కడప గడపలో సీమ ఆకలి ‘కేక’ అదిరింది

  • ఉద్యమాలు నాయకుల నుంచి కాదు… ప్రజల్లో నుంచి వస్తాయి

  • అవసరమైతే ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి

  • కొత్తతరం నాయకులతోనే రాయలసీమకు న్యాయం

  • రాజధాని ప్రకటనతో ముఖ్యమంత్రి సీమ వాసులను కించపర్చారు

శివరామకృష్ణన్, శ్రీకృష్ణ కమిటీలతో పాటు హోం శాఖల నివేదికలు కూడా రాజధానిగా విజయవాడ అనుకూలం కాదని తేల్చి చెప్పాయి.. సోషల్ అసెస్‌మెంట్ కమిటీ వారు రాజధానికి విజయవాడ అనుకూలం కాదని తేల్చిచెప్పారు.. రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేయాలని ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నాం” అని రాష్ట్ర రాజధాని సాధన సమితి అధ్యక్షుడు,విశ్రాంత న్యాయమూర్తి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు.

kekaరాయలసీమలోనే రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేయాలని ఆకలికేక పేరుతో జెడ్పీ కార్యాలయ ఆవరణలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ సీమ ప్రజల కోసం పోరాడేందుకు రాజకీయ ప్రజాప్రతినిధులంతా ముందుకు రావాలన్నారు. అవసరమైతే ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడించి వారిని ఉద్యమంలోకి తీసుకు వచ్చేలా చూడాలన్నారు. అయినప్పటికీ ముందుకు రాకపోతే రాయలసీమలో ప్రత్యేక పార్టీ పెట్టి ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఉద్యమాలనేవి నాయకుల నుంచి కాదు… ప్రజల్లో నుంచి వస్తాయనే నినాదాన్ని నిజం చేస్తామన్నారు. కొత్తతరం నాయకులు వస్తేనే రాయలసీమకు న్యాయం జరుగుతుందన్నారు. రాజధాని ఏర్పాటు విషయంలో సీమవాసి అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన చేసి తీరని ద్రోహం చేసిన కాంగ్రెస్‌ను సమాధి చేసినట్లే రాయలసీమలో రాజధాని ఏర్పాటుకు ఉద్యమించని నేతలకు కూడా అలాగే జరుగుతుందన్నారు. తమను ప్రజలు ఓడిస్తారని భయం రానంత వరకు ప్రజాప్రతినిధులు కదిలి రారన్నారు. కర్నూలును రాజధానిగా ఖచ్చితంగా ప్రకటించాలన్నారు.

చదవండి :  'పట్టిసీమ' పేరుతో సీమను దగా చేస్తున్నారు

రాయలసీమ రాష్ట్ర సాధన సమితి జిల్లా కన్వీనర్ డాక్టర్ ఓబుల్‌రెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన రాయలసీమలోనే రాజధాని నిర్మాణం చేయాలన్నారు. రాజధాని సాధన సమితి నాయకుడు డాక్టర్ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో రాయలసీమ వాసులు ఇక్కడ రాజధాని ఏర్పాటుకు సహకరించని నేతలకు రాజకీయ సమాధి కట్టాలన్నారు.

తరలివచ్చిన వేలాదిమంది విద్యార్థులు

 కడప నగరంలో బుధవారం నిర్వహించిన ఆకలి కేక సభాస్థలికి పాఠశాల స్థాయి నుంచి యూనివర్శిటీ వరకు వేలాది మంది విద్యార్థినీ విద్యార్థులు తరలివచ్చారు. పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

వారు ద్రోహం చేశారు

ముఖ్యమంత్రీ, ప్రతిపక్ష నేత ఇద్దరూ ఇక్కడి వారైనప్పటికీ ఈ ప్రాంతానికి ద్రోహం చేశారు. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని రాయలసీమ హక్కు – ఆ హక్కును సాధించుకునేదానికి మన కడప ‘ఆకలికేక’ నాంది. సీమ వెనుకబాటుతనాన్ని పట్టించుకోని నాయకులకు వచ్చే ఎన్నికల్లో సమాధి కడతాం.

– డాక్టర్  మధుసూదన్ రెడ్డి, రాజధాని సాధన సమితి  రాష్ట్ర కో కన్వీనర్

సీమ వాసులను అగౌరవపరిచింది

రాష్ట్ర రాజధానిని విజయవాడ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నట్లు అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం రాయలసీమ వాసులను అగౌరపరిచినట్లయింది.  రాయలసీమ వెనుకబడిన ప్రాంతమని, అలాంటి ప్రాంతానికి న్యాయం జరగకపోతే  ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం ఉద్యమం తప్పదు.

చదవండి :  కడప విమానాశ్రయ ప్రారంభోత్సవం ఆగింది ఇందుకా?

– భూమన్ , రాయలసీమ అధ్యయనాల  సంస్థ అధ్యక్షుడు

ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం

రాష్ట్ర రాజధాని విషయాన్ని వారం రోజుల్లోపు తేల్చకపోతే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం పోరాటం చేస్తాం. దేశంలోని 27 రాష్ట్రాలలో 22 రాష్ట్రాల రాజధానులు ఆయా రాష్ట్రాలకు మధ్య ప్రాంతాలలో లేవు. అటువంటిది రాయలసీమ రాజధాని అడిగేసరికి నడిమధ్య ఉండాలనడం కుట్రే.

– మల్లెల భాస్కర్,  రాయలసీమ స్టూడెంట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు

ప్రగల్భాలు వద్దు….ఆచరణ కావాలి….:

భవిష్యత్తులో విద్యార్థులు ఉజ్వలంగా ఉండాలంటే రాష్ట్ర రాజధాని రాయలసీమ ప్రాంతంలో ఉంటేనే బాగుంటుంది. రాజధాని ప్రకటన సమయంలో రాయలసీమకు వరాలిచ్చామని చంద్రబాబు ప్రగల్భాలు పలకడం సరికాదు.

– రామచంద్రారెడ్డి, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం అసోసియేషన్

 పులిబిడ్డల్లా విద్యార్థులు ఉద్యమించాలి:

రాయలసీమలోని విద్యార్థులంతా రాజధాని సాధన కోసం పులిబిడ్డల్లా గర్జించాల. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయానికి పాల్పడి ఏకపక్ష నిర్ణయంతో విజయవాడను రాజధానిగా ప్రకటించి రాయలసీమకు అన్యాయం చేశాయి.

– లెక్కల జోగిరామిరెడ్డి,  పవన్ స్కూలు కరస్పాండెంట్

 ఒట్టి చేతులతో రాయలసీమ :

1963లో కర్నూలు నుంచి హైదరాబాదును రాజధానిగా మార్చినపుడు, తెలంగాణ ఏర్పాటుతో ఇటీవల రాష్ట్ర విభజనజరిగినపుడు హైదరాబాదు రాజధానిని పోగొట్టుకుని ఒట్టి చేతులతో రాయలసీమ వాసులు మిగిలిపోయారు. చంద్రబాబు విజయవాడను రాజధానిగా ప్రకటించి రాయలసీమ ద్రోహిగా నిలిచారు.

చదవండి :  'పోలి' గ్రామ చరిత్ర

– రామకృష్ణారెడ్డి, నాగార్జున మహిళా డిగ్రీ కళాశాల కరస్పాండెంట్

 ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తాం

చంద్రబాబు అధికారంలోకి వచ్చి 100 రోజులు కాగానే, విజయవాడ రాజధానిగా ప్రకటించడం భావ్యంగా లేదు. ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు ఉద్యమం చేస్తే తప్పక విజయం సాధిస్తామన్నారు.

– వివేకానందరెడ్డి, రాయలసీమ మేధావుల ఫోరం అధ్యక్షుడు

 రాయలసీమ అభివృద్ది కోసం పోరాడాలి

జిల్లాలో ప్రతి సంవత్సరం ఆరు వేల మంది ఇంజినీరింగ్, మూడు వేల మంది ఎంబీఏ పూర్తి చేస్తున్నారని, ఉద్యోగ అవకాశాల కోసం గతంలో హైదరాబాదుకు వెళ్లే వారు, ప్రస్తుతం ఆ పరిస్థితి దూరమైంది. రాబోయే కాలంలో విద్యార్థుల సీమ భవిష్యత్తు, అభివృద్ది కోసం పోరాటం చేయక తప్పదు.

– ఫరూఖ్, భారత్ ఇంజినీరింగ్ కళాశాల కరస్పాండెంట్ 

మూల్యం చెల్లించక తప్పదు

సీమ వెనుకబాటుతనం గురించి మాట్లాదేదానికి నాయకులు కరువయ్యారు. అధికార, ప్రతిపక్ష నాయకులు కోస్తా వాళ్లకు అమ్ముడుపోయారు. సీమలో జరుగుతున్న ఉద్యమాలను విస్మరించి ఏకపక్షంగా రాజధాని ప్రకటన చేయడం సరికాదు. ఇందుకు మూల్యం చెల్లించక తప్పదు.

– రవిశంకర్‌రెడ్డి,  రాయలసీమ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు

ఇదీ చదవండి!

వైకాపా-లోక్‌సభ

కడప జిల్లా వైకాపా లోక్‌సభ అభ్యర్థుల జాబితా – 2019

కడప: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఇడుపులపాయలో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: