మిడిమేలపు మీడియా

పైత్యకారి పత్రికలు, మిడిమేలపు మీడియా

కడప జిల్లా విషయంలో విస్మయపరిచే తీరు

పుష్కరం కిందట 2007లో ప్రొద్దుటూరికి చెందిన చదువులబాబు అనే రచయిత జిల్లాలోని అన్ని మండలాలూ తిరిగి శ్రమకోర్చి సమాచారం సేకరించి ‘కడప జిల్లా సాహితీ మూర్తులు’ అనే పుస్తకం రాశారు. వేరొకరు ముందుకొచ్చి ఖర్చులు భరించి దాన్ని ప్రచురించారు. బహుశా అదే సమయంలో తెలంగాణకు చెందిన మౌనశ్రీ మల్లిక్‌ రాసిన ‘కడప జిల్లా చైతన్యమూర్తులు’ అనే పుస్తకం కూడా వచ్చింది. అది ఆంధ్రజ్యోతి అనే పత్రికకు ఎంత భరించరానిదైందంటే ఆ రెంటిని కలిపి ఆ దినపత్రిక తన ఆదివారం అనుబంధంలో ఇలా సమీక్షించింది:

అసలే ప్రాంతీయ చరిత్రల కాలం. దానికి తోడు కడప జిల్లా కాలం. ఫలితం – ఆ జిల్లా నుంచి ఒకేసారి రెండు పుస్తకాలు. కడప జిల్లా సాహితీమూర్తులు,కడప జిల్లా చైతన్యమూర్తులు. వాళ్ళూ వీళ్ళూ ఒకటి కాదా అని తొందరపడి అనుమానాలు తెచ్చుకోకండి. చైతన్య మూర్తులులో కొందరే సాహితీమూర్తులు. మిగతా వాళ్ళు వేరే. అయితే అందరూ బయటి జిల్లాల్లో కూడా ప్రసిద్ధులైన వాళ్ళు. సాహితీమూర్తులలో 465 మంది ఉన్నారు. ప్రాచీనులూ, నవీనులూ అంతా కలిపి. సాహిత్య కృషి, కాలం, ప్రక్రియల ప్రకారం వారిని విభజించి ఉంటే పాఠకులకు ఎక్కువ ఉపయోగంగా ఉండేది. ఏదేమైనా మన జిల్లాలో ఇంతమంది రచయితలు ఉన్నారనుకోవడం ఏ జిల్లా వాసులకైనా ఆత్మవిశ్వాసాన్ని కలిగించేదే. అన్ని జిల్లాల నుంచీ ఇటువంటి పుస్తకాలు రావాల్సిన అవసరం ఎంతయినా ఉంది. రచయితలు డి.కె.చదువుల బాబు, మౌనశ్రీ మల్లిక్‌లు అభినందనీయులు.

కడప జిల్లా సాహితీ మూర్తులు, పేజీలు: 368, వెల: రూ. 150/-
కడప జిల్లా చైతన్య మూర్తులు, పేజీలు: 62, వెల: రూ. 10/-
ప్రతులకు: ప్రజాహిత పబ్లిషర్స్‌, 1-1-1/18/1, గోల్కొండ క్రాస్‌ రోడ్స్‌, హైదరాబాద్‌ – 500 020″ అని.

http://www.andhrajyothy.com/sunday/sundayshow.asp?qry=2008/20-4/newbooks (పాత లింక్ కాబట్టి పనిచెయ్యదు. ఏ తేదీన వచ్చిందో కచ్చితంగా గుర్తులేదుగానీ లింకును బట్టి చూస్తే ఇది 2008 ఏప్రిల్ 20న వచ్చినట్లుంది.)

ఒకవైపు “రచయితలు అభినందనీయులు. అన్ని జిల్లాల నుంచీ ఇటువంటి పుస్తకాలు రావాల్సిన అవసరం ఎంతయినా ఉంది.” అంటూనే ఎత్తుగడలోనే ఆ వెటకారమెందుకో అర్థం కాదు. ఒక జిల్లా నుంచి ఒకే సమయంలో రెండు పుస్తకాలు రావడమే అంత నేరమైపోయిందా? తెలుగులో వారానికి/నెలకు ఎన్నేసి పుస్తకాలు వెలువడుతుంటాయో ఏ పత్రికలో పుస్తక సమీక్షల పేజీ చూసినా తెలుస్తుంది. వాటిలో ఒకే సమయంలో ఒకే జిల్లానుంచి ప్రచురితమైన పుస్తకాలే లేవా? అలా ఉన్నవాటన్నిటి గురించీ ఇలాగే ఎత్తిపొడుస్తూ సమీక్షిస్తారా? మిగతా ఏ జిల్లానుంచి ఎన్ని పుస్తకాలు వచ్చినా లేని అభ్యంతరం ఒక్క కడప జిల్లా మీదే ఎందుకు? సమీక్షకులు, సదరు పత్రికవారు గుర్తించడానికి ఇష్టపడని పాయింటేమిటంటే ఆ రెండు పుస్తకాలూ వచ్చింది “ఆ జిల్లా” నుంచి కాదు. ఒక పుస్తక రచయిత మాత్రమే “ఆ జిల్లా” వారు. ఇంకొక పుస్తక రచయిత వేరే ప్రాంతం వారు. ఆ ప్రాంతం ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే లేదు. ఇక ఆ రెండు పుస్తకాల ప్రచురణకర్తలు ఉండేది హైదరాబాదులో! ఒక తెలుగు పత్రికకు తెలుగునేలలోని ఒక జిల్లా/ప్రాంతం మీద అంత అక్కసెందుకు? ఈ అక్కసు ఆంధ్రజ్యోతి, ఇతర పత్రికల్లో అంతకుముందు కూడా ఉండేదేమో తెలియదుగానీ ఆ తర్వాత మాత్రం అంతకంతకూ పెచ్చరిల్లుతూ వచ్చింది.

చదవండి :  హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? - మొదటి భాగం

దాదాపు అదే సమయంలో బ్రాహ్మణి స్టీల్స్ గురించి ఆంధ్రజ్యోతి ఎంతగా అక్కసుపడిందో అందరికీ ఎరుకే. ఆ బీడుభూముల్లో సెలయేర్లు, వన్యప్రాణులు వగైరాలున్నాయి, అన్యాయమైపోతున్నాయని కరుణరసముప్పొంగేలా రసరమ్యగీతికలాలాపించిన కలాలు భ్రమరావతి (అసలు పేరు అమరావతి) కోసం అడవులు నరికేసేందుకు అడిగిన వెంటనే అనుమతివ్వలేదని కేంద్ర అటవీ పర్యావరణ శాఖమీద పడి ఏ విధంగా విలపించిందీ విన్నాం. ‘ఉక్కు’పాదాల కింద పచ్చదనం అంటూ “వేలాది వన్యజీవులు, ప్రకృతి ప్రసాదించిన అందమైన లోయలు, వాటి మధ్య నిరంతర జలధారలతో కలకలలాడే సెలయేర్లు, సెలయేటి గట్టున సంచరించే అడవి ఆవులు, అడవి పందులు, చెంగు చెంగున గంతులు వేసే జింకలు, కుందేళ్ళు, తోడేళ్ళు, నక్కలు వంటి వన్యప్రాణులు, కనువిందు చేసే మయూరాలు, కొమ్మల చాటున దాగిన కిలాకిలారావాలతో సందడిచేసే పక్షులు, కొండల్లో కోనల్లో పచ్చటి చెట్లు, ఔషధ గుణాలు కలిగిన వృక్షాలు, మొక్కలు, ఆహ్లాదభరితమైన, ఈ ముగ్ధ మనోహరమైన ఈ ప్రకృతి సంపద అంతా ‘ఉక్కు’పాదాల కింద నలిగి నామరూపాల్లేకుండా కనుమరుగు కానుంది” అని వగచిన కలాలు అక్కడే ఉక్కు కర్మాగారం నెలకొల్పడానికి చంద్రబాబునాయుడు చైనా కంపెనీని ఆహ్వానించినప్పుడు, రాష్ట్రప్రభుత్వం తరపున ఇంకొక స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసినప్పుడు మాత్రం నేను చూడలేదుగానీ ఉప్పొంగిన ఉత్సాహంతో స్వాగత గీతికలాలాపించే ఉంటాయి.

ఇదే ఆంధ్రజ్యోతి 2016లో విశాఖపట్నానికి సంబంధించిన ఒక వార్తకు పెట్టిన హెడ్డింగు “కడప రౌడీల సెటిల్మెంట్లు“. తీరా చూస్తే ఐదుమంది రౌడీల ముఠాలో ఒకడు మాత్రమే కడప జిల్లా వాసి. ఆంధ్రజ్యోతి మాటల్లోనే మిగతావాళ్ళలో “అచ్యుతాపురం దొప్పెర్లకు చెందిన కొరుప్రోలు చిన్నారావు, కొరుప్రోలు సరోజారావు ఇద్దరూ రౌడీషీటర్లు. వీరిపై అచ్యుతాపురం పోలీస్ స్టేషన్లో అనేక కేసులు ఉన్నాయి”. కానీ వీళ్ళిద్దరి ఫోటోలు ప్రముఖంగావేసి “పరారీలో మరికొంతమంది కడప రౌడీలు” అని క్యాప్షన్ పెట్టారు! ఇలాంటి అఘాయిత్యపు కథనాలు కొల్లలుగా వచ్చాయి.

ఈనాడు‘ సృష్టించిన కొత్తపదంకడపస్వామ్యం’ (2014 మే 8 సంపాదకీయం)

రాష్ట్రంలో 2014 ఎన్నికలు జరిగిన తీరును గురించి ఈనాడు 2014 మే 8 నాటి సంపాదకీయంలో తెగబడి ఇలా వ్యాఖ్యానించింది –

…వైకాపా – ముప్ఫై ఏడేళ్ళ కడపస్వామ్యాన్ని సీమాంధ్ర పరగణాలన్నింటికీ విస్తరించాలనే కంకణం కట్టుకొంది… బాంబుల భాష, వేటకొడవళ్ళ సంస్కృతి మాత్రమే తెలిసిన ఫాక్షనిస్టులు… ఏకపక్ష పోలింగ్, రిగ్గింగ్(ల) కడప నమూనాను రాష్ట్రవ్యాప్తం చేసే దుస్తంత్రం నేడు ఈ స్థాయిలో గజ్జెకట్టింది. వై ఎస్ జగన్లు కాంగ్రెస్లో ఉన్నంతకాలం వాళ్ళ ఫాక్షనిస్టు దందా, ప్రజాస్వామ్యాన్ని కాలరాచేలా ఏకపక్ష పోలింగ్ పంథా – కడపకే పరిమితమయ్యాయి. తన మనుగడ కోసం ఎప్పుడైతే జగన్ సొంతదుకాణం పెట్టుకొన్నాడో – సీమాంధ్రలోని తక్కిన పన్నెండు జిల్లాల్నీ తాను గుప్పిటపట్టిన కడపలా మార్చెయ్యడానికే కంకణం కట్టుకొన్నాడు అని.

కడపస్వామ్యం అనేది వారే సృష్టించిన కొత్తపదం. దానికి అర్థం (వారి దృష్టిలో) <<ఘర్షణలు, రాళ్ళదాడులు, ఏజెంట్ల అపహరింతలు, దొంగ వోట్లు, రిగ్గింగు, అభ్యర్థుల నిర్బంధాల వంటి నేరపూరిత కుట్రలతో పోలింగ్ ప్రక్రియ పవిత్రతకే ఎక్కడికక్కడ తూట్లు పొడవడం… బాంబుల భాష, వేటకొడవళ్ళ సంస్కృతి మాత్రమే తెలిసిన ఫాక్షనిస్టుల దందా… ప్రజాస్వామ్యాన్ని కాలరాచేలా ఏకపక్ష పోలింగ్, రిగ్గింగ్>>.

చదవండి :  మన పోలీసుకుక్కలకు బంగారు, రజత పతకాలు

కడప గురించి ఇన్ని కారుకూతలు కూసిన ఈనాడు వారు, ఒక్కసారి వెనక్కి తిరిగి, ఈనాడు కడప ఎడిషన్ ప్రారంభించినప్పుడు అదే పత్రికలో కడప గురించి ఏమని రాసుకున్నారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. ఆనాడేమో “పౌరుషాలకు పేరుబడ్డ పోతుగడ్డ కడప” అని శ్లాఘించారు. మరి అంతటి పోతుగడ్డను ఎవడో వచ్చి (వాడెవడైనా సరే) గుప్పిట పట్టజూస్తే, కడప నేల మీద ఇన్నిరకాల అరాచకాలకు పాల్పడితే వాడి అంతుచూడకుండా లొంగిపోయి వాడి గుప్పిట్లో పడి ఉంటుందని ఎలా అనుకున్నారో ఈనాడు వారు? వారు జగన్ గురించి, అతడి పార్టీ గురించి, అతడి ముఠాల గురించి “అతను గుప్పిటపట్టిన కడప” అని రాసిన కారుకూతలతో ఆ “పోతుగడ్డ” కడప పౌరుషాన్నే అవమానిస్తున్నారని కూడా వారికి తెలియలేదు పాపం!

అలాగే దంతులూరి కృష్ణ అనే ఒక వ్యక్తికి చెందిన ముఠా హైదరాబాదులో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని వ్యాపారంలో వాటా కోసం బెదిరిస్తే పులివెందుల ముఠా అని హెడ్డింగ్ పెడతారు. ఆ దంతులూరి కృష్ణ మారుపేరే మంగలి కృష్ణ అని ఆ కథనంలోనే ఉంది. దాన్నిబట్టి “మంగలి ముఠా” అని రాయవలసింది కదా? ఎందుకు రాయలేదో ఆ రాసినోళ్ళకే తెలియాలి!

ఇంతటి సత్యదూరమైన కథనాలతో చదివినవాళ్ళు దడుచుకుచచ్చేట్లు ఒక భీతావహమైన వాతావరణం కడప చుట్టూ కల్పించి చూపేదీ వాళ్ళే – పెట్టుబడిదారులకు కడపంటే దడ, అందుకే కడపకు పెట్టుబడులు రావడం లేదని సన్నాయినొక్కులు నొక్కేదీ వాళ్ళే.

మా జిల్లా మీద వాళ్ళకు అంత అక్కసుగా ఉంటే మా జిల్లాకు వాళ్ళ పత్రికలు పంపకూడదు, వాళ్ళ ఆఫీసులు, ఉద్యోగులను ఇక్కడ ఉంచకూడదు. ఇక్కడివాళ్ళకు వాళ్ళ సంస్థలో ఉద్యోగాలు కూడా ఇవ్వకూడదు. కానీ వాళ్ళు ఆ పని మాత్రం చెయ్యరు. ఎందుకంటే ఇక్కడి అమ్మకాల ద్వారా వచ్చే సర్కులేషను, ఆదాయం వాళ్ళకు కావాలి. ఇక్కడివాళ్ళ ప్రతిభా సామర్థ్యాలు వాళ్ళ సంస్థ ఎదుగుదలకు ఉపయోగపడాలి. అందుకే కడప జిల్లాకు చెందిన రారా, గజ్జెల మల్లా రెడ్డి లాంటి రచయితల సేవలను ఈనాడు, పెన్నేటి కథల రచయిత పి. రామకృష్ణారెడ్డి వగైరాల సేవలను ఆంధ్రజ్యోతి వాడుకున్నాయి. ద్వంద్వప్రమాణాలకు ఇంతకంటే పెద్ద నిదర్శనం ఉండదు.

వయ్యెస్సార్ తన ఐదేళ్ళ పాలనాకాలంలో కడప జిల్లాకు ఎంతచేసినా దానికి కారణం అది కేవలం తన సొంత జిల్లా కావడమొక్కటే కాదు, అది దశాబ్దాల తరబడి నిర్లక్ష్యానికి గురైన ప్రాంతం కాబట్టి – అభివృద్ధికి అంటరాని జిల్లాగా దూరం పెట్టబడిన జిల్లా కాబట్టి. ఇప్పటికీ పొట్టచేతబట్టుకుని గల్ఫ్ దేశాల్లాంటి సుదూరప్రాంతాలకు అల్పాదాయ వర్గాల వాళ్ళు అత్యధిక సంఖ్యలో వలస వెళ్తున్న జిల్లా కాబట్టి.

2004-2009 మధ్య ఎంత అభివృద్ధిచేసినా ఇప్పటికీ సో-కాల్డ్ రాయలసీమ నుంచి సైతం దేశంలోని అత్యంత వెనుకబడిన జిల్లాల్లో చోటు పదిలం చేసుకున్న ఏకైక జిల్లా కావడం ఈ జిల్లా వెనుకబాటుతనానికి, ప్రభుత్వాలు ఇంకా ఈ జిల్లా అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చెయ్యాల్సిన అవసరం ఉందనడానికి నిదర్శనం.

ఆ అభివృద్ధి అంతరాలను తగ్గించి ఈ జిల్లాను ఇతర జిల్లాల స్థాయికి దగ్గరగా తీసుకు వచ్చే ఏ చిన్న ప్రయత్నం జరిగినా కళ్ళలో నిప్పులు పోసుకునే పాత్రికేయ కలాలదే వారంటున్న “దుస్తంత్రం”. ఆ దుస్తంత్రంలో భాగమే 2004-2009 మధ్య మీడియాలో వచ్చిన కథనాలు, హెడ్డింగులు. మచ్చుకు కొన్ని హెడ్డింగులు ఈనాడు నుంచి:

  • నిధులన్నీ కడప గడపకే (సబ్ హెడింగ్: అనంతకూ అగ్రతాంబూలం)
  • చేనేతలోనూ కడపపైనే దయ
  • యువశక్తీ అక్కడే
  • పులివెందులకు పోత – పట్టణాలకు వాత
  • సొమ్ము అందరిది – సోకు పులివెందులది
చదవండి :  పట్టిసీమ ల్యా... నీ తలకాయ ల్యా..!!

తెలుగులో ఇతర పత్రికలు ఎప్పుడూ చదవలేదు కాబట్టి వాటిలో ఏం రాస్తున్నారో తెలియదు. తెలుగు పత్రికలు ఇలా ఉంటే ఆంగ్ల పత్రికలింకొకలా ఉన్నాయి – బహుశా అది కూడా ఆ పత్రికలో పనిచేస్తున్న సాటి తెలుగు పాత్రికేయులు కట్టుకున్న పుణ్యమే అయ్యుంటుందని నా గట్టి నమ్మకం.

INTACH :

మిడిమేలపు మీడియాఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ అని జాతీయ స్థాయిలో ఒక సంస్థ ఉంది. బడిపిల్లల కోసం వాళ్ళు నడిపే త్రైమాస పత్రిక వడ్రంగం/ కొయ్య బొమ్మల ప్రత్యేక సంచిక ఒకటి ఇటీవల చూడడం తటస్థించింది. దాంట్లో తెలంగాణలోని నిర్మల్తో బాటు కోస్తాంధ్రలో చెక్కబొమ్మల తయారుకు ప్రసిద్ధి గాంచిన కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లి (విజయవాడ నుంచి 16 కి.మీ.), లక్కబొమ్మల తయారీకి ప్రసిద్ధి గాంచిన విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి మండలంలోని ఏటికొప్పాక లాంటి చిన్నచిన్న ఊర్లపేర్లు సైతం సరిగ్గా ఇచ్చారుగానీ అదే కడప జిల్లాలో ఎర్రచందనం బొమ్మలకు ప్రసిద్ధి చెందిన శెట్టిగుంటకు బదులుగా “తిరుపతి ఎర్రబొమ్మలు” (శెట్టిగుంట నుంచి తిరుపతి 38 కి.మీ.) అని ఇచ్చారు. అన్నిరకాల వ్యతిరేక ప్రచారాలకు, లేనిపోని నిందలకు గురయ్యేది కడప, అదే కడప జిల్లాలోని ఊర్లకు తమదైన కళానైపుణ్యాలకు కూడా గుర్తింపు దక్కనివ్వరు, అలాంటివేవైనా ఉంటే పక్క జిల్లాల ఖాతాలో వేస్తారన్నమాట. కడప జిల్లాకు రౌడీల అడ్డా – బాంబుల గడ్డ అని తప్ప వేరే ఏ విధమైన గుర్తింపు (ప్రత్యేకించి పాజిటివ్ ఇమేజ్) దక్కనివ్వకుండా బద్నామ్ చేసే కుటిల ప్రయత్నంలో భాగమే ఇవన్నీ – అనిపిస్తే తప్పేముంది?

మిడిమేలపు మీడియాకడప మీద ఒక పత్రిక అనికాదు, ఒక మీడియాసంస్థ అనికాదు, ఒక భాష అని కాదు, అంతమందికి అంత చిన్నచూపు, ద్వేషభావం ఎందుకో మరి!

టీవీ చానెళ్ళు:

ఈ దుర్మార్గంలో టీవీ చానెళ్ళేమీ తక్కువ తినలేదు. మచ్చుకు ఒక ఉదాహరణ చెప్పాలంటే గండికోట ప్రాశస్త్యాన్ని గురించి 10TV ప్రసారం చేసిన ఒక కథనంలో ఉపోద్ఘాతంగా కడప జిల్లా గురించి చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు. ఆ వ్యాఖ్యల గురించి జిల్లావాసుల నుంచి విమర్శలు వెల్లువెత్తడం వల్ల కాబోలు ఆ వీడియోను తర్వాత యూట్యూబ్ నుంచే కాకుండా తమ వెబ్సైట్ నుంచి కూడా తొలగించారు. కడప మీద వచ్చిన కథనాల్లో నాకు తెలిసి అదొక్కటే మీడియావాళ్ళు తీసుకున్న “దిద్దుబాటు చర్య”.

– త్రివిక్రమ్ 

(trivikram@kadapa.info)

రచయిత గురించి

కడప జిల్లా సమగ్రాభివృద్ది కోసం పరితపించే సగటు మనిషీ త్రివిక్రమ్. సాహిత్యాభిలాషి అయిన త్రివిక్రమ్ తెలుగును అంతర్జాలంలో (వికీపీడియా సహా) వ్యాపితం చేసేందుకు ఇతోధికంగా కృషి చేశారు. ‘ఈ-మాట’ అంతర్జాల పత్రికకు సంపాదక వర్గ సభ్యులుగా వ్యవహరిస్తున్న వీరు కొంతకాలం పాటు అంతర్జాల సాహితీ పత్రిక ‘పొద్దు’ సంపాదకవర్గ సభ్యులుగా వ్యవహరించినారు. అరుదైన ‘చందమామ’ మాసపత్రిక ప్రతులను ఎన్నిటినో వీరు సేకరించినారు. చింతకొమ్మదిన్నె మండలంలోని ‘పడిగెలపల్లి’ వీరి స్వస్థలం.

ఇదీ చదవండి!

కడప జిల్లాలో నేరాలు

కడప జిల్లాలో నేరాలు – ఒక పరిశీలన

రోజూ కాకపోయినా వీలుకుదిరినప్పుడల్లా ఈనాడు.నెట్లో కడప జిల్లా వార్తలు చూసే నేను క్రైమ్ వార్తల జోలికి పోయేవాడ్ని కాదు. తునిలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: