సూతకం (కథ) – తవ్వా ఓబుల్‌రెడ్డి

రెడ్డేరోళ్ల ఆదిరెడ్డి ఇంటిముందు బ్యాండు మేళాలు ఉన్నట్టుండి మోగడంతో జనం సందడిగా గుమిగూడినారు. రేపు దగ్గరలోని టవున్లో ఆదిరెడ్డి కొడుకు విష్ణూది పెళ్లి. పెళ్లికి ముందు జరిపే దాసర్ల కార్యం ఆదిరెడ్డి ఇంట్లో జరుగుతోంది. దాసర్ల కోసం కుండలూ, బానలు తెచ్చి రామస్వామి దేవళం ముందు ఆవరణలోని వేపచెట్టు కింద పెట్టి సున్నపు నీళ్లు కలిపిన గుడ్డతో వాటిపై తెల్లటి పట్టెలు గీస్తున్నాడు కుమ్మరిశెట్టి. ఆడోళ్లంతా అక్కడ చేరి సాంగెపు పనులు చక్కబెడుతూ చతుర్లు విసురుకుంటున్నారు. సారేకాలు, నవ్వులతో దేవళం దగ్గర సందడి సందడిగా ఉంది.

పెళ్లి ఆదివారం నాడు కావడంతో మామూలుగా శనివారం నాడు జరుపుకునే దాసర్లు పెళ్లికి ముందురోజే పడినాయి. రెండు సాంగ్యాలూ వరుస దినాల్లో రావడమనేది చుట్టపక్కాలకు సౌకర్యమే అయినా ఆదిరెడ్డి మాత్రం పెళ్లి పనులతో సతమతమైపోతున్నాడు. దాయాదులు జమకూడినా ఇలా కనపడి అలా మాయమైపోతున్నారే తప్ప ఫలానా పని పూర్తిగా చేసినట్టు ఆదిరెడ్డికి అనిపించటం లేదు.

సూతకంరెడ్డేరోళ్ల ఇళ్లల్లో మంచి జరిగినా, చెడ్డ జరిగినా దగ్గరుండి అన్ని సాంగ్యాలను నడిపించే పెద్దదిక్కైన చెన్నమ్మ మాంచి పెళ్లి సమయంలో పాలెమాలడంతో ఆదిరెడ్డిలో దిగులు రేపుతోంది. ఊపిరి సలపని పెళ్లి పనులు ఆ దిగులును అణచేస్తున్నాయి. చెన్నమ్మ కుటుంబానికి, ఆదిరెడ్డి కుటుంబానికి దాయాది సంబంధం ఉంది. చెన్నమ్మకు ఎనభై ఏళ్లు దాటి ఉంటాయి. జీవితాంతం ఇటు ఇంట్లో పనుల్నీ, అటు చేలల్లో పనుల్నీ ఒంటిచేత్తో చేసినట్టుగా సునాయాసంగా చేస్తూ వచ్చింది చెన్నమ్మ. యాభై మంది కూలోళ్లకు ఒక్కతే సంగటి గెలికి గంపలకు వేసేదనీ, కపిల పారకంతో పదెకరాలకు నీళ్ల మడవలు కట్టేదనీ, చెన్నమ్మ గురించి ఊళ్లోవాళ్లు చెప్పుకుంటూ ఉంటారు.

పెళ్లిళ్లల్లో, ఇతర శుభకార్యాల్లో ఆచారాల ప్రకారం సాంగ్యాలను నడిపించడంలో చెన్నమ్మకు ఎవరూ సాటిరారని కూడా పేరు. ఉబ్బసంతో మంచం పట్టిన చెన్నమ్మకు వారం కిందట పాలెమాలిక ఎక్కువ కావడంతో కొడుకు సుబ్బారెడ్డి టవున్లోని ఆసుపత్రిలో చేర్పించినాడు. పెళ్లి పనుల్లో తిరుగుతూనే ఆసుపత్రికి పోయి చెన్నమ్మను పలుకరించి వచ్చినాడు ఆదిరెడ్డి. వయసు పైబడిన చెన్నమ్మ ఆరోగ్య పరిస్థితి కొంచెం సుమారుగా ఉందనీ, ఆసుపత్రిలో ఉంచడం వల్ల బాగా మెరుగయ్యే అవకాశాలు లేవనీ, ఇంటికి తీసుకువెళ్లి మందులు వాడుతూ ఉండాలని డాక్టరు చెప్పడంతో ఈరోజు పొద్దున్నే చెన్నమ్మను ఇంటికి తోడ్కొని వచ్చినారు. ఆదిరెడ్డి భార్యాకొడుకులతో పోయి చెన్నమ్మను వాళ్ల ఇంటి వద్ద పలకరించి వచ్చినాడు. చెన్నమ్మ ఆరోగ్య పరిస్థితి రామలక్షుమ్మలో ఆందోళన రేపుతోంది.

‘చెన్నమ్మకు పెళ్లి సమయంలో ఏమైనా అయితే?’… ఈ ఆలోచనతో రామలక్షుమ్మ గుండె వేగంగా కొట్టుకుంది. ఇంటికి పోయిన తర్వాత భర్తతో, కొడుకుతో ఏకాంతంగా ప్రస్తావించింది. చెన్నమ్మ ఆరోగ్యం విషయంలో ఆదిరెడ్డి ఇప్పటిదాకా మేలెంచుతున్నాడే కాని కీడెంచలేదు. భార్య రేకెత్తించిన అనుమానం పెనుభూతమై ఒక్కసారిగా ఆదిరెడ్డిని కుదిపేసింది.

లోగడ ఏ నలభై ఏళ్లప్పుడో ఇదే చెన్నమ్మ చిన్నకొడుకు పెళ్లి జరుగుతూ ఉంటే రేపు పెళ్లి అనంగా ఇట్లనే ఆదిరెడ్డి ‘అబ్బ’ (నాన్నకు నాన్న) చనిపోవడం, ‘సూతకం’ అని పెళ్లి వాయిదా వేసుకుని నెలరోజుల తర్వాత చేసుకున్న విషయం ఆదిరెడ్డికి కొంచెం కొంచెం గుర్తుంది. అయితే ఇప్పటికిప్పుడు చెన్నమ్మకు ప్రాణాపాయం ఉండకపోవచ్చునని డాక్టర్ అన్నట్టుగా చెన్నమ్మ కొడుకు చెప్పిన మాటలు ఆదిరెడ్డిని కొంత స్థిమితపర్చినాయి. పేరుకు రెడ్డేరింటివాళ్లయినా ఆదిరెడ్డివాళ్ల రెడ్డేరితనం ఒకప్పటి మాట. ఆదిరెడ్డి ముదెబ్బ (నాన్న నాన్నకు నాన్న) మానందిరెడ్డి ఐదూర్లకు రెడ్డితనం వెలగబెట్టినాడు.

మానందిరెడ్డి కొడుకు చిన్నపరెడ్డి హయాంలో కోర్టువాజ్యంలో రెడ్డితనం ఇతరులకు పోయింది. తర్వాత రెండు తరాలు గడిచేటప్పటికి వారసులు పెరిగిపోయినారు. కాలం గడిచే కొద్దీ భూములు, ఇళ్ల పంపకాలతో రెడ్డేరింటివారందరూ మామూలు రైతులుగా మారిపోయినారు. ఊర్లో సగం కుటుంబాలు తమ దాయాదులవే. ఇక చుట్టుపక్కల ఊళ్లలో కూడా దాయాదులు చాలామందే ఉన్నారు. ఆదిరెడ్డి, భార్య రామలక్షుమ్మ వారసత్వంగా వచ్చిన నాలుగెకరాల భూముల్లోనే వ్యవసాయం సాగిస్తూ, ఉన్న ఒక్క కొడుకు విష్ణూను బాగానే చదివించుకున్నారు.

చదవండి :  నెమిలి కత (కథ) - వేంపల్లి రెడ్డినాగరాజు

న్యూయార్క్‌లో పెద్ద కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. విష్ణూకు మంచి ఉద్యోగం రావడం, అదీ అమెరికాలో కావడంతో అనేక సంబంధాలతో పెళ్లిళ్ల పేరయ్యలు ఎగబడినారు. ఆ సంబంధాలలో తాసీల్దార్లు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఇసుక కాంట్రాక్టర్లూ, బ్రాందీ షాపుల ఓనర్లతోపాటు ఒకటీ రెండు టీచర్లు, లెక్చరర్ల కుటుంబాల సంబంధాలు కూడా ఉన్నాయి. రెండు వారాల సెలవు దొరకడంతో నచ్చిన సంబంధం కుదుర్చుకుని, పెళ్లి కూడా చేసుకుని అమెరికాకు తిరిగి వెళ్లాలనే ప్లానింగ్‌తో వచ్చినాడు విష్ణూ.

రోజుకు రెండు చోట్ల చొప్పున పెళ్లిచూపులు సాగినాయి. మూడు రోజుల కల్లా ఇసుక కాంట్రాక్టర్ గురివిరెడ్డి సంబంధం ఖాయం అయింది. అమ్మాయి ఫర్వాలేదు. బీటెక్ దాకా చదివింది. పెళ్లి చేసుకున్న తర్వాత వారం రోజుల్లో అబ్బాయి ఉద్యోగానికి వెళ్లిపోయినా, తిరిగి రెండు నెలల్లోగా రప్పించి అతనితో పాటు కూతుర్ని అమెరికాకు పంపే ఏర్పాట్లు చేస్తానని అంగీకారం కుదుర్చుకున్నాడు గురివిరెడ్డి. గురివిరెడ్డి అభీష్టాలూ, సూచనల మేరకే ఆదిరెడ్డి పెళ్లి పనులను చక్కబెడుతున్నాడు.

రామస్వామి దేవళం దగ్గర కుమ్మరిశెట్టి సిద్ధం చేసిన మట్టి బానలను పెళ్లింటికి తీసుకువచ్చే వేడుక మొదలయ్యింది. దుప్పటి మూలలను సలుగురూ నాలుగువైపుల పట్టుకుని ఉంటే ఒకరు కర్రతో దుప్పటి మధ్యభాగాన్ని ఛత్రంలా పెకైత్తి పట్టుకున్నారు. ఆ ఛత్రం కింద మట్టి బానలను పట్టుకున్న ఆడవాళ్లు తప్పెట్లు, బ్యాండు మేళాలతో ఆదిరెడ్డి ఇంటికి చేరినారు. బ్యాండు మేళగాళ్లు తమ వాయిద్యాలను ఆపి ఆదిరెడ్డి ఇంటెదురుగా ఉన్న రచ్చబండపై కూర్చున్నారు.

పెళ్లి పనుల గురించి ఆదిరెడ్డి ఎవరెవరితోనో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు. మాదిగోళ్లు తప్పెట్లను చంకలకు తగిలించుకుని ఆదిరెడ్డి చుట్టూ నిలబడి తలలు గీరుకోబట్టినారు. వాళ్ల వాలకాన్ని గమనించిన ఆదిరెడ్డి తన బావమరిదిని పిలిచి వీళ్లకు కావాల్సింది చూడమంటూ ‘మందు’ పోసే పనిని అప్పగించినాడు. సిగరెట్టు తీసి వెలిగించుకుని గుండెల నిండా పొగ పీల్చి గాలిలోకి వదుల్తూ ఆలోచనగా ఆకాశంలోకి చూస్తున్నాడు ఆదిరెడ్డి.

దాసర్లుగా ఉండేందుకు పొలిమేర దగ్గరి గొల్లపల్లె నుండి కొందరు మనుషులు వచ్చినారు. తెల్లారినప్పటి నుంచి ఏమీ తినకుండా ఒక్కపొద్దు ఉన్నందువల్లనేమో వాళ్ల ముఖాలు రవ్వంత వాడబారినా తెల్లటి అడ్డపంచెలు కట్టుకుని భుజాలపైన తువ్వాల్లేసుకుని, మెడలో మల్లెపూల దండలతో ఆకర్షణీయంగా కనబడుతున్నారు. వాళ్లంతా షామియానా కింద కుర్చీల్లో కూర్చుని సెల్‌ఫోన్లలో వీడియో గేములు ఆడుకుంటున్నారు.

టవున్నుంచి ట్రక్కులో వచ్చిన మంచినీళ్ల క్యాన్లను ఇంటి మొగశాలలో ఒకవారగా పెట్టిస్తోంది రామలక్షుమ్మ. పెద్ద పెద్ద బ్యాగులతో టాటా సుమోలో వచ్చిన వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లూ గొడుగులతో, ఫ్లాష్ లైట్లతో ఇళ్లంతా హడావుడిగా తిరుగుతున్నారు. నల్లమల కొండ నుంచి తెచ్చిన ఆరెకొమ్మను దీపపు కుదురుగా చుడుతున్నాడు చాకలి వీరన్న.

‘మా పిల్లప్పుడు కట్టవల్లో యాడ సూసినా ఆరె చెట్లే ఉండె. బావుల కాడ మర్రి ఆకులు కోసుకోనొచ్చి పెళ్లిళ్లకు ఇస్తరాకులు కుట్టుకుంటాండిరి. రెడ్డేరింటి అండాలూ, గంగాళాలతోనే ఎయ్యి మందికి బువ్వొండుతాండిరి. పరమాన్నమూ, సిత్రాన్నమూ, పప్పన్నమూ ఊరందరికీ పెట్టి, ఆయగాళ్లకు, అడుక్కునేటోళ్లకూ గంపలకు పోసి పంపుతాండిరి. ఆ సలుగు పాటలు ఏమైనాయో? ఆ అల్లెంగుండ్లు ఎట్టబోయినాయో? ఏమైనా ఊళ్లో పెళ్లి సందడి బయట సేసుకుంటే ఎట్టొచ్చాది?’ దాసర్లతో అన్నాడు చాకలి వీరన్న. నిజమే అన్నట్టుగా తలలు ఊపినారు దాసర్లు.

చదవండి :  తెలుగు పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ

‘ఈ షామియానాలూ, ఈ కుర్సీలూ, బెంచీలూ ఇయ్యన్నీ ఎవరు ఏచ్చాన్నెరు? ఎద్దలకొండన వాసాలు కొట్టకొచ్చి గుంజలు పాతి పైన కానిగాకు, బందెరాకు కప్పి పెద్ద పెద్ద పందిళ్లు ఏచ్చాండిరి. పెళ్లికొచ్చినోళ్లందరూ ఆ పందిళ్ల కింద మంచాలేసుకుని సల్లంగ కూకుంటాండిరి! ఎక్కడెక్కడి సుట్టాలు ఊళ్లోకి రాగానే పందిరి చూసి పెళ్లి ఇల్లు కనుక్కోని సక్కంగ వచ్చాండిరి!’

ఆదిరెడ్డి సెల్‌ఫోనులో ఫంక్షన్ హాలు అద్దె, అడ్వాన్సు గురించి మాట్లాడుతూ ఉన్న మాటలు చాకలి వీరన్న చెవిలో పడినాయి. అప్రయత్నంగా ముక్కున వేలేసుకున్నాడు చాకలి వీరన్న.

‘ఏందబ్బా.. సోమీ.. హాలు కోసం లచ్చె రూపాయలు అడ్మాంచు ఇచ్చినావ్! అద్దె ఎంతబ్బా?’ ఆశ్చర్యంగా అడిగినాడు. ఆదిరెడ్డి ఫోను పెట్టేసిన వెంటనే మళ్లీ ఫోను రావడంతో తన ఆశ్చర్యాన్ని ముఖంలో అలాగే నిలుపుకుని ఆదిరెడ్డి వైపే చూస్తున్నాడు చాకలి వీరన్న.

ఆదిరెడ్డి ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నాడు.

‘లచ్చెన్నర అడ్వాంసు ఇచ్చినా ఇంగా లెక్క.. లెక్క అంటాండరు.. ఏంది? వంటలు బెమ్మాండంగా ఉండాల. ఏదీ తక్కువ రాకూడదనే రెండున్నర లచ్చెలకు మీకు ఒప్పిచ్చింది. బాగా సేయర్రి. రేపు పెళ్లి అయిపోతానే మిగిలిన లచ్చ ఇచ్చాలే..!’ వంటవాళ్లకు చెప్పినాడు ఆదిరెడ్డి.

‘వంటల కోసం రొండున్నర లచ్చెలా. ఆ కాలంలో బంగారుకూ, గుడ్డలకే కర్చు. ఈ కర్చులన్నీ యాడియ్. ఏమి కాలమొచ్చెరా దేవుడా!’ ఆశ్చర్యంగా దాసర్ల వైపు చూస్తూ అన్నాడు చాకలి వీరన్న. వీరన్న మాటలను ఆదిరెడ్డి కూడా విన్నాడు. ‘వంటలకు, ఫంక్షనాల్‌కు నాలుగు లచ్చెలైతాంది. బంగారుకేమి? గుడ్డలకేమి? బస్సులు, కార్ల బాడిగలకేమి? వీడియోలకూ, పోటోలకేమి? పాట కచ్చేరికేమి? లాడ్జీల్లో రూము బాడిగలకేమి? అందరికీ అడ్వాంచులే ఐదు లచ్చెల దాకా ఇచ్చినా!’ చాకలి వీరన్న వైపు చూస్తూ లెక్కలు చెబుతున్నట్టుగా అన్నాడు ఆదిరెడ్డి.

పెళ్లి ఖర్చుల కింద ఇచ్చిన అడ్వాన్సు మొత్తం లక్షల్లో తేలుతూ ఉండటంతో ఆదిరెడ్డికి చెన్నమ్మ ఆరోగ్య పరిస్థితి గుర్తుకు వచ్చింది.

‘ఆ ఎన్ని లచ్చెలు పెడ్తే ఏమిలే! గానిగలోదే గంటెడు. ముప్పయ్యో… నలయ్యో గుంజిండ్ల్యా!’ అన్నాడు, అప్పుడే అక్కడికొచ్చిన తొగటోళ్ల వెంకట్రాముడు.

‘ఎవరిచ్చాండరు.. బావా ముప్ఫై.. నలభై… వాళ్లు ఇచ్చిన లెక్క పెళ్లి కర్చులకే సాలక తన్నుక లాడ్తాంటే!’ వెంకట్రాముని మాటలకు సమాధానంగా అన్నాడు ఆదిరెడ్డి.

‘ఊళ్లో అందరూ అనుకుంటాంటే నేను అంటాండలే సోమీ! అయినా ఇచ్చేది వాళ్లు. తీసుకుండేది నువ్వు. నడిమద్దెన నాకెందుకులే పెద్దరెడ్డీ?’ అన్నాడు వెంకట్రాముడు.

వెంకట్రామునికి ఇరవై మగ్గాల దాకా ఉన్నాయి. ఊరి చేనేత సంఘంలో డెరైక్టర్‌గా ఉంటున్నాడు. మంచికీ, చెడ్డకు ఆదిరెడ్డితో కలుస్తూ ఉంటాడు. పెళ్లికి మేలైన పట్టుచీరలనూ, బట్టలనూ దగ్గరుండి తీయించినాడు. కొడుక్కు ఇస్తున్న కట్నం గురించి ఊళ్లోవాళ్లు గొప్పగా చెప్పుకుంటూ ఉండటం ఆదిరెడ్డికి లోలోపల సంతోషం కలిగిస్తోంది.

డ్రాయరు జేబులోంచి కొత్త సిగరెట్ ప్యాక్ ఒకటి తీసి సిగరెట్టును వెంకట్రామునికి అందించి, తానూ ఒక సిగరెట్‌ను రెండు వేళ్ల మధ్య పెట్టుకున్నాడు ఆదిరెడ్డి.

వెంకట్రాముడు అగ్గిపెట్టె తీసి ముందుగా ఆదిరెడ్డి సిగరెట్ ముట్టించి తర్వాత తన సిగరెట్ ముట్టించుకున్నాడు. అది చూసి రచ్చబండ మీదున్న మేళగాళ్లు ఒక్కొక్కరుగా వచ్చి ఆదిరెడ్డి చుట్టూ నిలబడినారు. సిగరెట్ ప్యాక్ ఖాళీ అయింది.

చెన్నమ్మ ఆరోగ్యం గురించి వెంకట్రామునితో ప్రస్తావించినాడు ఆదిరెడ్డి. అలాంటి భయం పెట్టుకోవద్దనీ, దాసర్ల కార్యం మొదలుపెట్టమనీ, తాను వెళ్లి చెన్నమ్మ పరిస్థితి విచారించి వస్తానని వెంకట్రాముడు అక్కడ నుండి కదలినాడు. మరో సిగరెట్ ప్యాక్‌ను బయటకు తీసినాడు ఆదిరెడ్డి.

దేవుని గదిలో పూజాసామగ్రి సిద్ధం చేసింది రామలక్షుమ్మ. ఆరె కొమ్మతో చేసిన దీపపు కుదురును తీసుకువచ్చి ఇంట్లో చివరి గదిలో మూలన పాతినాడు చాకలి వీరన్న. నేతిని పోసి వత్తిని ఉంచిన వెడల్పాటి మూకుడు లాంటి ఎర్రమట్టి ప్రమిదను పట్టుకుని బయటకు వచ్చింది రామలక్షుమ్మ. ఇది గమనించిన ఆదిరెడ్డి దాసర్లను కార్యానికి పురమాయించినాడు. దాసర్లు తలవాకిట్లో వరసగా నిలబడినారు. చుట్టాలందరూ గుమిగూడినారు. ఆదిరెడ్డి చిన్నాన్న కొడుకు ఒకరు తలకు తువ్వాలును చుట్టుకుని, ప్రమిదను అరచేతిలో ఉంచుకున్నాడు. రామలక్షుమ్మ ప్రమిదను వెలిగించింది. ప్రమిదను పట్టుకున్న వ్యక్తి ‘గోవిందా’ అంటూ వెనక్కి నడుస్తూ ఉంటే దాసర్లు కూడా ‘గోవిందా’ అంటూ చివరి గదిలోని దీపపు కుదురు వైపునకు నడుస్తున్నారు. వెలుగుతున్న ప్రమిదను జాగ్రత్తగా దీపపు కుదురు మీద ఉంచినారు.

చదవండి :  ఎదురెదురు ! (కథ) - సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

పెళ్లికొడుకు దీపానికి మొక్కుకుని దేవుని గదిలో టెంకాయ కొట్టి పూజ చేసినాడు. ఆదిరెడ్డి కూడా భార్యతో కలిసి పూజలు చేసినాడు. దాసర్లకు విస్తరాకులు పరిచినారు. పరమాన్నం, పప్పన్నం, చారు, మజ్జిగలతో పెళ్లికొడుకుతో పాటు దాసర్లు ‘ఒక్కపొద్దు ’ చెల్లించినారు. ఈలోగా వంటవాళ్లు గ్యాసు పొవ్వులమీద వంటలను సిద్ధ్దం చేసినారు. భోజనాలకు పిలవడానికి పెళ్లికొడుకు బ్యాండు మేళగాళ్లతో ఊళ్లోకి బయలుదేరినాడు. రామలక్షుమ్మ పరమాన్నం తీసుకువెళ్లి చెన్నమ్మకు ఇచ్చి వచ్చింది. ఊరందరికీ భోజనాలు వడ్డించినారు. ఆయగాళ్లు, అడుక్కునేటోళ్లు కావలిసినంత పెట్టించుకు తిన్నారు. బ్యాండు మేళం వాళ్లకూ, తప్పెట్లోళ్లకూ డబ్బు ఇచ్చి పంపించినాడు ఆదిరెడ్డి.

‘దాసర్ల కార్యం అయితే బాగానే జరిగిపోయింది గానీ అసలుదైన పెళ్లి కార్యమే జరగాల్సి ఉంది’ చెన్నమ్మను గుర్తు చేసుకుంటూ తనలో తానే అనుకుంటున్నాడు ఆదిరెడ్డి.

ఇంతలో వెంకట్రాముడు వడివడిగా సడుచుకుంటూ ఆదిరెడ్డి దగ్గరికి వచ్చినాడు. చెన్నమ్మకు ఆయాసం ఎక్కువైందని, ఇంట్లోవాళ్లంతా ఆమె మంచం చుట్టూ చేరినారని చెప్పినాడు. భార్యతో కలిసి ఆదిరెడ్డి చెన్నమ్మ ఇంటికాడికి పరుగులాంటి నడకతో వెళ్లినారు.

మంచంపై పడుకున్న చెన్నమ్మ తీవ్రంగా గస పెడుతూ చిన్నగా మాట్లాడుతోంది. ఆదిరెడ్డినీ, రామలక్షుమ్మనూ చూసి కంటతడి పెట్టుకుంది.

‘సావడమైతే… ఇప్పుడే సచ్చిపోవచ్చు గానీ.. బతికేది ఎవరి చేతిలో ఉందిరా నాయనా ఆదిరెడ్డీ!’ అంది చెన్నమ్మ. ఒక పక్క చెన్నమ్మ పరిస్థితి, మరోపక్క పెళ్లికోసం ఇచ్చిన లక్షల అడ్వాన్సులూ ఆదిరెడ్డిలో కంపనాలు రేపినాయి. ఆదిరెడ్డి జేబులోని ఫోన్ మోగింది. చెన్నమ్మ ఇంట్లోంచి బయటకు వచ్చినాడు. వియ్యంకుడు గురివిరెడ్డి చేస్తున్నాడు. ఎమ్మెల్యే మనుషులకు రూముల బుకింగ్ గురించి అడుగుతున్నాడు. రూముల వివరాలతో పాటు చెన్నమ్మ చావు బతుకుల సంగతినీ, సూతకం ప్రమాదాన్నీ చెప్పినాడు ఆదిరెడ్డి. తర్వాత అరగంటైనా గడవక ముందే చెన్నమ్మ కన్నుమూసింది. రామలక్షుమ్మ బోరున ఏడ్చబట్టింది.

ఆదిరెడ్డి, పెళ్లికొడుకు, బంధువులు కంటతడి పెట్టుకున్నారు. ఆదిరెడ్డి ఇంటి ముందు ఆగిన కార్లోంచి గురివిరెడ్డి దిగినాడు. ముసిలామె ఆయుస్సు తీరి చనిపోయిందని, దూరపు దాయాదులు చనిపోతే పూర్వకాలంలో మాదిరి ఈ కాలంలో ఎవరూ పెళ్లిళ్లను వాయిదా వేసుకోవడం లేదనీ, అంటు పాటించకుండా ఉంటే దాయాది సంబంధం అంతటితో తెగిపోతుందంటూ తమ బంధువుల ఇళ్లలో జరిగిన సంఘటనలను ఉదహరించి చెప్పినాడు గురివిరెడ్డి.

అటు టవున్లో పెళ్లిమేళం, ఇటు పల్లెలో చావు మేళం ఒకే సమయంలో మోగినాయి. రెడ్డేరోళ్ల ఇళ్ల మనుషులు రెండు పాయలుగా చీలిపోయినారు.

(సాక్షి దినపత్రిక, 31 జులై 2016)

రచయిత గురించి

జర్నలిజం, సాహిత్యం ప్రవృత్తిగా రచనలు చేస్తున్న తవ్వా ఓబుల్ రెడ్డి కడప జిల్లా ఖాజీపేట మండలం బక్కాయపల్లె గ్రామంలో జన్మించారు. వీరి సంపాదకత్వంలో వెలువడిన ” కడప కథ, రాయలసీమ వైభవం” సంకలనాలు విమర్శకుల ప్రశంసలను అందుకున్నాయి.వీరు రాసిన ‘గండికోట’ అం.ప్ర ప్రభుత్వం వారి ఉత్తమ పర్యాటక రచన పురస్కారానికి ఎంపికైంది.

ఇదీ చదవండి!

ఉరుటూరు

ఉరుటూరు గ్రామ చరిత్ర

ఉరుటూరు గ్రామం కడపజిల్లా వీరపునాయునిపల్లె మండలంలో ఎర్రగుంట్ల -వేంపల్లి మార్గానికి పడమర ఒకటిన్నర కిలోమీటరు దూరంలో ఉంది. పూర్వం ఈతచేట్లు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: