దేవుని కడప

‘దేవుని కడప’లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయం కడప జిల్లాలోని ఒక ప్రసిద్ధ పుణ్య క్షేత్రం. కడప నగరంలోని ఉన్న ఈ పుణ్య క్షేత్రాన్ని దర్శించుకోవటానికి వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు వస్తుంటారు.

నిర్మాణ శైలి : విజయనగర

ప్రత్యేకతలు : ఏటా ఉగాది పర్వదినాన దేవుని కడప ఆలయాన్ని ముస్లింలు దర్శించుకుని స్వామి వారికి భత్యం సమర్పిస్తారు. ప్రతి సంవత్సరం ఈ గుడిలో అధిక సంఖ్యలో వివాహాలు జరుగుతాయి. సమీపంలోని దేవుని కడప చెరువులో పడవ విహారం సందర్శకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.

ఆనవాయితీ : తిరుమల వెళ్ళే భక్తులు మొదటగా దేవుని కడపకు వచ్చి ఇక్కడి స్వామిని దర్శించుకుని అనంతరం తిరుమలకు వెళ్తారు. ఈ ఆనవాయితీ కారణంగా దేవుని కడపకు ‘తిరుమలేశుని తొలి గడప’ అనే పేరు వచ్చింది. స్వామి వారిని దర్శించుకున్న తరువాత పుష్కరిణి సవీుపంలోని సోమేశ్వరున్ని దర్శించుకుంటారు.

ఆలయ నిర్వహణ: ఈ ఆలయం ప్రస్తుతం తితిదే (తిరుమల తిరుపతి దేవస్థానం) ఆధీనంలో ఉంది. ఆలయ నిర్వహణ అంతా తితిదే బోర్డు పరిధిలోనే జరుగుతుంది.

ఈ ఆలయంతో అనుబంధం కలిగిన మహనీయులు: తాళ్ళపాక అన్నమాచార్యులు, కృపాచార్యులు, అద్వైత మఠాధిపతులు, అహోబిల మఠాధిపతులు, మహాకవి క్షేత్రయ్య తదితరులు దేవుని కడపకు చేరుకొని ఇక్కడి స్వామి వారిని దర్శించుకున్నట్లు చారిత్రిక ఆధారాల వలన తెలుస్తోంది. అన్నమాచార్యుల వారు పలుమార్లు దేవుని కడప బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామి వారిపైన సంకీర్తనలను కూడా రాశారు.

చదవండి :  రాజంపేట పట్టణం

ఆలయ చరిత్ర:

వైవస్వత మనువు యొక్క 28వ యుగములో భరత ఖండానికి చక్రవర్తి గా ఉండిన జనమేజయ మహరాజు ఒకసారి తిరుమల యాత్రకు వచ్చి శ్రీవారిని దర్శించుకొని ఆ రాత్రి తిరుమలలోనే బస చేశాడు.

వేంకటేశ్వరస్వామి కలలో కనిపించి తిరుమల చెరువు కట్ట మీద తన విగ్రహం ఒకటి ఉందని ఆ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించాలని జనమేజయుని కోరతాడు. తెల్లవార గానే ఆవిగ్రహాన్ని కనుగొన్న మహారాజు తిరుమలకు వాయువ్య దిక్కున పది ఆమడల దూరాన ఉన్న (ఆమడ = దాదాపు 10 మైళ్ళు) ఆంజనేయ క్షేత్రం (హనుమత్ క్షేత్రం) ఒకటి ఉందని తెలుసుకుని ఆ క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ప్రతిష్టిస్తాడు. ఈ విగ్రహం ప్రతిష్టించిన పుణ్య క్షేత్రమే ఇప్పటి దేవునికడప గా విలసిల్లుతోంది.

దేవుని కడప లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంవేంకటేశ్వర స్వామి విగ్రహానికి వెనుక ఉన్న గోడలో ఇప్పటికీ ఆంజనేయ స్వామి రాతి ప్రతిమను మనం చూడవచ్చు. దేవునికడప క్షేత్రపాలకుడిగా ఆంజనేయుడే ఇప్పటికీ వ్యవహరింపబడుతున్నాడు. ఈ స్తలాన్ని తిరుమలకు ఉత్తర ద్వారంగా జనమేజయుడే ప్రకటించి ఇక్కడ ఒక అగ్రహారాన్ని కూడా కట్టించారు. క్రూరమృగాల వల్ల, ఇతర ఇబ్బందులవల్ల తిరుమలకు వెళ్ళలేని వారు తిరుమలేశునికి ఉత్తర గడప అయిన దేవుని కడపలో మొక్కు చెల్లించుకోవడం అప్పటి నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఆ నాటినుండి తిరుమలేశుని తొలి గడపగా “దేవుని కడప” అలరారుతోంది.

చదవండి :  నందలూరు సౌమ్యనాథ ఆలయం

జనమేజయుని వంశస్తుడైన నందన చక్రవర్తి కాలందాకా దేవుని కడప అగ్రహారం ఆ వంశస్తులచే పోషింపబడింది. నందన చక్రవర్తి ఈ ఆలయాన్ని జీర్ణోద్దరణ గావించాడు. వైదుంబ పదకొండో శతాబ్దంలో ఈ ప్రాంతం మీద పెత్తనం చేసిన వేలూరు బ్రహ్మారెడ్డి ఇక్కడి చెరువును నిర్మించాడు.

శ్రీకృష్ణదేవరాయలుతో సహా పలువురు విజయనగర రాజులు, నంద్యాల రాజులు, మట్లి రాజులు దేవుని కడప ఆలయాన్ని సందర్శించి మడిమాన్యాలూ, ఆభరణాలూ విలువైన కానుకలూ సమర్పించారు. దేవుని కడప ఆలయానికి సంబంధించిన అనేక చారిత్రక ఆధారాలను ఆలయ ప్రాంగణంలోని శాసనాల ద్వారా తెలుసుకోవచ్చు. (ఆధారం: మెకంజీ కైఫీయతులు. )

మరొక కథనం

అలాగే కడప పేరుకు సంబంధించి మరొక కథనం కూడా వాడుకలో ఉంది. కురుక్షేత్ర యుద్ధం తర్వాత కృపాచార్యుడు తిరుమలను దర్శించి అక్కడే గడపాలని బయలుదేరుతాడు. ప్రస్తుత దేవుని కడప ప్రాంతానికి చేరుకున్న తర్వాత ముందుకు వెళ్ళలేక తిరుమలేశుని ప్రార్థిస్తాడు. అక్కడే శ్రీవారు కృపాచార్యునికి దర్శనమిస్తాడు. ఆ తర్వాత కృపాచార్యుడు అక్కడే నివసించడం వల్ల ఆ ప్రదేశానికి కృపానగరం అని పేరు వచ్చింది. అదే కాలక్రమలో కృప గా, కరిపె గా, కడప గా మారిందని చెబుతారు.

చదవండి :  కడపకు 70 కంపెనీల కేంద్ర బలగాలు

బ్రహ్మోత్సవాలు

ప్రతి యేడూ మాఘశుద్ధ పాడ్యమి నుంచి సప్తమి వరకు ఏడు రోజులు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. రథసప్తమి నాడు జరిగే తేరు తిరునాల్ల ప్రత్యేకతను సంతరించుకొంది.

‘దేవుని కడప’కు ఎలా వెళ్ళాలి?

వాయు మార్గంలో:

దగ్గరి విమానాశ్రయం: కడప (11 కి.మీ), తిరుపతి (138 కి.మీ), బెంగుళూరు (260 కి.మీ), చెన్నై (275 కి.మీ),  హైదరాబాదు (400 కి.మీ)

రైలు మార్గంలో:

దగ్గరి రైల్వేస్టేషన్: కడప (5 కి.మీ)

రోడ్డు మార్గంలో:

దగ్గరి బస్ స్టేషన్: కడప (4 కి.మీ)

ప్రయివేటు వాహనాలలో:

బెంగుళూరు వైపు నుండి : చింతామణి, మదనపల్లి, రాయచోటి, గువ్వలచెరువు మీదుగా

చెన్నై వైపు నుండి : తిరువళ్ళూరు, ఊత్తుకోట, పుత్తూరు, రేణిగుంట, రైల్వేకోడూరు, రాజంపేట మీదుగా

హైదరాబాదు వైపు నుండి : జడ్చర్ల, కర్నూలు, నంద్యాల, మైదుకూరు మీదుగా

విజయవాడ వైపు నుండి : గుంటూరు, ఒంగోలు, కావలి, ఉదయగిరి, బద్వేలు మీదుగా

ఇదీ చదవండి!

palakolanu narayanareddy

పాలకొలను నారాయణరెడ్డి ఇక లేరు

మైదుకూరు మాజీ శాసనసభ్యుడు పాలకొలను నారాయణ రెడ్డి (84) సోమవారం హైదరాబాదులో కన్ను మూశారు. ఆయన 1962-67 కాలంలో ఉమ్మడి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: