చదువుకుంటూ పోతే ఇది మన నుండి వేగంగా జారిపోతుంది. అందుకని ఒక్కోచోట ఒక్కోవాక్యం కవితా పాదాల్లా చదువుకోవాలనిపిస్తుంది. ముందుమాటలో సాధారణంగా చేసే ముఖస్తుతి కాదిది. భాష, చిక్కటి వ్యక్తీకరణ నుండి ఈ కథలకు వచ్చిన శక్తి గురించే చెప్పడం.

ఇంకో విషయం కూడా చెప్పాలి. రాయలసీమ కథకులు, ముఖ్యంగా 80 లలో రచనలు చేసినవాళ్లు కరువుతో పాటు ఫ్యాక్షన్‌ను చిత్రించకుండా పోరు. వెంకటరెడ్డిగారు వాటి జోలికి పోలేదు. ఈ అనుభవం ప్రత్యక్షంగా లేని ప్రాంతం, వ్యక్తులు తగినంతగా సీమలో ఉన్నారు. ఒకే మూసలో రాయలసీమను చూసేవాళ్లకు ఇది కొత్తగా అనిపించవచ్చు.

రచయిత జీవితానుభవం రిత్యా, సుదీర్ఘ సాహిత్యానుబంధం రిత్యా చూస్తే రాయవలసిన వాటికన్నా ఈయన చాలా తక్కువ కథలు రాసారనిపించకపోదు. ఇటీవలే రాసిన కథను చూసినా మరిన్ని మంచి కథలు రాసే శక్తి మెండుగా ఉంది. కాబట్టి ఇప్పటి రాయలసీమ ఉద్యమ సందర్భంతో, మొత్తంగా నేటి సంక్షుభిత కాలంతో మన రచయిత రాయబోయే కథలు సంభాషిస్తాయని ఆశిద్దాం.

– పి.వరలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: