అంజనం (కథ) – వేంపల్లె షరీఫ్

పైన ఫ్యాను తిరుగుతోంది. తిరిగేది చిన్నగే అయినా కిటకిటా మంటూ శబ్దం పెద్దగా వస్తోంది. ఆ ఫ్యాను గాలిని ఏమాత్రం లెక్కచేయకుండా ఈగలు బొయ్యిమంటూ అటూ ఇటూ తిరుగుతున్నాయి. నట్టింట్లో కాళ్లు బార్లా చాపుకుని దిగులుగా కూచోనుంది జమ్రూత్.

“పెద్దోడు తిరిగొచ్చాడని పెద్దాసుండ్యా…” అంది ఉన్నట్టుండి.

“ఇప్పుడు ఆ ఆసకు ఏమైంది?” అన్నట్టు చూశాడు పక్కనే ఎర్రటి వైరు మంచంపై కూర్చొని ఉన్న ఆమె కొడుకు గౌస్.

“ఆ పావురం వొచ్చినట్టే నా బిడ్డకూడా వొచ్చాడనుకొంటి” అంది మళ్లీ జమ్రూత్.

గౌస్‌కి బాధేసింది.

“ఏమి ఈ పిచ్చాయమ. అదేదో పావురం ఒకటి దారితప్పి ఇంటికొచ్చిందని… దాంతో పాటే అన్న కూడా వొచ్చాడనూంటే ఎట్టా…? అన్న ఇంటి నుంచి వెళ్లిపోయి ఎన్ని దినాలైతాంది ఏమి కత? ఎబ్బుడో ఎనిమిదేండ్ల కిందట మనుసులో ఏం పురుగు పుట్టిందో… అందర్నీ కాదనుకుని వెళ్లిపోయినోడు ఇంతవరకూ సుతిల్యా… గతిల్యా…! సచ్చినాడో బతికినాడో కూడా తెలీదు. బతికుంటే ఒక తూరి కాకపోయినా ఒకతూరైనా ఎవురో ఒకరు గుర్తొచ్చి ఇంటికి ఎందుకు తిరిగిరాడు. బతికున్నాడో లేదో తెలీని వోడి గురించి ఎందుకు దినామూ దిగులు పడుకుంటా ఉండేది?

  vempallishareefసాక్షి సంస్థలో సంపాదకునిగా పని చేస్తున్న వేంపల్లె షరీఫ్ మైనారిటీ వర్గానికి చెందిన రచయితే ఐనా మైనారిటీ అస్తిత్వం ఒక్కటే ఉన్న రచయిత కాదు. షరీఫ్ స్వస్థలం కడప జిల్లా వేంపల్లె. షరీఫ్ కథ జుమ్మా పలువురు విమర్శకుల ప్రశంసలు పొందింది. వీరు ఈ మధ్యే జుమ్మా పేరుతో తన కథలను సంకలనంగా వెలువరించారు.

అసలు ఈయమ్మకు ఎవురు అంజనాలకు పొమ్మన్నింది? ఎవడ్నో ఒకడ్ని వెళ్లి అంజనాలు అడిగేది? వాడు ఏది చెబితే అది నమ్మేది… ఇలా బుర్ర పాడుచేసుకునేది. మొన్నకు మొన్న అన్న ఎక్కడో తిరప్తిలో ఉన్నాడని వాడెవడొ చెబితే అదేపనిగా నాయన్ను పంపించి ఎతికించింది. ఏమిటి లాభం. లెక్క నట్టం తప్ప. వాడు దొరకడు పాడుల్యా… ఈయమ్మ మారుదూ ఏమిల్యా…” మనసులోనే చిరాగ్గా అనుకున్నాడు గౌస్.

పైకి మాత్రం ఏమీ అనలేదు.

ఎంత కాదనుకున్నా తల్లి మనసు గదా… మరింత బాధ పడుతుందని… లోపలున్న చిరాకునంతా లోపల్నే అణచుకున్నాడు.

కానీ అతనికి కూడా నిన్నటి దాక ఇంట్లో సందడి సందడిగా తిరిగిన మచ్చల మచ్చల పావురమే గుర్తొస్తోంది.

మాంచి పావురమది. తెల్లటి రంగులో అక్కడక్కడ నల్లటి మచ్చలతో కళకళలాడుతూ ఉండేది. ఆరోజు జమ్రూత్ ఇంట్లో తన మటుకు తాను గిన్నెలు తోముకుంటోంది. ఆ పావురం నేరుగా ఇంట్లోకి వచ్చి నిలబడింది ఏదో అలవాటున్న ఇల్లు లాగా దర్జాగా నిలబడుకుని ఏమాత్రం అదురు బెదురు లేకుండా అటూ ఇటూ చూసింది.

