హోమ్ » పర్యాటకం » కడప నగరం
మనమింతే

కడప నగరం

కడప (ఆంగ్లం: Kadapa లేదా Cuddapah, ఉర్దూ: کڈپ ), వైఎస్ఆర్ జిల్లా యొక్క ముఖ్య పట్టణము, రాయలసీమలోని ఒక ప్రముఖ నగరము. మూడు వైపులా నల్లమల అడవులు, పాలకొండలతో కడప నగరం చూడముచ్చటగా ఉంటుంది. కడప నగరం యొక్క పాలన ‘కడప నగర పాలక సంస్థ’ పరిధిలో జరుగుతుంది.

కడప పేరు వెనుక కథ:

కడప జిల్లా గెజిటీరులో కడప పేరును 18వ శతాబ్ది వరకూ కుర్ప (Kurpa/Kurpah) అనే రాసేవాళ్ళని స్పష్టంగా ఉంది. ఇది కృప అనే పేరుకు దగ్గరగా ఉంది. స్థలపురాణం ప్రకారం దేవుని కడపలో విగ్రహ ప్రతిష్ఠాపన చేసింది మహాభారతంలోని కౌరవుల కులగురువైన కృపాచార్యుడు. ఆయన పేరుమీదుగా ఆ ఊరిని కృపనగరం, కృపాపురం, కృపావతి అని పిలిచేవారు. కృ శబ్దం ఉచ్చారణ క్రు, క్రి అని రెండు విధాలుగా ఉంటుంది. కృప అనే పేరు జనుల వాడుకలో కురుప/కుర్ప/కరుప/కరిప అని పిలవబడేదనుకోవచ్చు. క్రీ.పూ. 200 – క్రీ.శ. 200 మధ్యకాలంలో భారతదేశాన్ని సందర్శించిన టాలమీ అనే గ్రీకు యాత్రీకుడు ఆ పేరును కరిపె/కరిగె అని రాసుకున్నాడు. ఇక కడప/గడప అనే కన్‌ఫ్యూజన్ కడప నవాబుల కాలంలో మొదలైంది. ఎందుకంటే వాళ్ళ అధికారిక భాష పర్షియన్. ఆ భాషలో క, గ అనే అక్షరాల మధ్య తేడా ఇప్పుడు తెలుగులో థ, ధ ల మధ్య ఉన్నట్లు ఒక చుక్క మాత్రమే. అందువల్ల ‘క’ ను పొరబాటున ‘గ’ అని పలకడం మొదలైంది. ఏళ్ళు గడిచాక దానికి జస్టిఫికేషనుగా తిరుమలేశుని గడప అన్న కల్పన మొదలైంది. “పూర్వం తిరుమలకు వెళ్ళే యాత్రీకులు ముందుగా దేవుని కడపలోని లక్ష్మీ వెంకటేశ్వరుని దర్శించుకోవటం ఆనవాయితీగా ఉండేది.” ఆనవాయితీ ఉన్నమాట నిజమే అయినప్పటికీ కడప పేరుకు దానితో సంబంధం లేదు.

చదవండి :  కడప జిల్లా పేరు మార్పు

భౌగోళికం:

కడప నగరం భౌగోళికంగా 14.47°N 78.82°E వద్ద ఉన్నది. ఇది సముద్రమట్టానికి 138 మీ (452 అడుగుల) ఎత్తులో ఉంటుంది. కడప నగరం యొక్క వ్యాసార్ధం (radius) 8 కి.మీ, వైశాల్యం 203 చ.కి.మీ మరియు చుట్టుకొలత (circumference) 50 కిలోమీటర్లు. విమానాశ్రయం, యోగివేమన విశ్వవిద్యాలయం, కేంద్ర కారాగారంలను పరిగణలోకి తీసుకుని లెక్కిస్తే కడప నగరం యొక్క వ్యాసార్ధం 13 కి.మీ, వైశాల్యం 530 చ.కి.మీ మరియు చుట్టుకొలత (circumference) 81.6 కిలోమీటర్లు.  .

కడప నగర పరిధి
కడప నగర పరిధి

హద్దులు:

ఉత్తరాన చెన్నూరు పట్టణము, దక్షిణాన చింతకొమ్మదిన్నె, తూర్పున భాకరాపేట, పశ్చిమాన యోగివేమన విశ్వవిద్యాలయం కడప నగరానికి సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:

2011 జనాభా లెక్కల ప్రకారం కడప నగర జనాభా 344,078 – ఇందులో పురుషులు 172,969 మంది కాగా స్త్రీలు 171,109 మంది. కడప నగరంలో అక్షరాస్యతాశాతం 79.38. పురుషులలో అక్షరాస్యతా శాతం 86.22గా ఉండగా స్త్రీలలో అది 72.54గా ఉంది.

ప్రత్యేకత:

వివిధ  మతాలు, కులాలకు చెందిన ప్రజల ఐక్యత. కడప నగరంలో రెండు సార్లు పర్యటించిన మహాత్మాగాంధీ సైతం ఇక్కడి వారి మతసామరస్యాన్ని మెచ్చుకున్నారు.

నగరంలోని ప్రాంతాలు:

అక్కాయపల్లి, ఆలంఖాన్‌పల్లి, ఉక్కాయపల్లి, ఎర్రముక్కపల్లి, రామరాజుపల్లి, పుట్లంపల్లి,  అల్మాస్‌పేట, వైవిస్ట్రీట్, ఏడురోడ్ల కూడలి, మద్రాసు రోడ్డు, దేవుని కడప, పాత కడప, నాగరాజుపేట, చెమ్మిమియాపేట, మోచంపేట, సాయిపేట, గంగపేట,  నభీకోట, కాగితాలపెంట, మరియాపురం, శంకరాపురం, చిన్నచౌక్, దొంగల చెరువు, ఊటుకూరు, రవీంద్ర నగర్, ఓంశాంతి నగర్, అరవింద నగర్, ఆయేషా నగర్, గాంధీ నగర్, గౌస్ నగర్, భవాని నగర్, మారుతీనగర్, రామకృష్ణ నగర్, వినాయక నగర్, ప్రకాష్ నగర్, వివేకానంద నగర్, ఎన్జీవో కాలనీ, ఆర్టీసి కాలని, రైల్వే కాలనీ, ఎస్బిఐ కాలనీ, కో-ఆపరేటివ్ కాలనీ, టెలికం కాలనీ,  సింగపూర్ టౌన్‌షిప్, శాటిలైట్ టౌన్‌షిప్

చదవండి :  తెదేపా నాయకులకు కడప జిల్లా ప్రజల ప్రశ్నలు

దర్శనీయ స్థలాలు:

ఆధ్యాత్మికం: దేవుని కడప లక్ష్మీవెంకటేశ్వరాలయం, విజయదుర్గ ఆలయం,మారుతీ నగర్ ఆంజనేయుని గుడి, శివాలయం, అమ్మవారిశాల, అమీన్‌పీర్ దర్గా, చాంద్ పీరా గుంభజ్, సెయింట్ మేరీ కేథెడ్రల్, ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం, రామకృష్ణ మఠం, అహోబిల మఠం

విహారం: శిల్పారామం, రాజీవ్ స్మృతివనం, దేవుని కడప చెరువులో పడవ ప్రయాణం, వైఎస్ఆర్ పార్కు

ఇతరం: సిపి బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం, భగవాన్ మహావీర్ మ్యూజియం, వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియం, వైఎస్సార్ ఇండోర్ స్టేడియం

విద్యాసౌకర్యాలు:

ప్రాధమిక విద్య నుండి ఉన్నత విద్య అభ్యసించేందుకు అవసరమైన అన్ని విద్యాసంస్థలు కడప నగరంలో ఉన్నాయి. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాలలో – కేంద్ర, రాష్ట్ర పాఠ్య ప్రణాళికలను భోదించే విద్యాసంస్థలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వృత్తి విద్యను అందించే పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కళాశాలలు, వైద్య కళాశాలలు, న్యాయ కళాశాలలు మరియు ఉన్నత విద్యకూ, పరిశోధనలకూ ప్రఖ్యాతి గాంచిన యోగి వేమన విశ్వవిద్యాలయం అందుబాటులో ఉంది. క్రీడలలో శిక్షణ ఇచ్చేందుకు పేరొందిన వైఎస్సార్ క్రీడా పాఠశాల ఉంది.

ప్రజారవాణా సౌకర్యాలు:

కడప నగరంలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లేందుకు సర్వీసు ఆటోలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆటోలలో ఒకచోటు నుండి మరోచోటికి వెళ్ళటానికి కనీస చార్జి పది రూపాయలు. నగరంలో తిరిగే బస్సు సర్వీసులను ప్రవేశపెట్టేందుకు ఆర్టీసి కసరత్తు చేస్తోంది. త్వరలోనే ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

బయటి వారిని చేరవేసేందుకు బస్సు స్టాండు, రైల్వే స్టేషనూ, విమానాశ్రయం ఉన్నాయి.  కడప – హైదరాబాదు నగరాల నడుమ రోజువారీ విమాన సౌకర్యం అందుబాటులో ఉంది.

చదవండి :  శత్రుదుర్భేద్యమైన సిద్ధవటం కోట

వైద్య సౌకర్యాలు:

రాజీవ్ గాంధీ వైద్య విద్యాలయంతో పాటు అనేక ప్రయివేటు ఆసుపత్రులు ఉన్నాయి.

సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు, క్యాన్సర్, మెదడు, గుండె సంబంధిత వ్యాధులను నిర్ధారించే కేంద్రాలు కానీ, వాటికి మెరుగైన చికిత్స అందించగలిగిన ఆసుపత్రులు కానీ అందుబాటులో లేవు. విషమ పరిస్థితులలో మెరుగైన వైద్యం కావాలంటే తిరుపతి, వేలూరు లేదా కర్నూలు లేదా హైదరాబాదు వెళ్ళవలసి ఉంటుంది.

మొబైల్, ఇంటర్నెట్ సేవలు:

కడప నగర పరిధిలో అన్ని టెలికం కంపెనీలకు సంబంధించిన సేవలు అందుబాటులో ఉన్నాయి. నగర వ్యాప్తంగా 4జి సేవలు, 3జి సేవలు, బ్రాడ్ బ్యాండ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. నగరంలో పలు చోట్ల ఇంటర్నెట్ సేవలు అందించే కేంద్రాలున్నాయి.

వినోద కేంద్రాలు:

వినోదాన్ని అందించేందుకు నగరంలో సుమారు 15 వరకు సినిమా హాళ్ళున్నాయి. వీటిలో తెలుగు, ఇంగ్లీషు, హిందీ సినిమాలు ప్రదర్శితమవుతుంటాయి. ఇవి కాకుండా సాంస్కృతిక ప్రదర్శనల కోసం కళాక్షేత్రం, నగరపాలక సంస్థ ఆడిటోరియం, శిల్పారామం అందుబాటులో ఉన్నాయి.

మద్యపాన ప్రియుల కోసం శీతల గదులతో కూడిన బార్‌లు (మద్యపానశాలలు) కూడా అందుబాటులో ఉన్నాయి.

హోటళ్ళు/భోజనశాలలు:

నగరవ్యాప్తంగా దక్షిణాది, ఉత్తరాది, తెలుగు శాఖాహార, మాంసాహార వంటకాలను వడ్డించే సాధారణ/శీతల గదులతో కూడిన హోటల్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే పలుచోట్ల భోజన సదుపాయం అందించే మెస్ లు కూడా ఉన్నాయి.

వాతావరణం: ఉష్ణోగ్రత: 30°సె. – 44°సె (ఎండాకాలం), 21°సె. – 30°సె (చలికాలం), సగటు వర్షపాతము: 695 మి.మీ

సందర్శించేదానికి అనువైన సమయం: సెప్టెంబరు  – ఫిబ్రవరి మధ్య కాలం

ఇదీ చదవండి!

ఏమి నీకింత బలువు

ఏమి నీకింత బలువు – పెదతిరుమలయ్య సంకీర్తన

తాళ్ళపాక అన్నమయ్య, అక్క(ల)మ్మల (అక్కమాంబ) సంతానమైన పెదతిరుమలయ్య వాళ్ళ నాయన మాదిరిగానే శ్రీ వేంకటేశ్వరుని సేవలో తరించినాడు. తిమ్మయ్య, తిమ్మార్య, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: