నారాయణస్వామి మఠం - ఓబులరాజు పల్లె

రేపటి నుండి నారాయణస్వామి శతారాధనోత్సవాలు

ఈనెల 27,28 తేదీలలో (గురు,శుక్రవారాలలో) బ్రహ్మంగారిమఠం మండలంలోని ఓబులరాజుపల్లె నారాయణస్వామి 100వ ఆరాధనోత్సవాలు జరుగనున్నాయి. బ్రహ్మంగారిమఠంలోని సాలమ్మ మఠం, బొమ్మువారి మఠాలలో ఈ ఆరాధనోత్సవాలను నిర్వహించేందుకు నిర్వాహకులు ఘనంగా ఏర్పాట్లు చేశారు ఈ ఆరాధనోత్సవాల సందర్భంగా భక్తులకు అన్నదానం, సంస్కృతిక,ఆధ్యాత్మిక కార్యక్రమాలను, భజనలను నిర్వహిస్తున్నారు.

narayanaswamy
అవధూత నారాయణ స్వామి

బ్రహ్మంగారి మఠం సమీపంలోని శ్రీ నారాయణ స్వామి మఠం ఆధ్యాత్మిక భావనలతో వెలుగొందింది. కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలం మిట్టపల్లె, గంగిరెడ్డిపల్లె గ్రామంలో నర్రెడ్డి గంగిరెడ్డి, రామాంబ దంపతులకు 1834 లో జన్మించిన శ్రీ నర్రెడ్డి నారాయణరెడ్డి చిన్నతనంలోనే ప్రాపంచిక వ్వవహారాలకు దూరంగా ఉంటూ అద్వైతదృష్టిని సాధించారు. కర్నూలు జిల్లాలో ఆయన విసృతంగా పర్యటించడం వల్ల కర్నూలు నారాయణ రెడ్డిగా ఆయన ప్రసిద్దులు. ఆ మహనీయుని గొప్పతనాన్ని తెలుసుకున్న భక్తులు అధిక సంఖ్యలో ఆయనను ఆశ్రయించారు.

భక్తులకు జ్ఞానోపదేశం చేస్తూ, స్వగ్రామం నుండి శ్రీ నారాయణరెడ్డి దేశాటనానికి బయలుదేరారు. ఆ తర్వాత కడప జిల్లాకు చేరుకొని గ్రామాలలో పర్యటిస్తూ రాణీబావి, రేకులకుంటల మీదుగా జంగంరాజుపల్లె చేరుకున్నారు. పొరుగున ఉన్న ఓబుళరాజు పల్లె గ్రామస్తులు జంగంరాజుపల్లె గ్రామానికి వెళ్ళి తమ గ్రామానికి శ్రీ నారాయణస్వామిని ఆహ్వానించారు. స్వామి తప్పెట్లతో ఊరేగేతూ ఓబులరాజుపల్లెకు చేరుకున్నారు. గ్రామంలోని వారికి, పరిసర గ్రామాల వారికీ శ్రీ నారాయణ స్వామికి ఆతిధ్యం ఇచ్చిన శ్రీ బొమ్మూ వీరారెడ్డి కోర్టు కేసు నిమిత్తమై బద్వేలు వెళుతూ తనకు ఆశీస్సులు అందించాల్సిందిగా స్వామిని కోరారు. కేసు తోసిపోతుందిపో అని స్వామి చెప్పారు. అలాగే కేసు తోసి పోయింది.

చదవండి :  కరువుసీమలో నీళ్ళ చెట్లు!
నారాయణస్వామి సమాధి - ఓబులరాజుపల్లె
నారాయణస్వామి సమాధి – ఓబులరాజుపల్లె

ఓబుళరాజుపల్లెకు చేరిన వారం రోజుల తర్వాత 1915 మార్చినెల 12 వ తేదీన ( ఆనంద నామ సంవత్సర ఫాల్గుణ బహుళ ద్వాదశి శుక్రవారం అపరాహ్న వేళ) శ్రీ నారాయణస్వామి తన భౌతిక దేహాన్ని చాలించారు.

ఓబుళరాజుపల్లె గ్రామానికి పడమర దిశగా కుందేలు బోడు పక్కగా నాటి గ్రామాధికారి శ్రీ బొమ్ము వీరారెడ్డి, స్వామి వారికి సమాధి నిర్మించి శ్రీ నారాయణస్వామి మఠాన్ని స్థాపించారు. శ్రీ వీరారెడ్డి గారి అనంతరం, శ్రీ బొమ్మ రామారెడ్డి (మాజీ శాసనసభ్యులు) మాజీ సర్పంచ్‌ శ్రీ బొమ్ము పోలిరెడ్డి గారు శ్రీ నారాయణస్వామి మఠంలో ప్రతి ఏటా ఆరాధనోత్సవాలను నిర్వహించడానికి, ప్రతి శుక్రవారం పూజలను నిర్వహించడానికి కృషిచేశారు. వారి తర్వాత శ్రీ వారి వారసులు శ్రీ బొమ్ము చిన్న వీరారెడ్డి కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు.

భక్తురాలు సాలమ్మ 

తెలుగు గంగ ప్రాజెక్టులో నారాయణస్వామి మఠాన్ని మునకగా ప్రకటించడంతో ఆ మఠంలో పూజారి విధులను చాలా ఏళ్ళపాటు నిర్వహించిన భక్తురాలు సాలమ్మ జలాశయానికి వెలుపల నూతనంగా శ్రీ నారాయణస్వామి మఠాన్ని మరొక దానిని నిర్మించారు.. భక్తురాలు సాలమ్మ. ఓబులరాజుపల్లెలో మఠం రిజర్వాయరు నీటిలో మునకకు గురికాకముందు అనేక సంవత్సరాల పాటు సాలమ్మ వూరూరు తిరిగి భక్తులనుండి చందాలను వసూలు చేసి నారాయణస్వామి తిరుణాలను ఘనంగా నిర్వహించేది.

చదవండి :  ఈ రోజు నుంచి కాటివాలె సాహెబ్ ఉరుసు

మైదుకూరు,గంగాయపల్లెల మీదుగా మఠం వెళ్ళే భక్తులకు, సాధువులకు, పాదచారులకు వేళకు నారయణస్వామి మఠం చేరితే సాలమ్మ వారికి స్వామి అన్నప్రసాదాలతో ఆకలి దప్పులు తీర్చే సాధ్విగా పేరు గాంచింది. (ఇప్పటికీ సాలమ్మ బ్రహ్మంగారి మఠంలో నారాయణస్వామి మఠాన్ని నిర్వహిస్తూ దాదాపు నూరేళ్ళ వయస్సుకు చేరువౌతున్నా అదే దీక్షతో మఠాన్ని నిర్వహిస్తూ ఉండటం సాలమ్మ పట్టుదలకు నిదర్శనంగా చెప్పవచ్చు.) స్వామివారి ఆరాధనోత్సవాల సందర్భంగా పురాణ పఠనా సప్తాహం, హరికథలు, నాటక ప్రదర్శలు జరిగేవి. అన్నదానం, తీర్థ ప్రసాద వినయోగ కార్యక్రమాలు కూడా వైభవంగా జరిగేవి.

శ్రీ నారాయణరెడ్డి స్వామి మొట్ట మొదట ఓబుళరాజుపల్లెకు వచ్చిన సందర్బంలో తాను నాలుగు రోజులలో పరపదించనున్నట్లు భక్తులకు ముందుగా వెల్లడించారు. ఆయన పరమపదించిన తర్వాత 92 ఏళ్ల పాటు శ్రీ నారాయణస్వామి మఠం ఆధ్యాత్మిక వాతావరణంలో వెల్లి విరిసింది.2005 మార్చి 30వ తేదీన ఏప్రియల్‌ 6వ తేదీ వరకు చివరిసారిగా శ్రీ నారాయణస్వామి మఠంలో ఆరాధన మహోత్సావాలు జరిగాయి.

చదవండి :  మైదుకూరు, ఎర్రగుంట్లలలో అభ్యర్థులు దొరకలేదు

నారాయణస్వామి మఠం మునక

బ్రహ్మంగారి మఠం వద్ద నిర్మించిన బ్రహ్మంసాగర్‌ రిజర్వాయర్‌లో బసవాపురం, ఓబుళరాజుపల్లె, జంగంరాజుపల్లె, గొల్లపల్లె, చీకటివారిపల్లె గ్రామలతోపాటుగా శ్రీ నారాయణస్వామి మఠం మునకకు గురైంది. గంగాయపల్లె, నారాయణస్వామి మఠం మీదుగా బ్రహ్మంగారి మఠమునకు కడప నుండి ఆర్‌.టి.సి. బస్సులు నడిచేవి. మైదుకూరు నుండి కూడా నారాయణస్వామి మఠం బస్సు సర్వీసు సుమారుగా 25 ఏళ్ళపాటు నడిచింది. బ్రహ్మంగారి మఠం వెళ్ళే భక్తులకు నారాయణస్వామి మఠం ఒక వజిలీగా ఉండేది. అక్కడ భక్తులకు అన్నదానం కార్యక్రమము నిరంతరం నిర్వహించేవారు.

బొమ్ము కుటుంబీకులు కూడా బ్రహ్మంగారి మఠంలో సమీపంలోనే మరొక మఠాన్ని నిర్మించడం విశేషం. బ్రహ్మంసాగర్‌లో ఐక్యమైన శ్రీ నారాయణస్వామి మఠం, ఈ ప్రాంత భక్తులలో గొప్ప ఆధ్యాత్మిక స్మ ృతులను మిగిల్చింది.శ్రీ నారాయణ స్వామి పై ‘శ్రీనారాయణస్తవము’ పేరుతో జీరెడ్డి బాల వెంకట సుబ్బారెడ్డి (నిత్యానంద స్వామి), బాలకవి కసిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి కందపద్య శతకాన్ని రచించారు.

తవ్వా ఓబుల్ రెడ్డి

ఇదీ చదవండి!

సినీ రసజ్ఞత

రాయలసీమ వాసులూ – సినీ రసజ్ఞత

తెలుగు సినిమాకు ప్రపంచ ఖ్యాతి తీసుకురావడమే కాకుండా ఎన్టీఆర్ ,ఏయన్నార్ లాంటి సినీ నటులను ఆదరించి విజయా సంస్థ ద్వారా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: