మధ్య తరగతి ఆలోచనల్ని భూ మార్గం పట్టించిన కథాశిల్పి సొదుం జయరాం. వీరికి 2004లో రాచకొండ రచనా పురస్కారం శ్రీకాకుళంలోని కథానిలయం వార్షికోత్సవ సభలో ఫిబ్రవరి 15న అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత కేతు విశ్వనాథరెడ్డి మిత్రుడు జయరాం గురించి అందిస్తున్న రచన…
నాలుగైదు దశాబ్దాల కిందటి మాట. కడప జిల్లాలోని పల్లెటూళ్ళలో ఆధునిక సాహిత్య చైతన్యం అబ్బిన రైతు కుటుంబాలు చాలా తక్కువగా ఉండేవి. వీటిలో సొదుం జయరాం ఉమ్మడి కుటుంబం ఒకటి. జయరాం ఊరు ఉరుటూరు. కమలాపురం తాలూకా వీరపునాయునిపల్లె మండలంలోని గ్రామం అది. మెట్టప్రాంత గ్రామమది. కేథలిక్ చర్చి ఉండే గ్రామం కూడా అది. 1950ల్లో కమ్యూనిస్టు ఉద్యమాన్ని, మార్క్సిష్టు భావాల్ని స్వాగతించిన గ్రామం అది.

ఉరుటూరులోని సొదుం జయరాం ఇంట్లోకి అడుగు పెడుతూనే కాస్త విశాలమైన గదిలోకి ప్రవేశిస్తాం. ఎడమ వైపు జగితి ఉంటుంది. జగితి మీద మంచం ఉంటుంది. మంచంపై జయరాం అన్న సొదుం గోవిందరెడ్డి చదువుకుంటూనో, జయరాంనూ, ఆయననూ చూడడానికి వచ్చిన సాహిత్య మిత్రుల్ని పలకరిస్తూనో కన్పిస్తారు. వచ్చినవాళ్ళు జగితి కింది భాగంలో మంచం మీద, కుర్చీల్లో ఆయన ఎదురుగా కూర్చుంటారు, చర్చలు సాగుతాయి. ప్రసిద్ధ రచయితల రచనల మీద, పత్రికల మీద, వస్తున్న రచనల మీద, మార్క్సిజం మీద, సమకాలిక రాజకీయాల మీదా ఆ చర్చలుంటాయి. ఆ చర్చల్లో ఆత్మీయత ఉంటుంది. ఆపేక్ష ఉంటుంది. నిర్మొహమాటముంటుంది. లోతైన పరిశీలన ఉంటుంది. ఆ పరిశీలన వెనుక చదువు వుంటుంది.
1960లోనో 1961లోనో వేసవి సెలవుల్లో మా నల్లపాటి రామప్పనాయుడు, నేనూ మా ఊరు రంగశాయిపురం నుంచీ కదిరేపల్లె గుట్టలు దాటి, దండుపల్లె మీదుగా నాలుగైదు మైళ్లు నడిచి ఉరుటూరు వెళ్లాము ఒకటి రెండు సార్లు. ఆ తరువాత నేను రెండు మూడు పర్యాయాలు. మూడేండ్ల కిందట ఐ. సుబ్బారెడ్డి, నరాల రామిరెడ్డి, నేనూ వెళ్లాము. దృశ్యం మారలేదు. చర్చలు మారలేదు. స్నేహాలూ, ప్రేమలూ మాసిపోలేదు. సొదుం జయరాం, అతని తమ్ముడు సొదుం రామ్మోహన్, ఆ వాతావరణంలోనుంచీ వచ్చారు.
కుటుంబరావు సాహిత్యం మొదటి సంపుటంలోని సొదుం జయరాంకు, 1962లో సొదుం గోవిందురెడ్డికీ, 1965లో కొడవటిగంటి కుటుంబరావు రాసిన లేఖాంశాల్ని చదివిన వాళ్లు ఈ వాతావరణాన్ని సులభంగా ఊహించుకోగలరు. జయరాం, నేనూ సమవయస్కులం. మా ఇద్దరి మధ్య దాదాపు యాభై ఏండ్ల స్నేహ్రార్ధత ఉంది. నలభై ఏండ్లగా చెక్కు చెదరని సాహిత్య బాంధవ్యం ఉంది.
నేను 1962 ఫిబ్రవరి 9వ తేదీ తిలక్ రోడ్డులోని ఆంధ్రరత్న దినపత్రికలో సబ్ ఎడిటర్‌గా ట్రైయినీగా చేరాను. కొన్నాళ్లు విద్యానగర్‌లో రాజేంద్ర గదిలో ఉండి కాచిగూడా చౌరస్తాలోని భరత్ భవన్ గదిలో చేరాను. ఏ గదికీ లేని సౌకర్యం ఆ గదికి ఉంది. గదికి ముందు పిట్టగోడ ముందు నుంచి చూస్తే – ఎడమవైపు రోడ్డు వార పెద్ద పెద్ద చెట్లు, పక్షుల కిలకిలా రావాలూ, ఎదురుగా చూస్తే కింద ఖాళీ జాగా, ఆ పై చౌరస్తా, కుడివైపు భరత్ భవన్‌లో భాగమైనా, ప్రత్యేకంగా ఉండే ఇల్లూ, రెండు పూటలా భోజనం, వసతి. మొత్తానికి అరవై రూపాయలు.
అప్పటికే రాష్ట్ర గణాంక శాఖలో స్టాటిస్టికల్ అసిస్టెంట్‌గా జయరాం పనిచేస్తూ, వేరే ఎక్కడో గదిలో ఉన్నారు. ఇద్దరం కూడబలుక్కున్నాం. ఇద్దరం దాదాపు మూడు నెలలకు పైగా కలిసి ఉన్నాం. నాకు నూరు రూపాయల జీతం. మరో యాభయ్యో, నూరో ఇంటి దగ్గర నుంచీ అప్పుడప్పుడూ తెప్పించుకొనేవాణ్ణి. జయరాంకు నూటయాభై అని జ్ఞాపకం. మావి దాదాపు ఉమ్మడి ఖర్చులు. కథలు రాయాలనుకోవడం, పుస్తకాలు చదవడం, అడపాదడపా నచ్చిన పుస్తకాలు కోటీలో కొనడం, వాటి మీద చర్చించడం, జేబుల్లో రెండు రూపాయలుంటే పబ్లిక్ గార్డెన్స్‌కు బస్సులో వెళ్లి పచ్చిక బయలులో కూర్చొని కబుర్లు చెప్పుకోవడం – ఇది మా పని. ఒక్కొక్క మారు మా ఇద్దరి దగ్గరా ఒక్క రూపాయి కూడా ఉండేది కాదు. నెల చివరి రోజుల్లో నాకు ఉచితంగా వచ్చే ఆంధ్రరత్న దినపత్రికల్ని హోటల్ కుర్రాడితో అమ్మించి, పబ్లిక్ గార్డెన్స్‌కు నడుచుకుంటూ వెళ్లి, టీ తాగిన ఒకటి రెండు రోజులు జ్ఞాపకం ఉన్నాయి.
ఒకరోజు దాశరథి రేడియో నాటికల్ని చదువుతూ గట్టిగా నవ్వేశాను ‘జయరాం, జయరాం నియాన్‌లైట్ అనే పేరు నీకు బాగా సరిపోతుంది’ అని. ‘నువ్వు వెంటనే వెలగవు’ అని వివరించి చెప్పాక తనూ నవ్వాడు – నిష్కల్మషంగా. జయరాం నా కంటే సీరియస్ మనిషి. కానీ కలుపుగోలుగా ఉండే వాళ్లతో చక్కగా కలిసిపోయే సంస్కారం జయరాంది.
1962 జూన్‌లో ఆంధ్రరత్న నుంచీ తప్పుకున్నాను. జయరాం కడప చేరుకున్నాడు. 1962 జూలై 15న కడప కాలేజీలో నేను చేరాను. తరువాత అదే వృత్తిలో నేను, జయరాం గణాంకశాఖ నుంచీ తప్పుకున్నాడు. మహాబూబ్‌నగర్‌లో కొన్నాళ్లు టీచరుగా, మరికొన్నాళ్లు విశాలాంధ్రలో సబ్ ఎడిటర్‌గా పని చేశాడు. ఉద్యోగాలు అతని మనస్తత్వానికి సరిపడకో, వ్యక్తిగత కుటుంబ కారణాలో నేనెప్పుడూ జయరాంను గుచ్చి గుచ్చి అడగలేదు. ఆరా తీయలేదు.
గజ్జెల మల్లారెడ్డి ఈనాడులో, ఆంధ్రభూమిలో ఉన్నప్పుడు జయరాం పత్రికల్లో చేరితే బాగుంటుందని అనే వాడు. నాకు గుర్తున్నంతవరకు మూడు దశాబ్దాలకు పైగానే గ్రామంలో ఉంటూ రకరకాల సమస్యలతో పోరాడుతూనే ఉన్నాడు. జయరాంలోని కథకుడు ఎప్పుడూ చావలేదు, చావడు. సవ్యసాచి, సంవేదన, యుగసాహితీ మిత్రులం జయరాం కోసం ఎదురుచూసే వాళ్లం. కడపలో ప్రొద్దుటూరులో రా.రా. కేంద్రంగా సాగే సాహిత్య తాత్త్విక సామాజిక చర్చల్లో జయరాం తానొచ్చినప్పుడు పాల్గొనేవాడు. సాహిత్యం ఊపిరిగా అప్పుడు జీవించేవాళ్లం, ఎప్పుడు కలిసినా ఎన్ని నెలల ఎన్నేండ్ల తరువాత కలిసినా.
జయరాం కంటే కొంత ఆలస్యంగా నేను కథా రచనలోకి అడుగు పెట్టాను. కానీ నా మొదటి కథల సంపుటి జప్తు (1974) ప్రచురణకు ప్రేరణా, తోడ్పాటూ, మా నల్లపాటి రామప్పనాయుడుదీ, జయరాందీ. జయరాం జప్తుకు ముందు మాట రాశాడు. జప్తు ప్రచురణలో ముడిపడిన మరొక ముఖ్యమైన అంశం, మా రామప్పనాయుడు, జయరాం, నేనూ విరాళాల కోసం మా పల్లెటూళ్లు తిరగడం – ఆ సందర్భంలో ఉరుటూరు, అనిమెల, గడ్డంవారిపల్లె, గంగిరెడ్డిపల్లె, పాయసంపల్లె తిరిగినట్లు గుర్తు. సాహిత్యంలో, వామపక్ష భావాలతో సంబంధమున్న రైతుల నుంచీ, అయిదూ పదీ వసూలు చేశాం. ఆ రకంగా సాహిత్య శ్రేయోభిలాషుల నుంచి పల్లెల్లోనూ, చిన్న టౌన్లలో, కడపలో పోగు చేశాం.
వై.సి.వి.రెడ్డి మాకు వెన్నుదన్నుగా ఉండేవాడు. పి.సి. నరసింహారెడ్డి ముఖ చిత్రాన్ని విజయవాడలోని నిడమర్తి ఉమారాజ్ బ్లాకు చేయించి పంపించారు. అజంతా కొండయ్య ప్రెస్సులో మూడు వేల రెండు వందల రూపాయలకు వెయ్యి కాపీలను (క్రౌన్ 134 పేజీలు) అచ్చు వేయించుకున్నాం. ఒక నూరో, ఇన్నూరో కొండయ్య విరాళం. విరాళాలిచ్చిన రైతులకు, ఇతర మిత్రులకూ కాపీలు పంపించాము. అప్పటి మా సమిష్టి కృషిలో జయరాం పాత్ర ఇప్పటికీ మనసులో పదిలంగా ఉంది.
జయరాం ఆర్భాటాలు లేని జనం మనిషి. దీనివల్లనే కొన్నేళ్ళు ఉరుటూరు గ్రామ పంచాయితీ ప్రెసిడెంట్‌గా కూడా పని చేశాడనుకుంటాను. అయితే ఆర్థిక చలన సూత్రాలు అతనికి తెలిసినంతగా నేటి రాజకీయాల్లో ఇమిడిపోగల యుక్తీ చాతుర్యం లేవని నా నమ్మకం. ఆ యుక్తీ, చాతుర్యం లేకపోవడం వల్లనే కథకుడుగా ఎదుగుతూ వెళ్లగలిగాడు. మా ముందుతరం, మా తరం, ఆ తరువాతి తరంలో గౌరవాస్పదుడూ, ప్రేమాస్పదుడూ అయిన కథకుడిగా, మిత్రుడిగా నిలిచాడు.
చేవ కలిగిన కథా సాహిత్యంలో పరిచయమున్న వాళ్ళందరికి అతను సొదుం జయరాం. మాలో చాలామందికి అతను జయరాం. ఈ తరానికి అతను సొదుం. కొడవటిగంటి కుటుంబరావు, రా.రా. మెచ్చిన కథకుడిగా మా బృందంలో జయరాం డెబ్బయ్యో దశకంలోనే పేరు తెచ్చుకున్నాడు. 1969 ఏప్రిల్ సంవేదన సంచికలో రా.రా. రాసిన ‘మధ్య తరగతి జీవులకు షాక్ ట్రీట్‌మెంట్’, ‘వాడిన మల్లెలు‘ కథల సంపుటి మీద రాసిన సమీక్షా వ్యాసం కొంతమందిని ఉడుకుబోతులను కూడా తయారుచేసింది. నిరాడంబరుడు రాసిన నిరాడంబరమైన కథలని కుటుంబరావు మెచ్చుకుంటూ…జయరాం రాసిన కథలు పదునైనవనీ, ప్రతి కథా సంఘం మీద బలమైన గాటు పెట్టిందనీ అన్నారు.
జయరాం మొదట్లో కవిత్వం కూడా రాశాడు. ఇద్దరం కలిసి ఒకటి రెండు రాశాము. కవిత్వం జయరాం సాహిత్యరూపం కాదు. నాది అసలే కాదనుకోండి. కె.వి.రమణారెడ్డి సంకలనం చేసిన అడుగుజాడ గురజాడ కవితాసంకలనంలో జయరాం గేయం ఉన్నట్లు జ్ఞాపకం. ‘సవ్యసాచి’లో ఒకటి రెండు గేయాలు రాశాడు. నాటికలు కూడా రాసినట్లు గుర్తు. తరువాత తరువాత కథల మీదే తన దృష్టిని కేంద్రీకరించాడు. ‘సంవేదన’లో తను రాసిన వాడిన మల్లెలు ఒకే ఇతివృత్తంపై వచ్చిన నలుగురి కథలు ఒక ప్రయోగానికి గుర్తుగా నిలిచింది. అదే పేరుతో జయరాం మొదటి సంపుటి వచ్చింది. తరువాత విశాలాంధ్ర జయరాం ‘సింహాద్రి స్వీట్‌హోం’ ప్రచురించింది. జయరాం పది కథలు రష్యన్‌లోకి అనువాదమైనట్లు మధురాంతకం రాజారాం చెప్పారు. ఆయన సిరివాడ చిన్న ప్రపంచం నవలతో సహా ఆ విషయం జయరాంకు తెలిపినట్లు గుర్తు. అప్పటికి నేను తిరుపతి యూనివర్శిటిలో ఉన్నా. 1988లో కూలిన బురుజు అనే కథ రాశాను. అది మా ఊళ్ళోని మా కుటుంబంలోని కొన్ని అనుభవాలకు కథా రూపం. ఆ కథలోని జయరాం నిజానికి సొదుం జయరామే!
జయరాం తన అనుభవాల్ని వ్యక్తిగత ఉద్వేగ ప్రవృత్తితో చూసే రచయిత కాదు. ఆ మాటకొస్తే భరత్ భవన్ రోజుల్లో నన్ను గురించి అనేవాడు ‘నీకు అవసరానికి మించిన అనుభూతి ఉంది’ అని. ఈ మాట గుర్తు చేయడం ఎందుకంటే అవసరానికి పనికొచ్చే అనుభూతులున్నా, వాటిని జయరాం ఎందుకనో రచనల్లోకి ఎక్కించలేకపోయాడని తెల్పడానికి. ముఖ్యంగా తాను ఆరు దశాబ్దాలుగా గ్రామీణ వ్యవసాయిక జీవితంలోని మార్పుల మధ్య కరువులతో, కచ్చెలతో అల్లకల్లోలమవుతున్న జీవితాల మధ్య మొద్దుబారిపోతున్న స్పందనల మధ్య ఉంటూ కూడా వాటిని ఎక్కువ కథలుగా, ఒక పెద్ద నవలగా మలచలేకపోయాడని నా బాధ, ఫిర్యాదు.
జయరాం అగమ్యం నవల ఆ ప్రయత్నం కొంతవరకు చేసిన మాట నిజమే. కానీ రాయలసీమ గ్రామాలు, ఆ గ్రామాల్లోని పరివర్తన బహుముఖంగా అవగాహనకు రావాలంటే, నిర్దిష్టమైన జీవనాంశాల్ని సాధారణీకరణ చేయక తప్పదు. జయరాంకు ఆ చూపు ఉంది. రచనాశక్తి ఉంది, శిల్పదృష్టి ఉంది. జయరాం ఇతరేతర సమస్యలు నాకు తెలుసు. వాటిని అధికమించగల మనోదార్డ్యం ఉంది. రచనా సంస్కారం బలం ఉంది. రావిశాస్త్రి రచనా పురస్కారం జయరాం మనోదార్డ్యానికి, రచనా సంస్కార బలానికి స్ఫూర్తిని తప్పక ఇస్తుంది.
(2004)