దాన్ని చూసిన జమ్రూత్‌కి ముచ్చటేసింది. అది చేతులతో తోలుతున్నా ఎగిరిపోలేదు. అక్కడక్కడే తిరుగుతోంది.

చదవండి :  నీలవేణి (కథల సంపుటి) - భారతం నాదమునిరాజు

“అయ్యయ్యో… సిన్న పావురమే…” అనుకుంది.

అట్టే గబిక్కిన చేతుల్తో పట్టుకుంది. బయట చూస్తే వాన. ఎప్పుడు మొదలైందో కూడా ఆమెకు తెలీదు.

“పాపం ఈ వానలో ఈ పావురం ఏ చెట్టు మీది నుంచో దారి తప్పి వొచ్చింది…” అనుకుంది. దాని కోసం ఇంట్లోని ఓ గాజుల అల్మారా ఖాళీ చేసింది.

వేళకు తిండి గింజలు వేసింది. నీళ్ళ గిన్నె పెట్టింది. ఎన్ని పనులున్నా దాని మీద ఒక కన్నేసి పెట్టింది. ఏమాత్రం సమయమున్నా దాంతో చిన్నపిల్లలా ఆడుకుంటూ కనబడేది. ఆ పావురానికి కూడా తొందర్లోనే ఆ ఇల్లు అలవాటైంది. మనుషుల మధ్య రయ్యిన తిరుగుతూ,ఎగురుతూ… భుజాల మీద కూర్చోవడం మొదలుపెట్టింది. దానికి ఒక ‘తోడు పావురం’కూడా తీసుకురావాలి అనుకుంది. కానీ అంతలోనే ఇలా జరుగుతుందని ఆమె కల్లో కూడా ఊహించలేదు.

నిన్న సాయంత్రం గౌస్ ఇంటికొచ్చేసరికి దిగాలు ముఖం పెట్టుకుని కూర్చుంది జమ్రూత్.
ఏమీందని అడిగితే… చిన్న పిల్లలా తన ముద్దుల పావురం తనకు దూరమైన సంగతి గురించి చెప్పుకొచ్చింది.

“పావురానికి ఇల్లు బాగా అలవాటైంది. తీసుకెళ్లి రోడ్డు కవతలి వైపు వదిలినా నేరుగా ఇంట్లోకే వచ్చేస్తాంది. ఈ పొద్దు కూడా అట్టనే తీసుకుమెళ్ల్లి పావురాన్ని వదుల్తాంటే ఎప్పుడూ చూసినాడో ఆ గుడ్డాలాయప్ప కొడుకు సిన్నోడూ ‘ఆ పావురం… నాది గదుమ్మా…’ అంటా వచ్చినాడు.

ఆ మాటంటానే నాకు గుండె దడెత్తుకునింది.

‘ఈ పావురం నీది అనడానికి ఏమిటి ఆనవాళ్లు?’ అని అడిగినా.

ఆ పిల్లోడు అన్నీ కరెక్టుగానే చెప్పినాడు. నెల రోజుల కిందట వాన వొచ్చినప్పుడు ఆ పావురం బెదిరిపోయి వాళ్లింట్లోంచి బయటికి గెంతుకుంటా వచ్చిందంట. అలా అక్కడ గెంతిన పావులం ఇలా మనింట్లోకొచ్చి వాలిందని అప్పుడు నాకేం తెలుసు? అందుకే పానాలికి పానంగా సాక్కున్నా. కానీ ఆ పిల్లోడు అంతగా ‘ఆ పావురం నాది…నాది…’అంటాంటే… ఎట్టా ఇయ్యకుండా ఉండాలా… అందులో ఒకరి సొమ్ము మనకెందుకు?” అనింది.

నిజాయితీగా ఆ పావురాన్ని ఆ పిల్లోడికి ఇచ్చెయ్యనైతే ఇచ్చేసింది కానీ ఆమె మనసు మాత్రం మనసులో నిలవడం లేదు. అన్నం, నీళ్లు మానేసి ఇలా డీలా పడిపోయింది.

ఎందరు ఏమన్నా తన బిడ్డ బతికే ఉన్నాడని… ఏదో ఒకరోజు తిరిగి వస్తాడని… ఎంతో నమ్మకంగా చెప్పే జమ్రూత్ ఆ రోజు మాత్రం… “ఇంగ రాడు నా బిడ్డ…” అని కళ్ల నీళ్లు పెట్టుకుంది.

ఆమె ఏడుపు చూశాక గౌస్‌కి మరింత చిరాకు వేసింది.

ఆ పావురాన్ని ఆ పిల్లోడు తీసుకెళ్లడానికి ఎప్పుడో వెళ్లిపోయిన తన బిడ్డ ఇంక రాడని ఆమె అంత గట్టిగా నమ్మడానికి ఉన్న లింకేంటో అతనికి అర్థం కాలేదు.

చదవండి :  అడవి (కథ) - సొదుం జయరాం

“ఎవ్వురికి చేయి చూపించొద్దు. జోష్యాన్ని నమ్మొద్దు. ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది… అనవసరంగా జరగబోయేది తెలుసుకుని దాని గురించి బెంగ పెట్టుకోవద్దు…” అని చిన్నప్పటి నుంచి నీతులు చెప్పిన తల్లే ఇప్పుడిలా మారిపోవడం అతనికి ఆశ్చర్యమనిపించింది.

అంతే కాదు పక్కా మత పద్ధతులు పాటించే తల్లి ఇప్పుడు బుర్ఖా కప్పుకుని అంజనాల పేరుతో స్వాములు, సాధువుల వెంట తిరుగుతోంది.

“అనవసరంగా అంజనాలు… అవీ ఇవీ అని తిరిగి, వాళ్లు చెప్పిందల్లా విని, లెక్కంతా పాడుచేసుకుని పానానికి ఎత తెచ్చుకోకమ్మా” అని చాలాసార్లు చెప్పి చూశాడు గౌస్.
ఆమె వింటే కదా. అప్పటికి వినినట్టే ఉంటుంది. కానీ గుట్టు చప్పుడు కాకుండా మళ్లీ వేళ్ల వెంట, వాళ్ల వెంట అంజనాలకు వెళ్లేసి వస్తుంది. వాళ్లు చెప్పిందల్లా చేస్తుంది. బిడ్డ కోసం ఎక్కడెక్కడో వెతికిస్తుంది.

ఎప్పుడో కొన్నేళ్ల కిందట వెళ్లిపోయిన వ్యక్తిని ఇంట్లో వాళ్లంతా మర్చిపోతున్నా ఆమె ఒక్కటే గుర్తుంచుకుని ఇలా తిరిగి అందరికీ గుర్తు చేసి బాధను రగిలిస్తుంటుంది.

కానీ “దీనికి అంతు ఎప్పుడు?” – అనేదే అతని బాధ.

“ఏందమ్మా. నీ పిచ్చి… అన్న రావాల్సినోడైతే ఈ పావురం లేనంత మాత్రానా రాకుండా పోతాడా? రాకుండా ఉండాల్సినోడైతే ఆ పావురం ఉన్నంత మాత్రానా వొస్తాడా? అయినా నీకెవురుమ్మా మల్లా అంజనం అడిగేదానికి పొమ్మని చెప్పింది?” గట్టిగానే అన్నాడు గౌస్.

“నేనెవర్నీ అంజనం అడగలా…” అందామె సన్న గొంతుతో.

“మరెందుకు నీకా పిచ్చి నమ్మకం… ఆ పావురం ఉంటే అన్న వొస్తాడని…” అడిగాడు.

“చెబుతా విను. ఎనిమిదేళ్ల కిందట మనం పల్లెలో ఉన్నామా?”

“అవును”

“ఆ పల్లెలో కూడా అంతే. ఆ దినం వాన పడతాంది. నేను కాపుటీధి(కాపు వీధి) గిన్నె పట్టుకుని పాలకోసం పోతాండా. ఎక్కదున్నిందో కాకి… గోధుమ రంగు కాకి… రయ్యిన వొచ్చింది… నెత్తిన అట్టే తన్ని పోయింది…

‘షూ…షూ…’ అంటాన్నే వినలా. మళ్లా మీది మీదికి వొచ్చాండాది…
‘ఏందీ కాకి ఈయమ్మను అట్ట కొడతాండాది…’ అని అందరూ తలా ఓ రాయి ఏసేసరికి అది అట్నుంచట్నే ఎళ్లిపోయింది.

“ఏందీ కాకి… ఇట్టా కొట్టింది నెత్తిన…! ఏం దరిద్రం తగులుకుంటాదోనే…” అని దిగులు పట్టుకునింది.

ఇదంతా చూసిన పాల సుబ్బమ్మ గిన్నెలో పాలు పోసి “అయ్యో… బీబి.. దెరిద్రం కదా… కాకి అట్టా నెత్తిన కొడితే… ఏం జరిగి సచ్చాదోనే.. జాగ్రెత్తగా ఉండమన్లా… ఓ పనిజెయ్యి… ఇంటికి బోయి సల్ల నీళ్లతో స్నానం జెయ్యి. తొర్వాత ఎట్టయితే అట్టయితాది…” అని సలహా ఇచ్చింది.

“సరేమ్మా” అంటా పాలు పోయించుకుని ఇంటికొచ్చేసినా. ఆదరాబాదరాగా బిందె తీసుకుని సక్కంగా బోరింగ్ కాడికి పోయి సల్ల నీళ్లు తెచ్చుకుని కట్టు గుడ్డల మీదే స్నానం చేసినా. అయినా దరిద్రం పోలా. ఆ తెల్లారే నీ అన్న మాబ్బాష కనిపించకుండా పోయినాడు.

చదవండి :  సిన్నిగాడి శికారి (కథ) - బత్తుల ప్రసాద్

ఆ దినం అట్ట ఆ కాకితో వొచ్చిన దరిద్రం ఇట్టా ఈ పావురంతో పోతుంది అనుకున్నా…! అందుకే పావులం మీద అంత బ్రెమ పెంచుకున్యా..!” అని కళ్లు ఒత్తుకుని చెప్పింది జమ్రూత్.

గౌస్‌కి కడుపులో కవ్వమేసి కెలికినట్టయ్యింది. దేన్నుంచి దేనికో అన్వయించుకుని బాధ పడుతున్న ఆమె అమాయకత్వాన్ని చూసి అతనికి జాలేసింది. అంజనాలు అడిగీ… అడిగీ…, వాటిని నమ్మీ… నమ్మీ…, తిరిగీ… తిరిగీ… చివరికి ఆమే సొంతంగా కొన్ని నమ్మకాలు ఏర్పరచుకునే స్థాయికి దిగజారింది. బిడ్డ మీద ప్రేమ ఆమెనెంత నిస్సహాయంగా మార్చేసిందో తల్చుకుంటేనే అతని గుండె తరుక్కుపోయింది.

“అన్న బతికిలేడని నా అనుమానమమ్మా. ఉంటే ఎందుకు తిరిగిరాడు చెప్పు?” అన్నాడు గొంతు తగ్గించి బుజ్జగిస్తున్నట్టుగా.

“మరేమనుకోవాలమ్మా. మనిషనే టోడైతే వాడు ఒక్క ఫోనైనా చేయడా… ఇంటికి రాకుంటే మానే… ఫలానా చోట సలక్షణంగా ఉనా… అని ఒక ఉత్తరం ముక్కయిన రాయడా…”

“వాడు తిక్కోడు నాయనా. వాడికి అన్ని తెలివి తేటలు లేవు.”

“మరేం జేయాలా… ఏవేవో నమ్మి అంజనాలు చూపించుకుంటా కూచుంటే అయితాదా?” అన్నాడు కటువుగా.

“ఏదో… అంజనం చూపిస్తే పానం కొంచెం కుదుటగా ఉంటాది. వాళ్లు సెప్పేది అపద్దమో, నిజమో – వింటే మనసుకు రోంత నిమ్మతిగా ఉంటాది. మనిషి మీద ఏదో ఒక ఆశ మందులా పనిచేసి కాసేపు హుశారుగ తల్లాడేలా చేస్తాది.

అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయినా. మొన్న ప్రొద్దుటూరు పోయినప్పుడు నీ సిన్నమ్మను వెంటేసుకుని జమ్మలమడుగు బోయినా. ఆడ ఓ సామి చెప్పినాడూ… అన్న హిందూపురంలో ఉన్నాడంట… కచ్చితంగా చెబుతాండాడు. ఈ పావురం ఆస ఎట్టాగో లేకుండా పోయింది. ఇంగ ఆడ ఒక్కసోట చూసొస్తే చాలు…”

అలా తిరిగి ఇలా తిరిగి మళ్లీ అంతలోనే అంజనం దగ్గరికి వచ్చేసరికి గౌస్ తల పట్టుకున్నాడు. ఇక ఆమెను మార్చడం సాధ్యం కాదనుకున్నాడు.

ఎలాగోలాగా తల్లితో ఏడుపు మాన్పించడమే లక్ష్యంగా ఓ మాటన్నాడు.

“సర్లే… నువ్వు ఏడ్వొద్దు… ఈసారి నేనే స్వయంగా వెళ్లేసి అన్న కోసం వెతికొస్తా… సరేనా…?”
ఆ మాటతో ఆమె ముఖంలో బాధ మాయమై చిర్నవ్వు మెరిసింది.

అంజనం యొక్క ఉపయోగం అతనికి అప్పుడు బోధ పడింది. ఈ దేశంలో స్వాములు, బాబాలకు ఎందుకింత గిరాకీ ఉందో కూడా అవలీలగా తెలిసొచ్చింది.

(సాక్షి ఫన్‌డే 24 అక్టోబరు 2011 సంచికలో ప్రచురితం)

 

ఇదీ చదవండి!

Kuchipudi

‘వదినకు ఒకసరి…’ జానపద గీతం

వదినకు ఒకసరి బిందెకు బిగసరి బంగారు జడ కుచ్చుల మా వదిన అహ బంగారు జడ కుచ్చుల మావదిన ।వదినకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: