విశిష్టమైన అటవీ సంపద ”రాయలసీమ” కే సొంతం!

ప్రపంచంలో గల వృక్ష సంపదలో దాదాపు 12శాతం మొక్కలు భారత దేశంలో వున్నాయి. దేశంలో 5 వేల శైవలాల జాతులు, 1,600 లైకెన్‌ జాతులు, 20వేల శిలీంధ్ర జాతులు, 2,700 బ్రయోఫైట్‌లు, 600 టెరిడోఫైట్‌లు, 18000 పుష్పించు మొక్కల జాతులువున్నాయి.రాయలసీమ వైశాల్యం 69,043 చదరపు కీలోమీటర్లు. రాయలసీమలో మూడు రకాల అడవులున్నాయి.చిత్తడి ఆకురాల్చు అడవులు, మొదటివి. కర్నూలు జిల్లాలోని రోళ్ళపెంట, బైర్లూటి మధ్యన, అహాబిళం ప్రాంతంలోను, చిత్తూరు జిల్లాలోని తలకోనలోను ఈ అడవులు  వున్నాయి.తేమ లేని ఆకుల రాల్చు అడవులు, రెండవ రకం! రాయలసీమ లోని అన్ని జిల్లాల్లోను ఈ అడవులున్నాయి. ముళ్ళపొదల అడవులు. మూడవ రకానికి చెందినవి. అనంతపురం జిల్లాలో  మిగతా జిల్లాలలో దట్టమైన అడవుల చుట్టూ ఈ ముళ్ళపొదల అడవులున్నాయి.
రాయలసీమలో  1500  పుష్పించు జాతులు

రాయలసీమలో దాదాపు 1500 రకాలు పుష్పించు జాతులున్నాయి. అనంతపురం జిల్లాలో 710 పుష్పించు జాతులు, కర్నూలు జిల్లాలో 1050 జాతులు, కడప జిల్లాలో 1050 జాతులు ఉన్నాయి. రాయలసీమలో కలపకు ఉపయోగపడే చెట్టు జాతులెన్నో ఉన్నాయి. ఇందులో చెప్పుకోదగ్గది టేకు చెట్టు. కర్నూలు, కడప జిల్లాలోని నల్లమల అడవులలోను, కడప, చిత్తూరు జిల్లాలోని శేషాచల కొండలలోను టేకు చెట్లు ఉన్నాయి. బ్రిటీష్‌ వారికాలంలో ఓడల నిర్మాణం కోసం రాయలసీమ జిల్లాల్లోని అడవుల నుంచి టేకు చెట్లను కొట్టి తరలించారు. అలాగే రైల్వే స్వీపర్ల కోసం కుడా టేకు చెట్లను కొట్టివేశారు. రాయలసీమలో కలప నిచ్చు ఇతర చెట్లు నల్లమద్ది, బట్టగెనుపు, యేపి, పచ్చారి, దిరిశన మొదలైనవి. ఇవి దాదాపు రాయలసీమ అంతటా పెరుగుతున్నాయి.  ఇవే కాక వ్యవసాయ పనిముట్లకు ఉపయోగపడే బిల్లు చెట్టు కూడా ఈ అడవులలో పెరుగుతోంది.
సంకర జాతి వంగడాలను తయారు చేయడానికి అవసరమైన పైరు జాతి మొక్కల సహజ సంబంధ జాతులెన్నో రాయలసీమలో ఉన్నాయి. ఇవన్నీ అడవులలో సహజసిద్ధంగా పెరుగుతున్నాయి. ఇందులో చెప్పుకోదగ్గవి వరి సహజ సంబంధీమైనవి. కర్నూలు జిల్లాలోని నల్లమల అడవుల లోని గుండ్ల బ్రహ్మేశ్వరం ప్రాంతంలోవరి సహజ సంబంధీక  జాతులు ఒరైజీమైయోరియానా, ఒరైజీ మలం పూజెన్సిస్‌, ఒరైజీ గ్రాన్యులేటీలు పెరుగుతున్నాయి. వరిని ఆశించే అగ్గితెగులును తట్టుకోగల లక్షణాలు ఒరైజీమలంపూజెన్సిస్‌ లో వుండటం వలన దీనిని సంకరీకరణకు ఉపయోగిస్తున్నారు.  గుండ్ల బ్రహ్మేశ్వరం ప్రాంతంలో మిరియాల సంబంధిత జాతులు పైపర్‌ నైశ్రమ్‌,  పైపర్‌ అట్టెన్యువేటమ్‌, పైపర్‌ హైమొనో ఫిల్లమ్‌లు సహజసిద్ధంగా పెరుగుతున్నాయి.

రాయలసీమలో మరో చెప్పుకోదగ్గ చెట్టు,  ఎర్ర చందనం!

చదవండి :  25న ప్రచారానికి చంద్రబాబు

రాయలసీమలో మరో చెప్పుకోదగ్గ చెట్టు జాతి, ఎర్ర చందనం. కడప చిత్తూరు జిల్లాల్లోను, వాటి పరిసర ప్రాంతంలోను మాత్రమే ఈ ఎర్రచందనం చెట్టు పెరుగుతోంది. ప్రపంచంలో మరెక్కడా లేని ఈ చెట్టు మన రాష్ట్రానికి మన దేశానికి ఎంతో విదేశీ మారకం ఆర్జించి పెడుతున్నది. ఇక్కడ పెరిగే మరో విలువైన చెట్టు మంచి గంధం. అనంతపురం జిల్లాలోని మడకశిర ప్రాంతంలోని గుండుమల, కేకీతి అడవులలో సహజసిద్ధంగా ఇవి పెరుగుతున్నాయి. దొంగ రవాణా వలన ఈ మంచి గంధం చెట్లు అంతరించి పోయేదశకు చేరుకున్నాయి. రాయలసీమలో కొన్ని వేల గిరిజన కుటుంబాలనాదుకుంటున్న చెట్టు జాతి,  ఎర్రపొలికి. స్టెర్యూలియా యురెన్స్‌ అని పిలుస్తున్న ఈ చెట్టు నుంచి గిరిజనులు పొలికి జిగురు తీస్తున్నారు. ఈ జిగురును కిలో 120 రూపాయలకు గిరిజన సహకార సంస్థ కొనుగోలు చేస్తున్నది. నల్లమల కొండలలోని అడవులంతటా ఈ ఎర్రపొలికి చెట్టు పెరుగుతోంది. నన్నారి అనే శీతల పానీయం గురించి రాయలసీమ వాసులందరికీ తెలిసిందే. వేసవి కాలంలో మనందరం ఇష్టపడే ఈ పానీయం మానవుని ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఉష్ణాన్ని తగ్గిస్తుంది. రక్తాన్ని శుద్ధిచేస్తుంది. ఈనన్నారిని ”డేకేలెపిస్‌ హామిల్టానై”  అనే మొక్క వేరు నుంచి తీస్తారు. ఈ వేర్లు ఎంతో సువాసన కలిగి వుంటాయి.
రాయలసీమ జిల్లాల్లో ఔషధ మొక్కలు

రాయలసీమ జిల్లాలల్లో ఎన్నో ఔషధ మొక్కలున్నాయి. వీటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అడవులలోను, పొల్లాలోను పెరిగే ఒక మందు మొక్క ఆశ్వగంధ. విధానయం సొమ్నిఫెరా దీని శాస్త్రీయ నామం. దీని వేరు బలానికి, వీర్యవృద్ధికి తోడ్పడుతుంది. కఫాన్ని హరిస్తుంది. హృద్రోగానికి కూడా నివారిస్తుంది. సీమ అడవులలో గల మరో మందు మొక్క విషముష్టి. దీని కాయలలో గల స్ట్రిక్నిన్‌, బ్రుసిన్‌లు నాడి మండలాన్ని ఉత్తేజ పరుస్తాయి. పచ్చ కామెర్లను నయం చేయగల మొక్క  నేల ఉసిరి. దీనినే ”ఫిల్లాంధస్‌ అమారస్‌”  అంటారు. ఇది రాయలసీమ అంతటా బీడు భూముల్లోను, పంట పొలాల్లోను, గట్లవెంట పెరుగుతుంది. దీని పసరును రోజుకు మూడు సార్లు తీసుకుంటే పచ్చకామెర్లు తగ్గిపోతాయి.  ”కోస్టస్‌ స్పీసియోసస్‌”  అనేది ఇందులో ఒకటి. దీనిని తెలుగులో ”కేవుకిన్న” అంటారు. ఈ మొక్కకు అల్లందుంప వంటి వేరు ఉంటుంది. ఈ దుంపకు గర్భనిరోధక గుణం ఉందని ఈమధ్యనే కనుగొన్నారు. ఈ దుంప క్రిమి సంహారకం, విషజ్వర హారకం, గర్భస్రావకం. రాయలసీమలో మరో జీవనోపాధి మొక్క బీడి ఆకు. దీనినే తుమికి ఆకు, టుమికి ఆకు అని కుడా పిలుస్తారు.  దీని శాస్త్రీయనామం ”డయాస్పైరోస్‌ మొలనోక్సైలాన్‌”, సీమలో ఎంతో మంది ఈ ఆకును సేకరించి జీవనోపాధి పొందుతున్నారు. కలబంద రాయలసీమ అంతటా పొలం గట్ల వెంట పెంచటం మీరు చూసే వుంటారు. బీడు భూముల్లో కూడా పెరిగే ఈ మొక్క శాస్త్రీయ నామం అగేవ్‌అమెరికానా, మోకులు, తాళ్ళునేయడానికి ఈ నార ఎంతో ఉపయోగపడుతుంది. ఇతర రాష్ట్రాలకు కూడా ఈనారను ఎగుమతి చేస్తున్నారు. ఈ మొక్కలో హేకోజెనిన్‌ అనే మందు పదార్థం కూడా ఉన్నది. విస్తర్లు కుట్టడానికి రాయలసీమలో ఎన్నో రకాల చెట్ల ఆకులను వాడుతున్నారు. ఇందులో చెప్పుకోదగ్గవి ”బహీనియా వాహ్లిబ్యూటియా ఫ్రాండోసా”, ”బ్యూటియాసు  పర్బీ”. వీటిపై ఆధారపడి ఎంతో మంది గిరిజనులు  పల్లేప్రజలు జీవనం సాగిస్తున్నారు.

చదవండి :  ఆ అంశాన్ని ఎందుకు చేర్చలేదు? - బి.వి.రాఘవులు

రాయలసీమలో ప్రపంచంలోకెల్లా  వైశాల్యం గల చెట్టు!

ప్రపంచంలోకెల్లా ఎక్కువ వైశాల్యం గల చెట్టు మన రాయలసీమలో ఉంది. తిమ్మమ్మమర్రి మానుగా పిలుస్తున్న ఈ చెట్టు అనంతపురం జిల్లాలోని కదిరికి 26 కిలో మీటర్ల దూరంలో ఉన్న గూటి బయలు గ్రామంలో ఉన్నది. 2.1 హెక్టార్ల వైశాల్యంలో గల ఈ మర్రి వృక్షానికి 1100 ఊతవేర్లు ఉన్నాయి.  అనంతపురం జిల్లాలోని గుత్తివద్ద  1820లో రాబర్ట్‌వైట్‌ అనే శాస్త్రవేత్త కనుగొన్న ”పారాహైపార్థీనియం బెల్లీరెన్సిస్‌”  అనే గడ్డి జాతి మొక్క ఇప్పుడు పూర్తిగా అంతరించిపోయింది. గత 15 సంవత్సరాలుగా గుత్తి కోట ప్రాంతంలో దీనికోసం ఎంత వెదికినా ప్రయోజనం లేకపోయింది. ప్రపంచంలో మరెక్కడా ఈ మొక్కలేదు. ఇలాంటిదే మరో చెట్టు జాతి ”హిల్డెగార్డియా పాపుల్నిఫోలియా”. ఈ చెట్టు తమిళనాడులోని ”కల్‌రాయన్‌” కొండల లో మాత్రమే పెరుగుతోందని, ప్రపంచంలో మరెక్కడాలేని ఈ జాతి చెట్లు 20 మాత్రమే వున్నాయని బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా వారు తమ రెడ్‌డాటా బుక్‌లో పేర్కొన్నారు. అయితే ఈ మొక్క  అనంతపురం జిల్లాలోని బుక్కపట్నం సమీపంలోని చెండ్రాయుని కోనలో వున్నట్టు వృక్ష శాస్త్రజ్ఞుడు రవి ప్రసాద రావు కనుగొన్నారు.
”సైకాస్‌ బెడ్డోమై” అనే విస్తృత బీజపు మొక్క తిరుమల కొండలలో మాత్రమే పెరుగుతుంది. రెడ్‌ డాటా బుక్‌లోని మొదటి షెడ్యూల్‌ లో చేర్చిన ఈ మొక్క చాలా అరుదైన మొక్క అని, అంతరించి పోయేదశకు చేరుకున్నదని, సంరక్షణా చర్యలు చేపట్టాలని అంతర్జాతీయ జీవ పరిరక్షణా సంస్థ తెలియజేసింది.  ”డికాస్ట్టిియాకడపెన్సిస్‌”, ”డికాస్టిసియా రూఫా”  అనే రెండు మొక్కలు కడప, చిత్తూరు జిల్లాలలోని కొండలలో మాత్రమే పెరుగుతున్నాయి. కడప జిల్లాలో అంతరించి పోయే పరిస్థితుల్లో వున్న ఇతర మొక్కలు ”బ్రాభిస్టెల్మాగ్లాబ్రమ్‌”, ”బ్రాభిస్టెల్మా వాల్యుబిలె”, ”క్రోటాన్‌స్కాబియోసస్‌”, ”డిగోఫిరాబార్బిరి”, ”రింభోషియాబెడ్డోమై”, ”అరుండినెల్లాసిటోసా”,  ”ట్రైఫీసియా రెటికులేటా మొదలైనవి. అలాంటిదే మరో అరుదైన చెట్టు అల్‌ బిజియా ధాంప్సని. అనంతపురం జిల్లాలోని కాళ సముద్రం అడవులలో మాత్రమే పెరుగుతోంది.

చదవండి :  ఉక్కు పరిశ్రమ కోసం ‘అఖిల‌ప‌క్షం’ ఆందోళన

ఈ భూమిపైన మనకు తెలియని వృక్ష జాతులెన్నో వున్నాయి. వాటిని శాస్త్రజ్ఞులు ఇంకా కనుగొంటూనే వున్నారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు వెంకటరాజు, పుల్లయ్య (వ్యాసకర్త) లు ఇలాంటి ఒక కొత్త మొక్కను కర్నూలు జిల్లాలోని ఆవుకు అడవులలో కనుగొన్నారు. దీనికి ”డైమార్ఫోకేలిక్స్‌ కర్నూలెన్సిస్‌ ” అని నామకరణం చేశారు. ఇలా ఈ మధ్యనే కనుగొన్న కొత్త మొక్కలు ”ఆండ్రోగ్రాఫిస్‌ నల్లమలయానా”, ”పింపినెల్లా తిరుపతేన్సిస్‌”, ”యఫోర్జియాసిన్‌ గుత్తియా”  మొదలైనవి. రాయలసీమలోని ఇతర అరుదైన మొక్కలు ఇరియోతీశాలు షినిగ్టనై, ఇండిగోఫెరా బార్టెరి, ఆయియాంధస్‌ డిస్కి ప్లోరస్‌, రింఖోషియా బెడ్డోమ్‌.

రాయలసీమలోని మరో మొక్క సంపద బోదగడ్డి. దీని శాస్త్రీయ నామం ”సింబాపోగీన్‌ కలారేటస్‌”. రాయలసీమ కొండలన్నింటిలోనూ, బీడు భూములలోను ఈ మొక్క పెరుగుతున్నది. కొట్టాలు వేసుకోవడానికి బోదగడ్డి తో పాటు  ఈత, జమ్ము కూడా  ఉపయోగపడతాయి.
విదేశాల నుంచి మన దేశానికి వచ్చిన  మొక్కలు

విదేశాల నుంచి మన దేశానికి వచ్చిన కొన్ని మొక్కలు కూడా ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఇందులో చెప్పుకోదగ్గవి నీలగిరి, సుబాబుల్‌చెట్లు. అటవీశాఖ వారు, వ్యవసాయ, బీడుభూములలోను ఈ చెట్లను విస్తృతంగా పెంచుతున్నారు. త్వరగా పెరిగే ఈ చెట్లు ప్రజలకు ఉపయోగపడే కలపనిస్తున్నాయి. సుబాబుల్‌ ఆకులు పశువులకు మేతగా ఉపయోగపడుతున్నాయి. సర్కారు తుమ్మ అని పిలిచే ”ప్రోసోపిస్‌ జులిప్లోరా”ను 1896లో బెడ్డోమ్‌ అనే అటవీ శాఖాధికారి అమెరికా నుంచి  తీసుకువచ్చి కడప జిల్లాలోని కమలాపురంలో పెంచాడు. దేశమంతా విస్తరించిన ఈ చెట్టు బీద ప్రజలకు వంట చెరకుగా ఉపయోగపడుతున్నది. ఇలాగే విదేశాల నుంచి మనదేశంలో పెరిగి ఉపయోగపడుతున్న మరో మొక్క బిళ్ళగన్నేరు. రక్తక్యాన్సర్‌, లుకేమియాను నయం చేయగల విన్‌క్రిస్టిన్‌ విన్‌బ్లాస్టిన్‌లు ఈ మొక్క వేర్లలో వున్నాయి. రాయలసీమ జిల్లాలలో కీటకాహార మొక్కలున్నాయంటే మీరు ఆశ్చర్యపడవచ్చు. యుట్రిక్యురేలియాక్సొతీటా, యూట్రిక్యులేరియా గిబ్బాలు రాయలసీమలోని నీటి వాగులలో పెరుగుతున్నాయి. ఇలాంటి కీటకాహార మొక్కలు డ్రోసెరా బర్మానై, డ్రోసెరీ ఇండికాలు రాయలసీమలోని తేమ ప్రదేశాలలోని నత్రజని లోపంగల నేలలో పెరుగుతున్నాయి.

ఇదీ చదవండి!

అల్లరి నరేష్

కడప పెద్దదర్గాలో ‘అల్లరి’ నరేష్

కడప: కథానాయకుడు ‘అల్లరి’ నరేష్ ఈ రోజు (ఆదివారం) కడప నగరంలోని ప్రఖ్యాత అమీన్‌పీర్ దర్గాను దర్శించుకున్నారు. నరేష్ పూల చాదర్‌లను …

ఒక వ్యాఖ్య

  1. Very very informative. Please see if you can give information about other regions also. Iam asking you out of curiosity.

    madhuri.

Leave a Reply

Your email address will not be published.

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: