రాములవారి గుడి ముందు (కథ) – డా|| ఎల్‌.విజయమోహన్‌రెడ్డి

పుస్తకాల సంచీ బీరువా కింద దాచేసి, సరాసరి వంటింట్లోకి వెళ్ళబోయి, అంతగా పరుగెత్తుకొచ్చినందుకు అత్తయ్య కోప్పడుతుందేమోనన్న విషయం గుర్తొచ్చి గుమ్మంలోనే ఆగిపోయి లోపలికి తొంగి చూశాడు శివు. రంగమ్మ రొట్టెలు చేస్తూంది. చాలా సేపట్నుంచీ పొయ్యిముందు కూర్చుని పనిచేయడం వల్ల ఆమె ముఖమంతా చెమటతో తడిసివుంది. నొసటి కుంకుమ కరిగి ముక్కుమీదుగా కారి చార ఏర్పడింది. ముఖంమీది చెమట బిందువులు పొయ్యి వెలుగులో కెంపల్లా మెరుస్తున్నాయి.

శివు కాసేపు గుమ్మం వద్దనే ఆగి అలసట తీర్చుకుని లోపలికెళ్లి పళ్ళెం అడుగు నుంచి ఓ రొట్టె తీసుకుని ‘అత్తా పొప్పెయ్‌’ అంటూ రొట్టె ముందుకు చాచాడు. రంగమ్మ చేస్తున్న పని ఆపి, తలెత్తి నొసటి మీద చెమటను మోచేత్తో తుడుచుకుంటూ ”పొప్పు చెయ్‌లేదు. బెల్లం పెట్టె బీగం తీసి బెల్లం రొండుండల్దీస్కో” అంది. శివు రొట్టె తట్టలో పడేసి అత్తయ్య మెళ్ళోని తాళిబొటుదండకు ముడేసివున్న తాళంచెవి తీసుకుని బెల్లం పెట్టి తెరిచి, రంగమ్మ చూడకుండా గబగబా నాలుగుండలు నిక్కరు జేబులో వేసుకుని, రెండుండలు మాత్రం చేతిలోకి తీసుకుని, తాళం వేసి, తాళంచెవి అత్తయ్యకిచ్చి, చేతిలోని బెల్లం వుండలు చూపించి రొట్టె నాలుగు ముక్కలు చేసి నిక్కరు జేబులో కూరుకుంటూ బయటికి రాబోతుంటే –

”సివా, సెంకర్రెడ్డి పెదనాయన గారింటికాడ మీ మాముంటాడు. రొట్టె తినేకి రామన్జెప్పు” అని అత్తయ్య పని పురమాయించింది. శివుకు చిరాకేసింది. ”సుంకులమ్మ కట్ట” దగ్గర వెంకటేశూ, నరసింహుడూ, అప్పయ్య, నల్లప్ప, పాపిరెడ్డి అందరూ ఈ పాటికీ కాచుకుని వుంటారు. బడొదుల్తూనే ”చిల్లా-కట్టె” ఆడాలని మధ్యాహ్నమే అనుకున్నారందరూ. ఇప్పటికే ఆలస్యమయింది. ”ఆడుకునేకి పోవల్ల. నేను పోనుపో. కర్రోన్ని పంపీ” అని బయటికొచ్చి ”రేయ్‌! కర్రోడా! శంకర పెదనాయనగారింటికాడ మామున్నాడంట. అత్త పిలుస్తాందని పిల్చకరాపో” అని జీతగాణ్ణి పంపేలోగా అత్తయ్య వంటింట్లోంచి బయటికొచ్చి ”సెప్పిన మాటిను సివా. యెనుములు పిండుకోవల్ల. వాడు దూడల్నిడసద్దా? దావలోనే గదా. ఒగమాట సెప్పిపొయ్యేకి యెంత సేపైతాది” అంది.

శివు గత్యంతరం లేక మామను పిలవడానికి కదిలాడు.

* * * * *

శివు ‘కొలిమి మాను’ దగ్గరికొచ్చేసరికి కొలిమి తిత్తి వూదుతూ పీరా కనిపించాడు. పీరా నాయన మోదీను ఏదో కాగబెడుతున్నాడు. శివు పీరా దగ్గరికెళ్ళి ”రేయ్‌ పీరా చిల్లా కట్టె ఆడీకి వస్తావా?” అని అడిగాడు నెమ్మదిగా. పీరా శివు తింటున్నది చూసి అప్రయత్నంగా చెయి చాపాడు. శివు ఇచ్చిన రొట్టెముక్క నోట్లో వేసుకుని నముల్తూ తల అడ్డం తిప్పి ”తిత్తూదల్ల మా నాయన పంపీడు” అన్నాడు.

పని చేసుకుంటున్న మోదీను తలెత్తి చూసి ‘యేంది రెడ్డీ, ఒకనివే తింటూండావ్‌, నాకు పెట్టకుండ’ అని చిన్నగా నవ్వాడు. శివు గోడదాటి మోదీనుకు ఓ రొట్టెముక్క, బెల్లం వుండ యిచ్చి ”మోదీనూ, బంగరం ములికి చేసీవా, నిన్నే చేసిస్తానంటివే” అని అడిగాడు.

డా|| ఎల్‌.విజయమోహన్‌రెడ్డి గారు పులివెందుల తాలూకాలో యెద్దులయ్యగారి కొత్తపల్లిలో 20, జూన్‌, 1948న జన్మించారు. వీరు మోహ్న అనే కలం పేరుతో రచనలు చేశారు. వృత్తిరీత్యా డాక్టర్‌. చాలా కాలం కిందట నాలుగు మంచి కథలు రాశారు. సాహిత్యం, చిత్రలేఖనం వీరి అభిరుచులు. బాపు, రమణలంటే అంటే వీరికి ఆరాధనాభావం.

చిరునామా: డా|| ఎల్‌.విజయమోహన్‌రెడ్డి, విజయా క్లినిక్‌, 4వ రోడ్‌, అనంతపురం. సెల్‌: 9440866699

”రేపు సాయంత్రికి సేసిస్తాలే రెడ్డీ. యిప్పుడు మామగారిదే మడక్కర్రు దిగేయల్ల. పద్దన్నే దున్నేకి పోతారుట. సాయంత్రికి రెడీ కాకపోతే, రెడ్డి తంతాడు’ అని నచ్చచెప్పాడు మోదీను. శివు ఇచ్చిన రొట్టె ముక్క, బెల్లం నములుతూ, బొంగరం ములికి రేపు సాయంకాలానికి తప్పకుండా చేసివ్వాలని మరోసారి మోదీనుకు చెప్పి పెదనాయన గారింటివైపు పరుగుతీశాడు శివు.

* * * * *

శివు పీర్ల చావిడి దగ్గరికొచ్చేసరికి శంకరరెడ్డి పెదనాయన గారింటికాడ గుంపు కనిపించింది. శివు ఆత్రంగా పరుగెత్తుకెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళడానికి వీలులేకుండా వున్నారు జనం. దగ్గరికెళ్ళి చూశాడు. ఇంటి అరుగు మీద శంకరరెడ్డి పెదనాయన, మామ, మాడిమిద్దె కోటిరెడ్డి, నాగన్నగారి కొండారెడ్డి కూర్చుని వున్నారు. శివు మామకు కనిపించకుండా వెనకనుండి జనంలో చోటు చేసుకుంటూ వెళ్ళి పెదనాయన ప్రక్కన కూర్చున్నాడు. అరుగుకు ఎదురుగుండా నడవలో స్తంభానికి ఆనుకుని చేతులు కట్టుకుని నించుని వున్నాడు చాకలి ఆదెన్న. అక్కడున్న జనమంతా ఆదెన్ననే చూస్తున్నారు. శివుకు అక్కడేం జరుగుతూందో పెదనాయన్నడుగుదామని పించింది కానీ భయం వేసి మానుకున్నాడు. అంతలో కుంటి పుల్లయ్య తాత వచ్చి కూర్చుని ”యేందిరా సెంకరా పంచాయితీ” అనడిగాడు.

”ఇగో మామా, వీడుండ్లా, సాకలి అనుమక్క కొడుకు ఆదిగాడు. వీనిది బండకింది పంపు, అదే తిమ్మాపరం దావలో మన సెంద్రమ్మ కొడుకు నాగిరెడ్డి సేనిపక్కది, ఎకరా వుందిలే. సర్కారు పన్ను కట్లేదు. పిలిపిచ్చి అడిగితే యిరవై దినాల్నుంచీ ”ఈ దినం కడ్తా, రేపు కడ్తా” అంటూనే యిన్ని దినాలూ జరిపినాడు. అక్కడ జూస్తే రూకలు తొందరగా కట్టమని తాసిల్దారు పోరు. నిన్నగాక మొన్న పిలిపిచ్చి ”రెండు దినాల్లో కట్టకపోతే జప్తు చేయిస్తా” నని గట్టిగా సెప్తే, ఇప్పుడే గంటకింద దుడ్లు తీసకచ్చినాడు. పెద్దనోటు ”నా దగ్గిర సిల్లర్లేదురా. నువ్వు కట్టే యేడుం బావలాకి నేనెక్కడ తీస్కరాను. నువ్వే పొయ్‌ సిల్లర తీస్కరా” అని పంపిస్తే మన రంగారెడ్డి కాడికి పోయ్‌ సిల్లర్దెచ్చినాడు. రంగారెడ్డి సిల్లర నోట్లిచ్చి నూర్రూపాయల కాయితం యిప్పించుకునేది మర్సిపోయినాడంట. రంగారెడ్డి కూడా యిప్పుడే అర్ధగంటాయ వచ్చి. ఆదిగాడేమో నూర్రూపయల్నోటిచ్చినాకనే రంగారెడ్డి సిల్లరిచ్చినాడంటాడు. ‘యిస్తే యాడికి పోతాది నాకసలియ్యనే లేదంటాడు రంగారెడ్డి’ అంటూ విషయం విశదపరచాడు శంకర్రెడ్డి.

చదవండి :  కథానికా, దాని శిల్పమూ - రాచమల్లు రామచంద్రారెడ్డి

కుంటి పుల్లయ్య తాత చాకలి ఆదెన్న వైపు తిరిగి ‘యేమి చెప్తా’వన్నట్లు చూశాడు.

”బగమంతుని సాచ్చిగా నూర్రూపాయల కాయితం యిచ్చినా రెడ్డీ, మీ దెగ్గర పెద్దలు గట్టిచ్చి నింట్లో నిలబడి ఆపద్దెం సెప్తానా రెడ్డీ. పన్ను కట్టేకి పద్ది నాలాయె యెవుర్నడిగినా బొట్టు పుట్లేదు. సేనిపన్ను కట్టల్ల. పిల్లది సమర్తయినప్పుడు తీస్కోండి సరుకుల బాకీ కట్టల్ల.

అంగిడింటి సెన్నప్ప దిన్నం యింటి మీద కొస్తాడు దుడ్లీమని. యింటి దానికి కాయిలాసేత్తే గడేకల్లాయనొచ్చి మందిచ్చి బతికిచ్చె. అదీ తీరిసింది లేదు. అదీ నేను చనం కూడా కూకోకుండ పన్జేత్తేగాని యాడాది పొడుగూ కూటికి జరగదు. ఇంటికాడ సూత్తే పెద్దపిల్ల తప్పనిత్తే అందరూ పసోల్లు. సేను సూత్తే యానాడూ పండింది లేదు. పండింది రోంత యిత్తనానికీ, కాండ్ల బాడిగలకీ సరిపాయ. నాకు మిగిలిందేంది కాయకస్టం. ఈ బాకీలన్నీ తీర్సెదెట్లని వుండె. గాడ్దెల్లో రొండు నిన్న పద్దన్నేలన మాపరం సంతకు తోలకపోయ్‌ నూటికమ్మితి. నిన్న సంత సూస్కోనొచ్చేటాల్కి దీపాలు పెట్టేపొద్దాయ. పొద్దుగుంకి నాకయాల్లే అని పన్ను కట్టీకి రెడ్డింటికాడి పొయ్యేవాన్నల్లా యింటికి పోతి. ఇయాల సీకట్లోనే సాకిరేవుకు పోతి. యేటికాన్నుంచొత్తానే బువ్వదిని పన్ను కట్టేకి వొత్తే రెడ్డి సిల్లరలేదు. నువ్వే తీసకరాపో అంటే అంగడింటికి పొయ్‌ సెన్నప్పకియ్యాల్సిందిచ్చి సిల్లరదెత్తామని బైటకొత్తానే తలారి లింగడు గనపడి రంగారెడ్డింటికిపో, రెడ్డింటికాన్నే వుండాడు. పద్దన్నే సెనిక్కాయల్లెక్క యిచ్చి పొయ్‌నారుపో అనంటే రెడ్డోలింటికి పోతి. రెడ్డి బీరవసార్లో కూకొనిబుక్కులో రాసుకుంటూ నోట్లు యెంచుకుంటావుండె. సిల్లరడిగితే యాడిదిరా పెద్దనోటు పట్టకచ్చినా వంటూ నోటు తీసుకొని సిల్లర నోట్లు యెంచిచ్చె. గాడిదల్నమ్మినానని రెడ్డిక్కూడా సెప్తి. బాకీ వుండే సంగతి కూడ సెప్పి సిల్లర తీసుకొని పన్ను కట్టేకి ఈడకొస్తి రెడ్డీ, ప్రమాన సత్తెంగా నోటు రెడ్డికిచ్చినాకనే సిల్లర తీసుకుంటి. పిల్లలోన్ని రెడ్డీ. పిల్లలమీద ప్రమానం సేసి సెప్తాండా. నోటిచ్చినాకనే సిల్లర తీస్కుండా అంటూ చాకలి ఆదెన్న వినయంగా, నమ్మకంగా పెద్దల ఎదుట మనవి చేసుకున్నాడు. శివు చాకలి ఆదెన్ననూ, మామనూ శంకర పెదనాయన్నూ, తాతనూ, కట్టమీది మిగత పెద్ద మనుషుల్నీ మార్చి మార్చి చూస్తూ శ్రద్ధగా వింటున్నాడు.

”వాడు నోటియ్యలేదు సిన్నాయనా. యిచ్చింటే యెక్కడ పోతాది. నాకు బాగా గ్యాపకం. సిల్లర నోట్లు యెంచిచ్చినా. నోటు తీస్కోలేదు. సెనిక్కాయల్లెక్క కూడ మూడువేలు పెద్ద నోట్లిచ్చి మిగతాది సిల్లరిచ్చినాడు. దలాలిసాయిబూ, కావల్లంటే నువ్వే సూడు ముప్పై నూర్రూపాయల కాయితాలున్నాయంటూ జేబులోంచి నోట్లకట్ట తీసి పడేశాడు రంగారెడ్డి.

”దాంట్లొ సూసేదేందుంది. నువ్‌గాని అపద్దం సెప్తావా, నూర్రూపాయలకాడ” నోట్ల కట్ట ఎంచకుండానే రంగారెడ్డికి తిరిగిచ్చేసి ఆదెన్న వైపు తిరిగి ”యేరా ఆదిగా నిజ్జంగ నూర్రూపాయల కాయితం యిచ్చినావా? ఒకేల మర్చిపోయ్‌ జోబులో పెట్టుకోనొచ్చుకుంటివా? అట్లేమైనా జరిగింటే సెప్పు, యిప్పుడైనా మునిగిపొయ్యింది లేదు. నువ్వేం కావల్లని జేసింటావా, మర్సిపోయుంటావ్‌” అని అనునయిస్తూ అడిగాడు కుంటి పుల్లయ్య తాత.

”లేదు రెడ్డీ. పోతానే, నోటిచ్చినా. నోటిచ్చి నాకనే రెడ్డి సిల్లరిచ్చె” అన్నాడు ఆదెన్న నమ్మకంగా.

”అయితే నీ దగ్గిర నూర్రూపాయలకాడ నేనే అపద్దం జెప్తానంటావా?” అంటూ కోపంగా లేచాడు రంగారెడ్డి.

మామ ఆదెన్నను తంతాడేమోనని శివుకు భయం వేసింది. శంకరరెడ్డి రంగారెడ్డిని చేత్తో ఆపి నువ్వుండమన్నట్లు సైగజేసి, ఆదెన్నవైపు తిరిగి ”ఆదిగా, నువ్‌ నోటిచ్చి సిల్లర దీస్కున్నప్పుడు ఆడెవురైనా వుండ్రా” అనడిగాడు. ఆదెన్న ఒక్క క్షణం ఆలోచించి ”లేదు రెడ్డీ, నేను పొయ్నప్పుడు బీరవొసార్లో రెడ్డొక్కడే వుండె” అన్నాడు.
”యెట్లరా మల్ల. నువ్విచ్చింది యెవురూ సూల్లేదంటావు. ఎవురూ పలికే క్కూడ లేరంటావ్‌ సూసినా మన్జెప్పేకి. నువ్వు యిచ్చినానన్జెప్తె ఎట్లనమ్మల్ల! తీర్పెట్ల జెప్పల్ల” అన్నాడు శంకరరెడ్డి కాస్త విసుక్కుంటూ. ఆదెన్న తలొంచుకుని నుంచున్నాడు.

”ఏం జెయ్యల్లో నువ్వే సెప్పురా ఆదిగా. వూరికే అట్ల నిలబడితే యెట్ల బెల్లం కొట్టిన రాయి మాదిరి” అన్నాడు అంతవరకూ మౌనంగా వింటూ కూర్చున్న మాడీమిద్దె కోటిరెడ్డి. ఆదెన్న వంచిన తలెత్తలేదు.

”వాడు సెప్పేదేంది! నోటీలేదులే. రంగారెడ్డేం నూర్రూపాయలకాడ యింతమందిలో అపద్దం సెప్తాడా? రంగారెడ్డి సిల్లరిచ్చి నోటడిగేది మర్చిపోయినాడు. యిదే సందని వీడు సిల్లర తీస్కోనొచ్చి యిప్పుడు యిచ్చినానని తప్పుడు కూతలు కూస్తాండాడు. కాకపోతే ఒగపక్క పెద్దమనిసి నోటీలేదురా అంటాంటే యినిపిచ్చుకోకుండా యిచ్చినా యిచ్చినా అని ఒకటే దబాయిస్తాడా! సొలకాల తెగేట్లు కొడ్తే వాడే వొప్పుకుంటాడు” అన్నాడు నాగన్న గారి కొండారెడ్డి తాగుతున్న బీడీముక్క కిందపడేసి కోపంగా.

సత్తెపమానంగా రెడ్డీ నోటిచ్చే సిల్లర తీసుకుండా. నా పెండ్లాం పిల్లల మీద కావాల్సింటే ప్రమానం జేత్తా. బగమంతుని తోడు. పచ్చనాకు తోడు. ఇచ్చినా రెడ్డీ” అన్నాడు ఆదెన్న తలెత్తి.

”ఆదిగా నువ్‌ సెప్పినట్లే పదాం. నిజ్జంగ నోటిచ్చి నానంటాన్నావ్‌. అట్లైతే కర్రుదుయ్‌. నీ దగ్గిర సత్యముంటే నువ్‌ గెలుత్తావ్‌, లేకపోతే రంగారెడ్డి మీద పంచాయితీ పెట్టిన తప్పుకు అయిదునూర్లకు నోటు రాసీ రంగారెడ్డికి” అంటూ పరిష్కార మార్గం సూచించాడు మాడీమిద్దె కోటిరెడ్డి.

కర్రుదుస మనేసరికీ జనంలో గుసగుసలు మొదలయ్యాయి. ఆదెన్న యేమంటాడోనని జనం, పెద్దమనుషులు కూడ ఆదెన్న వైపే చూస్తున్నారు ఆత్రంగా. ఆదెన్న ముఖంలో నమ్మకం దృఢనిశ్చయం కొట్టొచ్చినట్లు కనిపిస్తూండగా ”బగమంతుడే దిక్కు, కానీ రెడ్డీ” అన్నాడు.

చదవండి :  రాతిలో తేమ (కథ) - శశిశ్రీ

* * * * *

శివు నెమ్మదిగా లేచి జనంలోంచి సందు చేసుకుని బయటికొచ్చి వాకిట్లో నుంచుని లోపలికి తొంగి చూస్తున్న మంగలి కిష్టప్పను ”కర్రు దూసేదంటే యేందని” అడిగాడు. కిట్టప్ప వినిపించుకోలేదు. చేత్తో తట్టి పిలుద్దామని చెయ్యెత్తినవాడల్లా యెందుకో మానుకుని ఇంటివైపు పరుగుతీశాడు.

శివు పరిగెత్తుకుంటూ యింటికిపోతూ దారిలో కొలిమ్మాను దగ్గరాగి కర్రుదుసడమంటే ఏమిటో మోదీన్నడిగి తెలుసుకొందామనుకున్నాడు. కానీ మోదీను కొలిమ్మాను కింద కనిపించలేదు. ఇల్లు చేరేసరికీ ఇంటిముందు కసువూడుస్తూ కర్రోడు కనిపించాడు. ”కర్రోడా, అత్తేదీ” అనడిగాడు అలుపు తీర్చుకుంటూ. జలాట్లో ఉంది రెడ్డీ అని, యేం రెడ్డీ అనడిగాడు. శివు వాని మాట వినిపించుకోకుండా ఇంట్లోకి పరిగెత్తి స్నానాల గది తలుపు తడుతూ ‘అత్తా’ అని కేకేశాడు. ‘నీల్లు పోసుకుంటా వుండా రోంచేపుండు’ అంది అత్తయ్య. శివు యేదో చెప్పబోయి ఆగి బయటికి పరుగెత్తుకొచ్చి ”కర్రోడా, కర్రు దుసేదంటే యేందిరా?” అనడిగాడు.

”కర్రు దుసేదంటే ఎవురన్న సుల్ల (అబద్దం) సెప్తే దొంగతనం సేస్తే… నానుండాననుకో, దొంగతనం సేసింటా. పెద్ద మనుషులడిగితే సెయ్యలేదంటా. అప్పుడు కర్రు దుసమంటారు. మడక్కర్రు ఎర్రగా కాగబెట్టి దేవుని గుడికాడ రెండు సేతుల్తో పట్కోని దుసల్ల. నాను సుల్ల సెప్పింటే నా సేతులు కాల్తాయి. నాను దొంగతనం సేసిండననుకో నా సేతులు కాలవ్‌” అని కర్రు దుయడమంటే ఏమిటో వివరంగా తెలియజేశాడు కర్రోడు, చేతిలోని కసువూడ్చే చీపురు కిందపడేసి.

ఇంతలో రంగమ్మ బయటికొచ్చి ”యేందిరా సివా” అనడిగింది.”అత్తా, సాకలాదెన్న వుండ్లేదా, వాన్ని కర్రు దుసమని చెప్పినారు శంకర పెదనాయన, మాడీమిద్దె కోట్రెడ్డీ వాల్లు. వాడు మద్యాన్నం మామ దగ్గిర నూర్రూపాయలకు సిల్లర తీసకపోయెనాడంట. నోటియ్యకుండా సిల్లర తీసకపొయ్‌నాడని మామంటాన్నాడు. ఆదెన్న ”లేదు నోటిచ్చినా నోటిచ్చి నాకనే సిల్లరిచ్చినాడు రెడ్డి” అంటాన్నాడు. దానికే ఆదెన్నను కర్రుదుయ్యమంటాన్నారు అని శంకరరెడ్డి పెదనాయనగారింట్లో తను చూసింది పూసగుచ్చినట్లు చెప్పి ”ఆ ఆదెన్న నోటిచ్చింటే మామే మర్చిపోయినాడేమో, అట్లయితే మామను కర్రు దుయ్యమన్లేదే వాల్లు, ఆదెన్ననే దుయ్యమన్రే” అని సందేహం వెల్లబుచ్చాడు.

”థూ! మీ మామకేం కర్మరా కర్రు దుసేకి. మీ మామను కర్రు దుయ్యమని సెప్పే దైర్నం యెవురుకుంది? నూర్రూపాయలకని మీ మామ అంతమంది ముందర అపద్దం సెప్తాడా? ఆదిగాడంటే సాకలోడు. సిన్నోల కెప్పుడూ సిన్న బుద్దులే. నూర్రూపాయలు మిగుల్తాయికదాని అపద్దం సెప్పింటాడు. అందుకే వాన్ని కర్రుదుయ్యమనిండేది. ఇంకెప్పుడూ అట్లడగద్దు.” అని శివును మందలించింది రంగమ్మ.

”రెడ్డెమ్మా ఆదెన్న మద్దాన్నంకాడ వొచ్చినప్డు రెడ్డి బీరవొసార్లో కూకోనుండె. నాను గాట్లో కసువూడుత్తాంటి, ఆదెన్న నూర్రూపాయ్ల కాయితం రెడ్డికిచ్చ, నాను సూత్తిగదా!” అని తను మధ్యాహ్నం చూసిన విషయం చెప్పాడు కర్రోడు.

రంగమ్మ కొక్క క్షణం యేమనాలో తెలియలేదు. ”కర్రె నాకొడకా యాడ సూత్తా పన్జేత్తాంటివో యేందో. వూరికే సూసినానన్జెప్తావా?” అంది కోపంగా.

”నిజంగ రెడ్డెమ్మా, నా కండ్లతో సూసినా. ఆదెన్న నోటిత్తానే మడిసి పక్క జోబిలో పెట్టుకోని యెంచుతాండీ నోట్లలోటివి పది రూపాయల కాయితాలు యెంచిచ్చె అన్నాడు నిశ్చయంగా. రంగమ్మ ఆలోచిస్తూ నుంచుండిపోయింది. ”మరిసిపోయ్‌నాడేమో నోటు తీసుకోనుండేది. పక్క జోబిలో పెట్టుకోని సూసుకోనుండడు. యిప్పుడేం జేసేది. యింత జరిగినాక ఇప్పుడు మరిసిపోయ్‌నానంటే వూర్లోవాల్లు యేందంటే అదనుకుంటారు. కర్రోడు, సివు యెవురికన్న సెప్తే మానం పోతాది” రంగమ్మకు భయం వేసింది.

”రేయ్‌ కర్రోడా, ఎవుర్తోనూ అనొద్దు. సూసింది సూసినట్లు మర్సిపో. యెవుర్దెగ్గరన్న అన్నావంటె సూడు, మీ రెడ్డికి సెప్పి సింతబరిక లిరిగేదాంకా కొట్టిస్తా” అని బెదిరించింది. వాడు చెప్పనన్నట్లు తల అడ్డం తిప్పాడు. అక్కడికి భయం తీరక ”యెవురికీ సెప్పొద్దు. దసెరి పండక్కు మీ రెడ్డికి సెప్పి కొత్తంగీ, కొత్త నిక్కర పట్టిత్తాలే” అని ఆశ చూపించి శివును పిలుచుకుని యింట్లోకెళ్ళింది. శివుకు పెట్టె తీసి పావలా రూక తీసిచ్చి ”అంగిడింటికిపొయ్‌ పొప్పరమింట్లు కొనుక్కో. సివా! యిక్కడ సూడు. కర్రోడు సెప్పింది ఎవురికీ సెప్పకూడదు. వూర్లో యెవురి కన్న తెలిస్తే మీ మామకు సెడ్డపేరు. నోటిప్పిచ్చుకొండేది మరిసిపోయుంటాడు. బల్లో పిల్లోల్లక్కూడ యెవురికీ సెప్పకూడదు. దేవున్తోడు యెవురికీ సెప్పనను” అని శివును బుజ్జగించి ప్రమాణం చేయమంది రంగమ్మ. శివు ఒక్క క్షణం తటపటాయించి కుడి చేయి తలమీదుంచుకుని దేవున్తోడు, ఎవురికీ సెప్పను అన్నాడు. ”దేవున్తోడు పెట్టుకున్నావు సూడు. యెవుర్తోనన్న సెప్తే కండ్లు పోతాయి. గుడ్డి రామునికి పొయ్‌నట్లు” అని బెదిరించింది. శివు చెప్పనన్నట్లు తలూపాడు. రంగమ్మకు తలమీది బరువు దించుకున్నట్లయింది.

* * * * *

శివు రాములవారి గుడి దగ్గరికొచ్చేసరికి వూర్లో జనమంతా అక్కడే గుమిగూడి వున్నారు. చుట్టుపట్ల యింటి అరుగుల మీద మిద్దెల మీద చాలా మంది నుంచునున్నారు. గుడి అరుగుల మీద వూరి పెద్దలూ, రంగారెడ్డి కూర్చుని వున్నారు. ఆదెన్న వాళ్ళకు దగ్గర్లోనే నేల మీద కూర్చుని వున్నాడు. శివు ముందు నుంచి జనంలోగుండా కాక గుడి వెనుక వైపున్న ”వేపమాను కట్ట” చుట్టుకుని వచ్చి నెమ్మదిగా పెదనాయన పక్కన జేరి స్తంభం చాటున కూర్చున్నాడు. కొలిమి మాను కింద మోదీను కర్రు కాగబెడుతున్నాడు. చుట్టూ వున్న జనం రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆదెన్నను సమర్ధించేవాళ్ళు నెమ్మదిగా, వూరి పెద్దలకు వినిపిస్తుందేమోనని భయం భయంగా మాట్లాడుకుంటున్నారు. రంగారెడ్డిని సమర్ధించేవాళ్ళు కావాలనే పెద్దలకు వినిపించేట్లుగా గట్టిగా మాట్లాడుకుంటున్నారు. ఆ ప్రదేశమంతా జనంతో క్రిక్కిరిసి గుసగుసలతో గందరగోళంగా, సందడిగా వుంది.

అంతలో-

గట్టిగా యేడుస్తూ అరుచుకుంటూ, జనాన్ని తోసుకుంటూ పెద్దలు కూర్చున్న చోటికి పరిగెత్తుకుంటూ వచ్చింది ఆదెన్న భార్య చాకలి పెద్దక్క. ఆమె చంకలోని నాలుగేళ్ళ కుర్రవాడు గుక్క తిప్పుకోకుండా యేడుస్తున్నాడు. వాడు నల్లగా, బలహీనంగా, ఎప్పుడూ చాకిరేవులోనే వుండటం వల్ల ఎర్రబడిన చింపిరి జుట్టుతో కారుతున్న ముక్కుతో అసహ్యంగా వున్నాడు. ఆమె నేరుగా చాకిరేవు నుంచి చేస్తున్నపని మధ్యలో ఆపి వచ్చినట్లుంది. ఎగకట్టిన చీరంతా తడిసిపోయింది. జుట్టంతా రేగిపోయింది. చాలా దూరం పరిగెత్తుకుంటూ రావడం వల్ల అలసిపోయి వుంది. ఉదయం నుండీ అన్నం లేక పోయినా పని చేయడం వల్ల నీరసించి వుంది.
పెద్దక్క ఏడుస్తున్న కుర్రవాడ్ని ఆదెన్న పక్కనే కూలేసి, తనూ కూలబడి గుండెలు బాదుకుంటూ యేడ్వడం మొదలెట్టింది. మధ్య మధ్యలో కర్రు దుయ్యడానికి ఒప్పుకున్నందుకు ఆదెన్నను తిట్టింది. ”పిల్లల గతియేం కాన”ని నిలదీసింది. తప్పుకాసి ఒదిలిపెట్టమని పెద్దల్ని వేడుకుంది. ఎలాగో కష్టపడి నూర్రూపాయలూ తీరుస్తానంది. ఆదెన్న దృఢంగా, రాయిలా కూర్చున్నాడు. పెద్దక్కను ఓదార్చడానిక్కూడా ప్రయత్నించలేదు. పెద్దలు కూడా యేమీ మాట్లాడలేదు. జనం కళ్ళప్పగించి చూస్తున్నారు. శివు స్తంభం చాటు నుంచి భయం భయంగా చూస్తున్నాడు.

చదవండి :  సొప్పదంటు ప్రెశ్నలు (కథ) - వేంపల్లి రెడ్డినాగరాజు

పెద్దక్క యేడుస్తూనే గండం కాయమని దేవుళ్ళనందర్నీ పేరు పేరునా వేడుకుంది. సుంకులమ్మకు కోడిపెట్టనిస్తానంది. దుర్గమ్మ జాతర కొస్తానంది. సంగమ్మకు చీర చదివిస్తానంది.పీర్ల పండగనాడు లాల్‌సామికి వెండి గొడుగు చదివిస్తానంది. కసాపురం ఆంజనేయునికి ఆకుపూజ చేయిస్తానంది, తిరుపతి కొండకొస్తానంది. పెద్దక్క హృదయవిదారకంగా ఏడుస్తూనే వుంది. జనం ఆత్రంగా, భయంగా, నిర్లక్ష్యంగా, నిర్లిప్తంగా, నిస్సహాయంగా, జాలిగా, సానుభూతితో చూస్తున్నారు. శివు బిక్కుబిక్కుమని చూస్తున్నాడు. ఆదెన్న మాత్రం నిశ్చలంగా, దృఢంగా కూర్చున్నాడు తలొంచుకుని. మోదీను కాగబెడుతున్న కర్రు తీసి చూశాడు. అప్పుడప్పుడే ఎర్రబారుతూంది.

”ఆదిగా, కానీరా” అన్నాడు కుంటిపుల్లయ్య తాత.

ఆదెన్న నెమ్మదిగా లేచి వూరబావి వైపు కదిలాడు. కొందరు పిల్లలూ, పెద్దలూ వెంట కదిలారు. శివుకు వెళ్లాలనిపించినా స్తంభానికి అతుక్కుపోయి కదల్లేదు. ఆదెన్న వూరబావిలో కట్టు బట్టల్తో మునిగివచ్చాడు. వస్తూ ఆంజనేయుని గుడిచుట్టూ ప్రదక్షిణం చేసి నమస్కరించాడు. ఆదెన్న రాములవారి గుడి దగ్గరికొచ్చేసరికి, ఆదెన్న బావమరిది మారెన్న గుడిముందు కొంతభాగం కసువూడ్చి. నీళ్ళు చల్లి ముగ్గుతో చదరం గీసి, పసుపు కుంకుమ చల్లి చదరం నాలుగు మూలలా తాంబూలం వుంచి, టెంకాయ సిద్దం చేసి వుంచాడు. ఆదెన్న గుడిచుట్టూ ప్రదక్షిణం చేసి, టెంకాయ కొట్టి నమస్కరించి వచ్చి గుడివైపు ముఖం చేసి చదరం మీద కూర్చున్నాడు. ఎవరో వచ్చి పెద్దక్కను పక్కకు తీసికెళ్ళారు. మోదీను కర్రు బయటికి తీశాడు. బాగా కాలిన కర్రు ఎర్రగా మెరుస్తూంది. కుంటి పుల్లయ్య తాత సైగ చేస్తూనే నాగన్నగారి కొండారెడ్డి లేచివెళ్ళి కర్రు తీసుకొచ్చి ఆదెన్న ముందు నుంచున్నాడు పై చివర దృఢంగా పట్టుకుని. జనం రెప్పవాల్చకుండా ఆత్రంగా చూస్తున్నారు. శివు గుండె అరచేతిలో పట్టుకుని చూస్తున్నాడు గుడ్లప్పగించి. పెద్దక్క ఏడుపు సన్నగా వినిపిస్తూంది.

ఆదెన్న ”సివా, సెంకరా, రామా” అని గట్టిగా అరుస్తూ రెండు చేతుల్తో కర్రు పట్టుకుని కిందకు లాగాడు. ఒక్కసారిగా మాంసం కాలిన వాసన గుప్పుమంది. పెద్దక్క కెవ్వుమని అరిచింది. ఊపిరి బిగబట్టి చూస్తున్న జనంలో చలనం కలిగింది. ఆదెన్న రెండు చేతులూ ముడుచుకుపోయాయి. కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. మనిషి సన్నగా వణుకుతున్నాడు. బాధగా తలొంచుకునేసరికి కళ్ళనీళ్ళు టపటప రాలాయి.

శివు భయంతో గడ్డకట్టుకుపోయాడు. వూపిరి తీసుకోడం మరచిపోయాడు. గుండె వేగంగా కొట్టుకుంటూంది. జనం గందరగోళంగా మాట్లాడుకుంటున్నా వినిపించటం లేదు. అసలేం జరుగుతుందో కూడా తెలియలేదు చాలాసేపటి వరకూ. శివులో చలనం కలిగి పరిసరాల్ని గుర్తించేసరికి కుంటి పుల్లయ్యతాత, శంకరరెడ్డి పెదనాయన, మామ అంగడి చెన్నప్పను పిలిపించి అయిదు నూర్లకు పత్రం రాయిస్తున్నారు.

ఆ రోజు పంచాయితీలో ఆదెన్న మాత్రమే యెందుకు కర్రు దూసాడో, పెద్ద మనుషులు మామనెందుకు కర్రుదుయ్యమని చెప్పలేదో, నిజం చెప్పినా ఆదెన్న చేతులెందుకు కాలాయో శివుకు అర్థమవలేదు. అత్తయ్య ప్రమాణం చేయించుకుని యెవరికీ చెప్పొద్దన్న విషయం అందరికీ వినిపించేలా గట్టిగా అరిచి చెప్పాలనిపించింది. కానీ నోరు పెగల్లేదు. నోటు రాయడం పూర్తవగానే ఆదెన్నను పిలిచారు. ఆదెన్న మౌనంగా పెద్దమనుషుల దగ్గరికి లేచి వెళ్ళి ఎడమచేయి ముందుకు చాచాడు. బొటనవ్రేలితో సహా మొత్తం చేయి కాలిపోయింది. కాలిన బొటనవ్రేలికే ”సిరా” పూశాడు మాడీమిద్దె కోటిరెడ్డి. శివు చూస్తూనే వున్నాడు నిస్సహాయంగా, నిర్విణ్ణుడై. ఆదెన్న ఒణుకుతున్న చేతినెత్తి బొటనవ్రేలితో ప్రామిసరీ నోటు మీద కోటిరెడ్డి చూపించిన చోట శివు చిన్నారి మనసు మీద చెరగని విధంగా ముద్ర వేశాడు.

ఆ రోజు రాత్రికే శివుకు ఒళ్ళు తెలియకుండా జ్వరం వచ్చింది. నిద్రలో ఉలికిపడి లేస్తూ, కలవరిస్తూ, అరుస్తూ, ఏడుస్తూ వున్నాడు. రంగమ్మ శివుని కనిపెట్టుకుని శివు మంచం వద్దే కూర్చుంది. అర్ధరాత్రి దాటిం తర్వాత కలవరింతలు మరింత ఎక్కువయ్యాయి. రంగమ్మ ఏడుస్తూ మంచం దగ్గరే కూర్చుంది. రంగారెడ్డి కూడా అక్కడే కూర్చున్నాడు రాత్రంతా. శివు ఒళ్ళు జ్వరంతో పేలిపోతూ ఉంది. రాత్రంతా గట్టిగా కలవరిస్తూనే వున్నాడు. తెల్లవారుజామున రంగారెడ్డి వున్న పళంగా బండి సిద్దం చేయించి, ఇంటిని కనిపెట్టుకుని వుండమని జీతగాళ్ళతో చెప్పి శివును, రంగమ్మనూ తీసుకుని శివుకు వైద్యం చేయించడానికి ఆ వూరికి ఆరేడు మైళ్ళ దూరంలో వున్న పట్నానికి బయలుదేరాడు.

(21 జనవరి 1977 ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక)

ఇదీ చదవండి!

dada hayat

సెగమంటలు (కథ) – దాదాహయత్

సెగమంటలు కథ  మాల ఓబులేసు నీరసంగా రిక్షా తోసుకుంటూ వచ్చి తన ఇంటి ముందాపాడు. ఇల్లంటే ఇల్లు కాదది బోద …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: