ఊరికి పోయి రావాల (కథ) – పాలగిరి విశ్వప్రసాద్

ఉదయం 6 గంటలకు మంచం మీద నుండి లేవడానికి కునికిపాట్లు పడుతుండగా సెల్‌ఫోన్ మోగింది. ఇంక లేవక తప్పలేదు. అవతలి నుండి ‘విశ్వనాథ్ గారా?’ కన్నడంలో అడిగారెవరో. నాకు కన్నడం రాదు. అతను చెప్పిన పేరు నాదే. ‘ఔను. విశ్వనాథ్‌నే మాట్లాడుతున్నా’. అవతలి నుండి, తన పేరు రఘురామ సోమయాజి… అంటూ కన్నడంలో చెప్పుకుపోతున్నాడు. నేను ఇంగ్లీషులో అడిగే ప్రయత్నం చేసినా, అతను కన్నడంలోనే చెప్పుకుపోతున్నాడు. అతని మాటల్లో అక్కడక్కడా వినిపించిన ఇంగ్లీషు పదాల ఆసరాగా కొంత అర్థమయింది.

ఆర్నెళ్ల కిందట చనిపోయిన మావూరి వాడే అయిన నా మిత్రుడు చంద్రారెడ్డి దానం చేసిన గుండె, ఈ రఘురామ సోమయాజిలో ఉంది. అంతకు మించి అర్థం కాలేదు ‘ఐ విల్ కాల్ బ్యాక్ ఇన్ ఏ ఫ్యూ మినిట్స్’ అని ఫోన్ కట్ చేసినా. వెంటనే కన్నడం తెలిసిన మిత్రుడు భాస్కర్‌కు ఫోన్ చేసి, సోమయాజి నెంబరు ఇచ్చి విషయం కనుక్కోమన్నాను. నాలో ఆలోచనలు ముసురుకున్నాయి.చంద్రారెడ్డి గుండెను అమర్చుకున్న రఘురామ సోమయాజి! చనిపోయిన చంద్రారెడ్డి గుండెతో జీవిస్తున్న సోమయాజి!

ఆ రోజు చంద్రారెడ్డి బ్రెయిన్ డెడ్ అయ్యాక, అవయవ దానానికి చంద్రారెడ్డి భార్య, కొడుకులను ఒప్పించింది తనే. కొడుకులిద్దరూ ఒక్క మాటతోనే ఒప్పుకున్నారు. ఉష మాత్రం ససేమిరా కాదంటే కాదంది.కడపలోనే ఉంటున్న నా చిన్ననాటి స్నేహితుడు కృష్ణయ్యకు ‘లివర్’ పూర్తిగా చెడిపోయింది. అతన్ని బతికించాలని నా తాపత్రయం. ఎలాగూ మట్టిలో కలిసిపోయే అవయవాల వల్ల మరొకరు, మరికొన్నేళ్ళు జీవించే అవకాశం ఉన్నప్పుడు… ఆ సందర్భం కళ్ళముందుకొచ్చినప్పుడు… నేను ఆమెలాగే విచక్షణ కోల్పోయి మౌనంగా ఉండకూడదనుకున్నాను.

కృష్ణయ్యను బతికించడానికి చంద్రారెడ్డి భార్య ఉషను బలవంతంగా ఒప్పించాల్సి వచ్చింది. కృష్ణయ్యకు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగింది. ఒక మనిషిగా నా కర్తవ్యం చేశాననుకున్నాను. తక్కిన అవయవాలు రెండు కళ్ళూ, రెండు కిడ్నీలు, ఊపిరితిత్తులు, గుండె ఎవరికి చేరాయో! గుండె మార్పిడి మాత్రం అప్పుడు టీవీ ఛానెల్స్‌లో, పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. చెన్నై ఆసుపత్రిలో చంద్రారెడ్డి బ్రెయిన్ డెడ్ శరీరం నుండి అన్ని అవయవాలు తీసిన తర్వాత చివరగా గుండెను తీశారు.

ఊరికి పోయి రావాల

హాస్పిటల్ నుండి ఏర్‌పోర్ట్ వరకూ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసి ఉంచారు. గాజుపెట్టెలో ఏదో లిక్విడ్‌లో పెట్టిన గుండె అంబులెన్స్‌లో ఆఘమేఘాల మీద ఏర్‌పోర్ట్‌కు చేరింది. అక్కడి నుండి విమానంలో బెంగుళూరుకు దూసుకుపోయింది. ఆ నగరంలో కూడా ఏర్‌పోర్ట్ నుండి హాస్పిటల్ వరకూ ట్రాఫిక్ క్లియర్ అయింది. అంబులెన్స్‌లో ఆ గుండె శరవేగంగా ఆసుపత్రికి చేరింది. గుండెను శరీరం నుండి తీసిన నాలుగు గంటలలోపే అది అవసరమైన వారి శరీరంలో అమర్చాలట.

ఈ సంఘటనను చెబుతూ ‘మీడియా’ ఆ రోజు ఆ రెండు ఆసుపత్రులనూ, ఆ డాక్టర్లనూ ఆకాశానికెత్తింది. గుండెను దానం చేసినవారి ఊసుమాత్రం ఆ వార్తల్లో లేదు. చంద్రారెడ్డి గుండె చేరింది ఈ రఘురామ సోమయాజి శరీరంలోకా! ఇప్పుడెందుకు ఫోన్ చేసినట్లు? నా ఫోన్ నెంబరు ఎలా దొరికింది?… అసలు నాకే ఎందుకు ఫోన్ చేసినట్లు?నా ఆలోచనలు గతంలోకి, వర్తమానంలోకి గింగుర్లు తిరుగుతున్నాయి. అర్ధగంట తర్వాత భాస్కర్ నుండి ఫోన్ వచ్చింది.

‘‘బాసూ! మీ ఫ్రెండెవరో బ్రెయిన్ డెడ్ అయినప్పుడు అతని అవయవాలు దానం చేసినారన్నావు గదా! అతని గుండె అమర్చింది ఈ సోమయాజికేనంట. మామూలుగా అయితే అవయవాలు దానం చేసినవారి వివరాలు తీసుకున్నవారికీ, తీసుకున్నవారి వివరాలు దానం చేసినవారికీ చెప్పరంట. బెంగుళూరు ఆసుపత్రి డాక్టర్లలో తనకున్న పలుకుబడితో, చెన్నై ఆసుపత్రి డాక్టర్లను పరిచయం చేసుకున్నాడట. ఫోన్లలో పని కాకపోతే స్వయంగా చెన్నై వెళ్ళి తనకు జీవితం ఇచ్చిన వారి వివరాలు కనుక్కున్నాడంట. మీ ఫ్రెండ్ భార్యకు, కొడుకులకు ఫోన్‌లు చేస్తే పనిచేయడం లేదట. పనిచేస్తున్న ఒక్క ఫోన్ వారం రోజుల నుండి రింగవుతోంది గానీ లిఫ్ట్ చేయడం లేదంట. ఆ అవయవ దానానికి సూత్రధారివి నువ్వేనని కనుక్కుని, నీ నెంబరు పట్టుకుని ఫోన్ చేసినాడంట. తనకు జీవితం ఇచ్చినవారిని కలుసుకుని కృతజ్ఞత చెప్పుకోవాలంట. డాక్టర్లు మాత్రం వెళ్ళొద్దు, వాళ్ళను చూసి ఎమోషనల్ అయితే గుండెకు దెబ్బ అంటున్నారంట. అయినా వాళ్ళను కలుసుకుంటాను, తనకు సహకరించమంటున్నాడు.

చదవండి :  సూతకం (కథ) - తవ్వా ఓబుల్‌రెడ్డి

ఈ రోజే బెంగుళూరు నుండి కార్లో బయలుదేరుతున్నారంట. నిన్నూ, నన్నూ కడప విడిచి ఎక్కడికీ వెళ్ళొద్దనీ ఫోన్‌లోనే కాళ్ళు పట్టుకుంటున్నాడు. ఆయన్ను, మీ ఫ్రెండ్ భార్యా కొడుకులతో కలపనంట కలిపి పుణ్యం కట్టుకోరా!’’ గడగడా మాట్లాడి, నన్ను మాట్లాడనీయకుండానే ఫోన్ కట్ చేసినాడు. నాకు దిక్కు తోచలేదు. ఆర్నెల్ల నుండీ మా వూరికి పోవాలంటేనే నాకు మొహమెక్కడం లేదు. ఆరోజు కృష్ణయ్య జీవితం నిలబెట్టాలనే తాపత్రయంతో, చంద్రారెడ్డి భార్యను వత్తిడి చేసి వొప్పించిన సందర్భమే మహాసంకట సమయంలో జరిగింది.

ఆ రోజు చంద్రారెడ్డి చనిపోవడమే ఒక విస్మయం. హఠాత్మరణం. మా వూర్లో పెద్ద భూస్వామి చంద్రారెడ్డి. చంద్రారెడ్డికీ వాళ్ళ నాయన మాదిరే రాజకీయాల ధ్యాస లేదు. తనూ, తన కుటుంబం, తన వ్యవసాయం, తన సంపాదన అంతే. ప్రతిఫలం లేకుండా ఎవరికీ ఏ సాయం చేయని ‘లోభి’ తనముందనే పేరుంది.ఆ రోజు ఉదయమే వూరి నుండి ఫోన్. పల్లె నుండి ప్రొద్దుటూరుకు పోతున్న చంద్రారెడ్డి పట్టణ శివారులో యాక్సిడెంట్‌కు గురైనాడు. ప్రొద్దుటూరు గవర్నమెంటు ఆసుపత్రి నుండి కడపలోని మల్టీకేర్ కార్పొరేట్ హాస్పిటల్‌కు తీసుకొస్తున్నారు… అని ఫోన్ సారాంశం. నేను ఊరు విడిచి వచ్చి ఇరవై యేళ్ళయినా… ఊరి దగ్గరున్న అమ్మా, నాయనలు కాలమయి పోయినా ఊరితో నా వేర్లు తెగలేదు.

నేను హాస్పిటల్‌కు చేరుకున్న సమయంలోనే, ప్రొద్దుటూరు నుండి అంబులెన్స్ చేరుకుంది. వెనుక ‘సుమో’లో ఆడవాళ్ళు దిగినారు. మగవాళ్ళెవరూ రాలేదు. వెనుక మోటర్ బైకుల్లో వస్తున్నారన్నారు. ఇక హాస్పిటల్‌లో ‘అంతా నేనే’ అవ్వాల్సి వచ్చింది. వెంటిలేటర్‌తో శ్వాస పోసుకుంటున్న చంద్రారెడ్డి శరీరాన్ని అంబులెన్స్ నుండి స్ట్రెచర్ మీద కిందికి దించినారు. చంద్రారెడ్డి అప్పటికే కోమాలోకి పోయినట్లుంది. ముక్కు నుండి, చెవుల నుండి రక్తం కారుతూ మొహమంతా రక్తమయమయింది. డాక్టర్లు చూడగానే అత్యవసర కేసుగా గుర్తించి, సంబంధించిన డాక్టర్ల టీమ్‌ను నిమిషాల మీద పిలిపించినారు. శరీరంలో మొత్తం అన్ని అవయవాలను ‘స్కానింగ్’ చేయాలని నిర్ధారించినారు. రిపోర్టు రాసి హాస్పిటల్‌కు చెందిన ప్రత్యేక అంబులెన్స్‌లో నగరంలో ఖరీదైన అధునాతన స్కానింగ్ సెంటర్‌కు పంపించారు. వెంట ఆసుపత్రి స్టాఫ్ ఉన్నారు.

నాకు తెరపి దొరికి చుట్టూ చూశాను.
వెయిటింగ్ హాల్‌లో ఉష అచేతనంగా కుర్చీలో జారగిలబడి వుంది.

స్కానింగ్ సెంటర్ నుండి అంబులెన్స్ వచ్చింది. చంద్రారెడ్డిని హాస్పిటల్‌కు చేర్చగానే బయట నుండి వచ్చిన డాక్టర్ల టీమ్ ముసురుకుంది.

ఓ పది నిమిషాలు రిపోర్టులూ, శరీరాన్నీ పరిశీలించి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు.

హాస్పిటల్‌కు చెందిన డాక్టరు బయటకు వచ్చి ‘‘చెన్నై తీసుకుపోండి, ఏర్పాట్లు చేస్తాం!’’ అన్నాడు. ప్రక్కనే ఉన్న నర్సుకు ఒక చీటీ ఇచ్చి, ‘‘వాళ్ళతో అడ్వాన్స్ పోనూ ఈ డబ్బు క్యాష్ కౌంటర్‌లో కట్టించు. కట్టిన వెంటనే వచ్చి చెప్పు’’ పురమాయించాడు.

నేను డాక్టర్‌ను కదిలించినా.
‘బ్రెయిన్ డెడ్. తలలో నరాలన్నీ చిట్లిపోయినాయి. చెన్నై వెళ్ళాక అక్కడ డాక్టర్స్ టీమ్ ఇంకోసారి ఎగ్జామిన్ చేస్తారు. వెంటిలేటర్, స్పెషల్ అంబులెన్స్ ఏర్పాటు చేసి పంపిస్తాం. అక్కడ ఆర్గాన్స్ డొనేట్ చేసేట్లయితే ముందుగానే నిర్ణయించుకోండి’‘ఆర్గాన్స్ డొనేట్’ మాట వినగానే నాకు కృష్ణయ్య జ్ఞాపకం వచ్చినాడు. వాడికి లివర్ పూర్తిగా చెడిపోయింది. ఏ తాగుడు వ్యసనం వల్లో వాడి లివర్ చెడిపోలేదు. ఏదో ‘సిర్రోసిస్’ అనే రోగం వచ్చింది. కుటుంబ సభ్యుల లివర్ మ్యాచ్ కాలేదు.

చదవండి :  నెమిలి కత (కథ) - వేంపల్లి రెడ్డినాగరాజు

అయినా మరొకరి లివర్‌ను కత్తిరించి అమర్చే దశ దాటిపోయింది. ఇపుడు పూర్తి లివర్… కెడావరిక్ లివర్ అంటే బ్రెయిన్ డెడ్ అయిన వారి నుండి పూర్తి లివర్ కావాలి.వాడు ‘జీవన్ దాన్’లో రిజిష్టరు చేయించుకుని, బ్రెయిన్ డెడ్ అయిన వారి లివర్ కోసం చావును కళ్ళల్లో పెట్టుకుని ఎదురుచూస్తున్నాడు. క్షణమాలోచించకుండా, ఉన్నఫళంగా అంబులెన్స్‌తోపాటు, వెనుక వాహనంలో నేనూ చెన్నై బయలుదేరాను.

వాహనంలో పోతుండగానే, చంద్రారెడ్డి కొడుకులిద్దరికీ ఫోన్ చేశాను. ఎంటెక్ పూర్తిచేసి ఢిల్లీలో సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న పెద్ద కొడుకుతో, ఈ నడుమనే పూణేలో సాఫ్ట్‌వేర్‌లో చేరిన చిన్న కొడుకుతో మాట్లాడాను. ఇద్దరూ ‘యాక్సిడెంట్ విషయం’ తెలిసిందన్నారు.

బ్రెయిన్ డెడ్ విషయం చెప్పి, అవయవ దానానికి వాళ్ళను ఒప్పించే ప్రయత్నం చేశాను.

చెన్నై హాస్పిటల్‌లో మరోసారి డాక్టర్స్ టీమ్ ‘బ్రెయిన్ డెడ్’ నిర్ధారించాక, అవయవ దానం ప్రస్థావన చేశాను. కొడుకులిద్దరూ సమ్మతి తెలిపినారు. ఉష అస్సలు ఒప్పుకోలేదు. ససేమిరా కాదంటే కాదంది. హిస్టీరిక్‌గా ప్రవర్తించింది.

‘‘అవయవాలన్నీ తీసేసి కాయాన్ని మూటగట్టి ఇస్తే తీసుకుపోవాల్నా? నేనొప్పుకోను. నా మొగుడే పోయిన తర్వాత, ముక్కూ మొఖం తేలీని వాళ్ళెకెవరికో ఆయప్ప అవయవాలిచ్చి వాళ్ళను బతికించేంత దయ నాకు లేదు. ఆ పుణ్యం మాకొద్దు’’ అంటూ చెన్నై హాస్పిటల్‌లో పిచ్చిదానిలా ఊగిపోయింది. ఏడుస్తూ ఉన్మాదిలా రేగిపోయింది.

ఆమె అన్న, తమ్ముళ్ళకు విడమరిచి చెప్పి, వాళ్ళ ద్వారా ఆమెనెలాగో ఒప్పించామందరమూ. కొడుకులిద్దరూ ఆసుపత్రి వాళ్ళిచ్చిన అన్ని కాగితాల మీదా బాధగానే సంతకాలు చేసినారు. ఉష ఏడుస్తూ, అందర్నీ శాపనార్థాలు పెడుతూ సంతకం చేసింది.

ఆ రోజు నుండి ఊర్లో ఉష కనపడినవాళ్ళందరి దగ్గరా నన్ను శాపనార్థాలు పెడుతోందని విన్నాను. ఎట్టున్నవాడిని అట్లే పూడ్చి సమాధి కట్టుకోకుండా, తన భర్తను పీలికలు పీలికలు చేసి మూట కట్టి చేతిలో పెట్టించానని దుమ్మెత్తి పోస్తోందని విన్నాను.

ఇవన్నీ విని నాకు ఊరికి పోవడానికే మొహమెక్కడం లేదు. పుణ్యానికి పోయి ఏదో పాపం చేశానేమోననే న్యూనత. మా ఊరికి పోయి ఉషకు కృతజ్ఞతలు చెప్పి వద్దామని, కృష్ణయ్య ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాడు. నేను ఆ మొర ఆలకించలేదు. ఇప్పుడు తప్పేటట్లు లేదు. కృష్ణయ్యకూ ఫోన్ చేసినా. ‘‘మా ఊరికి వెల్దాం. గంటలో రడీగా ఉండు.’’

మధ్యాహ్నం రెండు గంటలకు భాస్కర్ నుండి ఫోనొచ్చింది. ‘వాళ్ళు కడపకు ఎంటరయినారంట. హరిత టూరిజం రెస్టారెంట్ దగ్గరకు రమ్మన్నా. నువ్వు రా సామీ!’’

నేను వెళ్ళగానే రఘురామ సోమయాజిని పరిచయం చేశాడు. యాభై యేళ్ళు దాటినట్లున్నాయి. మరో ఇద్దరు. యువకుడు తమిళం. యువతి కన్నడం. ముప్ఫై, ముప్ఫై అయిదేళ్ళ మధ్యలో ఉన్నారు. వాళ్ళకూ తెలుగు రానట్లుంది. ఇంగ్లీషులో మాట్లాడుతున్నారు.

‘‘వీళ్ళిద్దరూ కూడా మీ ఫ్రెండ్ లైఫ్ ఇచ్చినవాళ్ళే. డాక్టర్ శరవణన్, కల్పన. చంద్రారెడ్డి రెండు కిడ్నీలూ వీళ్ళలో చెరొకటి ఉన్నాయి.’’

భాస్కర్ మాటలు, నాకు సంభ్రమం కలిగించాయి.
చంద్రారెడ్డి మరణంతో, జీవిస్తున్న ముగ్గురు అజ్ఞాత వ్యక్తులు నా కళ్ళముందు కనిపిస్తున్నారు. నాలుగోవాడు కృష్ణయ్య వచ్చాడు.

ఏవేవో బేకరీ ఐటమ్స్ మోసుకొచ్చాడు.
వాటిని కారులో పెడదామని డిక్కీ తెరిపిస్తే, డిక్కీ నిండా పండ్ల పెట్టెలు. ఆపిల్స్, పైనాపిల్స్, ఆల్‌మండ్స్, కర్జూరాలు… రకరకాలు. వాటితోపాటు తేనె సీసాలు.

నేను, భాస్కర్‌ను పక్కకు పిలిచి, నేను ఊరికి ఎందుకు రాలేనో దీనంగా చెప్పి, నా పరిస్థితి అర్థం చేసుకోమన్నాను. వాళ్ళను మా ఊరికి తీసుకుపోయి ఉషతో మాట్లాడించి తీసుకురమ్మన్నాను. అక్కడ వీళ్ళు గానీ, ఆమె గానీ ఏ రకమైన ఎమోషన్‌కు గురికాకుండా చూడమన్నాను. ‘అందుకు నువ్వే సమర్ధుడి’వంటూ కాళ్ళా వేళ్ళాపడ్డాను.

‘‘నాకు ఇదేం పితలాటకం సామీ!… సరేలే!’’
ఐదుగురూ కారెక్కారు. డాక్టర్ శరవణన్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. నేను కారెక్కకపోయే సరికి, బెంగుళూరు నుండి వచ్చిన ముగ్గురు దిగి నా చేతులు పట్టుకుని బలవంతం చేశారు. భాస్కర్ వారితో కన్నడంలో ఏదో సర్దిచెప్పి కారెక్కించాడు.

చదవండి :  'రాయలసీమ సంస్కృతి'పై చిత్రసీమలో ఊచకోత

నాకు మనసు కుదురుగా లేదు. అన్ని పనులు విడిచిపెట్టి ఇంట్లోనే కూర్చున్నా. నిలకడ లేదు… కాలు కాలిన పిల్లినైపోయాను… అక్కడేం జరుగుతోందో! భాస్కర్‌కు ఫోన్ చేయాలనుకుని చేతికి తీసుకోవడం. మళ్ళీ ఆలోచన విరమించుకుని పక్కన పడేయడం. ఫోన్ రింగైతే, పరుగున పోయి ‘భాస్కరేమో?’ అని చూడడం… నిరాశగా లిఫ్ట్ చేసి అవతలి వాళ్ళతో పొడిపొడిగా మాట్లాడి, ‘బిజీగా ఉన్నా’నంటూ కట్ చేయడం.

నాకు నరాలు చిట్లిపోయేట్లున్నాయి.
సాయంత్రం ఆరు గంటలవుతుండగా భాస్కర్ నుండి ఫోన్.

‘‘ఏమైంది రా?’’
‘‘బాగా టెన్షన్ పడ్తున్నట్లుందే. అంతా సవ్యం బాసూ! బయలుదేరి మీ వూరి పొలిమేర దాటుకున్నాం.’’
‘‘ఉష ఏమనింది?’’
‘‘ముందు కొంచెం ముభావంగా ఉన్నింది. వీళ్ళు మాట్లాడిన తీరు ఆమెను కరిగించింది. శరవణన్, కల్పనతో పాటు రఘునాథ సోమయాజి కూడా వంగి ఆమె కాళ్ళకు నమస్కరించేసరికి ఆమె తత్తరపడింది. ఇంకా మనోడు కృష్ణయ్య కూడా పాదాభివందనం చేసేసరికి సిగ్గుపడింది. ఇక్కడ నేనోగొప్ప అనువాదకుడినైపోయినా. వీళ్ళ మాటలు ఆమెకు తెలుగులో, ఆమె మాటలు వీళ్ళకు కన్నడంలో, తమిళంలో చెప్పడమే నా పని అయిపోయింది.

మేము పోయిన అర్ధ గంటకు పల్లెలో వాళ్ళు చాలామంది ఆ ఇంటికి చేరినారు. వీళ్ళు, ఊరిలో వాళ్ళతో ఉష మా పాలిట దైవమనీ, ఆమె వల్లే తాము బతుకుతున్నామనీ లేకుంటే ఈ శరీరాలు ఈ పాటికే మట్టిలో కలిసుండేవని పదే పదే చెప్పుకున్నారు. బాసూ! మీ వూర్లో అంతకుముందు చంద్రారెడ్డి ఆర్గాన్స్ డొనేషన్స్ గురించి ఏమనుకున్నారో గానీ, వీళ్ళు పోయిన తరువాత ఇప్పుడు చంద్రారెడ్డి, ఆయన భార్య చాలా గొప్పవాళ్ళయిపోయినారు. వీళ్ళు అక్కడికి చేరిన వారందరికీ పండ్లు, స్వీట్స్ పంచినారు. సోమయాజి డబ్బు ఇవ్వబోతే కూడా ఉష తీసుకోలేదు. వీళ్ళు తెచ్చిన పండ్ల పెట్టెలు, తేనె సీసాలు కూడా వద్దంది. బలవంతం చేస్తే రకానికొక పండ్ల పెట్టె, ఒక తేనె సీసా తీసుకుంది.

మిగిలినవన్నీ తిరుగుటపా. అవన్నీ నీకూ నాకే…’’
‘‘నోర్మూసుకోరా! నీ ఓగల కూతలూ నువ్వూ! పక్కన వాళ్ళున్నారనే సిగ్గు కూడా లేదా!..’’
‘‘సిగ్గెందుకు బాబూ! వాళ్ళకు మన ఓగల కూతలేవీ అర్థం కావులే. ఆ సరుకంతా తిరిగి తీసుకుపోవడం వాళ్ళు అవమానంగా భావిస్తున్నారు. అయినా…’’

భాస్కర్ మాట్లాడుతుండగానే సెల్‌లో ఉష ఫోన్.
భాస్కర్‌ను కట్ చేసి ఉష ఫోన్ లిఫ్ట్ చేసినా ‘హలో’ అన్నా సంశయంగా.
‘‘అన్నా! బాగున్నారా! నన్ను క్షమించు. మా ఆయప్ప కాయము అంతా కోసి మూటకట్టి ఇచ్చినారని అందరితో నిన్ను నానా మాటలు మాట్లాడినా. ఈ పొద్దు వాళ్ళొచ్చి పోయినాక తెలుస్తాంది ఎంత గొప్పపని చేయించినావు. చచ్చిపోవాల్సిన నలుగురు మనుషులు మా ఆయప్ప అవయవాలతో బతికి, నా ముందుకొచ్చి నిలబడి ఉంటే నాకు ఏందో వింత జరిగినట్లుంది. ఊర్లో ఈయప్ప ఎవరికీ ఏ సాయం చేయడని అనుకుంటారు. ఈపొద్దు ఎనిమిది మందికి బతుకునిచ్చినాడు గదన్నా. వాళ్ళు నాలుగు లక్షలు లెక్క ఇయ్యబోతే వద్దంటే వద్దని చెప్పినా. ఆ లెక్క తీసుకుంటే ఆయప్పను అమ్ముకున్నట్లు గాదాన్నా!…’

కండ్లు, ఊపిరితిత్తులు, ఇంగా ఏవో అవయవాలు తీసుకున్నవాళ్లు ఎక్కడుంటారో నీకు తెలుసా అన్నా! వాళ్ళను కూడా చూసింటే బాగుండుననిపిస్తాంది.’’

ఉష నన్నేమీ మాట్లాడనీయలేదు. నేనేమీ మాట్లాడలేకపోయాను.
‘‘నువ్వూ, వదినా ఊరికి వచ్చినప్పుడు ఇంటి కాడికి రాండిన్నా!’’ అన్నది చివరగా.
‘‘సరేమ్మా!’’ఉష మాట్లాడాక నా మనసులో ఆర్నెళ్లుగా మోస్తున్న బరువేదో దిగిపోయినట్లయింది.
‘ఒకసారి ఊరికి పోయి రావాల’ అనుకున్నా.

(సాక్షి ఫన్ డే, 04 డిసెంబర్ 2016)

ఇదీ చదవండి!

సిద్దవటం కోట

జిల్లా సంస్కృతిని అందరికీ తెలపాల

కడప: పర్యాటక అభివృద్ధికి జిల్లాలో అనేక ఆదాయ వనరులు ఉన్నాయని, జిల్లా సంస్కృతిని అందరికీ తెలపాలని ఏజేసీ ఎం.సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: