వైఎస్సార్
ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి వద్ద రచయిత

దైవత్వాన్ని నింపుకున్న మానవుడు వైఎస్సార్

డాక్టర్ వైఎస్సార్ (వైఎస్ రాజశేఖరరెడ్డి) ను నేను చూసింది కేవలం నాలుగు సార్లు. ఒంగోలుకు ఇందిరా గాంధీ వచ్చినపుడు ఆ సభలో తొలిసారి చూసాను. ఆ తరువాత డాక్టర్ సి నారాయణరెడ్డి గారి మనుమరాలు వివాహ వేడుకలో చూసాను. మరో రెండు సందర్భాల్లో రెండు సార్లు. ప్రత్యక్షంగా మాట్లాడలేదు . దురదృష్టం ఏమిటంటే 2004 వరకు ఆయన పట్ల నాకు అసలు సదభిప్రాయమే లేదు. చంద్రబాబు గొప్ప సంస్కరణవాది అని, ఆయన చాలా మంచి పాలనాదక్షుడు అని నాకు ప్రగాఢ విశ్వాసం ఉండేది. ఆ తరువాత పోయింది. ఆ కథ ఇక్కడ చెపితే ఈ పోస్టింగ్ అసలు ప్రయోజనం దెబ్బ తింటుంది. దాన్ని మరో పోస్ట్ లో వివరంగా చర్చించుకుందాము.

డాక్టర్ వైఎస్సార్ ఒక ఫ్యాక్షనిస్ట్ అని, హత్యలు చేస్తాడు, చేయిస్తాడు, వాళ్ళ ఇంట్లో బియ్యం బస్తాల స్థానంలో బాంబులు ఉంటాయని నా అభిప్రాయంగా ఉండేది. బహుశా ఆనాటి పత్రికల దుష్ప్రచారం అందుకు కారణం కావచ్చు అని ఆ తరువాత నాకు అనిపించింది. నిజం చెప్పొద్దూ…2004 లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, వైఎస్సార్ ముఖ్యమంత్రి అయినట్లయితే రాష్ట్రం మొత్తం రక్తసిక్తం అవుతుందని, బాంబులవర్షం కురుస్తుందని, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి సినిమాలను నిజజీవితంలో చూడాల్సి వస్తుందని భయపడ్డాను. అయితే కాంగ్రెస్ లో ఉన్న ఒక వెసులుబాటు ఏమిటంటే, ముఖ్యమంత్రులు ఏడాదికోసారి మారుతారు కాబట్టి వైఎస్సార్ ను తప్పిస్తారు అని నమ్మి కాంగ్రెస్ కు ఓటు వేసాను.

చదవండి :  సీమవాసుల కడుపుకొట్టారు

నా అంచనాలను వమ్ముచేస్తూ వైఎస్సార్ పాలన నభూతో నభవిష్యతి అన్నట్లు సాగింది. బలి, శిబి, దధీచి లాంటి వదాన్యవరులను తలదన్ను మహాదాతలా, ఉన్నవాడికి, లేనివాడికి అభినవ రాధేయుడిలా, అదేసమయంలో అపర భగీరధుడిలా , ఫాక్షన్ ను ఉక్కుపాదంతో అణిచివేసిన త్రివిక్రముడిలా వైఎస్సార్ లోని దశావతారాలను, తుదకు విశ్వరూపాన్ని కూడా చూసేను. పత్రికలు అప్పటివరకు వైఎస్సార్లోని అసలైన కోణాన్ని ఆవిష్కరించలేదని నాకు బోధ పడ్డది.

అప్పట్లో ఉండవల్లి అరుణ్ కుమార్ సారధ్యంలో “ఈ వారం” అనే వారపత్రిక వస్తుండేది. ఆ పత్రికలో నేను సుమారు నాలుగు వందలు రాజకీయ, ఆర్ధిక, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు “పంచ్” అనే కాలమ్ లో రాసేవాడిని. ఒక్కోవారం నాలుగు వ్యాసాలు కూడా రాసేవాడిని. అవి విపరీతమైన పాఠకాదరణను చూరగొన్నాయి.

చదవండి :  నోరెత్తని మేధావులు

కొన్ని నెలల తరువాత వైఎస్సార్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఆయన పీఏ ఫోన్ చేశారు. “మీ వ్యాసాలు కొన్ని సిఏం గారు చదివారు. మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు. మీరు వస్తానంటే అపాయింట్మెంట్ ఖరారు చేస్తాను” అన్నారు.
మై గాడ్!! సీఎం తో కలిసే అవకాశాన్ని ఎంత తెలివి తక్కువవాడైనా వదులుకుంటాడా? ఎగిరి గంతేసాను. ఈ క్షణం రమ్మన్నా వస్తాను అని బదులిచ్చాను. సాయంత్రం నాలుగు గంటలకు టైం ఫిక్స్ అయింది. నేను బయలుదేరుతుండగా మళ్ళీ ఫోన్. “అర్జెంట్ గా కలెక్టర్స్ మీటింగ్ ప్లాన్ చేసారు. ఈరోజు నాలుగు గంటలకే. మీకు మరోసారి అపాయింట్మెంట్ ఖరారు చేసి ఫోన్ చేస్తాను. సారీ” అన్నారు పీ ఏ.

చదవండి :  ఆదివారం ఇడుపులపాయలో వైకాపా రెండో ప్లీనరీ

కొంచెం నిరాశపడినా, ఊళ్ళోనే ఉండేవాళ్ళం కదా.. ఎప్పటికైనా కలవొచ్చులే అనుకున్నాను. నాకేం తెలుసు.. ఆ తరువాత అంత అకస్మాత్తుగా అయన మబ్బుల్లో లీనమై పోతారని?

అంతకు పదిహేను రోజులముందే సోనియా, అంబానీ, మన్మోహన్ ల మీటింగ్లో పాల్గొన్న వైఎస్సార్ “ఆంధ్రాలో తయారవుతున్న గాస్ ను ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి) ప్రజలకు వంద రూపాయలకు ఇచ్చి తీరాల్సిందే” అని ఆగ్రహంగా సోనియాతో వాదించి ఫైల్స్ విసిరికొట్టారట… ఆయన దుర్మరణం మీద అనుమానాలు ఇంకా పీడిస్తూనే ఉన్నాయి.

నిన్న ఇడుపులపాయలో వైఎస్సార్ సమాధి ముందు కాసేపు కూర్చున్నపుడు గతమంతా జ్ఞాపకాలపొరలను చీల్చుకుని వచ్చి మనసంతా వికలమై పోయింది. అనుకోకుండా రెండు చేతులు జోడించాను. నా జీవితంలో ఒక రాజకీయ నాయకుడి సమాధిని సందర్శించి నమస్కరించడం ఇదే తొలిసారి. బహుశా ఇదే తుదిసారి కావచ్చు.

ప్రాంతీయభేదం లేకుండా అందరిని ప్రేమించిన ఏకైక మహనీయుడు వైఎస్సార్.

– ఇలపావులూరి మురళీ మోహన్ రావు

ఇదీ చదవండి!

ఆరోగ్యశ్రీ

హైదరాబాదు ఐఐటి ఏర్పాటు ప్రకటన

శాసనసభలో వైఎస్ ప్రసంగాలు Date: December 19, 2006 చదవండి :  గణిత బ్రహ్మతో నా పరిచయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: