తరం-అంతరం (కథ) – చెన్నా రామమూర్తి

ఎడ్లబండి కదిలింది.
చెరువు కానుకొని ఉండే దట్టమైన చీకిచెట్ల నుంచి కీచురాళ్లు రొద చేస్తానే ఉండాయి ఆగకుండా! చుక్కలు లేని ఆకాశం చినుకులు కురిపించడానికి సిద్దమవుతున్నట్లుగా ఉంది.
కందెన తక్కువై ఇరుసు చేస్తున్న శబ్దం…
రాయి ఎక్కి దిగినపుడు చక్రం మీదున్న కమీ చేస్తున్న శబ్దం…
ఎద్దుల గిట్టల శబ్దం…
సుతారంగా కదిలే ఎద్దుల మెడలోని పట్టీల గజ్జల శబ్దాలు తప్ప ఇంకేమీ విన్పించటం లేదు.
కుదుపు.. సన్నటి కుదుపు…
అలాంటి కుదుపే మనసులోనూ…
బండి రెడ్డిగారిండ్ల దావకెక్కింది.
సోములు మనసంతా కలవరంగా ఉంది.
ఇంకొంచెం సేపటికి బండి చిన్నరెడ్డి ఇంటి ముందు నుంచి పోవాలి… పోనిస్తాడా?… పోనీడా?.. అడ్డంపడి నోటికొచ్చిన కారుకూతలు కూస్తాడా? .. ఇంకా ఏమయినా దండిస్తాడా? అంతులేని ఆలోచనలు భ్రమిస్తున్నాయి. ఎనె్నన్నో జవాబుల్లేని ప్రశ్నలు మెదడును తొలిచేస్తున్నాయి.
గతంలో జరిగిన విషయాలన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొస్తున్నాయి.
* * *
బాగా పొద్దెక్కింది.. కిటికీలోంచి ఎండ తీవ్రత మంచంపై పడింది.
‘నీ దిగులే నీకు జరమై కూచ్చుంది’ అన్న శీనుగాడి మాట నిజమేనేమో అనుకున్నాడు సోములు. శీను ఆ మాట అన్నాడేకాని, వాడయితే మాత్రం ఏం చేస్తాడు. రెక్కలు ముక్కలయ్యేట్లు పని చేస్తాడు. పూటకు పొట్ట నింపుతాడు. వాడి కష్టాన్ని తల్చుకుంటే ఒళ్లు జివ్వుమంటాది.
‘నాకు జ్వరం వచ్చినపుడన్నా శీనుగాడు ఇంటికాడ ఉంటే బాగుండు’ అనుకున్నాడు సోములు.
‘చిన్నరెడ్డి పెండ్లాం యాడ ఇనుకుంటుంది. కోడికూత కంటే ముందే ఆయమ్మకు శీనుగాడు ఎదురుగుంటేనే తృప్తి. లేకుంటే గయ్యిమంటాది’ ఏంటో బతుకు అనుకున్నాడు.
కాళ్లు కదిపి ఎండ వైపు జరిపినాడు. జ్వరాన్ని ఎండ తీవ్రత రెట్టింపు చేసేట్లుంది. చిన్నగా లేచి కరడుగట్టిన గంజిని గుటగుటా తాగనారంభించాడు. ఉబ్బిలికొచ్చింది. తమాయించుకున్నాడు.
‘తూ.. నీయమ్మ… మనిషికి బాగలేనప్పుడన్నా ఇంటికాడ ఒక్కరుండరు. ఇంత అద్దుమానం బతుకాయ…’ తిట్టుకున్నాడు.
అప్పుడే సర్దార్ పుస్తకాలు తీసుకొచ్చి గూట్లోకి నెట్టి ‘ఎట్లుంది నాయినా..’ అన్నాడు. తలెత్తి చూశాడు సోములు. కళ్లు చింతనిప్పుల్లా ఉన్నాయి.
‘ఏంది నాయినా.. ఇంత కాలిపోతాంది ఒళ్లు. జరం ఫుల్లుగా ఉందే..’ అని చెయ్యి పట్టుకొని నాన్నను మంచం వద్దకు తీసుకొచ్చాడు సర్దార్.
‘ఇగో.. మాత్తర్లు తిని నిమ్మలంగ పండుకో.. ఏమి దిగులు పెట్టుకోవాకు. ఎట్ల కావాల్సింటే అట్లయితుందిలే.. అని, కాళ్లవైపు నుంచి ముఖం దాకా దుప్పటి కప్పి పక్కనే కూర్చున్నాడు.
కళ్లు మూసుకుని పడుకున్నాడు సోములు.
కళ్లవైపే చూస్తూ కూర్చున్నాడు సర్దార్.
కళ్లు మూసుకున్నాడే గాని ఆ కళ్ల వెనకాల కదలాడే తీరని కలలు కొట్లాడుతున్నాయన్న భావన సర్దార్‌కు తెలియంది కాదు.
‘రామిరెడ్డి ఎపుడొస్తాడంట..’ కళ్లు మూసుకునే అన్నాడు సోములు.
‘నువ్వు ఊరకే పడుకోలేనా నాయినా…’
‘రామిరెడ్డి ఎపుడొస్తాడంటరా..’ కోపం కలిగిన నీరసంలో…
‘ఆయనకు లెక్క వచ్చేదుందంట.. రాగానే వస్తాడంట..’
‘ఎపుడొస్తుందంట లెక్క…’
‘తొందర్లోనే వస్తాదంటలే.. చెప్పినాడు’
‘త్వరలో అంటే ఎట్ల.. మల్లా.. ఆ చిన్నరెడ్డి మనసు మార్చుకుంటాటేడేమోనని భయం. ఏ నిమిషంలో ఏమి మాట్లాడతాడో ఏమో…?’ ఆందోళనతో అన్నాడు.
‘ఇంగా చిన్నరెడ్డి మాటలేంది.. మన పొలమే గదా అమ్ముకుంటాడాం.. ఇంగేంటికి భయం..’ అన్నాడు సర్దార్.
‘మన పొలమైనా వాళ్లు ఒప్పుకుంటేనే అమ్మాల…’
‘చిన్నరెడ్డి ఒప్పుకోకుంటే ఎట్ల?’ సర్దార్.
‘ఒప్పుకోకుంటేనా..?’ ఇకపై మాట్లాడలేక పోయాడు సోములు. మూసుకున్న కనురెప్పల మధ్య సన్నటి కన్నీటి ధార ఒకటి కన్పించింది.
‘నువ్వు ఏడిస్తే నేన్నీదగ్గరుండను. నాకూ ఏడుపొస్తుంది…’ అంటూ తుండుగుడ్డతో కన్నీళ్లను తుడిచాడు సర్దార్…
* * *
సామేలు పేరు రూపాంతరం చెంది సోములు అయ్యింది. జ్ఞాపకం వచ్చినప్పటి నుంచి తన తండ్రితోపాటు చిన్నరెడ్డి ఇంట్లో పనిచేస్తూనే ఉన్నాడు. చిన్నరెడ్డిది.. తనది ఒకే ఈడు. సామేలు కంటే సోములు పేరు బాగుంటుందని చిన్నరెడ్డి నాయన బాలిరెడ్డి ఎందుకన్నాడో ఏమో.. ఇప్పటికీ అర్థంకాదు. పేరైతే రూపాంతరం చెందింది. కానీ బ్రతుకులో మార్పు లేదు. పిల్లలు ఎదిగి పెద్దవుతున్నప్పటికీ అచ్చం నాన్న బ్రతుకే కళ్ల ముందు కొచ్చినపుడు భయపడేవాడు.. అయినా తప్పదు.. చేయాల్సిందే.. బాలిరెడ్డిలో ఎంత అంతర భావం లేకున్నా కొన్ని విషయాల్లో తేడా అట్టే కనిపించేది.
ఎండనక, వాననక, బురద గుంటల్లో, రాళ్లల్లో రప్పల్లో తిరిగి చివికిపోయిన కాళ్లు ఏలుపుతున్నపుడు అమ్మ చమురు, పసుపు సాది మర్దనా చేసేది. అదే వయసున్న చిన్నరెడ్డి పెద్ద బడిలో చదువుకునేవాడు.
పెద్దయ్యాక, కొన్ని సమయాల్లో చిన్నరెడ్డిలో బాలిరెడ్డి కనిపించేవాడు. ‘నాలో కూడా.. మా నాయన.. కనిపిస్తాడేమో వీళ్ల కళ్లకు’ అనుకునేవాడు. ‘అందుకే.. మా నాన్నలా నా జీవితం’ అనుకునేవాడు సోములు.
సోములుకు ముక్కాలెకరా భూమి ఉంది. నాన్న ఆస్థి అది. కొనే్నండ్లుగా బాలిరెడ్డి చేస్తున్నాడు. ‘అది మాది’ అని చెప్పుకునే ధెర్యం ఎపుడూ చేయలేదు సోములు.
చిన్నారెడ్డి పెళ్లి తర్వాత ఏడు నెలలకు సోములుకు పెళ్లైంది. చిన్నరెడ్డికి కూతురు.. కొడుకు. సోములుకు ఇద్దరూ కొడుకులే. పిల్లల జీవితాల్లో కూడా అంతరాలు కొట్టొచ్చినట్లు కనపడుతున్నాయి.
* * *
‘శీనుతోపాటు సర్దార్‌ను కూడా రేపట్నించి పనిలోకి రమ్మన్నాడయ్యా’ అంది మేరమ్మ భర్త తలను నిమురుతూ.
‘ఏం! వాడు బడికి పోవద్దంటనా…’ అన్నాడు.
‘ఏమో మల్ల.. బడిమాట ఎత్తితే గయ్యిమంటాడు. లేదా మాట మారుస్తాడు.’
‘అదేందే.. మనోన్ని కాలేజిలో చేరిపియ్యాలని అనుకున్నాం.. ఇంగ మాట మార్సేది లేదు..’ అన్నాడు చిన్నరెడ్డిపై కోపంతో…
ఆయన ముఖంలోకి చూసింది మేరమ్మ.
‘ఇన్ని మాటలు ఎట్ల నేర్చుకున్నాడో.. ఈ మాటల్ని చిన్నరెడ్డి ముందర కూడా మాట్లాడతాడా..’ అనుకుంది. అడగాలని నోరు తెరవబోయింది. చిన్నబుచ్చుకుంటాడని విరమించుకుంది.
‘మరి చిన్నరెడ్డికి ఏం చెప్పాల…’ అంది.
‘ఏందీ చెప్పేది.. ఇంతకుముందే చెప్పిండ్లా…’
‘నువ్వెన్నిసార్లు చెప్పినా – మనోడు కాలేజిలో చేరాలంటే ఆయనే కదా లెక్కియ్యాల… ఆయన ఈకుంటే..’ అనుమానించింది మేరమ్మ.
‘ఆయన ఇయ్యనని తెగజెప్పినాడు.. – అందుకే గదూ.. ఆ ముక్కాలెకరా అమ్ముదామని అనుకున్నాం..’ అన్నాడు.
‘అమ్మనీకి ఆయన ఒప్పుకుంటే కదూ…’ అంది.
‘ఒప్పుకోకుంటేనా..’ రౌద్రం, నిస్సహాయత రెండూ కళ్లలో ప్రస్ఫుటమయ్యాయి. ఇకపై మాట్లాడలేక పోయాడు. తర్వాతి ఆలోచనలు ఏంటో తెలియదు…
* * *
నిర్ణయం ఒక్కటే..
ఆరు నూరైనా.. నూరు ఆరైనా.. సర్దార్‌ను కాలేజిలో చేర్పించాల. వాన్ని చదివించాల.. చిన్నరెడ్డి వినుకోడనీ తెలుసు. ధైర్యం చేశాడు. గట్టిగా శ్వాస పీల్చుకున్నాడు.. ఒళ్లు విదిలించుకున్నాడు.
అరుగు మీద కూర్చున్న చిన్నరెడ్డి ముందుకెళ్లి చేతులు కట్టుకొని, వంగి అదే విషయాన్ని అడిగినాడు.
చిన్నరెడ్డి వినలేదు…
చేతులు కట్టుకొని నిటారుగా నిలబడి అడిగినాడు.
వినలేదు.
చేతులు వదిలి, నిటారుగా నిలబడి అడిగినాడు. వినలేదు.
చేతులు వెనక్కి కట్టుకొని నిలబడి అడిగినాడు. ఊహు.. వినలేదు.
ప్రక్కనున్న అరుగు మీద కూర్చొని అడిగినాడు.
చిన్నరెడ్డి అరుగు మీద నుంచి లేచి వెళ్లబోయాడు.
‘ఉండు రెడ్డి’ అన్నాడు.
‘ఏం!’ అన్నాడు రెడ్డి.
‘ఏదో ఒకటి చెప్పు’ అన్నాడు సోములు.
‘నువ్వు అరుగు మీద కూర్చున్నాక ఏం చెప్పను..?’ అంటూ విసురుగా లోపలికి వెళ్లిపోయాడు చిన్నరెడ్డి.
* * *
సర్దార్‌లో కొత్త ఊపిరి. కాలేజిలో చదువుకుంటానన్న సంబరం. పుస్తకాలకు అట్టలు వేసుకుంటున్న సర్దార్‌ను చూసి మేరమ్మ మురిసిపోయింది.
‘రామిరెడ్డి రేపొస్తాడు. పొలం తీసుకొని లెక్క ఇస్తాడు. లెక్క మన చేతిలో పడేవరకు చిన్నరెడ్డి ఎదురు చెప్పకుంటే చాలు..’ అనుకుంటూ సోములు పుస్తకాల్ని వరుసలో పేరుస్తున్నాడు.
* * *
సోములు మనసంతా ప్రశ్నలమయం.
రామిరెడ్డి రేపొస్తాడా…? రామిరెడ్డి వచ్చాక చిన్నరెడ్డి నా భూమిని అమ్మడానికి ఒప్పుకుంటాడా? బాకీ ఉన్న లెక్కంతా ఒకటేసారి కట్టమని కట్టడి చేస్తాడా…? మమ్మల్ని తనింట్లో పనుల్లోంచి తీసేస్తాడా? ఇంగా ఏమి చేస్తాడో…? ఏమో..?
‘మా నాయన దగ్గర్నుంచి – నేనూ, నా పెళ్లాం, నా కొడుకు శీను ఒళ్లు దాచుకోకుండా పని చేసింది తెల్దా? మరెందుకు ఈయన ఒప్పుకోడు..? ఈ రోజు ఏదో ఒకటి తేలిపోవాల’ అనుకున్నాడు.
రామిరెడ్డి రాకతో – ఇద్దరూ కలిసి చిన్నరెడ్డి ఇంటి వద్దకు వెళ్లారు. ముగ్గురి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది.
స్తంభాన్ని ఆనుకొని నిల్చున్నాడు సోములు.
ఎలా ప్రారంభించాలో తోచక మెల్లగా దగ్గాడు.
‘ఆ భూమి కాయితాలు ఇస్తే.. రామిరెడ్డి తీసుకుంటాడు’ నాలుగు మాటలు పొడిగా అన్నాడు సోములు. చలనం లేదు చిన్నరెడ్డిలో. ‘మన పొలం రామిరెడ్డి పొలానికి ఆనుకొని ఉందని ఆయనకే సెప్పినా.. పొలం అమ్మి పిల్లోన్ని రోంత సదివిచ్చుకున్నామని చెబితే రామిరెడ్డి ఒప్పుకున్నాడు…’ అన్నాడు వివరంగా.
‘్భమిని ఎవరమ్ముతున్నారు?’ అన్నాడు చిన్నరెడ్డి.
‘నువ్వే సెప్పినావుగద రెడ్డి.. నీ ఇష్టమొచ్చినట్లు చేసుకొమ్మని, నేను ఇట్లనుకొని రామిరెడ్డికి సెప్పిన…’ అన్నాడు.
‘్ఛత్.. నోరుముయ్యి. నీకేమన్నా బుద్దుందా రోంతన్నా.. నాకు బాకీ ఉండే లెక్కలేకి నేనే నీ భూమిని తీసేసుకున్నా… ఇంకా నువ్వే బాకీ పడతావు… అట్లాంటప్పుడు మళ్లా భూమిని వానికమ్ముతానంటావా… మరి నా బాకీ సంగతెట్ల?’ అని అటు రామిరెడ్డి వైపు తిరిగి ‘వాడమ్ముతానంటే నువ్వెట్ల వచ్చినావయ్యా కొనడానికి.. నీకు తెల్దా.. వీడు మా ఇంట్లో పని చేస్తాడని.. సరే ఎట్లా ఒచ్చినావు… వాడి లెక్కంతా నువ్వే కట్టి ఈ కాయితాలు తీసుకో..’ అంటూ చిట్టాపద్దులు ముందేశాడు…
‘ఇదంతా ముందు చెప్పాలగద సోములు’ అని చురచురచూస్తూ ‘ఇంత రామాయణం నాకు తెలకపాయలేన్నా..’ అని పంచ సవరించుకుంటూ రామిరెడ్డి మెట్లు దిగి పడమటి వీధిగుండా వెళ్లిపాయ.
సోములు కుటుంబమంతా రెక్కలు తెగిన పక్షుల్లా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ కూర్చున్నారు.
‘ఇపుడు ఏం చేస్తారు’ అంటూ మేరమ్మ,
‘చిన్నరెడ్డి మనల్ని పనిలోకి వద్దంటే మన బతుకు ఏమికాను’ అంటూ శీను.
‘ఇంగ కాలేజిలో చేరటం ఉత్తుత్తదేనేమో’ అంటూ సర్దార్ భావిస్తున్నారు.
‘సర్దార్ చదువు సాగదు. వాడూ మా తిన్ననే.. వాని కొడుకూ మాతిన్ననే.. దీనికి ముగింపు లేదు.

చదవండి :  పాలకంకుల శోకం (కథ) - సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

రామిరెడ్డి మాతిక్కు ఒక్క మాటన్నా సెపుతాడనుకున్నా.. పిల్లిలాగ మెల్లగా దాటిపాయ. ఇంగ ఎవరూ చెప్పరు. మాట్లాడితే మేమే మాట్లాడాల’ మనసులో భావాలు ఆకృతి దాలుస్తున్నాయి.
సర్దార్ గొంతు సవరించుకున్నాడు.
‘నాయినా.. నామాటిను.. ఈ పొలమొద్దు ఈ పని ఒద్దు.. ఈ చిన్నరెడ్డి వద్దు.. ఈ ఊరే వద్దు.. ఇంకా ఎవర్ని నమ్ముతావు చెప్పు. పోనీ మనతిక్కు చెప్పే ఒక్క మనిషన్నా ఉన్నాడా ఈడ…
చదివి బాగుపడతానని నా మీద నాకు నమ్మకముంది. ఈడపడే కష్టం టౌనులోనే పడదాంపండి. ఒక అయిదేండ్లు చేస్తే.. అందరం బాగుంటాం.. నా సదువయిపోతే, ఏదన్నా ఉద్యోగం దొరికితే మల్ల ఎన్ని పొలాలైనా కొనొచ్చు’ అంటూ ఏదేదో చెబుతున్నాడు.
‘వాని మాటలు వింటూంటే వాడు నాకంటే ఎంతో పెద్దోనితిన్న కనిపిస్తున్నాడు. కాదే… చిన్నరెడ్డి మనల్ని ఊరు విడిచి పోనిస్తాడా..’ అన్నాడు మేరమ్మ వైపు చూస్తూ…
వౌనం సమాధానమైంది.
‘ఏంది నాయనా అట్ల మాట్లాడతావు.. మన దావన మనం పోతామన్నా వినుకోరు. అయితే ఎవరికీ తెలకుండా పోదాం.. దొంగగా… నువ్వట్ల భయపడాకు నాయినా.. మనం తప్పకుండా పోదాం..’ అన్నాడు సర్దార్.
కుటుంబ సభ్యులంతా ఒక యోధున్ని చూసినట్లు సర్దార్ వైపు చూస్తున్నారు.
* * *
చిన్నరెడ్డి భార్య లక్షుమ్మ అన్నం వడ్డిస్తూ ‘మేరమ్మ వాళ్లు మనింటికి ఇంగ నుంచి పనికిరారు’ అంది.
ఆయన అగ్గిమీద గుగ్గిలమయ్యాడు.
‘ఎట్ల ఊరిడిసిపోతారో నేనూ చూస్తా…’ అన్నాడు కోపంగా.
‘ఎందుకయ్యా అట్లంటావు…’
‘మరి.. మనింట్లో పనిచేసేవాడే ఎదురు తిరిగితే వాళ్లు బతకాలనేనా..’ గంభీరమయ్యాడు.
ఆమె ఏడుస్తోంది.. ‘ఏమైందని’ అన్నాడు.
‘ఇంకా ఏంకావాల?.. మన పిల్ల మూగిదాయ.. మనోడేమో కుంటివాడాయ.. ఇదంతా ఎందుకు జరిగిందంటావు.. మనం చేసే పనుల్ని దేవుడు చూస్తాంటాడయ్యా..
వాళ్లు చూడు… వాళ్ల పని వాళ్లు చేసుకుంటారు. ఎక్కడైనా బతగ్గలమని ఊరిడిసి పోడానికి సిద్దపడ్నారు.
మనింట్లో సూడు. నువ్వు మాత్రం మీసం దువ్వుకోని సోపాలో కూర్చోవాల. నేనేమో ఈ కుంటి కురూపుల్ని ముందరేసుకొని ఏగాల… ఇదేం బతుకయ్యా!
పక్కవాళ్లను సంతోషపెడితే.. మనమూ సంతోషంగా ఉంటావయ్యా..’ అంటూ కొంగుతో కన్నీళ్లను ఒత్తుకుంటోంది.
‘ఓయ్.. ఏందంతా..’ గర్జించాడు. అయినా చెప్పడానికి సిద్దమైంది.
‘సోములుకు సాయం చెయ్యి’ అంది.
‘వాడు మన పనిమనిషే..’ అన్నాడు.
‘అయితేనేం.. పిల్లోన్ని సదివిచ్చుకుంటాడంట. నీకు ఆ అవకాశమూ లేదు గదా!’ అంది.
‘నీకేమైనా పిచ్చా…’ అన్నాడు.

చదవండి :  ఓడిపోయిన సంస్కారం (కథ) - రాచమల్లు రామచంద్రారెడ్డి ( రా.రా )

‘నువ్వు లెక్క ఈకుంటే మానె.. పొలం కూడా అమ్ముకోనీలేదు..’ అంది.
‘మరి నాకు రావాల్సిన లెక్క..’ అన్నాడు.
‘ఎంత లెక్కయ్యా! చేసే నికృష్టమైన పనుల వల్ల మన పిల్లలు నాశనమైనారు. లక్షల లెక్క ఉండి ఏమి లాభం. మన జీవితం ఇంకా ఏ స్థితికి వస్తుందోనని భయంగా ఉందయా..’ అంటూ ఏడుస్తూ వంట గదిలోకెళ్లింది లక్షుమ్మ.
‘ఊరు ఇర్సనీ నాయాండ్లు – అదీ చూద్దాం’ ఉరుముతున్నాడు.
* * *
సర్దార్ రెండు రోజులు టౌనులో తిరిగి, కట్టెల డిపోలో నాన్నకు, లాండ్రిలో శీనుకు, పని కుదిర్చి విషయం చెప్పాడు.
‘చిన్నరెడ్డితో చెప్పి పోదామా.. చెప్పకుండా దొంగగా పోదామంటారా..’ అన్నాడు సోములు.
‘చెపుతే పోనీడు’ మేరమ్మ అంది.
‘అయితే చెప్పకుండానే పోదాం’ అందర్నీ చూస్తూ సోములు.
ఎంత పిరికిగా బ్రతుకుల్ని భద్రపరచుకోవాల్సి వస్తోంది, అన్న ఒక్క భావం సర్దార్‌ను ఒక పట్టాన ఉండనివ్వలేదు.
‘సరే చెప్పకుండానే పోదాం’ తీర్మానించాడు సర్దార్.
‘ఈ విషయం చిన్నరెడ్డికి తెల్సిందో మూడేపమాన్లకు కట్టేసి కొడతాడు’ అన్నాడు శీను బెరుకు బెరుగ్గా.
‘రాత్రి పనె్నండు దాటినాక మారెన్నను బండి కట్టమని, సామాన్లు ఏసుకొని పోతే సరిపాయ’ సరిదిద్దింది మేరమ్మ.
‘ఎవురికీ తెలకుండా సూడండి’ అన్నాడు సోములు.
* * *
తన పిల్లల్ని ఒకసారి చూసుకున్నాడు చిన్నరెడ్డి. ఏదో తెలియని ఒక అవ్యక్త భావన తనను వెంటాడినట్లు అనిపించింది. మనసంతా కల్లోలం.
‘ఇన్నాళ్లూ బెదిరించి, ఇపుడు సోములుకు డబ్బులిస్తానని ఎలా చెప్పటం? తన భూమిని స్వేచ్ఛగా అమ్ముకొమ్మని ఎట్ల చెప్పాలి? నీ కొడుకుని చదివించుకొమ్మని ఎలా చెప్పాలి? సరే ఇట్ల చేస్తే నేను చిన్నరెడ్డిని ఎలా అవుతా…?’ మనిషి గంభీరంగా ఉన్నా మనసు మూలల్లో ఎక్కడో లోపల తుపాను ముందటి ప్రశాంతత చోటు చేసుకొని కాస్త ఆలోచించమంటున్న ఆజ్ఞలు చిన్నరెడ్డిని తడుతున్నాయి.
‘నేనేమీ చెప్పను. చెప్పనుగాక చెప్పను. అంత బలహీనమైన గుండె కాదు నాది’
* * *
సామానంతా బండిలో వేసినారు. గునపాన్ని బండిలో వెయ్యనివ్వలేదు సర్దార్.
‘వెయ్యరా బండిలో గునపం.. ఎందుకూ’ అన్నాడు నాన్న.
‘పని ఉందిలే నీకు తెల్దు’ అన్నాడు సర్దార్.
‘ఏం పని’
‘చూద్దాం.. చిన్నరెడ్డి ఏమన్నా అంటాడేమో’ అన్నాడు సర్దార్.
ఎడ్లబండి కదిలింది. చీకి చెట్లు, చెరువు కట్ట దాటి రెడ్డిగారిండ్ల దావకెక్కింది. యింగ రోంత సేపటికి బండి చిన్నరెడ్డి ఇంటి ముందు నుంచి పోవాల.
దూరం నుంచి చిన్నరెడ్డి పొగ కాలుస్తూ మిద్దె మీద పచార్లు చేస్తున్నట్లు కనిపించింది.
‘దిగి వస్తాడు. బండి శబ్దం చేయకుండా పోతే బాగుంటుంది’ అనుకున్నాడు సోములు.
గునపాన్ని మరింత బిర్రుగా పట్టుకున్నాడు సర్దార్.
నిముషాలు భారంగా దొర్లుతున్నాయి.
అంతకంటే భారంగా బండి చక్రాలు.
చిన్నరెడ్డి కనిపించలేదు.
బండి.. చిన్నరెడ్డి ఇల్లు దాటి ముందుకు సాగిపోతూ ఉంది.
*

చదవండి :  మా నాయన సన్న పిల్లోడు (కథ) - బత్తుల ప్రసాద్

రచయిత చిరునామా
చెన్నా రామమూర్తి
ట్రైనింగ్ ఆఫీసర్, ప్రభుత్వ ఐటిఐ
తొండూరు (పోస్ట్ – మండలం)
కడప జిల్లా.
– 94944 35236

చెన్నా రామమూర్తి కొండాపురం మండలం దత్తాపురం లో జన్మించారు.

 

ఇదీ చదవండి!

dada hayat

సెగమంటలు (కథ) – దాదాహయత్

సెగమంటలు కథ  మాల ఓబులేసు నీరసంగా రిక్షా తోసుకుంటూ వచ్చి తన ఇంటి ముందాపాడు. ఇల్లంటే ఇల్లు కాదది బోద …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: