తాళ్ళపొద్దుటూరు

‘తాళ్ళపొద్దుటూరు’లో ఏమి జరుగుతోంది?

2004లో రిజర్వాయర్ తొలి సామర్థ్యం 16.850 TMC, మునక గ్రామాలు 14.

2007లో పెంచిన రిజర్వాయర్ సామర్థ్యం 26.85 TMC, మునక గ్రామాలు 22.

———————————-

పులివెందుల నియోజకవర్గంలో ఎండిపోతున్న చీనీ చెట్లకు ఆరునెలల్లో నీళ్లిస్తామని, అంతవరకు తాను గడ్డం కూడా తియ్యనని శపథం చేసిన అప్పటి తెదేపా నాయకుడు, శాసనమండలి ఉపాధ్యక్షుడు (ఇప్పుడు కూడా ఈయన “అధికార పార్టీ”లోనే ఉన్నాడు) రెండుమూడేళ్ళుగా గడ్డంతోనే తిరుగుతున్నాడని జాలిపడి, గడ్డం తీయించడానికి తొందరపడి 2017లో గండికోట రిజర్వాయర్ నుంచి నీళ్ళు వదిలారు. గొప్ప నాణ్యతా ప్రమాణాలు పాటించడం వల్ల వారానికే పైపులు పగిలిపోయి నీళ్ళు ఆపేశారు. గండికోట నుంచి బయటికి పోయే నీళ్ళు ఆపినారు గానీ ఇన్ ఫ్లో ఆగలేదు. దాంతో నీటిమట్టం పెరిగి చౌటపల్లె మునిగిపోయింది. అప్పటి ఘటనాక్రమమిది:

2016 నవంబర్ : గండికోట రిజర్వాయర్లో నిల్వచేస్తున్న నీళ్ళు ముంపు గ్రామాల్లోకి రావడం మొదలైంది.

2016 డిసెంబర్ : ముంపు గ్రామాల వాసులు గండికోట రిజర్వాయర్ నుంచి తమ ఊర్లోకి వచ్చిన ఎదలోతు నీళ్ళలో గంటో రెండుగంటలో కాకుండా కొన్నిరోజులపాటు నిలబడి నిరసన తెలిపితే పునరావాసం కల్పిస్తామన్న హామీ మాత్రమే వచ్చింది.

2017 జనవరి 11 : స్వయంగా ముఖ్యమంత్రి నీళ్ళు వదిలేనాటికి ముంపుగ్రామాల్లో మొట్టమొదటిదైన చౌటపల్లెలో పునరావాస పరిహారం (కేవలం పరిహారం మాత్రమే) అందింది 911 కుటుంబాలకు గాను కేవలం 140 కుటుంబాలకు మాత్రమే. అంటే 85% మందికి పరిహారం అందలేదు.

చదవండి :  ఈ రాయలసీమ చీకటి ఖండం - పుట్టపర్తి వారి తొలిపలుకు

2017 జనవరి 21 : ఊర్లోకి నీళ్ళు రాకుండా గ్రామస్థులు వేసుకున్న కట్టతెగి 100 ఇళ్ళు మునిగిపోయాయి.

2017 జనవరి 28 : ముంపువాసులకు చెక్కులు పంపిణీ చెయ్యాల్సి ఉండగా గ్రామానికి ఒకరిద్దరు లబ్దిదారులకు మాత్రమే ఇచ్చి, మిగతావాళ్ళకు తర్వాత విడతలవారీగా పంచుతామని నచ్చజెప్పి మమ అనిపించారు.

2017 జనవరి 30 : గండికోటకు వచ్చే ఇన్‍ఫ్లో కూడా ఆగిపోయింది. నీళ్ళురానందుకు ఈ ముంపుగ్రామాలవాసులు ఊపిరిపీల్చుకోవాలా లేక సాగునీరు అందనందుకు రైతులు బాధపడాలా అనేది బేతాళ ప్రశ్న.

అప్పటి ప్రభుత్వం మూడు రోజులపాటు భయపెట్టి, మభ్య పెట్టి, మాయ చేసి, అంతకు కిందటి ఏడాదే ఖాళీ చేసేందుకు ఒప్పుకున్నట్టు పాత తేదీలతో సంతకాలు తీసుకొని, వసారా గోడలు కూలుస్తూ వచ్చారు. చెక్కులు రాని వారి గురించి అడిగితే, వాళ్ళను ఏమీ అనము, విచారణ జరిపి ఇస్తామని నమ్మబలికారు. సాయంకాలం 5 గం.లకు రాత్రి 10 లోగా ఖాళీ చేయమని చాటింపు. పోలీసుల్ను దింపారు. ఇప్పటికిప్పుడు నా పశువులు ,మేత తీసుకొని ఎక్కడికి పోవాలని ఒకరి ఆవేదన, మాకు డబ్బులు రాలేదు బాడుగ కు ఇల్లు తీసుకోవాలంటే ఎలా? సామాన్లు తరలించటం ఎలా? అసలు అన్ని ఇండ్లు మండలం లో ఎక్కడ వున్నాయి. (https://www.facebook.com/jkakumani/posts/10214748971330323)

అప్పటి ప్రతిపక్షం తరపున సౌటపల్లె బాధితులకు జమ్మలమడుగు వైకాపా భాద్యుడుగా ఉన్న సుధీర్ మధ్దతు తెలిపారు. ఆనాటి ముఖ్యమంత్రి సౌటపల్లె వాసులను జలసమాధి చేయాలని చూశారని ఆరోపించి, ఆయనపైన హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు.

చదవండి :  ముఖ్యమంత్రి గారూ, అభినందించండి సార్!

ప్రస్తుతం :

పరిహారం అందాల్సిన కుటుంబాలు ఎన్ని ఉన్నాయి, పెద్దలెంతమంది, పిల్లలెంతమంది అన్న లెక్కలు వెయ్యడానికి ఒక కటాఫ్ తేదీని పెట్టుకుంటారు. గండికోట ముంపు గ్రామాల్లో అది 2017 సెప్టెంబర్ 30గా నిర్ణయించారు. నిరాశ్రయులు కాబోయేవాళ్ళకు 2017లోనే పునరావాస ప్యాకేజీ కింద పరిహారం ఇచ్చి ఉంటే అదొక లెక్క. కానీ మూడేళ్ళ తర్వాత ఇప్పుడు పరిహారం ఇవ్వాలంటే 2017 నాటికి మైనారిటీ తీరనివాళ్ళను ఇంకా చిన్నపిల్లల కిందే లెక్కవేసి ఇప్పుడు వాళ్ళకు బిస్కెట్లూ చాక్లెట్లూ ఇచ్చి ఊరుకోబెడదామంటే కుదరదు కదా ? అందుకే ముంపుగ్రామాల వాసులు కటాఫ్ తేదీని 2020 డిసెంబర్ 31కి మార్చమంటున్నారు. మారిస్తే నిరాశ్రయుల సంఖ్య, కుటుంబాల సంఖ్య పెరుగుతుంది. ప్రభుత్వానికి అదొక సమస్య.

రెండో సమస్య :

పునరావాసం కోసం కేటాయించిన కాలనీలో ఇళ్ళు కట్టుకుందామంటే ప్రభుత్వం అక్కడ మౌలిక వసతులు కల్పించలేదంటున్నారు. విద్యుత్తు సరఫరా లేదట. రోడ్లు, తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల, మొదలైనవాటిలో ఏయే సౌకర్యాలున్నాయో ఏవి లేవో తెలియదు. (రెండో విడతలోని మొదటి ముంపు గ్రామం తాళ్ళ ప్రొద్దుటూర్లో ఉన్న ఇండ్లు 1552, కుటుంబాలు 2869. వాళ్ళలో వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) కోరుకున్నది 1765, పునరావాసంతో పరిహారం (ఆర్&ఆర్) కోరుకున్నవాళ్ళు 1104. ఓటీఎస్ అందిన కుటుంబాలు 1021; ఆర్&ఆర్ అందిన కుటుంబాలు 939. ఖాళీ చేసిన కుటుంబాలు 539. ఆర్&ఆర్ అందినవాళ్ళు ఖాళీ చెయ్యలేదంటే పునరావాస కాలనీలో మౌలిక వసతులు లేకపోవడం కారణమనుకోవచ్చు. ఒకపక్క ఊరు మునిగిపోతూంటే ఓటీఎస్ అందినవాళ్లలో కూడా దాదాపు సగం మంది ఇంకా ఖాళీ చెయ్యకుండా ఎందుకున్నారో అర్థం కావడం లేదు.)

చదవండి :  మంది బలంతో అమలౌతున్న ప్రజాస్వామ్యం

మూడో సమస్య :

నిర్వాసితులకు గత ప్రభుత్వం ఏకమొత్తంగా (వన్ టైమ్ సెటిల్మెంట్ కింద) ప్రకటించింది 6.75 లక్షలు (పునరావాసం కోరుకున్నవాళ్ళకు 5 సెంట్ల ఇంటి స్థలం, 3.75 లక్షలు). ఇప్పటి ప్రభుత్వం పదిలక్షల చొప్పున ఇస్తామంటూంటే నిర్వాసితులు పన్నెండున్నర లక్షలు కావాలంటున్నారు.

ఈ సమస్యలు ఎటూ తేల్చకుండానే రిజర్వాయర్లో నీళ్ళు నింపడం మొదలుపెట్టేశారు. దాని మూలంగా గతంలో చౌటపల్లెలో వచ్చినట్లే ఇప్పుడు తాళ్ళ ప్రొద్దుటూర్లోకి నెల రోజుల కిందటి నుంచి నీళ్ళు రావడం మొదలై ఇళ్ళు మునిగిపోయినాయి. ఆ ఊరివాళ్ళు ఎక్కడికైనా పోదామన్నా పోయే దారి లేదు. అవసరమైతే నిరాశ్రయులకు తన ఇంట్లో ఆశ్రయమిస్తానన్న స్థానిక జమ్మలమడుగు ఎమ్మెల్యే గత రెండు వారాలుగా పత్తా లేడు. కరోనా వచ్చిందంటున్నారు. వచ్చినా నిర్వాసితులకు అండగా నిలబడాలన్న ఆలోచనే ఉంటే అది ఆచరణలో కనబడేది.

(సమాచార సేకరణ: గతంలో జరిగిన పరిణామాల గురించిన సమాచారం న్యూస్ మినిట్ లో వచ్చిన ఆర్టికల్ నుంచి, తాజా పరిణామాల గురించి ప్రధానంగా ఈనాడులో వచ్చిన వార్తల నుంచి)

– గాలి త్రివిక్రమ్

(trivikram@kadapa.info)

ఇదీ చదవండి!

బస్సు ప్రయాణం

తప్పుదోవలో ‘బస్సు ప్రయాణం’

మామూలుగా ఐతే ఒక ప్రాంతం/వర్గంమీద అక్కసుతో అపోహలు, అకారణ ద్వేషం కలిగేలా రాసే కథలను విజ్ఞతగల సంపాదకులు ప్రచురించరు. ఒకవేళ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: