హోమ్ » వార్తలు » ప్రత్యేక వార్తలు » ప్రభుత్వం ఆయన్ను వెనక్కి పిలిపించుకోవాల

ప్రభుత్వం ఆయన్ను వెనక్కి పిలిపించుకోవాల

కడప: జిల్లా కలెక్టర్ కేవీ రమణ వ్యవహార శైలిపై అఖిలపక్షం నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాజ్యాంగ బద్ధంగా పని చేయని ఆయన ఈ జిల్లా కలెక్టర్‌గా అర్హులు కారని పేర్కొన్నారు.

కడప నగరంలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ అధ్యక్షతన రౌండు టేబుల్ సమావేశం నిర్వహించారు. వైకాపా, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, కార్మిక సంఘం నేతలు జిల్లా కలెక్టర్ తీరుపై మండిపడ్డారు.

గతంలో పని చేసిన ఉన్నతాధికారులంతా జిల్లా ప్రజలు సహృదయులు, ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తులని అనేక సందర్భాల్లో ప్రశంసించారని గుర్తు చేశారు.  జిల్లాకు రావడానికి పారిశ్రామిక వేత్తలు భయపడుతున్నారంటూ జిల్లా ప్రతిష్ఠను దెబ్బ తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కలెక్టర్ ఈ జిల్లాకు వద్దని పేర్కొన్నారు.   ప్రభుత్వం తక్షణమే ఆయన్ను వెనక్కి పిలిపించుకోవాలని, మంచి అధికారిని ఇక్కడికి పంపాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్ నరసింహన్‌తోపాటు చీఫ్ సెక్రటరీలకు తీర్మానం కాపీలను పంపాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోడిలకు కూడ   ఫిర్యాదులు పంపాలని నిర్ణయించారు.

కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, రైతు సంఘం నాయకులు చంద్రమౌళీశ్వర్‌రెడ్డి, నాయకులు ప్రతాప్‌రెడ్డి, ఫణిరాజు తదితరులు పాల్గొన్నారు.

 ప్రజలను పట్టించుకోవడం లేదు

జిల్లా కలెక్టర్ కేవీ రమణ పరిపాలన, వ్యవహార శైలి ఏమాత్రం బాగా లేదు. ఒక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు ఒక బాలిక పట్ల అమర్యాదగా ప్రవర్తించాడు. అది జిల్లాలో పెద్ద సంచలనం అయింది. ఆ గ్రామస్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. విచారణ కోసం వచ్చిన జిల్లా కలెక్టర్ సదరు ఉపాధ్యాయునికి వత్తాసు పలకడం దారుణం. పాఠాలు చెప్పడంలో భాగంగానే ‘గిల్లడం’ జరిగిందని పేర్కొనడం మరీ దారుణం. పోలీసులు అతనిపై కేసు పెట్టినా కలెక్టర్ క్లీన్ చిట్ ఇవ్వడం శోచనీయం. మైదుకూరులో ఒక కంపెనీ మందును రైతులు వాడడంతో వంద ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. న్యాయం కోసం ఆ రైతులు జిల్లా కలెక్టర్‌ను కలిస్తే రెండు, మూడు దఫాలు తిప్పుకుని ఫోరంకు వెళ్లాలని సూచించడం ఈ కలెక్టర్‌కే చెల్లింది.

చదవండి :  బడ్జెట్‌పై ఎవరేమన్నారు?

కడప స్పోర్ట్స్ స్కూలు వ్యవహారానికి సంబంధించి అవినీతికి పాల్పడిన స్పెషల్ ఆఫీసర్‌ను తన పక్కనే కూర్చొబెట్టుకుని అతనికి అనుకూలంగానే మాట్లాడి కింది స్థాయి ఉద్యోగులపై చర్యలు చేపట్టడం ఎంత వరకు సబబు? ప్రజలకు మేలు చేయని ఈ కలెక్టర్ మాకొద్దు. జిల్లాలో ప్రొద్దుటూరు ఆస్పత్రి సమస్యలపై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే అటువైపు కన్నెత్తి చూడలేదు. విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తే స్పందనే ఉండదు. ఫిర్యాదు చేయాలని వస్తే కలిసే అవకాశం ఇవ్వరు. ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన అధికారి నియంతృత్వంతో వ్యవహరించడం ఎంత వరకు సమంజసం?

 – జయశ్రీ, మానవ హక్కుల,  ఐక్య వేదిక జిల్లా కన్వీనర్

బ్యాగుల కుంభకోణంలో సస్పెండ్ అయ్యారు

కేవీ రమణ జిల్లా కలెక్టర్ కాకముందు బ్యాగుల కుంభకోణంలో సస్పెండ్ అయ్యారు. అనంతరం జిల్లాకు కలెక్టర్‌గా వచ్చారు. ఆయన తీరు ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూస్తున్నాం. జిల్లా సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబును కలవాలంటే కలవనీయలేదు. ప్రజలు దరఖాస్తులు ఇవ్వడానికి వెళితే కనీసం తలెత్తి కూడా చూడరు. సాక్షాత్తు జెడ్పీ చైర్మన్‌నే పట్టించుకోలేదు. నాకు కలెక్టర్‌ను కలవడానికి మూడు రోజుల సమయం పట్టింది. కలెక్టర్‌ను ఇక్కడి నుంచి పంపడమే మేలు. ఇది వెనుకబడిన జిల్లా. రాష్ట్ర విభజన నేపథ్యంలో అన్ని విధాల ఇబ్బందులు పడుతున్నాం. కరువు జిల్లాలో ఇలాంటి కలెక్టర్ పనిచేస్తే ప్రజలకు మరింత నష్టమే.

చదవండి :  భారతదేశ కీర్తిని ఇనుమడింపజేస్తున్న మంగంపేట

 – నారాయణ, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

 తీరు మారాలి

జిల్లా కలెక్టర్ అనుసరిస్తున్న తీరు పద్ధతిగా లేదు. ఆయన తీరు మారాలి. ప్రజల కోసం పని చేయాలి. అపాయింట్‌మెంట్ పద్ధతిని రద్దు చేయాలి. కలెక్టర్ అంటే జిల్లా సంక్షేమం కోసం, ప్రజల బాగు కోసం పని చేయాలి. అన్ని వర్గాలను కలుపుకు పోవాలి. అందరికీ అందుబాటులో ఉండాలి.

– నాగ సుబ్బారెడ్డి, సీపీఐ నాయకుడు

చరిత్రలో ఇదే మొదటిసారి

జిల్లా చరిత్రలో కలెక్టర్ వ్యవహార శైలిపై చర్చ జరగడం ఇదే మొదటిసారి. జిల్లా అభివృద్ధి కోసం మాత్రమే ఆయన పని చేయాలి. రాజకీయ నాయకునిలా వ్యవహరించడం, మాట్లాడటం పనికిరాదు. జిల్లా కలెక్టర్ కలెక్టర్‌గానే వ్యవహరించాలి. వంద సంవత్సరాలుగా ఒకే సమయపాలన పాటిస్తున్న విద్యా మందిర్‌లో పేరెంట్స్ వ్యతిరేకిస్తున్నా, ఆయన కుమార్తె కోసం పాఠశాల వేళలు మార్పించిన ఘనత ఈ కలెక్టర్‌దే.

 – నజీర్ అహ్మద్, డీసీసీ అధ్యక్షుడు

 ఆసక్తి ఉంటే రాజకీయాల్లోకి రావడం మంచిది

 పారిశ్రామికవేత్తలు జిల్లాకు రావాలంటే భయపడుతున్నారని కలెక్టర్ చెప్పడం దారుణం. ఆయన జిల్లా ప్రతిష్ఠను దెబ్బ తీశారు. అవమానపరిచారు. జిల్లా అంటే అందరికీ ప్రేమ, అభిమానం ఉంది. 2004 నుంచి 2009 వరకు పారిశ్రామికవేత్తలు కడప చుట్టూ తిరిగారు. ఇక్కడ ఎన్నో ఫ్యాక్టరీలు ఏర్పాటు కావాల్సి ఉంది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా అవి ఏర్పాటు కాలేదు. ఆ మేరకు ప్రభుత్వం మౌలిక వసతులు, నీటి సౌకర్యం కల్పించలేదు. దానిని విస్మరించి.. ‘పారిశ్రామిక వేత్తలు భయపడుతున్నారు.. ఎలాంటి రాజకీయ వివక్ష  లేదు’ అంటూ జిల్లా కలెక్టర్ రాజకీయ నాయకుడిలా మాట్లాడటం తగదు. ఆసక్తి ఉంటే రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావడం మంచిది. ప్రభుత్వం ఆయన్ను వెనక్కి పిలిపించుకుని సమర్థుడైన కలెక్టర్‌ను పంపాలి.

చదవండి :  ఈతకొలను నిర్మాణానికి భూమిపూజ

 – ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి,  వైకాపా జిల్లా అధ్యక్షుడు

 జిల్లా పరువు తీశారు

పారిశ్రామికవేత్తలు జిల్లాకు రావడానికి భయపడుతున్నారని కలెక్టర్ వ్యాఖ్యానించి జిల్లా పరువు తీశారు. కలెక్టర్ స్థాయిలో ఉన్న అధికారి అలా వ్యాఖ్యానించడం మంచి పద్ధతి కాదు. కలెక్టర్ విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమించడానికి సన్నద్దం కావాలి.

– గూడూరు రవి, జెడ్పీ చైర్మన్

 కలెక్టర్‌తో ప్రభుత్వం క్షమాపణ చెప్పించాలి

జిల్లా వాసులు ఆవేశపరులని, పారిశ్రామికవేత్తలు ఇక్కడికి రావడానికి భయపడుతున్నారని కలెక్టర్ వ్యాఖ్యానించడం ఆశ్చర్యం కలిగించింది. ఆయన అంత మాటన్నా జిల్లా ప్రజలు శాంతి స్వభావులు కాబట్టే ఏమి పట్టించుకోలేదు. ఈ సంగతిని ఆయన గమనించాలి. బాధ్యతగల అధికారిగా ఆయన ఇలా అమర్యాదగా ప్రవర్తించడం తగదు. ఇదే సంఘటన తెలంగాణలో జరిగి ఉంటే కేసులు నమోదయ్యేవి. ఇక్కడి ప్రజలు స్నేహశీలురు కాబట్టి సరిపోయింది. రాయలసీమ పట్ల, జిల్లా పట్ల అనాదిగా వివక్ష కొనసాగుతోంది. కనీస పరిజ్ఞానం లేని అధికారికి ఐఏఎస్ గుర్తింపు ఇవ్వడమే సరైంది కాదు. పారిశ్రామిక ప్రగతి కోసం కనీస వసతులు కల్పించకుండా ‘పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు.. నమ్మకం లేక వెనుకంజ వేస్తున్నార’ని స్వయాన కలెక్టరే వ్యాఖ్యానించడం తీవ్ర అభ్యంతరకరం. కలెక్టర్ తీరు పద్ధతిగా లేదు. తక్షణమే ప్రభుత్వం ఆయనతో జిల్లా ప్రజలకు క్షమాపణలు చెప్పించాలి.

 – సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, రాయలసీమ కార్మిక, కర్షక సమితి అధ్యక్షులు

ఇదీ చదవండి!

కడప జిల్లాలో బౌద్ధ పర్యాటకం

కడప జిల్లాలో బౌద్ధ పర్యాటకం

బౌద్ధ ప్రదీప కడప కడప జిల్లాలో నందలూరు, పాటిగడ్డ, పుష్పగిరి, పెద్దముడియం, నాగనాదేశ్వరుని కొండ నేలమాళిగలోని బౌద్ధ స్థూపాలు– బుద్ధుడి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.