కడపలోని యోగివేమన యూనివర్శిటీ చరిత్ర విభాగం పరిశోదనలో ‘దివిటీలమల్లు సెల’గా స్థానిక ప్రజలు భావించే కొండపేటు ఆదిమానవుల ఆవాసంగా ఉండేదనే విషయం వెలుగులోకి వచ్చింది. ”మల్లుగానిబండ’గా స్థానికులు పిలిచే ఈ ప్రదేశంలో ఆదిమానవులు యెర్రటి కొండరాళ్ళపై తెల్లటి వర్ణాలతో జంతువులు, మనుషుల చిత్రాలను గీశారు.

దీంతో మైదుకురు నియోజకవర్గంలోని ఖాజీపేట మండలం భూమాయపల్లెలో యాదవ కుటుంబంలో పుట్టి రేకలకుంటలో ఒక పాలెగాని ఇంట పెరిగి అత్యంతసాహసవంతుడిగా పేరుగాంచి, బ్రిటీషువారినే ఎదిరించిన దివిటీలమల్లు ఆదిమానవుడికి అవాసమైన కొండపేటులోనే తలదాచుకున్నట్లు వెల్లడైంది. ఈ నేపధ్యంలో దివిటీలమల్లును గురించి తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.
‘దివిటీల మల్లన్న’ను గురించిన రోంత సమాచారం మీ కోసం…
క్రీ.శ.1800 ప్రాంతంలో దివిటీలమల్లు పేదలకోసం, భయంకరమైన కరువు వాతన పడిన అన్నార్తులకోసం రాణీబావి మార్గంలో మైదుకూరు నెల్లూరు బాటలో ప్రయాణిస్తున్న భూస్వాములను, రావాణా సరుకులను దోపిడీ చేసేవాడు. బ్రిటీషు పోలీసులకు చిక్కకుండా వాయువేగంతో అదృశ్యమైపొయేవాడు. కొందరు సిద్దుల పరిచయం తో ఆకుపసరుతినడంవల్ల కొండలు,గుట్టలూ అవలీలగా ఎగురుకుంటూ వెల్లేవాడని ఇప్పటికీ ప్రజలు చెప్పుకుంటారు.
రాత్రిపూట నల్లమలలోని లంకమల అడవిలో దివిటీతో సంచరించేవాడు. రాత్రి సమయాల్లోనే పల్లెలకు వచ్చేవాడు. వీధినటకాలు, బుర్రకథలు చూసి, విని మళ్ళీ అడవిలోకి వెళ్ళేవాడు. దివిటీలమల్లును పట్టుకునే ప్రయత్నంలో బ్రిటీషు పోలీసులు చాలామంది కొండలోయల్లో పడి ప్రాణాలను పోగొట్టుకున్నారు. చివరికి పాలెగాళ్ళను అణచివేయడంలో సిద్ధహస్తుడైన దత్త మండలాల కలెక్టర్ సర్ థామస్ మన్రో ఒక మహిళ సహకారంతో దివిటీలమల్లు అనుపానులు కనుక్కొని భారీ బలగాలతో వెళ్ళి నిదురబోతున్న దివిటీలమల్లు హతమారుస్తారు.
ఈ సందర్భంలో భయంకర కరవులు ఏర్పడినప్పుడు ధనవంతుల్ని, భూస్వాముల్ని దోచి ప్రజల ఆకలి తీర్చిన దివిటీల మల్లుడు వంటి సాహసవంతుడిని అజ్ఞాత జానపద కళాకారులు ఇలా కీర్తించారు.
“దివిటీల మల్లుగాడు
దీటిబట్టి వచ్చినాడు
గుఱ్ఱమెక్కి గూడమొచ్చి
గంజి గటక కాచి కాచి
సానికల్లో పోసినాడు
ధాతుకరువు భూతమయ్యె
దొర కొడుకుల దొరతనం
మల్లు ముందు
దిగదుడుపురా
నాసామిరంగా”
దివిటీలమల్లు జీవితంపై సమగ్ర పరిశోదన జరగాల్సి ఉంది.