హోమ్ » వార్తలు » ప్రత్యేక వార్తలు » హవ్వ… వానా కాలంలో డెల్టాకు తాగునీటికొరతా?
srisailam water pressmeet

హవ్వ… వానా కాలంలో డెల్టాకు తాగునీటికొరతా?

నిబంధనలకు విరుద్ధంగా శ్రీశైలం నుండి నీటిని తరలిస్తున్నారు

చరిత్రలో ఈ మాదిరిగా శ్రీశైలం నుండి నీళ్ళు తీసుకుపోయిన దాఖలా లేదు

రాయలసీమకు నీళ్ళు అందకుండా చేసే ఎత్తుగడ

మీడియా సమావేశంలో రాయలసీమ అభివృద్ది సమితి

(హైదరాబాదు నుండి మా విశేష ప్రతినిధి)

శ్రీశైలం జలాశయం నుంచి నిబంధనలకు విరుద్ధంగా నీటిని తరలిస్తూ రాయలసీమకు నీళ్ళు అందకుండా చేసేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఎత్తుగడ వేశాయని రాయలసీమ అభివృద్ది సమితి ఆరోపించింది. దీని వల్ల సీమ రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. శుక్రవారం హైదరాబాద్‌లో సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి, నీటిపారుదల రంగ నిపుణుడు ప్రభాకర్ రెడ్డి, రిటైర్డ్ ఐజీ హన్మంతరెడ్డిలు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…కనీస నీటి మట్టం 854 అడుగులు చేరక ముందే తాగునీటి కోసం మరో ఐదు టీఎంసీల చొప్పున  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ  ప్రభుత్వాలు అడగటం, అందుకు కృష్ణా బోర్డు తలాడించటం ఎంతమేరకు సమంజసమన్నారు. వానాకాలంలో 20 – 30 అడుగుల లోతులో బోర్లలో నీళ్ళు లభించే డెల్టా ప్రాంతంలో తాగునీటికి కొరత ఏర్పడితే 1500 అడుగుల లోతులో కానీ నీళ్ళు లేని రాయలసీమ ప్రజలకు తాగునీటికి కొరత ఉండదా? ఆ విషయం ఆం.ప్ర ప్రభుత్వానికి తెలియదా అని వారు ప్రశ్నించారు.  ఈ రకంగా వానాకాలంలో 854 అడుగుల కనీస నీటిమట్టం నిర్వహించకుండా శ్రీశైలం నుండి ఎప్పుడూ నీళ్ళు తరలించలేదన్నారు. రాయలసీమకు చెందిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆ ప్రాంతానికి తీరని ద్రోహం చేసే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు.

చదవండి :  'సీమలోనే రాజధాని ఏర్పాటు చేయాల' - జస్టిస్ లక్ష్మణరెడ్డి

854 అడుగుల నుంచి 875 వరకు నీటి మట్టం ఉంటే పొతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు నీరు వెళ్తుందన్నారు. నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం సుమారు 150 టీఎంసీల నీరు నిలవ ఉందన్నారు. అయినా రాయలసీమకు నీరు దక్కనీయకూడదనే ఉద్దేశంతో ఏపీ,  తెలంగాణ ప్రభుత్వాలు కూడబలుక్కున్నాయని ధ్వజమెత్తారు. ఈ విధంగా శ్రీశైలం నుండి నీటిని తరలించుకుంటూ పోతే రాయలసీమకు ఇవ్వాల్సిన 100 టిఎంసిల నికర జలాలను ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. డెల్టా అవసరాలు అన్నీ తీరిపోయినాక అక్టోబర్ చివర్లో శ్రీశైలం నీళ్ళు ఇస్తే రాయలసీమలో పంటలు సాగు చేసుకునే అవకాశం లేకుండా పోతుందన్నారు. అందరికీ దక్కాల్సిన సాగునీటిని దిగువన నాగార్జున సాగర్లో సరిపడా నీల్లున్నా కూడా తాగునీటి పేరుతొ శ్రీశైలం నీళ్ళు అక్రమంగా తీసుకుపోవడం దోపిడీ కాదా అని ప్రశ్నించారు.

చదవండి :  ఒంటిమిట్టలో రోడ్ల పునరుద్ధరణకు 45లక్షలు

గతంలో పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీరు తరలించవద్దని మంత్రి దేవినేని ఉమా ఉద్యమం చేశారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిని చంద్రబాబు నీటిపారుదల మంత్రిగా ఉంచితే రాయలసీమకు నీరు రానిస్తాడా అని ప్రశ్నించారు.

1996లో 854 అడుగుల నుంచి 834 అడుగుల కనీస నీటి మట్టాన్ని శ్రీశైలంలో తగ్గించిన ఘనత చంద్రబాబు నాయుడుదని గుర్తు చేశారు. మళ్లీ దివంగత వైఎస్సార్ తాను అధికారంలోకి రాగానే శ్రీశైలంలో 854 అడుగులకి నీటిమట్టం స్థాయి పెంచారన్నారు. ఇది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

చదవండి :  సన్నపురెడ్డి నవల 'కొండపొలం'కు తానా బహుమతి

అభివృద్ధి అంతా కృష్ణా, గుంటూరు జిల్లాలకే పరిమితం చేస్తున్నారని విమర్శించారు. పట్టిసీమ జీవోలో రాయలసీమకు నీరు ఇస్తామని ఎక్కడా లేదని తెలిపారు. కేవలం పరిశ్రమలకు, డొమెస్టిక్ అవసరాలకు మాత్రమే నీరు ఇవ్వాలని జీవో ఉందని పేర్కొన్నారు.

రాయలసీమకు ద్రోహం చేసే కుట్రలు జరుగుతున్నాయని ప్రజాప్రతినిధులు మేల్కోవాలని, ప్రజలకు అండగా నిలబడి ఉద్యమించాలని సూచించారు. గ్రాట్ జనరల్ సెక్రటరీ రాధారావు, రాయలసీమ సామాజిక మాధ్యమాల ఫోరం ప్రతినిధులు అశోక్, నాగాభరణనాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి!

రాయలసీమపై టీడీపీ

రాయలసీమపై టీడీపీ కక్ష తీర్చుకుంటోంది : బిజెపి

కడప : రాయలసీమ కోసం తెలుగుదేశం నేతలు దొంగ దీక్షలు, యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదని బీజేవైఎం అధ్యక్షుడు విష్ణువర్థన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: