ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు
ఒంటిమిట్ట కోదండ రామాలయం

పౌరాణిక భౌగోళిక చారిత్రక ప్రాధాన్యాన్ని నింపుకొన్న ఒంటిమిట్ట

పౌరాణికం

1. సీతారామలక్ష్మణులు అరణ్యవాసం చేస్తున్నపుడు సీతమ్మ కోసం రామయ్య బాణం సంధించి భూమి నుంచి నీరు తెప్పించిన చోటు ఇక్కడుంది. అక్కడే నేడు రామతీర్థం వెలసింది.

2. సీతమ్మ కోసం వెతుకుతూ జాంబవంతుడు ఇక్కడ ఒక రాత్రి నిద్రించాడు. మరునాటి ఉదయం ఒక శిలలో సీతారామలక్ష్మణుల్ని, భావించి నమస్కరించి అన్వేషణకు బయలుదేరాడు.

ఈ గుట్ట మీద నిర్మాణం అయిందే కోదండరామాలయం.

భౌగోళికం

తిరుమల నుంచి కడపకు వస్తున్న శేషాచలం కొండలు ఒంటిమిట్టను దాటుకొంటూ విస్తరించాయి. ఆ కొండల్నుంచి వచ్చే నీళ్లతో ఒంటిమిట్టలో చెరువు, సమీపంలో గుడి ఏక కాలంలో నిర్మాణ మయ్యాయి. ఇది రాయలసీమ ప్రాంతం. ఒకనాడు రత్నాలసీమ, నేడు కరువు సీమ.

చారిత్రకం

1. క్రీ.శ. 1340-55 ప్రాంతంలో ఉదయగిరి పాలకుడు కంపరాయలు ఈ ప్రాంతంలో సంచరించి గుడి, చెరువు నిర్మించేందుకు ఆజ్ఞలు జారీ చేశారు. (ఒంటిమిట్ట కైఫీయత్తు, కల్నల్‌ కాలిన్‌ మెకంజీ సేకరణ)

2. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి బుక్కరాయలు క్రీ.శ. 1356 తరువాత కాశీ రామేశ్వర యాత్ర చేస్తూ – ఒంటిమిట్ట గుడిలో సీతారామలక్ష్మణులు కొలువు దీరిన ఏకశిలా విగ్రహాన్ని నిలిపారు. (కడప జిల్లా మాన్యువల్‌ 1875, జె.డి.బి. గ్రిబుల్‌, గండికోట శాసనం ఆంగ్లానువాదం, పేజి 376-78)

చదవండి :  ప్రొద్దుటూరు అమ్మవారిశాల

3. బుక్కరాయల ప్రతిష్ఠ నాటికి గర్భాలయం, అంతరాలయం, ఆలయం పైన చిన్న గోపురం మాత్రం ఉండేవి. (గండికోట శాసనం ఆంగ్లానువాదం, ఒంటిమిట్ట కైఫీయత్తు)

4. రంగమంటపం, మహా ప్రాకారం, తూర్పు, ఉత్తర, దక్షిణ దిక్కులో ఎత్తైన గోపురాలు. క్రీ.శ. 1590 నుంచి క్రీ.శ.1628 మధ్యలో నిర్మాణం అయ్యాయి. విజయనగర సామ్రాజ్యంలో అమరనాయకులుగా ఉంటూ సిద్ధవటాన్ని పాలించిన మట్లిరాజుల పర్యవేక్షణలో విజయనగర చక్రవర్తుల ఆదేశాలతో ఈ నిర్మాణాలు జరిగాయి.

  •  మట్లి అనంతరాజు కాలంలో తూర్పు గాలిగోపురం, మహాప్రాకారం నిర్మాణం అయ్యాయి.
  • ఉత్తర దక్షిణ గాలిగోపురాలు – అనంతరాజు కుమారుడు తిరువేంగళనాథరాజు, మనుమడు కుమార అనంతరాజు కాలంలో పూర్తయ్యాయి.

5. మట్లి అనంతరాజు కాలంలో అప్పటికి శిథిలమైన రథం స్థానంలో నూతన రథనిర్మాణం చేశాడు, రథ వివాదానికి చెందిన తీర్పు శాసనం మహాద్వారం తూర్పు – లోపలివైపున ఉత్తరం గోడ మీద ఉంది. (4, 5 అంశాలకు సంబంధించిన ఆధారం – సిద్ధవటం కైఫీయత్తు – మెకంజీ సేకరణ)

చదవండి :  కడప జిల్లాలో బౌద్ధ పర్యాటకం

దాన శాసనాలు

6. క్రీ.శ. 1555, 1558 నాటి దాన శాసనాలు విజయనగర చక్రవర్తి సదాశిరాయలు వేయించినవి. తూర్పు ద్వారం లోపలివైపున ఉన్నాయి.

7. ఇంకా వెలుగుచూడని శాసనాలు కనీసం ఒక ఇరవై ఉన్నాయి. ఒంటిమిట్ట చుట్టూ ఉన్న గ్రామాల ఆదాయం ఒంటిమిట్ట గుడికే చెందుతూ ఉండినట్లు – కైఫీయత్తుల్లోని దానశాసనాలు తెలుపుతున్నాయి.

8. భాగవతాన్ని తెలుగు చేయనున్న పోతనకు ధ్యానంలో కనిపించింది ఒంటిమిట్ట కోదండరాముడే! ఆ ‘రఘురామునికే’ పోతన తన భాగవతాన్ని అంకిత మిచ్చాడు. అయ్యలరాజు తిప్పయ్య, అయ్యలరాజు రామభద్రుడు ఉప్పుగొండూరు వెంకటకవి, వరకవి అయ్యప్ప వంటి కవులు ఈ కోదండరాముని సేవించి రచనలు చేశారు.

9. వావిలికొలను సుబ్బారావు – 20వ శతాబ్దం ప్రారంభంలో వాసుదాసుడై వందలాది రచనలు చేసి శ్రీరామునికి సమర్పించారు. మహమ్మదీయుల కాలంలోనే, ఆంగ్లేయుల కాలంలోనే మాన్యాలు కోల్పోయి దీనావస్థలో ఉన్న ఒంటిమిట్ట ఆలయానికి పునర్వైభవం తీసుకొచ్చారు.

10. ఇక్కడ మతభేదం కనిపించదు.

  • టిప్పుసుల్తాన్‌ కాలంలో ఒంటిమిట్ట తుకిడీ అమలుగా ఉన్న అక్బర్‌ బేగ్‌ వంశీయుడు హిమాంబేగ్‌ గుడికి బావి త్రవ్వించాడు. ఆ జలం గుడి కార్యక్రమాలకు వినియోగించేవారు.
  • మన్రో కలెక్టర్‌గా ఉన్న కాలంలో కొద్దిగా దేవాలయానికి ఆర్థిక సహాయం అందుతూ ఉండేది.
  • స్థానిక మలకాటిపల్లి మాలఓబన్న ప్రతినిత్యం స్వామి సన్నిధిలో భజన చేసేవాడు. ఆయన భజన పాటలకు భక్తులు ముర్సిపోయేవారు. వారికి గుర్తుగా దేవాలయం ముందు స్వామికి ఎదురుగా మాలఓబన్న మంటపం ఉంది.
చదవండి :  ఒంటిమిట్టలో కృష్ణంరాజు

– విద్వాన్ కట్టా నరసింహులు

ఒంటిమిట్ట కోదండ రామాలయం ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

రచయిత గురించి

భాషాపండితుడుగా ఉద్యోగ విరమణ పొందిన విద్వాన్ కట్టా నరసింహులు గారు కడపలోని సి.పి. బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్ర బాధ్యతలు నిర్వహించారు. సి.పి. బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం – ప్రకటిస్తున్న మెకంజీ కైఫీయత్తులుకు సంపాదకత్వం వహించినారు.ఇప్పటి వరకు వీరు ఆరు సంపుటాలకు సంపాదకత్వం వహించారు. కడప జిల్లా చరిత్ర సాహిత్యాల వికాసానికి కృషి చేస్తున్న వీరు ప్రసుతం కడపలో నివసిస్తున్నారు. ఫోన్ నంబర్: 9441337542

ఇదీ చదవండి!

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు

తితిదే ఆధీనంలోకి ఒంటిమిట్ట

మాట తప్పిన ప్రభుత్వం తితిదే అజమాయిషీలోకి కోదండరామాలయం కోదండరామయ్య బాగోగులకు ఇక కొండలరాయుడే దిక్కు ఒంటిమిట్ట: వందల కోట్ల రూపాయలు వెచ్చించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: