కాలచక్ర మెరుగగాలేక ఎప్పుడు సంధ్య జపము సేయు జాణలార!

ఋషులదెట్టి జాతి ఇంపుగా వెలసిన

బ్రహ్మకిష్టులైరి బ్రహ్మలైరి

తుదిని ఎవ్వరైన సొదమునుటేనయా!

విశ్వదాభిరామ వినురవేమ

ఋషులకు కూడా కులభేదాలు అంటగడితే ఎలా? అంటున్నాడు వేమన ఈ పద్యంలో. ఋషుల కులం, వంశం, తెగ, వర్గం, పుట్టుక లాంటి వాటిని గురించి ఆలోచించడం శుద్ధ అనవసరం. వారు తపః సంపన్నులు కాబట్టి సృష్టికర్త మెప్పును పొందారు. ఉత్తమ స్థాయిని పొందిన వారి గురించి కులం గిలం అనే మీమాంస ఎందుకు? ఏ కులం వారైనా చివరకు చితిని చేరుకోవడమే కదా! గ్రహించమంటున్నాడు వేమన.

ఋషి అంటే ద్రష్ట. అంటే సత్యాన్ని దర్శించినవాడు (ఋషి దర్శనాత్). ఇంద్రియాలను జయించి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినవాడు ఋషి. కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, వశిష్ఠుడు… వీరు సప్త ఋషులు. మరో క్రమంలో మరికొందరుంటారు.

ఇంపు అంటే ఆనందం, ఇష్టం. బ్రహ్మ జ్ఞానం అంటే తత్త్వజ్ఞానం పొందారు కాబట్టి, వేద కర్మలను ఆకళించుకున్నారు కాబట్టి, చిత్ స్వరూపాన్ని గ్రహించారు కాబట్టి వారు బ్రహ్మకు ఇష్టులయ్యారు.

ఇక్కడ బ్రహ్మ శబ్దంతో ఆడుకున్నాడు వేమన. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కావొచ్చు, బ్రహ్మవేత్త కావొచ్చు, చివరకు బ్రాహ్మణుడు కావొచ్చు. జ్ఞానం ప్రధానం కానీ కులం కాదు అంటున్నాడు వేమన.

చదవండి :  బహుళజాతి చిలుకలు (కవిత) - తవ్వా ఓబుల్ రెడ్డి

 

ఎంతటి ఋషులైనా, ఏ కులం వారైనా ఒకనాటికి మరణించక తప్పదు కదా! తుది అంటే చరమ దశ, సొద అంటే మామూలుగా అయితే గోడు. తమ కష్టాలను ఇతరులకు చెప్పుకోవడం. కాని సొద అంటే చితి. శవాన్ని కాల్చడానికి పేర్చిన కట్టెలను సొద అంటారు. ‘సుదతీయేటికి సొద చొచ్చెదు’ అని ప్రయోగం. సొదజొచ్చు అంటే అగ్ని ప్రవేశం చెయ్యడం అని అర్థం.

కాలచక్ర మెరుగగాలేక ఎప్పుడు

సంధ్య జపము సేయు జాణలార!

సంధ్య జపములోని జాడలెట్లుండును?

విశ్వదాభిరామ వినురవేమ

కాలం యొక్క భ్రమణంలోని అంతరార్థం తెలుసుకోకుండా మూడు పూటలా సంధ్యావందనం ఆచరించే నేర్పరులారా! ఒక్కసారి ఆలోచించి చూడండి కాలం దిశ ఎటువైపు వెళ్తుందో అని హెచ్చరిస్తున్నాడు వేమన.

 

కాలచక్రం అంటే చక్రాకారంగా తిరిగే కాలం. చక్రం అంటే ఇక్కడ గ్లోబు కాదు. భూమండలం. కాలం రోజులు, నెలలు, సంవత్సరాలు రాశులుగా విభజించబడింది. అవి గడిచిపోయి మళ్లీ తిరిగి వస్తాయి. అందుకే చక్రం. ఇంతకూ కాలమంటే ఏమిటి? కాలమంటే సమయం. దీనిని సూర్యుడు ఏర్పరుస్తాడు. స్థూలంగా అయితే కాలాన్ని భూత భవిష్యత్ వర్తమానాలంటాం. దీనికే కాలయంత్రమని పేరు.

 

చదవండి :  'ఏముండయన్నా కడపలో'? : కడప పర్యటన - 1

అలాగే ఒక రోజును (అంటే 12 గంటలు) ఐదు భాగాలు చేసి ప్రాతః కాలం, సంగవ కాలం, మధ్యాహ్నం, అపరాహ్ణం, సాయంకాలాలు అన్నారు. వీటి మధ్య సుమారుగా 2 గంటల 24 నిమిషాలు వ్యవధానముంటుంది. వీటిలో ప్రాతః, మధ్యాహ్న, సాయంకాలాలు సంధ్యలు. త్రిసంధ్యల్లో నమస్కారం చేసి గాయత్రీ మంత్రాన్ని జపిస్తారు. పద్యంలో ‘ఎప్పుడు’ అనే మాటకు రోజూ మూడు పూటలా అని అర్థం.

ఇంతకూ సంధ్య అంటే ఏమిటి? సూర్యమండల స్థిత చైతన్యంతో జీవ చైతన్యాన్ని సంధించే శక్తిని సంధ్య అంటారు. సూర్యోదయానికి ఐదు గడియల ముందుండేది ప్రాతః సంధ్య.

సూర్యాస్తమయానికి ముందు మూడు గడియల వరకు వ్యాపించి ఉండేది సాయం సంధ్య. సంగవం అంటే కాల పంచకంలో రెండోది. ఈ సమయాన్ని లౌకికమైన కోరికల కోసం ఉపయోగిస్తారు.

ఇవన్నీ బాగానే ఉన్నాయి కాని ఇంతకూ కాలం అంటే ఏమిటో తెలుసా? యాంత్రికమైన జపతపాదులతోనే ఆగిపోక, కాస్త పెకైదిగి ఆలోచించమంటున్నాడు వేమన.

కాలాతీతం అయిందంటాం. అంటే యుక్త సమయం దాటిపోవడం. అంటే ఏమిటి? యముణ్ని కాల పురుషుడు అంటారు. ఎందుకు? కాలధర్మం చెందడం అంటే ఏమిటి? కాలధర్మం చెందటమంటే చనిపోవడం. చనిపోవడం కాలం యొక్క లక్షణమన్నమాట! పుట్టడం కూడా కాలధర్మమే కాని అలా అనం. బ్రౌన్ కాలధర్మానికి అర్థం చెప్తూ ఖీజ్ఛి ఛ్ఛీఛ్ట ౌజ ూ్చ్టఠట్ఛ అన్నాడు. ప్రకృతికి చెల్లించవలసిన బాకీ, ఇక్కడ ఈ అర్థం సరిపోదు గాని బ్రౌన్ లోక వ్యవహారంలోంచి ఈ అర్థాన్ని తీసుకొని ఉంటాడు.

చదవండి :  ఇంటి యాలి విడిచి యెట్లుండవచ్చురా..

‘వాడికి బాకీ తీరిపోయింది’ అంటారు. అలాగే కాలజ్ఞానం అంటే ఏమిటి? విద్యారణ్యుడు, సర్వజ్ఞుడు, చెన్న బసవడు, పోతులూరి వీరబ్రహ్మం వీరు భవిష్యత్తును గురించి ఎలా చెప్పగలిగారు?

 

కాలం యొక్క ప్రభావం తెలియని జపతపాలు వ్యర్థమే కదా అని సారాంశం. కాలమాహాత్మ్యం ఎట్లాంటిది? దానిని ఎలా ఆరాధించాలి? కాలం ఎంతో బలమైనది, దురతిక్రమమైంది. జపతపాలు దానిని అడ్డుకోగలవా? ఇంతకూ కాలమంటే ఏమిటి? కాలమంటే క్రియ. గడిచిపోయేది నీ కాలం కాదు, గడిపేదే నీ కాలం. కాబట్టి కాలాన్ని తెలుసుకుంటే నీకూ పరమాత్మకూ గల సంబంధం కొంత అవగతం కావొచ్చునంటున్నాడు వేమన.

జాణ అంటే సమర్థుడు, రసికుడు; జాణతనం అంటే చాతుర్యం, ప్రౌఢత్వం అంటూ అనేక అర్థాలున్నాయి. తెలంగాణలో ‘శానతనం చేస్తున్నాడు’ అంటారు. అది జాణతనమే, ఎక్కువ మాట్లాడుతున్నాడని.

 

ఒక స్థాయికి వెళ్లగలిగితే కాలమే సృష్టి రహస్యం, కాలమే దైవం.

డా॥ఎన్.గోపి
(సాక్షి దినపత్రిక)

ఇదీ చదవండి!

అద్వితీయ ప్రతిభాశాలి పుట్టపర్తి

తెలుగు సాహిత్యంలో ఇరవయ్యో శతాబ్దిలో అత్యంత ప్రతిభావంతులైన ఇంకా కొన్ని తరాలు కూడా చెప్పుకోగల గొప్ప రచయితలు ఐదుగురిని లేదా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: