కడప జిల్లా కథాసాహిత్యం
ఆచార్య డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి

కడప జిల్లాలో కథాసాహిత్యం – డా|| కేతు విశ్వనాధరెడ్డి

కడప జిల్లా కథాసాహిత్యం

నవల, కథానిక, నాటకం, నాటిక వంటి ఆధునిక రచన సాహిత్య ప్రక్రియల ఆవిర్భావం కడప జిల్లాలో కళింగాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాలతో పోలిస్తే చాలా ఆలస్యంగా జరిగింది. కందుకూరి వీరేశలింగం పంతులు తొలి సాంఘిక నవల రాజశేఖర చరిత్ర (1878) వచ్చి, ఎనబై ఏళ్లు గడిచాకే, కడప జిల్లా సాహిత్యకారులు నవలా రచన ప్రయత్నాలు చేశారు. గురజాడ తొలి కథానిక దిద్దుబాటు (1910) తర్వాత ఏ యాభై ఏళ్లకో కడప జిల్లా సాహిత్య చరిత్రలో కథానిక చోటు చేసుకుంది. నాటకం, నాటిక విషయంలో కూడా సాంస్కతికమైన ఈ వెనుకబడటమూ’, చారిత్రకమైన ఈ ఆలస్యమూ కన్పిస్తాయి. వెనకబడటమూ, ఆలస్యమూ మధ్య సంఘటనాపరమైన ఒక వైరుధ్యం లేకపోలేదు. అది, సినిమా వంటి ఒక నూతన సాంకేతిక మాధ్యమాన్ని, ఒక మిశ్ర దృశ్య సాహిత్య రూపాన్ని కడప జిల్లాకు చెందిన కీ.శే.బి.ఎన్‌.రెడ్డి 1939లో చేపట్టటం.

వాహినీ ప్రొడక్షన్‌ తరపున వందేమాతరం (1941) వంటి సమకాలిక జీవితాన్ని చిత్రించటానికి ప్రయత్నించిన చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఆ తర్వాత కాలంలో వాహినీ సంస్థ, విజయా సంస్థ భారతదేశం గర్వించదగిన బి.యన్‌.రెడ్డివంటి కాల్పనిక దర్శకుణ్ణి, బి.నాగిరెడ్డి వంటి చలనచిత్ర నిర్మాతనూ, వాణిజ్యవేత్తనూ తయారు చేయగలిగాయి. ఏభయ్యో దశకంలో కడప జిల్లా ప్రముఖ జాతీయవాది కడప కోటిరెడ్డి కుటుంబానికి కూడా చిత్రనిర్మాణంలో ఏదో మేరకు సంబంధం కన్పిస్తుంది. రెండోప్రపంచ యుద్ద కాలం, ఆ తర్వాత సాగిన ఒక దశాబ్ది దాకా వీరందరి చిత్ర చరిత్ర కడప జిల్లా నుంచి ఒక రచయితను ఆకర్షించలేక పోయింది. తయారు చేయలేక పోయింది. బి. నాగిరెడ్డి గారు కోస్తాంధ్ర మిత్రుడైన చక్రపాణి సాహచర్యంలో పెంచి పెద్ద చేసిన ప్రచురణలు యువ, చందమామ మన రచయితలకు స్ఫూర్తి కాలేక పోయాయి.కాలగర్భంలో కలిసిపోయిన జాతీయోద్యమ కాలపు పత్రికలు మాతృశ్రీ, ఆజాద్‌ వంటివి కనీసం కథానికా రచనను ప్రోత్సహించినట్లు సమాచారం లేదు. ఏభై, అరవై దశకాల్లో వచ్చిన తెలుగు సంక్రాంతి, సవ్యసాచి పత్రికలు కొన్నేండ్లే వచ్చి ఆగిపోయినా, అవీ కొంతవరకు ఉపాధ్యాయ పత్రికా కథారచనకు స్పూర్తినీ, ప్రేరణనూ ఇచ్చాయి. మిగతా చిల్లర మల్లర పత్రికలన్నీ కొద్దిపాటి పత్రికా రచనలూ, కోర్టు నోటీసుల ప్రచురణకూ చోటిచ్చాయి.

కడప జిల్లా, మొత్తం రాయలసీమ – వెలుపలి సాంస్కృతిక చైతన్యం, ఆ చైతన్యానికి కారణమైన సామాజిక, బాషా సాహిత్య ఉద్యమాలు కడపజిల్లాలోని కవి, పండిత సాంస్కృతిక వారసత్వ చైతన్యాన్నీ, దాని వెనుకబాటు తనాన్నీ ఏ మాత్రం 1955-1960 పాంత్రాల దాకా కుదుపు నివ్వలేక పోయాయి. నిరక్షరాస్యుల నాలుకల మీద, సామాజికనిరసన కవులైన వేమన, వీరబ్రహ్మం, సిద్దయ్య పద్యాలు, తత్వాలు ఒకవైపు ఆడుతూ ఉంటే, ప్రజా గేయాలు, పదాలు ప్రజలు వల్లిస్తూ ఉంటే, ఆ సరసన్నే రాయల నాటి ప్రబంధ నిర్మాణ సంస్కారమూ, అష్టావదాన, శతావధానాలూ శిష్ట సాహిత్యంగా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్నాయి. నవ్య కవిత్వ సృష్టికి పుట్టపర్తి వారు తమ యౌవ్వన దశలో కారకులైనా, ఆధునిక సాహిత్య వచన పక్రియల వికాసానికి దోహదం చేయలేకపోయారు.

వెనుకబాటుతనానికి కారణాలు

కడప జిల్లాలో కన్పించే ఈ సాంస్కృతికమైన వెనుకబాటుతనానికి మూడు నాలుగు కారణాలు పేర్కొనవచ్చు. అవి

1. రెండో ప్రపంచ యుద్ద కాలంలోనో, ఆ తర్వాతో వచ్చిన నూనె మిల్లులూ, జిన్నింగు మిల్లులూ తప్ప, వాణిజ్య వ్యాపారాలూ, ఆధునిక పరిశ్రమలూ విస్తరించకపోవటం, కె.సి. కెనాలు, మట్టికొట్టుకుపోయిన చెరువులు, ఏటికాలవల కింద సేద్యం తప్ప, మిగతా సేద్యమంతా ప్రకృతిమీద ఆధారపడటం – ఈ కారణంగా ఆర్థికమైన వెనుకబాటుతనం.

2. విద్యాసంస్థల సంఖ్యా, అక్షరాస్యుల సంఖ్యా తక్కువగా ఉండటం.

3. రవాణా సౌకర్యాలు, ప్రసారసాధనాలూ, అధ్వాన్నంగా వుండటమే కాకుండా, పట్టణీకరణ చాలా ఆలస్యంగా జరగటం.

4. పట్టణ మధ్యతరగతి ఒక విస్పష్టమైన ఆకారాన్ని మొన్నటిదాకా రూపుదాల్చుకోలేకపోవటం, రాచమల్లు రామచంద్రారెడ్డి 1960 లోనే గుర్తించినట్లు, ఈకారణాలవల్ల సమకాలిక సమాజాన్ని చిత్రించే కథానికలు, నవలలు, నాటికలు, నాటకాలు మనజిల్లాలో సృష్టి అయ్యే సూచనలు కూడా కనపడడంలేదు. అసలు కథానికలు, నవలలు, నాటికలు అనేక సమకాలిక సాహిత్య శాఖలు. ఈ సాహిత్య శాఖలను సాహిత్య శాఖలుగా గుర్తించి గౌరవించే యోగ్యతకూడా లేనివాళ్ళు మన జిల్లాలో కవులుగా చెలామణి అయ్యారు. అట్టి వాళ్ళకు సమకాలిక సమాజ ధర్మాలు అర్థం కాకపోవడంలో ఆశ్చర్యం ఏముంది? (సవ్యసాచి 28 మార్చి ,1960)

1960లో ”అట్టి సూచనలు కనపడడం లేదని” రా.రా. భావించి వుండవచ్చు. కాని గడచిన మూడు దశాబ్దాల్లో ఆధునిక వచన సాహిత్య శాఖలు ఈ జిల్లాల్లో వర్ధిల్లాయి. ముఖ్యంగా కథానికా రంగంలో రా.రా తరం, ఆ తర్వాతి రెండు తరాల వాళ్ళు సాధించిన కృషి తక్కువైంది కాదు. దీనికి కారణాలన్నీ కడప జిల్లా జీవితంలో కన్పిస్తాయి. ఆ జీవితంలో కొన్ని ఆధునిక లక్షణాలు ప్రవేశించాయి. ముందుకంటే లఘు, భారీ పరిశ్రమలు కడపజిల్లాలో ఎక్కువగా వెలిశాయి. సున్నపురాళ్ళు, బెరైటీస్‌, ఆస్‌బెస్టాస్‌ల వాణిజ్యం పెరిగింది. ఎర్రగుంట్ల, కోడూరు, చిలమకూరులలో భారీ సిమెంటు కర్మాగారాల స్థాపన జరిగింది. పండ్లు, తమలపాకులు, పసుపు, ఉల్లి, మిరప, వేరుసెనగ, బియ్యం వాణిజ్యం పెరిగింది. వ్యాపారం విస్తరించింది. పట్టణీకరణ జరిగింది. రవాణాసౌకర్యాలు, ప్రసార వ్యవస్థ మెరుగయ్యాయి. అక్షరాస్యత పెరిగింది. విద్యాలయాలు హెచ్చాయి. ఉద్యోగస్వామ్యం, నిరుద్యోగ మధ్యతరగతి, ఇతర మధ్యతరగతీ పెరిగింది. ఆర్థికకమైన వెనుకబాటుతనం కావలసినంత కొనసాగుతూనే వుంది. ఆర్థికపరమైన వ్యత్యాసాలు పెరుగుతూనే ఉన్నాయి. పర్యావరణ సమతౌల్యం ఘోరంగా దెబ్బతినటంవల్ల వర్షపాత శాతం తగ్గిపోతూ, ప్రకృతికీ, మనిషికీ ఘర్షణ మరింత అధికమైంది. మనిషికీ, కడప సామాజిక చరిత్రకూ, దాన్ని ప్రభావితం చేస్తున్న ఇతర సాంస్కృతిక శక్తులకూ మధ్య ఘర్షణ ఎన్నెన్నో రూపాలలో ఎక్కువైంది. దీనివల్ల సమకాలిక సమస్యలకూ, ధర్మాలకూ సమస్యలకూ, ధర్మాలకూ రచయితలు స్పందించగలిగిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కథానికా రచనకు అవసరమైన ప్రేరణను తమ చుట్టూ వున్న సామాజికాంశాలనుంచీ, సాహిత్యాంశాలనుంచీ రచయితలు పొందగలిగారు. ఉత్తమ తెలుగుకథా సాహిత్యంలో తమకొక స్థానం వుందని కడపజిల్లా రచయితలు నిరూపించుకున్నారు. తమ ప్రాంతీయ మాండలిక జీవితానికి తెలుగు కథాసాహిత్యంలో చోటు కల్పించారు.

చదవండి :  సీమ కోసం గొంతెత్తిన సాహితీకారులు

భారతం నాదమునిరాజు

​కడపజిల్లాలో మొదటి కథానికా రచయిత ఎవరన్నది ఒక పరిశోధనాంశం. అరవయ్యో దశకంలో ఏకోన్ముఖమైన సాంద్ర స్పందన అభిముఖంగా, సజీవమైన ఏకత్వం లక్ష్యంగా అభ్యుదయ దృక్పథంలో రా.రా. కథలు రాశారు. ఆయనకంటే కొన్నేళ్ళు ముందుగానే కీ.శే. భారతం నాదమునిరాజు (1930-1966 వేంపల్లి జన్మస్థలం) కథలనూ, నవలలనూ రాసినట్లు కన్పిస్తుంది. ఆయన ”నీలవేణి” కథల సంపుటి ఒకటి వచ్చింది. క్రింది, మధ్యతరగతి జీవితాల్లోని విషాదాలను నాదమునిరాజు తన కథల్లో ఇతివృత్తంగా స్వీకరించారు. ఉద్యోగరిత్యా చిత్తూరు జిల్లాలో (శ్రీకాళహస్తి, తిరుపతి) ఆయన మరణ పర్యంతం వుండటంవల్ల కావచ్చు. ఆయన రచనలు అప్పటియువకులు కొద్ది మంది దృష్టిలో మాత్రమే పడ్డాయి. నాదమునిరాజు రచనల ప్రభావం కడప జిల్లా కథకులమీద అప్పట్లో పడిందని చెప్పలేము. ఆయన రచనల నుంచి రచనా ప్రేరణ పొందినవారు ఎవరో కూడా ఖచ్చితంగా చెప్పలేము. అట్లాగే తెలుగు స్వతంత్రలో 1955-60 మధ్య వి.ఎన్‌. ఆచార్య రాసిన కథలాంటి వ్యంగ్య రచనలు కూడా.

1960 ప్రాంతాల తర్వాత కడప పట్టణం కేంద్రంగా ఒకవైపు యుగసాహితి, అభ్యుదయ సాహిత్యోదమమూ, మరొకవైపు కడప జిల్లా రచయితల సంఘం, మరొకవైపు మాసీమ రచయితలు, బుద్దిజీవులు, ఇంకొకవైపు అకాశవాణి, వీటికి తోడుగా గతంలో కంటే ఇతర ప్రాంతాల పత్రికలతో రచయితలతో, సాహిత్యంతో ఏర్పడిన ఇతోదిక సాన్నిహిత్యమూ, సాంస్కృతిక వినిమయమూ, కడప జిల్లాలోని కథానికా రచయితలను ప్రభావితం చేశాయి.

కడప జిల్లాలో తొలి తరం కథా రచయిత రా.రా. అనుకుంటే ఈయన తరంలో ‘గట్టిగింజలు’ రచయిత వై.సి.వి. రెడ్డి ప్రధానంగా కవిగా మాత్రమే కన్పిస్తాడు. తర్వాత తరంలోని కథా రచయితలు సొదుం జయరాం, కేతు విశ్వనాథరెడ్డి, తులసీకృష్ణ (పి. రామకృష్ణారెడ్డి), కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి, కేతు బుచ్చిరెడ్డి, మల్లెమాల వేణు గోపాలరెడ్డి, జానకీరాం, కేశవగోపాల్‌, సత్యాగ్ని, వీణా రమాపతిరాజు, వీణా రాధాకృష్ణరాజు, ఎన్‌.సి. రామసుబ్బారెడ్డి, రాధేయ ఈ తరంలోని యువకులు దాదాహయాత్‌, చక్రవేణు.

రారా (రాచమల్లు రామచంద్రారెడ్డి)

కథా రచనలో నిశితమైన మేధాశక్తీ, సాంద్రమైన భావుకత్వమూ, ఖచ్చితమైన అభ్యుదయ దృష్టీ, తనదైన శైలీ,టోనూ వున్న రా.రా. మార్గం ఒక రకంగా అనితరసాధ్యమైంది. కథా శిల్పంలోని ఆయన పట్టు ప్రపంచ ఉత్తమ కథానికా రచయితల కోవకు చెందింది. ఆయన ‘అలసిన గుండెలు’ సంపుటిలోని ప్రతి కథా ఇందుకు సాక్ష్యంగా నిలుస్తుంది. ఆర్థిక వ్యవస్థలోని దుర్లక్షణాలే మధ్య తరగతి ఘర్షణకూ, వేదనకూ, అలోచనలు నిశితం కావటాకీ కారణమనే స్పృహనూ, విశాల పరచుకోవసిన సంస్కారావశ్యకతనూ రా.రా. కథలు కల్పిస్తాయి. తెలుగు, మధ్య తరగతి జీవితంలో వచ్చిన, వస్తున్న మార్పుల కేంద్రంగా ఆయన కథలు రాశారు. కడప జిల్లా అచ్చమైన జీవితానుభవాల మధ్య ఆయన నలిగినా, వాటిని గురించి ముఖ్యంగా గ్రామీణ జీవితంలో వస్తున్న వివిధ పరిణామాల గురించి కథలు రాయలేదు. తర్వాత తర్వాత పత్రికా రచన, సాహిత్య విమర్శ, అనువాదాలు ఈ రంగాలలోనికి రా.రా. వెళ్లటం ఇందుకు ఒక కారణమేమో.

వై.సి.వి.రెడ్డి

వై.సి.వి. కవిత్వ రచనను దాదాపు మానాక, అభ్యుదయ సాహిత్యోద్యమం, భారతీయ కమ్యూనిస్టు పార్టీతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి వుంటూ, సరళమైన గ్రామీణ జీవితానుభవాలను నెమరువేసుకుంటూ, వాటినపుడపుడూ రైతుగా, కార్యకర్తగా చవిచూస్తూ, గట్టి గింజలు (1982) కథలు రాశాడు. కడప జిల్లా గ్రామీణ భూస్వామ్య వ్యవసాయిక జీవితంలో వస్తున్న మార్పులకు చలించి, స్పందించి రాశాడు. రాయలసీమ కథకుడు తప్ప వేరే రచయిత ఎవరూ రాయలేని ప్రాంతీయ వర్గ మాండలికాల శైలుల్లో, బతికి చెడ్డవాళ్లనూ, పీడితులైన వివిధ కింది కులాల బడుగు జీవులనూ వై.సి.వి. తన కథల్లో చిత్రించారు. కథా రచనలో వై.సి.వి.ది జానపద కథకుడి సరళ మార్గం. ఆధునిక కథానికా రూపంలోని సంక్లిష్ట మార్గంకాదు. దీనికి తోడు వై.సి.వి. తన కథల్లో కాల్పనికాంశ వున్న కవిగా కూడా దర్శనమిస్తాడు. ప్రాంతీయ జీవితాన్ని చిత్రించాలనుకునే రచయిత లెవ్వరూ వై.సి.వి. కథలను చదవటం మరచిపోరు.

చదవండి :  కేతు విశ్వనాథరెడ్డి ఇంటర్వ్యూ...

సొదుం జయరాం

కొ.కు., రా.రా., పెద్దిబొట్ల సుబ్బరామయ్య వంటి సీరియస్‌ కథకులు మెచ్చుకున్న కథా రచయిత సొదుం జయరాం. కొకు. (1968)లో తమ ముందు మాటలో అన్నట్లు జయరాం కథలు ”జీవితానికి అత్యంత సన్నిహిత మైనవి. ఈ రచయిత రెక్కలు కట్టుకుని గాలిలో ఎగరటానికిగానీ, మనుషుల్ని పాకే పురుగుల్లా చూడటానికిగానీ, ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. చాలా నిరాడంబరమైన కథలు. నిరాడంబడురుడు రాసినవి. పదునైననవి. ప్రతి కథా సంఘంమీద బలమైన గాటు పెట్టినవి. మధ్యతరగతి వాస్తవ జీవిత చిత్రణలో కథానికా లక్షణాల విషయంలో పాటించే ఆత్మనిగ్రహంలో, పొదుపరితనంలో, నిరలంకారమైన శైలిలో జయరాం విస్మరించలేని కథా రచయిత. అరుదైన జీవితానుభవాలున్నా, వాటికి మరిన్ని కథా రూపాలు ఇవ్వలసిన, ఇవ్వగలిగిన రచయిత జయరాం. 1968, 1972లో ప్రచురించిన వాడిన మల్లెలు, సింహాద్రి స్వీట్‌ హోం కథల సంపుటులలోని కథలు, 1991లో సాదుం జయరాం కథలు పేరున వెలువడ్డాయి. రెండు దశాబ్దాలుగా దాదాపు కథలు రాయడం మానుకున్నారు. జయరాం కథలు పండ్రెండు రష్యన్‌ భాషలోకి, కొన్ని హిందీ, కన్నడాల్లోకి అనూదితమయ్యాయి.

కేతు విశ్వనాథరెెడ్డి

తన వ్యక్తిత్వపు మూలాలను, తన కథల మూలాలను కడపజిల్లా పల్లెపట్టుల చరిత్రలో, తెలుగు సామాజిక పరిణామాల్లో నిరంతరం వెతుక్కుంటున్న కథకుడు కేతు విశ్వనాథరెెడ్డి.స్వాతంత్య్రానంతరం కడప జిల్లాలోనూ, రాయలసీమ జిల్లాలోనూ వచ్చిన మంచి చెడ్డలనూ, సంక్షోభాన్నీ, ప్రకృతి, మార్కెట్‌ వ్యవస్థా, కుల వ్యవస్థా, గ్రామ కక్షలూ, పరిశ్రమలు స్పష్టించిన సంవేదననూ, తన కథల్లో 1962 నుండి చిత్రిస్తున్న కథకుడు. కేతు విశ్వనాథరెడ్డి జప్తు (1974), కేతు విశ్వనాథరెడ్డి కథలు (1991) కథల సంపుటిలోని కథలు కొన్ని ఇంగ్లీషు, రష్యన్‌, హిందీ, బెంగాలీ, మరాఠీ, కన్నడ భాషల్లోకి అనూదితమయ్యాయి.కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు అనేక జాతీయ,రాష్ట్రస్థాయి అవార్డులను అందుకున్నారు.

రామకృష్ణారెడ్డి

తులసీకృష్ణ (పి. రామకృష్ణారెడ్డి) నవలా రచయితగా ముందు పరిచయమైనవాడు. రుతుపవనాలు నవలలోని కాల్పనిక ధోరణిని విడనాడి, నత్తగుల్లలు రచనలో మధ్యతరగతి వాస్తవ జీవిత దృశ్యాలను పరిచయం చేసి తర్వాత పత్రికా రచయితగా, విమర్శకుడు, కథా రచయితగా తెలుగు సాహిత్యంతో పరిచయమున్న వారందరికీ పరిచయం వున్నవాడు. సునిశితమైన మేధా, భావుకత్వమూ, నిజాయితీ వున్న రచయిత. ‘కర్రోడి చావు’ (1986) కథా రచనతో విమర్శకుల దృష్టిని ఆకర్షించి, పెన్నేటి కథలు (1990) సంపుటంతో కథా రచయితగా పేరు పొందినవాడు. ఆంధ్రజ్యోతి వారపత్రికలో ధారావాహికంగా 1989లో వెలువడిన పెన్నేటి కథలు తన స్వగ్రామం హనుమనగుత్తి – పెన్న పరిసరాల రైతు జీవనంతో ముడివడినవి. రైతులేకాదు, రైతులతో సంబంధమున్న పశువులూ, నేలా, నింగీ, రైతు సమాజంలోని ఇతర సామాజిక అంతురుపులూ, వాటన్నింటినీ కడప మాండలికంలో చిత్రించినవాడు. కడప మాండనికంలోని యాస, పదునూ, వేగమూ, టోనూ పట్టుకొని విద్వాన్‌ విశ్వం పెన్నేటి గాథలోని కారుణ్యాన్నీ, కాల్పనికతనూ, మించిన వాస్తవికతా దృక్పథంతో రామ కృష్ణ రాసిన కథలు పెన్నేటి కథలు.

కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి

కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి, కుట్ర (1982) కథల రచయితగా ప్రసిద్ధుడు. వోబిగాడు కథా రచయితగా కథారచయితలూ, అబిమానులూ, విమర్శకుల లోకంలో చిరస్మరణీయుడైనవాడు. పద్మనాభుని కథనంలో ఒక నిగూఢత వుంటుంది. శైలిలో హాస్యదృష్టి, టోన్‌లో పరిహాస, వ్యంగ్య ధోరణులూ వుంటాయి. కథల నిండా హాస్య, విషాద, బీభత్స వాతావరణం కమ్ముకొని వుంటుంది. కుసంస్కారం పట్ల వెగటు కలిగించగలిగిన కథానికా లక్షణాలున్న కథానికలు రాసిన పద్మనాభరెడ్డి ఈ దశాబ్ధిలో కథలు రాయటం దాదాపు మానివేయటం దురదృష్టకరం. పద్మనాభుడికి క్రమశ్షిణతో కూడిన రచనా దీక్ష వుండి వుంటే, చవకరకం హాస్య రచనలు చవి చూస్తున్న పాఠకులు హాస్య ప్రయోజనాన్ని – మన సంస్కారాన్ని పెంచే హాస్య దృష్టిని గుర్తించి వుండేవాళ్ళు.

కేతు బుచ్చిరెడ్డి

కేతు బుచ్చిరెడ్డి వృత్తిరీత్యా డాక్టరు. అనంతపురంలో వుంటున్న రచయిత. ముత్యాలు – రత్నాలు (మే 1986), ఇదిగో సూర్యుడు (జూన్‌ 1989) అనే రండు కథా సంపుటులను వెలువరించాడు. నిజాయితీగల కథకుడు. వివిధ సామాజిక అంతరువులు, వాటి నేపధ్యాల్లోని వ్యక్తుల బాహ్య, అంతరంగ జీవితాల మధ్య ఘర్షణను కవితాత్మతో విశ్లేషించగల నైపుణ్యమున్న రచయిత బుచ్చిరెడ్డి. కరుణ, సానుభూతి, ఆర్తి, నిరసన – వీటి వ్యక్తీకరణ ప్రధానంగా బుచ్చిరెడ్డి కథలు సాగుతాయి. ఒక నిర్దిష్ట తాత్విక దృక్పథాన్ని తాను నమ్మకపోయినా, అమిత స్పందనా శీలి, మానవక్షేమ దృష్టి వున్న రచయిత.శిరీష అనే కలం పేరుతో కొన్ని కథలురాసి, ఉ(దా)త్త పురుషుడు (నవంబరు 1977) అనే కథల సంపుటిని అందించిన మల్లెమాల వేణుగోపాలరెడ్డి నెల్లూరు జిల్లాలో జన్మించినా, గత ముప్పై ఏళ్ళుగా కడప జీవితంలో కలిసిపోయిన సర్జన్‌. ఆయన కథల్లో ఆహ్లాదకరమైన కథన కౌశలం వుంటుంది. సూచీ కథనం వుంటుంది. జనరంజకమైన హాస్య దృష్టి వుంటుంది.

చదవండి :  పోట్లదుర్తి - యాట కుక్కపైన కుందేళ్లు తిరగబడిన చోటు

లక్ష్మీకరరాజు, ఎం. జానకీరాం, కేశవగోపాల్‌, వీణా రమాపతిరాజు, వీణా రాథాకృష్ణరాజు, ఎన్‌.సి.రామసుబ్బారెడ్డి, రాధేయ, సత్యాగ్ని, ఎం.వి. రమణారెడ్డి నిలకడగా కథా రచన చేయని కథానికా రచయితలు. నిలకడగా అని అనటం ఎందుకంటే, వారి రచనా ప్రవృత్తి కథానికా రూపం మీద ఏకోన్ముఖం కాకపోయింది కాబట్టి. జానకీరాం పరిష్కారం కథల సంపుటిని వెలువరించారు.

షేక్‌ హుసేన్‌

సత్యాగ్ని అనే కలంపేరుతో పాచికలు, అగ్ని సరస్సు అనే కథల సంపుటులను షేక్‌ హుసేన్‌ వెలువరించారు. ముస్లిం స్త్రీల వ్యదార్ధ జీవితాలను, హిందూ ముస్లిం భావ సమైక్యతనూ తన కథల్లో చిత్రించిన మంచి రచయిత సత్యాగ్ని. కడప జిల్లాలోని షేక్‌ బుడన్‌సాహెబ్‌ వంటి కవులు, పండిత కవులతో పోటీ పడి మనుచరిత్ర పద్య నిర్మాణ వారసత్యాన్ని కొనసాగిస్తే, సత్యాగ్ని వంటివారు యధార్ధ జీవన చిత్రణకు వచన రచన యోగ్యమైందని విశ్వసించి ఆ రంగంలో కృషి సాగించటం ఒక విశేషం. ప్రగతిశీలకమైన అంశంకూడా.

ఎన్‌.పి. రామసుబ్బారెడ్డి అలకపాన్పు కథల సంపుటి, హిందీ పండితుడైన తెలుగు కవిగా పరిచయమైన రాధేయ కథలు వారు తమ వ్యక్తీకరణ మాధ్యమాన్ని ఖచ్చితంగా ఎన్నుకోవలసిన ఆవశ్యకతను గుర్తు చేస్తాయి. వీరేకాక కడప జిల్లాలో కథలు రాసిన వారు వెంకటపతిరాజు, ఆరవేటి శ్రీనివాసులు, సి. అనంతరావు, చింతకుంట వాసుదేవరెడ్డి (సునంద కథల సంపుటి రచయిత). ప్రభంజనం నడిపిన ఎం.వి. రమణారెడ్డి, సాధ్వి (అంధ ఉదయం), పరిష్కారం కథల ద్వారా కథా రచనలో తనకు మెలకువ వుందని నిరూపించుకున్నారు.

జనరంజకమైన కథలనూ, డిటెక్టివ్‌ నవలలనూ, కథలనూ రాసిన రెండో తరానికి చెందిన ప్రముఖుడు కె. సుబ్బయ్య. ఆయన తెలుగు సంక్రాంతి పత్రికను కొన్నాళ్ళు దీక్షతో నడిపారు.

ఈ తరానికి చెప్పుకోతగిన ప్రతినిధులు ఎన్‌. దాదాహయంత్‌, చక్రవేణు, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, శశిశ్రీ , పాలగిరి విశ్వప్రసాద్ , తవ్వా ఓబుల్ రెడ్డి , వేంపల్లి గంగాధర్, వేంపల్లి షరీఫ్ .

అహింస, గుక్కెడు మంచినీళ్ళు కథానికలద్వారా దాదాహయాత్‌, కసాయి కరువు, కువైట్‌ సావిత్రమ్మ కథల ద్వారా చక్రవేణు, కొత్త దుప్పటి, బతుకు సేద్యం కథా సంపుటుల ద్వారా సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, చుక్క పొడిచింది, మనిషి కథల ద్వారా పాలగిరి విశ్వప్రసాద్ , కడుపాత్రం, నవవసంతం , సూతకం కథల ద్వారా తవ్వా ఓబుల్ రెడ్డి , దహేజ్ , రాతిలో తేమ కతాసంపుటుల ద్వారా శశిశ్రీ , మొలకల పున్నమి, దేవరశిల, గ్రీష్మభూమి కతాసంపుటుల ద్వారా వేంపల్లి గంగాధర్, జుమ్మా కథల ద్వారా వేంపల్లి షరీఫ్ కథాభిమానులను, విమర్శకులను విశేషంగా ఆకర్షించారు. రాయలసీమ కథానిక భవిష్యత్తు వీరి చేతుల్లో రూపుదిద్దుకుంటోందని నిరూపించారు. దాదాహయాత్‌ ‘అహింస’ (1983), రా.రా. ‘ఇది నిజంగా కష్టమా’ (1984), జ్ఞానపీఠ్‌ వారి భారతీయ కథానికల హిందీ అనువాద సంకలనాల్లో చోటు చేసుకున్నాయి. కడప జిల్లా కథారచయితలు తాము ఏ ఇతర భారతీయ కథా రచయితలకు తీసిపోమని నిరూపించుకోగలిగారు.

కడప జిల్లాలోని కథానికా వికాసాన్ని మనం పరిశీలించినపుడు క్రింది అంశాలు తెలుస్తాయి.

1) కథానికా రచన 1960 దశకంలో ప్రారంభమైనా, కడప జిల్లా కథానికా రచయితలు సమకాలిక సమాజ ధర్మాలను అర్ధం చేసుకొని రచనలు చేశారు.

2) వామపక్షాలు, అవి నడిపిన పత్రికలూ, అభ్యుదయ సాహిత్యోద్యమమూ, యుగ సాహితీ, జిల్లా రచయితల సంఘమూ రచనా స్ఫూర్తినిచ్చాయి.

3) మొదటి రెండు తరాల రచయితల్లో మార్క్సిస్టు తత్త్వ అవగాహన ఒక అంతస్సూత్రంగా కనిపిస్తుంది. మూడవ తరం బాధనూ, మాయనూ విశ్లేసించటానికి తపన పడుతున్న తరం’

4) రచయితలు చాలామటుకు గ్రామీణ రైతుల కుటుంబాల నుంచి వచ్చినవాళ్ళు. భూమితో సంబంధం వున్నవాళ్ళు కొందరు. పోయినవాళ్ళు కొందరు. వృత్తుల్లో స్థిరపడినవాళ్ళు మరికొందరు. ఎకడమిక్‌ డిగ్రీలు వున్నవాళ్ళే వీరిలో ఎక్కువ.

5) కడపజిల్లా ప్రాంతీయ మాండలిక జీవిత వాస్తవికతకూ, బాషా శైలులకూ, నుడికారానికి ప్రాధాన్యమిస్తున్న రచయితలు రెండో తరంలో, మూడో తరంలో వున్నారు.

6) తెలుగు కథా సాహిత్య చరిత్రలో కడపజిల్లా ప్రాంతీయ కథా సాహిత్య చరిత్ర ఒక అంతర్భాగమైనా, దాని ప్రత్యేక లక్షణాలు దాని కున్నాయి. వాటి పరిశీలనే సాహిత్యగతికి దోహదం చేస్తుంది. సాహిత్య సమాజ సంబంధాల అవగాహనకు తోడ్పడుతుంది. సాహిత్యాన్ని ఆధునిక సంస్కార వాహికగా సమగ్రంగా రూపొందించటానికి ఒక కారకమవుతుంది.

ఇదీ చదవండి!

నంద్యాలంపేట

నంద్యాలంపేట

నంద్యాలంపేట (English: Nandyalampeta) – వైఎస్‌ఆర్ జిల్లా, మైదుకూరు మండలానికి చెందిన ఒక పల్లెటూరు. ఈ ఊరు మైదుకూరు – …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: