gandhi

గాంధీజీకి, కడప హరిజన మిత్రులకు మధ్య జరిగిన సంభాషణ

కడపలో గాంధీజీ విశ్రాంతి తీసుకుంటున్న రోజున (1934(౧౯౩౪) జనవరి 1 (౧)) కొందరు స్థానిక హరిజనులు ఆయనను కలుసుకొని వివిధ విధాలైన అంతరాలతో ఉన్న వర్ణ వ్యవస్తను గురించి సంభాషించారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఆ సంభాషణ కడప జిల్లా హరిజనుల చైతన్యాన్ని, ముక్కుసూటితనాన్ని వ్యక్తీకరించింది. గాంధీజీకి, కడప హరిజన మిత్రులకు మధ్య జరిగిన ఆ సంభాషణ మీ కోసం …

హరిజన మిత్రులు: నేటి వర్ణ వ్యవస్థ ఉండవలెనని మీ అభిప్రాయమా? పోవలెనని అభిప్రాయమా?

గాంధీజీ: హరిజనోద్యమమం వర్ణ వ్యవస్థలోని అట్టడుగున ఉన్న చెడును పెకలించడానికి ప్రయత్నిస్తున్నది. అస్పృశ్యత పోయినట్లయితే ఈనాడు మనం చూస్తున్న కులాలు కూడా పోగలవు.

హరిజన మిత్రులు: అది ఎంత మాత్రం జరగదు.

గాంధీజీ: నేను అంతిమస్థాయినందుకొన్న అస్పృశ్యతను గురించి మాట్లాడుతున్నాను. అస్పృశ్యత అనే చెడు ఏదో ఒక రూపంలో హిందూ సాంఘీక వ్యవస్థ అంతటిలోను వ్యాపించి, హిందూ సంఘానికి కీడు చేస్తున్నది. అస్పృశ్యతకు మూలం ఎక్కువ తక్కువలనే భావమే. అంతిమస్థాయినందుకొన్న అస్పృశ్యత పోయినట్లయితే తక్కినది పోయి తీరుతుంది. అట్లా పోకపోయినట్లయితే, మన ఉద్యమమంతా వట్టి మాయ. హేచ్చుతగ్గులనే వ్యత్యాసం పోనంతవరకు అస్పృశ్యత పోయిందని చెప్పటానికి వీలే లేదు.

హరిజన మిత్రులు: ఇక మీరు సమర్థిస్తున్న వర్ణాల మాటేమిటి?

చదవండి :  కడప మండల చరిత్రము : జనమంచి శేషాద్రి శర్మ

గాంధీజీ: నిజమే! నేను వర్ణాలను సమర్థిస్తున్నాను. వర్ణ వ్యవస్థను గురించిన నా వ్యాఖ్యానం మీరు తెలుసుకోవలె. ప్రస్తుత కుల వ్యవస్థకు, వర్ణ వ్యవస్థకు ఇత్తడికి, పుత్తడికి ఉన్నంత భేదం ఉంది. వర్ణం అనేది ఆర్ధిక సూత్రానికి సంబంధించినది అని నా అర్థము. దానిని మనం అట్లా గ్రహించి ఉండవచ్చు. గ్రహించకపోవచ్చు. వర్ణ వ్యవస్థను పాటిస్తే మానవ జాతి సుఖంగా ఉంటుంది. దానిని పాటించనందున సంఘం విచ్చిన్నమవుతుంది. అదే ఇప్పడు ప్రపంచంలో జరుగుతున్నది. బలం గలవానిదే న్యాయం (హక్కు) అనే సిద్ధాంతానికి వర్ణ వ్యవస్థ పూర్తిగా వ్యతిరేకము. అది గొప్పవాళ్ళు, తక్కువవాళ్ళు అనే వ్యత్యాసాలన్నిటిని రూపుమాపుతుంది.

హరిజన మిత్రులు: అయితే వర్ణానికి మీరు చెప్పే అర్థం మరెవ్వరూ చెప్పటంలేదే!

గాంధీజీ: కావచ్చు. మానవుని బావ పరిణామంతో పాటు మాటల అర్థాలు కూడా మారుతుంటాయి. వర్ణ వ్యవస్థను సిద్ధాంతీకరించిన మూల మంత్రంలోగానీ, వర్ణాలను గురించి చెప్పిన గీతలోగానీ నే చెప్పిన అర్థం స్పష్టంగా కనిపిస్తుంది.సహభోజన వివాహాలకు సంబంధించిన నియమాలకు వర్ణ వ్యవస్థతో ప్రత్యక్ష సంబంధం లేదు. వర్ణ ప్రత్యెక లక్షణం వృత్తి.

హరిజన మిత్రులు: ప్రతివాడు తండ్రి వృత్తినే అవలంభించేటట్లు నిర్భందిస్తారా మీరు?

గాంధీజీ: నేను గానీ మరెవ్వరుగానీ ఎవ్వరినీ అట్లా నిర్భందించలేదు. నిర్భంధించడానికి గానీ, నిర్బందిన్చాకపోవడానికి గానీ వర్ణ ధర్మం మానవ నిర్మితమైనది కాదు. మానవుని పునరుద్ధరణకు అది అత్యవసరము. అతడు దానిని పాటించకుంటే అందుకు ఫలితం అనుభవించగలడు. వర్ణాశ్రమ నియమాలను పాటించడానికి, ఉల్లంఘించడానికి అతనికి స్వేచ్చ ఉన్నది. ఆ వ్యవస్థను భారతదేశం కనిపెట్టింది. శతాబ్దాల కొద్దీ దానిని భారతీయులు తెలిసి ఉండి విశ్వసనీయంగా అనుసరించినారు. నేడు కూడా అజ్ఞానంతోనో తప్పనిసరిగానో భారతీయులలో ఎక్కువమంది దానిని అనుసరిస్తూనే ఉన్నారు. ఆ సిద్ధాంతం ప్రకారం బ్రాహ్మణుడు, భంగి ఇద్దరూ ఒకే స్థాయిలో ఉంటారు. తన విధిని తానూ హృదయపూర్వకముగా విశ్వాసంతో నిర్వర్తించే భంగీ దేవుని కృపకు పాత్రుడవుతాడు. బ్రాహ్మణుడు ఎంత పండితుడయినప్పటికి తన ధ ర్మం సరిగా నిర్వర్తించకుంటే దేవుని కోపానికి గురి అవుతాడు. వర్ణ వ్యవస్థ హక్కులను, అధికారాలను ప్రసాదించటం లేదు. ధర్మం ప్రతిపాదిస్తున్నది. ధర్మ శాస్త్రాన్ని గుర్తించి దానికి విధేయులుగా ఉండటం వల్లనే నిజమైన ప్రజాస్వామ్యం రూపొందుతుంది. అందువల్ల వర్ణ వ్యవస్థలో దోషం లేదని నా అభిప్రాయం. ఒక వర్ణం గొప్పది మరొకటి తక్కువది అనే భావంలోనే దోషమున్నది.

చదవండి :  జిల్లాల వారీ నేర గణాంకాలు 1984

హరిజన మిత్రులు: మీరు వర్ణించిన వర్ణ వ్యవస్థ కేవలం మీ ఊహలో మాత్రమే ఉన్నది. మా చుట్టూ గట్టిగా కరుడు కట్టిన కులాలు కనిపిస్తున్నాయి. వారంతా ఒకరికన్నా ఒకరు మిన్న అనుకొంటున్నారు.

గాంధీజీ: అదే దురదృష్టం. నేను కేవలం కుల వ్యవస్థకు, వర్ణ వ్యవస్థకు ఉన్న ప్రధాన భేదం మీ ప్రశ్నకు సమాధానంగా చెప్పినాను. కులాలు మానవ నిర్మితాలు. అవి రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. అవి పోయి తీరవలె. నేను వర్ణించిన వర్ణ వ్యవస్థ కేవలం నా ఊహలోనే ఉండిపోవచ్చు. కానీ నేను వివరించిన వ్యాఖ్యానం మాత్రం ఊహాజన్యం కాదు. అది స్వతస్సిద్దంగా మంత్రంలో ఉన్నది, భగవద్గీతలో వివరంగా చెప్పబడి ఉన్నది.

చదవండి :  కడప, పులివెందుల ఉపఎన్నికల తాజా సమాచారం

ఆ తరువాత కడపలో జరిగిన ఒక సభలో గాంధీజీ మాట్లాడుతూ.. “హరిజనులకు మంచి ఇండ్లు, ప్రత్యెక బావులు, పాఠశాలలు నిర్మించినంత మాత్రాన మన కర్తవ్యమ్ పూర్తయినట్లు భావించకూడదు. మనమివన్నీ వారికిచ్చి వారిని అస్పృశ్యులుగానే ఉంచిన పక్షంలో వారిని ఇనుప గోలుసులకు బదులు బంగారు గొలుసులతో బంధించి బానిసగా ఉంచడమే. వారికి మనతో పాటు అన్ని సౌకర్యాలు కలుగజేయవలె. అంతేకాదు వారిని మనలో కలుపుకోవలె. వారికీ, మనకూ ఉన్న అంతరాన్ని పూడ్చే విధంగా సేతువు నిర్మించుకోవలె. ఈ వ్యత్యాసం మన మనసుల నుంచి తుడిచిపెట్టుకొంటే గానీ మనం ప్రారంభించిన పవిత్రీకరణ ఉద్యమం పూర్తయినట్లు కాదు. ఇది జరగనిది మనం సంతృప్తి పడి మిన్నకుండరాదు.”

ఇదీ చదవండి!

బుగ్గవంక

బుగ్గవంక రిజర్వాయర్ సొగసు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: