సివిల్స్ లో మళ్ళీ మనోల్ల మెరుపులు

గత కొద్ది సంవత్సరాలుగా సివిల్స్‌లో సత్తా చాటుతుతున్న కడప జిల్లా వాసులు, మరోసారి విజయ పతాక మోగించారు. శుక్రవారం విడుదలైన సివిల్స్ – 2012 ఫలితాలలో జిల్లాకు చెందిన మేఘనాథ్‌రెడ్డి, తేజ లోహిత్ రెడ్డి, సగిలి షణ్‌మోహన్‌లు మెరుగైన ర్యాంకులు సాధించారు. మేఘనాథ్‌రెడ్డి 55వ ర్యాంకును, తేజ లోహిత్ రెడ్డి 101వ ర్యాంకును, సగిలి షణ్‌మోహన్‌ 132వ ర్యాంకును సాధించారు.

తేజలోహిత్‌రెడ్డి

tlreddyకమలాపురంలో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న కొండారెడ్డి కొడుకు తేజలోహిత్‌రెడ్డి.  ఖాజీపేట మండలం సుంకేసుల వీరి సొంతూరు. ఉద్యోగ రీత్యా కమలాపురంలో నివాసం ఉన్నారు.సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో 101వ ర్యాంకు సాధించారు.

ప్రాథమిక విద్య 1 నుంచి 5వ తరగతి వరకు పెనగలూరు, 6 నుంచి7 వరకు రాజంపేట ఇన్‌ఫాంట్‌ జీసస్‌ పాఠశాలలో, 8 నుంచి 10 వరకు కడప నాగార్జున పాఠశాలలో చదివారు. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో 543 మార్కులు సాధించి ప్రతిభ చూపారు.

ఇంటర్మీడియట్‌ బైపీసీ గ్రూపువివిజయవాడలో శ్రీచైతన్యలో చదివి 967 మార్కులు సాధించారు. ఎంసెట్‌లో 6వ ర్యాంకు సాధించారు. ఉస్మానియా యూనివర్శిటీలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. ఐఏఎస్‌ కావాలనే సంకల్పంతో ఎంబీబీస్‌ చివరి సంవత్సరం చదివేప్పటినుంచే సివిల్‌ సర్వీసెస్‌కు సిద్ధమయ్యారు.

వారి సహకారం మరువలేనిది

నేను హైదరాబాద్‌లో ఉంటూ సివిల్స్‌కు చదివాను. కడపకు చెందిన మహేశ్వర్‌రెడ్డి ప్రస్తుతం ఐపీఎస్‌ శిక్షణలో ఉన్నారు. అనంతపురానికి చెందిన భరత్‌గుప్తా(ఐఏఎస్‌) ప్రస్తుతం ఖమ్మం జిల్లా భద్రాచలం సబ్‌ కలెక్టర్‌గా ఉన్నారు. వారిద్దరి సహకారంతోనే నేను ర్యాంకు సాధించా. ఏ సందేహం వచ్చినా వారితో మాట్లాడేవాడిని. ఎప్పుడడిగినా నా నివృతి చేసేవారు. వారి సహకారం మరువ లేను.

జోగిరెడ్డి మేఘనాథరెడ్డి – 55వ ర్యాంకు

megnathరాజుపాళెం మండలం పగిడాల స్వగ్రామం. ప్రస్తుతం ప్రొద్దుటూరు పట్టణం వైఎస్‌నగర్‌లో నివాసం. తల్లిదండ్రులు లక్ష్మిదేవి, ఈశ్వర్‌రెడ్డి.1987 మార్చి 14న జననం. మేఘనాథ్ పెద్ద కుమారుడు. చెల్లెలు శాంతి ఎంబీఏ చదివారు.

చదవండి :  సివిల్స్‌లో సత్తా చాటిన కడపజిల్లా యువకులు

విద్యాభ్యాసం

ఎల్‌కేజీ నుంచి 8వ తరగతి వరకు ప్రొద్దుటూరు పట్టణంలోని సెయింట్‌జోసఫ్‌ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం సాగింది. ఆ తర్వాత 9-10 వరకు ఆదిత్య ఉన్నత పాఠశాలలో చదివారు. పదో తరగతిలో 551మార్కులు తెచ్చుకున్నారు. ఏపీఆర్జేసీ ప్రవేశ పరీక్షలో రాష్ట్రస్థాయిలో ఆరో ర్యాంకు సాధించారు. విజయవాడ శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్‌(ఎంపీసీ) ఆంగ్లమాధ్యమంలో చదివి 948 మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. ఎన్‌డీఏ పరీక్షలో కూడా రాణించారు. హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో డిగ్రీ(ఈపీపీ) చదివి 90శాతం మార్కులు సాధించారు.

పసిడి పతకం

భాగ్యనగరంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎంఏ ఎకనామిక్స్‌ విభాగంలో 92శాతం మార్కులు సాధించి బంగారు పతకం అందుకున్నారు.

* బ్యాంకులో ఉద్యోగం : బెంగళూరు నగరంలోని రిజర్వు బ్యాంకులో రెండు నెలలపాటు పనిచేశారు.

* న్యూఢిల్లీలో శిక్షణ : సివిల్స్‌లో రాణించాలనే తపనతో న్యూఢిల్లీలో ఏడాదిపాటు శిక్షణ పొందారు. 2011 మే 11న సివిల్స్‌ పరీక్ష ఫలితాలు విడుదల కాగా 624 ర్యాంకు సాధించి ఐఆర్‌పీఎస్‌(ఇండియన్‌ రైల్వే పర్సనల్‌ సర్వీస్‌) ఎంపికయ్యారు. అంతటితో ఆగక ఐఏఎస్‌ కావాలనే పట్టుదల మరింత ముందుకు నడిపించింది. కష్టపడి చదివి కలలసౌధాన్ని అందుకున్నారు. తన స్వగ్రామం పడిగాల, నివాసం ఉంటున్న పట్టణం ప్రొద్దుటూరు, జిల్లాకు కీర్తి తీసుకొచ్చి చెరగని ముద్ర వేశారు.

నాన్న కష్టం కదిలించింది

తల్లిదండ్రులు పట్టుదలతో నన్ను చదివించారు. వారి కృషితో రాణించా.నాకు ఏలోటూ రాకుండా చూశార. ఐఏఎస్‌ కావాలనేది వారి కోరిక. కష్టపడి చదివా. ఇష్టపడి కలల స్వప్నాన్ని సాధించా. సెయింట్‌ జోసఫ్‌, ఆదిత్య పాఠశాలల యాజమాన్యానికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. నాన్నే నాకు స్ఫూర్తి. ఆయన కష్టం నన్ను కదిలించింది. రామిరెడ్డి, పి.నరేంద్రనాథరెడ్డి వెన్నుతట్టి ప్రోత్సహించారు. వీరి కృషి ఎన్నటికీ మరువలేనిది.  చిన్నప్పటి కల సాధించాననే సంతోషం చెప్పలేనిది. భవిష్యత్తులో పేద కుటుంబాలకు ఆసరాగా నిలుస్తా. సమాజాభివృద్ధికి శక్తివంచన లేకుండా పాటుపడతా.

షన్మోషన్‌ – 132వ ర్యాంకు

చదవండి :  యోవేవికి ఒకేసారి ఆరు రామన్ ఫెలోషిప్‌లు

manmohanరాయచోటి పట్టణం కొత్తపేటకు చెందిన సగిలి షన్మోహన్‌ తండ్రి సగిలి శివయ్య చిత్తూరు జిల్లా గ్యారంపల్లి గురుకుల కళాశాలలో గణిత అధాపకుడిగా పని చేస్తుండగా తల్లి శ్రీదేవి రాయచోటిలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయురాలుగా పని చేస్తోంది. తల్లిదండ్రుల చెంతనే ఉండి షన్మోహన్‌ ప్రాథమిక విద్యను స్థానిక రాజు విద్యా సంస్థలలో 10వ తరగతి వరకు పూర్తి చేసి అప్పటి ఫలితాలలో రాయచోటిలో మొదటి స్థానంలో నిలిచారు.

23 సంవత్సరాల షన్మోషన్‌ గుజరాత్‌లోని అహమ్మదాబాద్‌లో ఐఐఎం చదువుతున్నారు. సివిల్స్‌ లక్ష్యం కావడంతో 2012 అక్టోబరు 5న సివిల్స్‌ పరీక్షలు రాశారు. పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ప్రత్యేక శిక్షణ కూడా తీసుకోకపోయినా సివిల్స్‌ ప్రిలిమినరీ, మెయిన్స్‌కు ఎంపిక కావడంతో ఆయనకు ఐఏఎస్‌ సాధిస్తానన్న విశ్వాసం పెరిగింది. తక్కువ సమయంలోనే ఇంటర్వ్యూకు తర్పీదు అయి గత నెల 5న జరిగిన ఇంటర్వ్యూలకు హాజరు కావడంతో తొలి ప్రయత్నంలోనే ఆల్‌ ఇండియా స్థాయిలో 132వ ర్యాంకు ఆయన సొంతమైంది. 23 ఏళ్లకే షన్మోహన్‌ ఐఏఎస్‌ సాధించడంతో శుక్రవారం తల్లిదండ్రులు, బంధువులు, పూర్వపు ఉపాధ్యాయులు ఆయనను అభినందనల్లో ముంచెత్తారు.

 ఆది నుంచి విద్యలో దిట్టే

ఎల్‌కేజీ నుంచి 10వ తరగతి వరకు రాయచోటిలోని రాజు విద్యా సంస్థలలో చదివినా 8వ తరగతి చదివే సమయంలోనే సైన్సులో రాణించి జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచారు. 10వ తరగతి ఫలితాలలో రాయచోటిలో ప్రథమంగా నిలిచి హైదరాబాదులోని కృష్ణమూర్తి ఐఐటీ ప్రవేశ పరీక్షలో ఎంపికై ఇంటర్మీడియట్‌ ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యారు. అక్కడ నుంచి బిట్స్‌ఫిలానీకి ఎంపికై రాజస్థాన్‌లో పూర్తి చేశారు. తర్వాత జరిగిన ఐఐఎం పోటీ పరీక్షలలో ఎంపికై గుజరాత్‌లోని అహమ్మదాబాద్‌లో ఆయన ఐఐఎం విద్యను కొనసాగిస్తున్నారు. 2012లో జరిగిన సివిల్స్‌కు హాజరై అనుకున్న లక్ష్యాన్ని సాధించారు.

చదవండి :  కడప నుండి కలెక్టరేట్‌ వరకూ .... తప్పెట ప్రభాకర్‌రావు ఐఏఎస్‌

బాలశాస్త్రవేత్తగా గుర్తింపు

8వ తరగతి చదువుతుప్పుడే సైన్సులో మంచి పట్టు సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన విద్య వైజ్ఞానిక ప్రదర్శనలో రాణించారు, గుజరాత్‌లోని అహమ్మదాబాద్‌లో అఖిలభారత విద్య వైజ్ఞానికప్రదర్శనలో ప్రథమ స్థానంలో నిలిచారు. దాంతో భారత ప్రభుత్వం షన్మోహన్‌కు బాల శాస్త్రవేత్తగా గుర్తింపు ఇచ్చింది. అప్పట్లో జిల్లా విద్యాధికారులు షన్మోహన్‌ను అభినందనందించారు.

విద్య, ఆరోగ్యం మెరుగు పరుస్తా

దేశంలో పేదరికం నిర్మూలనకు విద్య, వైద్య రంగాలు మెరుగు పడాలి. పుట్టిన ప్రతివాడికి విద్య సొంతం చేయాలన్నదే లక్ష్యంగా పని చేస్తా. అందరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏదైనా సాధించగలరు. ఈ విభాగాలపైనే నా ప్రత్యేక దృష్టి పెట్టాలనుకున్నా. ప్రాథమిక దశలో నాకు లభించినచదువే ఉన్నత శ్రేణికి సహకరించింది. ఆత్మవిశ్వాసం పెంచుకుని పోటీ పరీక్షలంటే భయం విడనాడి లక్ష్యం వైపు వెళ్లేందుకు ముందడుగు వేయాలి. ఫలితం సాధనకు ఎక్కువ సమయం పట్టినా ఓపికతో ఆత్మస్త్థెర్యం పెంచుకుని ప్రయత్నించాలి. ఇదే నా లక్ష్య సాధనకు తోడ్పడింది. ఐఐటీ, ఐఐఎం, ఐఏఎస్‌ పరీక్షలు ఇంచుమించు ఒకేలా ఉంటాయి. తల్లిదండ్రులు, విద్యా సంస్థలు ఇచ్చిన ప్రోత్సాహం నన్ను ఈ స్థాయికి చేర్చాయి.

ప్రొఫైల్ 

* సొంతూరు:  పడమరనడింపల్లి గ్రామం,  నంబరుపూలికుంట మండలం, అనంతపురం జిల్లా

* తల్లిదండ్రులు: సగిలి శివయ్య, శ్రీదేవి

* వృత్తిరీత్యా స్థిర నివాసం: రాయచోటి పట్టణం, కొత్తపేట

* ఎల్‌కేజీ నుంచి 10వ తరగతి వరకు రాయచోటిలోని రాజు విద్యా సంస్థలలో చదివారు.

* ఇంటర్మీడియట్‌: హైదరాబాదులోని కృష్ణమూర్తి ఐఐటీలో పూర్తి చేశారు

* బిట్స్‌ఫిలానీ 2007-11: రాజస్థాన్‌లో చదివారు

* ఐఐఎం(2011-13): గుజరాత్‌లోని అహమ్మదాబాద్‌లో చదివారు.

* సాధించిన ఫలితం: సివిల్స్‌: 2012 అక్టోబరు 5న జరిగిన పరీక్షలు రాసి ఆల్‌ఇండియా 132వ ర్యాంకు సాధించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: